ఆంధ్ర ప్రదేశ్‌లో సాగు చేసే అపరాల్లో పెసర, మినుము పంటలు ముఖ్యమైనవి. ఈ పంటలను ఏక పంటగానే కాకుండా పత్తి, కంది, ఆముదం వంటి పైర్లలో అంతర పంటగా కూడా సాగుచేస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు తొలిదశ నుండే వివిధ రకాల పురుగులు ఆశించటంవల్ల ఈ పంటల్లో దిగుబడి ఆశించలేక పోతున్నాము. కావున ఈ పంటలను ఆశించే పురుగులు వాటి నివారణ చర్యలను గురించి తెలుసుకున్నట్లయితే సకాలంలో పురుగులను గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టి వాటి ఉధృతిని తగ్గించి మంచి దిగుబడులు పొందవచ్చు.

చిత్త పురుగులు :

ఈ పురుగులు పైరుపై రెండు ఆకుల దశలో ఎక్కువగా ఆశించి గుండ్రటి చిన్న చిన్న రంధ్రాలు చేస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు నివారించకపోతే 80 శాతం మొక్కలు ఈ దశలోనే చనిపోతాయి. ఈ పురుగు నివారణకు 2.5 మి.లీ. క్లోరిపైరిఫాస్‌ లేక ఏసిఫేట్‌ 1 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లిటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

మారుక మచ్చల పురుగు :

దీన్నే పూత పురుగు లేక గూడు పురుగు అని అంటారు. ఈ పురుగు మొగ్గ, పూత, పిందే దశలో ఆశించి పంటకు ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. ఈ పురుగు పూమొగ్గలపై లేత ఆకులపై పిందెలపై గుడ్లను పెడుతుంది. గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు పూమొగ్గల లోపలికి చొచ్చుకొనిపోయి లోపలి లేత భాగాలను తింటాయి. ఈ పురుగులు కాయలు తయారయ్యేటప్పుడు వాటి దగ్గరకు చేరి గూడుగా కట్టి కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినటం వల్ల పంటకు 10-80 శాతం వరకు నష్టం కలుగుతుంది. ఈ పురుగు నివారణకు పైరు పూత దశకు రాకముందు నుంచే సస్య రక్షణ చర్యలు చేపట్టాలి.

పంట మొగ్గ దశలో 5 శాతం వేపగింజల కషాయం లేదా 5 మి.లి. వేపనూనె లిటరు నీటికి కలిపి పిచ్చికారి చేస్తే పురుగు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు.

బూడిద తెగులు :

ఈ తెగులు విత్తిన 30-35 రోజుల తరువాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముదురు ఆకులపై బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలుగా కనపడి అవి క్రమేణా పెద్దవై ఆకులపైనా క్రింది భాగాలకు మరియు కొమ్మలకు కాయలకు వ్యాపిస్తుంది. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 1 గ్రా. కార్బెండిజమ్‌ లేదా 1 మి.లీ. కెరాథేన్‌ లేదా 1 మి.లీ. డైకొనజోల్‌ కలిపి 10-15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

పల్లాకు తెగులు :

ఈ తెగులు జెమిని వైరస్‌ వల్ల వస్తుంది. పసుపు రంగులో మచ్చలు మొదట లేత ఆకులపై ఏర్పడును. క్రమేపి ఈ మచ్చలు పెరిగి ఆకు అంతటా వ్యాపించి పసుపు రంగులోకి మారును. ఈ తెగులు పైరు తొలి దశలోనే ఆశించినట్లైతే మొక్క గిడసబారి, ఎండిపోయి, రాలిపోవును. ఈ తెగులు లక్షణాలు పూత దశలో వస్తే సుమారు 90-100 శాతం వరకు దిగుబదులు తగ్గే అవకాశం ఉంది. ఈ తెగులు తెల్ల దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి క్రిమి సంహారక మందులైన ట్రైజోఫాస్‌ 1.5 మి.లీ. లేదా ఎసిఫెట్‌ 1 గ్రా. లేదా ప్రోఫెనోఫాస్‌ 1.5 మి.లీ. లేదా అసిటామిప్రిడ్‌ 0.2 గ్రా. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. ఎండిన ఒకదాన్ని ఒక లీటరు నీటికి కలిపి తెల్లదోమ ఉధృతిని బట్టి మందును మార్చి మార్చి వారం నుంచి పదిరోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.

మొగ్గ, పూత దశల్లో అక్కడక్కడ కొన్ని పూమొగ్గలను సేకరించి వాటిని తెరిచి పిల్ల పురుగులు ఉన్నాయేమోనని గమనించాలి. వాటిలో పురుగు ఉన్నట్లయితే వెంటనే 2.5 మి.లీ. క్లోరిపైరిఫాస్‌ లేదా 0.75 మి.లీ. నోవాల్యురాన్‌ మందులో ఏదో ఒక మందుతో పాటుగా ఉదార స్వభావం గల డైక్లోరోవాస్‌ 1 మి.లీ. కలిపి పిచికారి చేయాలి. మళ్ళీ అవసరమైతే 5-10 రోజుల వ్యవధిలో మందులను మార్చి పిచికారి చేయాలి.

పురుగు ఉధృతి అధికంగా గమనించినప్పుడు స్పైనోసాడ్‌ 0.3 మి.లీ. లేదా ఇమామెక్టిన్‌ బెంజోయెట్‌ 0.4 గ్రా. లేదా ఫ్లూబెండమైడ్‌ 0.2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పొగాకు లద్దె పురుగు :

ఇది పైరు తొలిదశలో ఆశించి పంటను నష్ట పరుస్తుంది. ఈ పురుగు పత్రహరితాన్ని గోకి తిని నష్టం కలుగజేస్తుంది. అందువల్ల దిగుబడులు కూడా తగ్గిపోతాయి. పురుగు నివారణకు ఎకరానికి 200 గ్రా. థయోడికార్బ్‌ లేదా 400 మి.లి. క్వినాల్‌ఫాస్‌ లేదా 200 గ్రా. ఎసిఫేట్‌ లాంటి మందులు పిచికారి చేసుకోవాలి.

పక్షి కన్ను తెగులు :

ఈ తెగులు సోకిన ఆకులపై లేత పసుపు రంగు అంచులతో కూడిన చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. ఈ తెగులు నివారణకు మాంకోజెబ్‌ 2.5 గ్రా. లేదా హెక్సాకొనజోల్‌ 2 మి.లీ. లేదా ప్రోఫికొనజోల్‌ 1 మి. లీ. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

బి. షైని ప్రియాంక, రీసెర్చ్‌ అసోసియేట్‌ (ప్లాంట్‌ ప్రొటెక్షన్‌), యస్‌.కె. నజ్మ, రీసెర్చ్‌ అసోసియేట్‌ (క్రాప్‌ ప్రొడక్షన్‌)

జి. ప్రసాద్‌ బాబు, కో-ఆర్డినేటర్‌, కె. రాఘవేంద్ర చౌదరి, ఎస్‌ఎంఎస్‌ ఎక్స్‌టెన్షన్‌, ఎరువాక కేంద్రం, బనవాసి, ఫోన్‌ : 6304770936