కొబ్బరి, పామాయిల్‌ తోటల్లో అంతర పంటగా రైతులకు లాభాలు చేకూరుస్తున్న కోకో సాగు రోజు రోజుకీ విస్తరిస్తుంది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రైతు లు ఈ పంటను విస్తారంగా సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే ఈ పంటపై పురుగుల బెడద ఎక్కువ కావడం, కొన్ని తోటల్లో కోకోతోపాటు మిరియం, వక్క వంటి సుగంధ ద్రవ్య పంటలు కూడా సాగవుతుండడంతో వలస పురుగుల బెడద అధికమవుతుంది. ఉద్యానవనాల సాగు కొత్త పుంతలు తొక్కుతుండడంతో నవీన వ్యవసాయంలో పురుగుల బెడద కూడా అధికంగా కనబడుతుంది. దీని నివారణకు శాస్త్రవేత్తలు ఇస్తున్న సూచనలను రైతులందరూ పాటించి తమ తోటలను సమృద్ధి వ్యవసాయ దిశగా నడిపించుకునేందుకు ఈ వ్యాసం తోడ్పడుతుంది. శాస్త్రీయ నామం ఇండార్‌బెల, టెట్రోనిస్‌, ఇ. క్వాడ్రినొటాట

స్థితి మరియు విస్తరణ :

భారతదేశం, బంగ్లాదేశం, బర్మా, శ్రీలంక మొదలగు దేశాల్లో ఇది గమనించబడింది.

ఆశించే మొక్కలు :

మామిడి, కోకో, జామ, దానిమ్మ, చీని, కమల, మల్బరీ, మునగ, గులాబి, రేగు మొదలగు చెట్లను ఈ పురుగు ఆశిస్తుంది.

లక్షణాలు :

ఈ పురుగు లేత కొమ్మలపై ఎక్కువగా దాడి చేస్తుంది. లేత గోధుమ రంగులో ఉన్న తల్లి పురుగులు మే, జూలైలో కోశస్థ దశ నుండి బయటకు వచ్చి బెరడు వదులుగా ఉన్న ప్రదేశాల్లో గుడ్లు పెడుతుంది. 10 రోజుల తరువాత గుడ్లు పొదిగి ముదురు గోధుమ తలలో గొంగళిపురుగు బయటకు వచ్చిన తరువాత గూళ్ళలో ఉంటాయి.

పిల్ల గొంగళి పురుగులు బెరడును తిని కాండంలోకి తొలుచుకు పోతాయి. పగటి పూట కాండంలో ఉంటూ రాత్రి సమయంలో అవి విసర్జించిన పదార్థాల్లో తయారైన గొట్టం ఆకారంలో ఉన్న దారి ద్వారా బయటకు వచ్చి బెరడును తింటాయి.

ఈ పురుగు విసర్జించిన రంపపు పొట్టుతో కట్టుకున్న గూళ్ళు చెట్టుకాండంపైన స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని సార్లు రైతులు ఈ లక్షణాలను గమనించి చెదపురుగులు ఆశించాయని అపోహపడతారు. దీని గొంగళి పురుగు దశ సుమారు 9-10 నెలల వరకు ఉంటుంది. ఈ పురుగు ఆశించడం వల్ల చెట్టు కాండంపై బెరడు కోల్పోయి పుష్పాలు రాక పిందెలు ఏర్పడవు. పెద్ద చెట్టు చిన్న చెట్ల కన్నా ఎక్కువ దాడికి గురవుతాయి. ప్రత్యేకించి నిర్లక్ష్యం చేయబడిన తోటలు ఈ పురుగు ముట్టడికి ఎక్కువగా గురవుతుంది.

పురుగు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చెట్టులోని పసరు ప్రవాహం అడ్డుకోబడి మొక్క యొక్క పెరుగుదల ఆగిపోతుంది. మరియు పండ్లు ఏర్పడడం బాగా తగ్గుతుంది.

నివారణ :

వదులుగా ఉన్న, దెబ్బతిన్న బెరడును మరియు కొమ్మలను పురుగు ఆశించిన కొమ్మలను తీసి కాల్చివేయాలి.

లద్దె పురుగులు చేసిన రంధ్రాల్లో ఇనుప చువ్వలతో యాంత్రికంగా పొడిచి చంపాలి.

రంధ్రాలను గమనించి దానిలో పెట్రోలు లేదా కిరోసిన్‌లో ముంచిన దూదిని పెట్టాలి.

ఈ పురుగు ప్రవేశించిన రంధ్రంలోకి 0.5 మి. లీ. లీటరు నీటిలో కలిపి క్లోరాన్‌ట్రనిప్రోల్‌ లేదా డైక్లోరోవాస్‌ని సిరంజ్‌ ఉపయోగించి పంపించాలి. తరువాత బురదతో రంధ్రాన్ని పూడ్చాలి.

తల్లి పురుగును ఆకర్షించడానికి దీపపు ఎరలను 1 హెక్టారుకు అమర్చాలి. ఈ విధంగా పురుగు ఉనికిని గమనించవచ్చు.

కోకోవ చెట్ల కొమ్మల కత్తిరింపు తరువాత కత్తిరించిన భాగాలను బ్లైటాక్స్‌ పూయాలి. లేనిచో కత్తిరించిన భాగాల ద్వారా బెరడు తొలుచు పురుగు ప్రవేశించే ప్రమాదం ఉంటుంది.

బెరడు తొలిచే పురుగు ఆశించే ఇతర మొక్కలను కోకో తోటలో నీడ చెట్టుగా ఉపయోగించరాదు.

మిత్ర పురుగులను కాపాడడానికి మరియు పురుగు (జనాభాను) సంతతిని సహజంగా నివారించడానికి, ఆరోగ్యకరమైన మరియు సమతుల్య పర్యావరణ వ్యవస్థను నిర్వహించండి.

- కె. చక్కని ప్రియ, రీసెర్చ్‌ అసోసియేట్‌ (ఎంటమాలజీ),

డా|| ఎన్‌.బి.వి చలపతి రావు, ప్రిన్సిపల్‌ సైంటిస్టు (ఎంటమాలజీ),

డి. రక్షిత్‌ రోషన్‌, రీసెర్చ్‌ అసోసియేట్‌ (ఎంటమాలజీ),

డా|| జి. రామానందం, ప్రిన్సిపల్‌ సైంటిస్టు (హార్ట్‌) & హెడ్‌,

ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట, తూర్పుగోదావరి,

ఫోన్‌ : 9441474967, 7382633653