ప్రకృతిలో పంట నష్టం కలుగజేసే పురుగులు, శిలీంధ్రాలతో పాటు వాటిని అదుపులో పెట్టే సహజ శత్రువులు కూడా ఉన్నాయి. ఈ సహజ శత్రువులు నష్టం చేసే పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. ఈ విధంగా మనకు లాభం చేకూరుస్తాయి. కనుక వీటిని మిత్ర పురుగులు అంటున్నాం. మిత్రపురుగులు, శిలీంధ్రాలను వృద్ధి చేసి హాని చేసే పురుగులను, శిలీంధ్రాలను నియంత్రించవచ్చు. పొలంలో ఉన్న మిత్ర పురుగులను రక్షించుకుంటూ, అవసరమైనప్పుడు పొలంలో వీటిని వదులుతూ ఉండాలి.

ఒక జీవిని ఉపయోగించి, మనకు నష్టాన్ని కలిగించే మరొక జీవిని నశింపచేయడమే జీవనియంత్రణ పద్ధతికి మూలం. బెడద పురుగుల మీదకు, హానికర శిలీంధ్రాల మీదకు, వాటి సహజ శత్రువులను మళ్ళించే ప్రక్రియనే జీవ నియంత్రణ అంటున్నాం. సమగ్ర సస్యరక్షణలో ఇది చాలా విలువైన అంశం. ఈ పద్ధతిలో ఉపయోగపడే జీవులను 3 రకాలుగా విభజించవచ్చు.

1. పరాన్న భుక్కులు లేదా బదనికలు (ప్రిడేటర్స్‌)

2. పరాన్న జీవులు (పారసైట్స్‌)

3. పురుగులకు రోగాలను కలుగజేసె క్రిములు (పాధోజెన్స్‌)

పరాన్నభుక్కులు :

ఇవి ఇతర పురుగులను మొత్తంగా ఆహారంగా తీసుకుంటాయి. కనుక పురుగుల ఉధృతి తగ్గిపోతుంది. వీటిలో సాల్లీళ్లు, తూనీగలు, అల్లికపురుగులు (క్రైసోపా), మిరిడ్‌ నల్లులు, అక్షింతల పురుగులు, కందిరీగలు ముఖ్యమైనవి. ఇవి సుడిదోమలను, దీపం పురుగులను, కాండం తొలిచే పురుగులను, గొట్టాల పురుగులను తింటాయి. ఈ మధ్య కాలంలో అక్షింతల పురుగుల్ని, అల్లికపురుగుల్ని అభివృద్ధి చేసి పొలాల్లో, తోటల్లో, వదులుతున్నారు. మంచి ఫలితాలను సాధిస్తున్నారు.

పరాన్న జీవులు

ఇవి ఇతర జీవుల శరీరంపై చేరి జీవరసాన్ని పీల్చి నాశనం చేస్తాయి. పరాన్న జీవులలో ట్రైకొగ్రామా ముఖ్యమైనది. ప్రయోగశాలలో వీటిని తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయవచ్చును. ఇవి చీడపీడలను గుడ్డు దశలో ఆశించి నిర్మూలిస్తాయి. కనుక పంటకు జరగబోయే నష్టం ముందుగానే అరికట్టవచ్చును. ట్రైకొగ్రామా పురుగులు తమంతటతామే చీడపురుగుల గుడ్లను వెతికి వాటిలో జీవిస్తూ వృద్ధి చెందుతాయి. పురుగుల ఉనికిని గమనిస్తూ తీవ్రతను బట్టి ట్రైకొగ్రామా కార్డులు ఎకరానికి 2-3 వాడాలి. ఒక్కొక్క కార్డుపై 20,000 గుడ్లు ఉంటాయి. ఈ కార్డును చిన్న ముక్కలుగా చేసి సుమారు 10 మీ. దూరంలో పొలంలో నలువైపులా పెట్టాలి. ఎండ తగలకుండా ఉండేటట్లు ఆకుల అడుగు భాగంలో సూదితో పెట్టాలి. పొలంలో 3-4 సార్లు ట్రైకొగ్రామా పురుగుల్ని వదలాల్సి ఉంటుంది. వీటిని వదలటానికి ముందు, వదిలిన తరువాత వారం, పది రోజుల వరకు ఎటువంటి పురుగు మందులు వాడకూడదు. ట్రైకొగ్రామా పురుగులను కొన్ని సార్లు పొలంలో వదిలిన తరువాత వాటంతట అవే క్రమంగా వద్ధి చెందుతాయి. కనుక ప్రతిసారి విడుదల చేయాల్సిన ఆవశ్యకత ఉండదు.

పురుగులకు రోగాలను కలుగజేసే క్రిములు :

బాసిల్లస్‌ తురింజెనిసిస్‌ అనే బాక్టీరియా మందులు ద్రవ రూపంలో, పొడి రూపంలో డైపెల్‌, బియోరిప్‌, బయోబిట్‌, అగ్రీ, హాల్ట్‌, స్పిక్‌ తురిన్‌, డెల్ఫిన్‌, అనే పేర్లతో లభ్యమవుతున్నాయి. వీటిని ఎకరాకు 200-400 గ్రా. వరకు సాయంత్రపు వేళల్లో పిచికారీ చేస్తే చీడపురుగులు వ్యాధికి గురయ్యి చనిపోతాయి. ప్రత్తి, కంది, శనగ, కూరగాయల మీద వచ్చే శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులను వీటి వాడకం ద్వారా నివారించవచ్చు.

ఫంగస్‌ వ్యాధి కలుగచేసే మందులు కొన్ని పొడి రూపంలో లభ్యమవుతున్నాయి. మెటారైజియం ఎనైసోప్లియేను ఉపయోగించి కొబ్బరిపై వచ్చే ముక్కు పురుగు (రైనో సిరస్‌), వేరు శనగ పైన వచ్చే వేరు పురుగును, మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగును నివారించవచ్చు. అదే విధంగా బెవేరియా బాసియానాను వరి మరియు ప్రత్తి పంటలలో రెక్కల పురుగుల కోసం, వెర్టిసిలియం లెకాని ద్రాక్షలో పిండి పురుగులను నివారించుకోవటానికి వాడుకోవచ్చు. ఈ పొడి మందును 5 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

ప్రత్తి, కంది, శనగ, మిరప, టమాట, పంటలపై శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులను, నివారించడానికి ''న్యూక్లియర్‌ పాలిహేడ్రోసిస్‌'' వైరస్‌ ద్రావణాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ వైరస్‌ పంటను నష్టపరిచే లార్వాలకు జబ్బు కలుగజేస్తుంది. వైరస్‌ వల్ల చనిపోయిన పురుగుల నుండి దీనిని తాయారు చేస్తారు. శనగ పచ్చ పురుగు (హెచ్‌.ఎన్‌.పి.వి), పొగాకు లద్దె పురుగు (ఎన్‌.ఎన్‌.పి.వి.)ల మీద పని చేసే క్రిములు వేర్వేరుగా ఉంటాయి. కనుక ప్రత్యేకించి దేనికదే వినియోగించాలి.

రైతులు స్వయంగా ఎన్‌. పి. వి. ద్రావకం తయారు చేసుకోవచ్చు. పొలంలో వైరస్‌ వ్యాధి సోకి తలకిందులుగా వేలాడుతున్న లార్వాలను సేకరించుకోవాలి. ఈ లార్వాలను ఒక పాత్రలోకి తీసుకొని మంచి నీళ్ళు కలిపి మెత్తగా నూరి ద్రావణం తయారు చేసి పలచని గుడ్డ ద్వారా వడపోయాలి. 200 వ్యాధి సోకిన పురుగుల నుండి వచ్చిన ద్రావణానికి 200 లీ. నీటిని, 1 కిలో బెల్లం మరియు 100 మీ. లీ. టీపోల్‌ లేదా రాబిన్‌ బ్లూ కలిపి ఎకరం పొలంలో పిచికారి చేయాలి.

పైరులో అమర్చిన లింగాకర్షక బుట్టల్లోనికి 8-10 రెక్కల పురుగులు ఆకర్షించబడిన రెండు వారాల్లో గాని లేక పైరుపై గ్రుడ్లను గమనించిన వారం రోజుల్లో వైరస్‌ ద్రావణాన్ని పైరుపై సమంగా తడిచేటట్లు పిచికారి చేయాలి. సాయంత్రం వేళల్లో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే పిచికారి చేయాలి. అవసరాన్ని బట్టి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేసుకోవచ్చు.

ట్రైకొడెర్మా విరిడి :

జీవనియంత్రణ పద్ధతిలో శిలీంధ్రాలను కూడా అదుపు చేయవచ్చు. గుర్తించిన కొన్ని రకాల శిలీంధ్రాలను ఉపయోగించి పంటను నష్టపరచే శిలీంధ్రాలను నాశనం చేయడం ద్వారా లబ్దిపొందవచ్చు. పంట భూముల్లో అనేక రకాల శిలీంధ్రాలుంటాయి. వీటిలో స్క్లీరోషియం, పిధియం, ఫైటోప్తోరా, రైజోక్టనియా, ఫ్యుజేరియం వంటివి మొక్కలకు తెగుళ్ళు కలుగ జేసి నష్టపరుస్థాయి. ట్రైకొడెర్మా విరిడే, ట్రైకొడెర్మా హర్జినియం వంటి మరికొన్ని శిలీంధ్రాలు తెగుళ్ళు కలిగించే శిలీంధ్రాలను నాశనం చేస్తాయి. వీటిలో ట్రైకొడెర్మా విరిడే బాగా ప్రాచుర్యం పొందింది. ఇది భూమిలో అతి త్వరగా వృద్ధి చెందుతుంది. దీనికి ఆమ్ల నేలలు, తటస్థ నేలలు అనుకూలం. వేరుశనగ, పప్పుధాన్యాలు, కూరగాయలు, ప్రత్తి, నిమ్మ, కొబ్బరి, అరటి, పొగాకు, మిరప మొదలైన పంటలకు తీవ్రంగా నష్టం కలిగించే వేరుకుళ్ళు, కాండంకుళ్ళు, మాగుడు తెగులు, ఎండు తెగులు, కొబ్బరిలో గానోడెర్మా తెగులు నివారణకు ఉపయోగపడుతుంది. దీన్ని వేసినప్పుడు వేరు చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడి తెగుళ్ళ నుండి కాపాడుతుంది. ఇది విత్తన శుద్ధి చేయడానికి, సేంద్రియ ఎరువులతో కలిపి నేలలో వేయడానికి కూడా పనిచేస్తుంది.

విత్తన శుద్ధి :

ఒక కిలో విత్తనాకి 4-6 గ్రా. పొడిమందు ఉపయోగించాలి. అరటి, పసుపు దుంపలను, చెరకు మొచ్చెలను శిలీంద్ర ద్రావణంలో ముంచినాటాలి. 500 గ్రా. ట్రైకొడెర్మా విరిడే పొడి మందును 100 లీటర్ల నీటిలో కలిపి ద్రావణం తయారుచేసి ఉపయోగించాలి.

నేలలో వేయడానికి తయారు చేసే విధానం :

ఒక కిలో ట్రైకొడెర్మా విరిడి పొడి మందును 90 కిలోల పూర్తిగా మాగిన పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండితో బాగా కలిపి వారం, పది రోజుల పాటు నీడలో పాలిధిన్‌ కవర్‌లో కప్పి ఉంచాలి. తగినంత తేమ ఉండటానికి అప్పుడప్పుడు నీరు చిలకరిస్తూ ఉండాలి. శిలీంద్రం బాగా వృద్ధి చెందుతుంది. వరి పైరుకు నాట్లు వేసే ముందు పొలం మీద వెదజల్లాలి. వేరుశనగ, మిరప, కూరగాయల పైర్లకు మొక్కల మొదళ్ళ ప్రక్కగా వేసి నెలలో కలిసేటట్లు చూడాలి. ఎకరానికి 200 కిలోలు వేయవలసి ఉంటుంది. నిమ్మ, కొబ్బరి చెట్లకు 10 కిలోల చొప్పున వేయాలి. నిమ్మలో వేరుకుళ్ళు తెగులు, కొబ్బరిలో గానోడెర్మా తెగులును సమర్ధవంతంగా నివారించవచ్చు. వ్యవసాయ శాఖవారి జీవనియంత్రణ ప్రయోగశాల్లో దీన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ప్రైవేటు కంపెనీల ఉత్పత్తులు, ట్రైకొజెన్‌-టి, బయోడెర్మా, సన్డెర్మా, నిప్రాట్‌ అనే పేర్లతో మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

వివిధ జీవనియంత్రణ పద్ధతులను అవసరాలకు అనుగుణంగా సస్యరక్షణ ప్రక్రియలో ప్రదానాంశంగా వాడుకున్నట్లయితే పురుగు మందుల వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. జీవనియంత్రణ పద్ధతులను పాటించడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గటం, పర్యావరణ సమతుల్యత పెరగటమే కాకుండా అవశేషరహిత ఉత్పత్తులను సాధించి, ప్రపంచ వాణిజ్య రంగంలో మన దేశ ఉత్పత్తులకు మంచి ధర పలికేటట్లు చూసుకోవచ్చు.

జి. హారిక, రీసెర్చ్‌ అసోసియేట్‌, కెల్లా లక్ష్మణ, శాస్త్రవేత్త, వై. సంధ్యారాణి, శాస్త్రవేత్త, ఏరువాక కేంద్రం, విజయనగరం