రైతులకు అదనపు ఆదాయం సమకూర్చే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బృహత్తర కార్యక్రమం చేపట్టబోతుంది. వ్యవసాయ రంగంలో రైతులు రోజు రోజుకూ ఆర్థికంగా చితికిపోతున్నారు. వ్యవసాయ రంగానికి అనుగుణంగా పరిశ్రమలు తీసుకొస్తే వ్యవసాయ రంగం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందనే దృక్పదంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బయో కంప్రెస్డ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ (సిఎన్‌జి) ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. 2023 నాటికి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 5 వేల గ్యాస్‌ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగాంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు, వ్యవసాయ రంగ అభివృద్ధికి దోహదపడే ఈ ప్లాంట్లను నెలకొల్పేందుకు వివిధ ఆయిల్‌ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. తెలంగాణ రైతులు సిఎన్‌జి ప్లాంట్ల కోసం ఆసక్తిని కనబరచిన రైతులకు ప్రభుత్వం ఐఒసి సంస్థల ద్వారా ఉచితంగా శిక్షణ అందచేసి సిఎన్‌జి ప్లాంటు నిర్వహణపై అవగాహనను కల్పిస్తుంది.

రాష్ట్ర ఉద్యానశాఖ సంచాలకు ఎల్‌ వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో వివిధ సంస్థల అధికారులు, మేనేజింగ్‌ డైరెక్టర్లు, ఉద్యానవన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18 లక్షల హెక్టార్లలో పత్తి, 17 లక్షల హెక్టార్లలో వరి సేద్యం చేస్తున్నారు. ముడిసరుకైన వరి గడ్డి, పత్తికట్టె ముడిసరుకుగా వస్తుంది. సుమారు 52 లక్షల మెట్రిక్‌ టన్నులు ఈ పంటల ద్వారా సంవత్సరానికి వ్యర్థపదార్థాలుగా మిగిలిపోతున్నాయి. వీటి నుండి ప్రయోగాలు చేపట్టిన తరువాత బయోగ్యాస్‌ తయారీ చేసుకోవచ్చునని ప్రభుత్వం భావించింది. వరి గడ్డి, పత్తి యొక్క ముడిసరుకుతో బయో గ్యాస్‌ను ఉత్పత్తి చేయవచ్చును. దీని ద్వారా ఎకరాకు రూ. 5 వేలు అదనంగా ఆదాయం సమకూర్చవచ్చు.

తెలంగాణలో పంటల వల్ల వచ్చే వ్యర్థపదార్థాల నుండి 66 లక్షల కిలోల బయోగ్యాస్‌ ఉత్పత్తి చేయవచ్చు. ఇలా ఉత్పత్తి చేసిన గ్యాస్‌కు రూ. 3 వేల కోట్లు రాబడి చేకూరనున్నది. దీనివల్ల తెలంగాణ రైతాంగానికి పరోక్షంగా అదనపు ఆదాయం చేకూరుతుంది. భారతదేశంలో 2023 నాటికి 5 వేల బయోగ్యాస్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేసింది. దీనిలో భాగంగానే తెలంగాణలో కూడా ప్రాధాన్యత కల్పించి రైతులకు ఉచితంగా ఐఒసి ద్వారా సాంకేతిక సలహాలతో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు. బయో సిఎన్‌జి ద్వారా తయారు చేసిన వ్యవసాయ సేంద్రియ ఎరువుల్లో ఎన్‌పికె ఎంత శాతం ఉంటుందో ఏ ఏ పంటలకు ఎంత మోతాదులో వేయాలో విషయాలను పూర్తిగా అవగాహన కల్పించనున్నారు. ఈ అవకాశాన్ని తెలంగాణ రైతులు విరివిగా ఉపయోగించుకోవాలి. దీని ద్వారా వ్యవసాయేతర పనులకు ఎంతో దోహదపడుతుంది. తద్వారా రైతులకు ఆర్థిక కష్టాలు అధిగమించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉపాది కలగనుంది. దీనికి తోడుగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉన్న వెదురు సైతం వ్యాపారంగా మలచి రైతులకు ఆదాయాన్ని సమకూర్చే విధానాన్ని ప్రభుత్వం పరోక్షంగా సహకారం అందిస్తుంది. రైతులందరితో కలిపి తెలంగాణలో ఒక వెదురు హబ్బును నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్దం చేస్తుంది. వెదురు ఉత్పత్తికి కావలసిన సూచనలు, సలహాలు అందించనుంది. ప్రస్తుతం 2009 సం||లో సిిఎన్‌జి ప్లాంటును స్థాపించి రోజుకు 100 టన్నుల సరుకు పిప్పి నుండి 8 వేల కిలోల బయో సిఎన్‌జి ఉత్పత్తి చేస్తున్నారు.

- ఎ. రాంబాబు, అగ్రిక్లినిక్‌ ప్రతినిధి