సృష్టిలో మకరందం కన్నా తీయనైనది మరొకటి కాదు. తేనెటీగలు పువ్వుల నుండి సేకరించే తియ్యటి ద్రవపదార్ధాన్నే తేనె అంటారు. స్వచ్ఛమైన తేనె దాని సహజ గుణాల వలన ఎన్నటికీ చెడిపోయే అవకాశాలు లేవు. పంచదార కన్నా రెండు రెట్లు తియ్యగా ఉండే తేనె క్రిమిసంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది బ్యాక్టీరియాను సంహరించగలుగుతుంది. తేనెలో 14 నుండి 18 శాతం వరకూ తేమ ఉంటుంది. ఇందులో నీటి శాతం కూడా తక్కువగా ఉండటంతో పులియడం, పాడవడం జరగదు. 18శాతం కన్నా తక్కువ తేమ ఉన్న పదార్ధాల్లో సూక్ష్మజీవులు కాని, ఏ ఇతర జీవులు పెరగలేవు. కాని పిల్లలకు హానికలిగించేంత మొత్తంలో సూక్ష్మక్రిములు ఉండటానికి అవకాశం ఉంది. పంచదార కనిపెట్టకముందే మనిషి తొలిసారిగా తీపి రుచిని తెలుసుకుంది తేనె ద్వారానే. మొట్టమొదటిసారిగా మద్యాన్ని తయారుచేసింది తేనెతోనే.

ప్లేటో, అరిస్టాటిల్‌, డిమొట్రిస్‌ లాంటి తత్వవేత్తలంతా తేనె వైశిష్టాన్ని తమ గ్రంధాలలో పేర్కొన్నారు. భారతీయ తొలి చరకుడు, సంహితుడు తేనెను త్రాగే మందుగా వినియోగించి, ఆ కాలంలోనే దాని ప్రాశస్త్యాన్ని గుర్తించారు. శ్వాసకోశ వ్యాధులకు తేనెను మించిన ఔషదం మరోటి లేదని ప్రాచీన కాలంనుండి నిరూపితమయిన అంశం.

తేనె ఉద్భవించే సహజ ప్రక్రియ :

సృష్టిలో అన్నిటికంటే విశిష్టమైన శ్రమజీవులు తేనెటీగలు. ముఖ్యంగా కూలీ ఈగలు. ఫ్రక్టోజ్‌ 38 శాతం, గ్లూకోజ్‌ 31శాతం, సుక్రోజ్‌ 17శాతం, నీరు 17శాతం, ఇతరత్రా పిండి పదార్ధాలు 0.17 శాతం కలిగిన తేనె చిక్కదనానికి ఇవి మూలకారకాలు. ఇవి ఎలా తేనెలో మిళితమై రంగరించుకున్నాయని పరిశీలిస్తే తేనెటీగల అద్భుత సహజ ప్రక్రియ దీనిలో మనగుపిస్తుంది.

ఈగలు మకరందాన్ని గ్రోలి తేనెపట్టు వద్దకు తీసుకువచ్చేటప్పుడు ఆ సమయంలో వాటిల్లోని కొన్ని ఎంజైములు అందులో కలుస్తాయి. సేకరించడం పూర్తయ్యాక ఈగలన్నీ తెనెపట్టులోకి చేరిపోయి, అక్కడ అనేకసార్లు రెక్కలను అల్లార్చుకోవడం వలన, మకరందంలోని నీరంతా ఆవిరైపోతుంది. ఫలితంగా చక్కెర గాఢత పెరిగి చిక్కని తేనె మాత్రం మిగులుతుంది.

తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, జింక్‌, సల్ఫర్‌, సోడియం, సిలికాన్‌ వంటి ఖనిజ లవణాలు, థైమన్‌, రిబోప్లావిన్‌, షైరిడాక్సిన్‌, పాంటోథెనిక్‌ యాసిడ్‌, నికోటినిక్‌ యాసిడ్‌ లాంటి విటమిన్లూ - పుప్పొడి ద్వారా చేరిన ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు, ఎంజైములూ ఉంటాయి.

ముదురు రంగు తేనెలో యాంటి ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలూ ఎక్కువగా ఉంటాయి. మరో విశేషమేమంటే, మానవుడికి అద్బుతమైన శక్తినందించే తేనెలో ఎలాంటి కొవ్వు పదార్ధాలు లేకపోవడం మరో మంచి సుగుణం.

పసుపు, బూడిద, ముదురు కాఫీ, నలుపు రంగుల్లో తేనె లభిస్తుంది. ఒక్కో తేనె ఒకోరకమైన సుగంధాన్ని అందిస్తుంది. మధుకీటకాలు సేకరించే పూల జాతుల మీద ఆధారపడి రంగు, రుచి, వాసన ఉంటాయి. తేనెపట్టు నుంచి అప్పటికప్పుడు తీసిన తేనెను ''జింటి తేనె'' అంటారు. ప్రోసెస్‌ చేయని ఈ తేనెలో ఎంజైములు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

తేనె - తెరవెనుక కథ :

సృష్టిలో అతి ప్రాచీనమైన, అతి మధురమైన ఆహార పదార్ధం తేనె. సుమారు 20 వేల ఏళ్ళ నుంచి మనిషి తెనెను ఆస్వాదిస్తున్నట్లు ఆధారాలున్నాయి. ప్రపంచంలోని పౌరులలో న్యూజిలాండ్‌ దేశస్థులు అత్యధికంగా తేనెను వినియోగిస్తారు. 88శాతం మంది ఆ దేశ ్పరజలు సగటున ఒక్కొక్కరూ 1.95 కిలోల తేనెను సాలీనా సేవిస్తారు.

'తేనె'కూ ఒక 'మాస'ముంది తెలుసా?

రంగు, రుచి ఆధారంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 300 రకాల తేనెలు తయారవుతున్నాయి. అమెరికా రైతులు తేనెతుట్టిలకు ప్రోత్సాహమివ్వడం ద్వారా పంటల ఫలదీకరణకు అధికంగా కృషి చేస్తారు. సాలీనా సగటున ప్రతి పౌరుడు 1.5 పౌండ్ల తేనెను స్వీకరించడం విశేషం. ఆ దేశంలో తేనెను వాణిజ్యపరంగా సాగు చేసేందుకు ప్రభుత్వం జాతీయ తేనె బోర్డు ఒకదానిని ఏర్పాటు చేసింది. అంతే కాకుండా, సెప్టెంబరు మాసాన్ని ''తేనె'' మాసంగా పరిగణించి, ఆ నెల రోజులపాటు తేనె ఉత్పత్తి, వినియోగం, లాభాలపై ప్రత్యేక తరహా కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తారు.

స్వచ్ఛమైన తేనెను ఎలా కనుగొనవచ్చు?

గాజు గ్లాసులో నీటిని నింపి ఒక చుక్క తేనెను అందులో వేస్తే, అది సరాసరి గ్లాసు అడుగు భాగానికి చేరుకుంటే దానిని శుద్దమైన తేనెగా భావించవచ్చు. శుద్ధమైన తేనె మంచి సువాసన కలిగి ఉంటుంది. చలికాలంలో గడ్డలాగా పేరుకుని, ఎండాకాలంలో కరిగిపోతుంది.

తేనెను సేవించే విధానం :

శుద్ధమైన తేనెను వేడి పదార్ధాలతో తీసుకోరాదు. చల్లటి పాలు, చల్లని నీటితో కలిపి తీసుకోవచ్చు. చక్కెర కలపని పాలలో తేనె కలిపి తీసుకుంటే శరీరంలోని కొవ్వు కరిగి కాంతివంతంగా మారుతుంది. తేనెకు పండ్లు, పండ్ల రసం, పాలు లేదా బాదం పప్పులతో పాటు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు. అల్లం నుంచి తీసిన రసంతో పాటు తేనెను కలిపి తీసుకుంటే శ్వాసకోశ వ్యాధులు, దగ్గునుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఉల్లిపాయ రసంతో పాటు తేనె కలిపి తీసుకుంటే ఊపిరితిత్తులు, గొంతులో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. ఎక్కిళ్ళను తగ్గించడానికి తేనెను వినియోగించవచ్చు.

తేనెటీగల పెంపకం - యాజమాన్య పద్ధతులు :

తేనెటీగల పెంపకం వ్యవసాయాధార పరిశ్రమ. రైతులు అదనపు ఆదాయం కోసం తేనెటీగల పెంపకాన్ని చేపట్టవచ్చు. తేనెటీగలు పూవులలో మకరందాన్ని తేనెగా మార్చి, తేనెపట్టు అరలలో దానిని నిల్వ చేసుకుంటాయి. అడవుల నుంచి తేనె సేకరించడమనేది ఎప్పటి నుంచో వున్నదే. తేనెకు దాని ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ పెరుగుతుండటంతో, తేనెటీగల పెంపకం లాభసాటి పరిశ్రమగా మారింది. తేనెటీగల పెంపకం నుంచి లభించే విలువైన ఉత్పత్తులలో తేనె, మైనము ముఖ్యమైనవి.

ఆదాయ మార్గంగా తేనెటీగల పెంపకం - ప్రయోజనాలు :

తేనెటీగల పెంపకానికి కొద్దిపాటి పెట్టుబడి, వనరులు, సమయం చాలు.

తేనెటీగల పెంపకానికి, మైనం తయారీకి వ్యవసాయపరంగా ఎలాంటి విలువలేని స్థలమైనా చాలు.

మరి ఏ ఇతర వ్యవసాయ పరిశ్రమ కన్నా కూడా తేనెటీగల పెంపకానికి అతి కొద్దిపాటి వనరులు సరిపోతాయి.

తేనెటీగల పెంపకం పర్యావరణంపై సానుకూల ప్రభావం చూపుతుంది. పూలు పూచే మొక్కలలో పరాగ సంపర్కానికి తేనెటీగలు ఎంతగానో తోడ్పడతాయి. ఆ విధంగా, పొద్దు తిరుగుడు వంటి పంటలలోను, వివిధ పండ్ల జాతులలోను అధిక దిగుబడికి తేనెటీగల పెంపకం దోహదం చేస్తుంది.

తేనె చాల రుచికరమైన, అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్ధం, తేనె పట్టుకోసం అడవులలో తేనెటీగలను వేటాడటం పాత పద్ధతి, ఈ పద్ధతిలో ఎన్నెన్నో తేనెటీగల సమూహాలు నాశనమైపోయేవి. ఇళ్ళ వద్దనే పెట్టెలలో తేనెటీగలను పెంచి, తేనెను సేకరించడం వల్ల ఈ విధమైన తేనెటీగల వినాశనాన్ని నివారించవచ్చు.

తేనెటీగల పెంపకాన్ని ఎవరికి వారుగా కాని, బృందాలుగా కాని చేపట్టవచ్చు.

తేనెకు, మైనానికి మార్కెట్‌లో ఎంతో గిరాకి ఉంది.

తయారీ విధానం

తేనెటీగలను పొలంలో లేదా ఇంటివద్ద పెట్టెలలో పెంచవచ్చు.

1. తేనెటీగల పెంపకానికి కావలసిన పరికరాలు

తేనెపెట్టె (హైవ్‌) ఇది పొడవుగా ఉండే ఒక చెక్క పెట్టె. దీనిపై భాగం నుంచి కింది వరకు పొడవైన అనేక పెట్టెలు ఉంటాయి. ఈ పెట్టె కొలతలు సుమారుగా ఇలా ఉంటాయి. పొడవు 100 సెం.మీ., వెడల్పు 45 సెం.మీ., ఎత్తు 25 సెం.మీ., మందం 2 సెం.మీ. తేనె టీగలు రావడానికి, పోవడానికి వీలుగా ఈ పెట్టెకు ఒక్కొక్కటి ఒక సెం.మీ. వెడల్పు కలిగిన రంద్రాలు ఉంటాయి. పెట్టెకు పైన పట్టెల బిగింపు ఈ రంద్రాలు మూసుకుపోని విధంగా ఉండాలి. పట్టెలు పెట్టె కింద వరకు ఉండాలి. ఎక్కువగా తేనెటీగలు పట్టితే, ఆ బరువును తట్టుకునే విధంగా పట్టెలు 1.5 సెం.మీ. మందంతో ఉండాలి. పెట్టెలో తేనెటీగలు తిరగడానికి ఇరుకుగా ఉండకుండా, పెట్టెకు మధ్య కనీసం 3.3 సెం.మీ. మీటర్ల ఎండం ఉండాలి.

పొగ డబ్బా (స్మోకర్‌) ఇది ముఖ్యమైన రెండవ పరికరం. ఒక చిన్న డబ్బాను ఇందుకు ఉపయోగించవచ్చు. తేనెటీగలు మనలను కుట్టకుండా చూసుకోవడానికి, వాటిని అదుపు చేయడానికి ఈ డబ్బా ఉపయోగపడుతుంది.

గుడ్డముక్క తేనె పట్టుకు దగ్గరగా పనిచేస్తున్నపుడు తేనెటీగలు కుట్టకుండా కళ్ళను ముక్కును కప్పుకోవడానికి

చాకు తేనె పట్టెపై పట్టెలను కదిలించి, తేనె అరలను కత్తిరించడానికి

ఈక తేనె అర నుంచి తేనెటీగలను నెట్టివేయడానికి

రాణి ఈగను వేరుపరచు జల్లెడ (క్వీన్‌ ఎక్క్సూడర్‌)

అగ్గిపెట్టె

తేనె టీగల జాతులు :

ఇండియాలో నాలుగు జాతుల తేనెటీగలు ఉన్నాయి అవి.

రాక్‌బీ (ఎపిస్‌ డార్సటా) ఇవి చాలా ఎక్కువగా తేనె సేకరిస్తాయి. సగటున ఒక్కొక్క తేనె పట్టుకు 50-80 కిలోల తేనెను ఇవి సేకరిస్తాయి.

లిటిల్‌ బీ (ఎపిస్‌ ప్లోరియా) ఇవి బాగా తక్కువగా తేనెను సేకరిస్తాయి. ఒక్కొక్క పట్టుకు కేవలం 200-900 గ్రాముల తేనె మాత్రమే వస్తుంది.

ఇండియన్‌ బీ (ఎపిస్‌ సెరనా ఇండికా) ఇవి ఏడాదికి సగటున 6-8 కిలోల తేనెను సేకరిస్తాయి.

యూరోపియన్‌ బీ (ఇటాలియన్‌ బీస్‌) (ఎపిసమెల్లిఫెరా) ఒక్కొక్క తేనె పట్టుకు సగటున 25-40 కిలోల తేనె వస్తుంది.

కొండి లేని తేనెటీగ (ట్రిగొనా ఇరిడిపెన్సిస్‌) పైన పేర్కొన్న నాలుగు జాతులే కాకుండా కేరళలో కొండిలేని తేనెటీగ అనే మరో జాతి కూడా ఉంది. అయితే నిజానికి వాటికి కొండి బొత్తిగా లేకపోలేదు. కాని అది అంతగా పెరగదు. ఇవి పరాగ సంపర్కానికి బాగా తోడ్పడతాయి. సంవత్సరానికి 300-400 కిలోల తేనెను సేకరించగలవు.

తేనె తుట్టెల ఏర్పాటు :

తెను పెట్టెలను తప్పనిసరిగా, నిలువ నీరు లేని ప్రదేశంలో ఏర్పాటు చేయాలి. మకరందం, పుప్పొడి, నీరు బాగా లభ్యమయ్యే పండ్ల తోటల సమీపంలో అయితే మరీ మంచిది.

తేనె పెట్టెలో ఎప్పుడూ అనువైన ఉష్ణోగ్రత ఉండాలి. అందువల్ల, తేనె పెట్టెకు నేరుగా ఎండ తగలకుండా చూడటం ముఖ్యం.

చీమలు పట్టకుండా, తేనె పెట్టె స్టాండు కాళ్ళకింద నీటి గిన్నెలు అమర్చాలి. తేనెపెట్టె ఉండే దిక్కుకు కొద్ది తేడాతో ఈ అమరిక ఉండాలి. తేనెటీగల అరలను పశువులకు, జంతువులకు అందుబాటులో ఉండకుండా చూడాలి. జన సమ్మర్దమైన రోడ్ల ప్రక్కన, వీధి దీపాల దగ్గర వీటిని ఉంచకూడదు.

తేనె టీగల సముదాయాన్ని ఏర్పాటు చేయడం :

అడవిలో తేనెటీగల గుడ్లు వున్న తేనె తుట్టెను తెచ్చి, తేనె పెట్టెలో పెట్టడం ద్వారానో తేనెపట్టు సమీపం నుంచి వెళ్ళే తేనెటీగల గుంపును తేనెపెట్టలోకి ఆకర్శించడం ద్వారానో తేనెటీగల సముదాయాన్ని ఏర్పాటు చేయవచ్చు.

తేనెటీగల గుడ్లనో, అటుగా వెళ్ళే తేనెటీగల గుంపునో ఆకర్షించడానికంటే ముందుగా చేయవలసింది ఆ తెనెపెట్టెలో తేనెటీగలకు అలవాటైన వాసన ఉండేలా చూడటం. కొన్ని పాత తేనెతుట్టె ముక్కలనో, కొద్దిపాటి తేనె మైనాన్నో తీసుకుని ఈ కొత్త తేనె పెట్టెకు బాగా రుద్దాలి. వీలైతే, గుంపుగా వెళ్ళే తేనెటీగల నుంచి రాణి ఈగను పట్టుకుని, తేనె పెట్టెలో అడుగున ఉంచాలి. అప్పుడు ఇతర తేనెటీగలు అక్కడికి ఆకర్షితమవుతాయి.

అరకప్పు వేడినీటిలో అరకప్పు చక్కెర కలిపిన ద్రావణాన్ని తేనె పెట్టలోకి చేరిన ఈ తేనెటీగల సముదాయానికి కొన్ని వారాలపాటు ఆహారంగా అందించాలి. తేనెటీగలు పట్టెల వెంబడి తేనె అరల నేర్పరచడాన్ని కూడా ఇది త్వరితం చేస్తుంది.

ఒక తెనె పెట్టెలో మరీ ఎక్కువ సంఖ్యలో తేనెటీగలు ఉండకుండా జాగ్రత్త వహించాలి.

ఒక తేనె పెట్టెలో మరీ ఎక్కువ సంఖ్యలో తేనెటీగలు ఉండకుండా జాగ్రత్త వహించాలి.

తేనె పెట్టె నిర్వహణ :

తేనె పట్టులో తేనె నిండే రోజులలో కనీసం వారానికొకసారి తేనె పెట్టెలను పరిశీలించాలి. ఉదయం పూట అయితే మరీ మంచిది.

ఈ వరుసలో తేనె పెట్టెను శుభ్రం చేయాలి. పై భాగం, సూపర్‌ / సూపర్స్‌ ఛేంజర్‌, పిల్ల ఈగలు అరలు (బ్రూడ్‌ చేంజర్స్‌), అడుగు పలక (ఫ్లోర్‌ బోర్డ్‌)

రాణి ఈగ బాగున్నదీ లేనిదీ పిల్ల ఈగల పెరుగుదల ఎలా ఉన్నదీ, తేనె పుప్పొడి ఏ మేరకు పోగైందీ, రాణి ఈగలు ఉండే అరలు ఎలా ఉన్నదీ, తేనెటీగలు ఏ సంఖ్యలో ఉన్నదీ ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.

తేనెటీగలకు హానికలిగించే మైనపు పురుగు (వాక్స్‌ మాత్‌) (గల్లేరియా మెల్లనెల్లా) తేనె పెట్టెలో చేరాయోమే గమనించి పెట్టె అరల నుంచి, పెట్టె మూలల నుంచి గ్రుడ్లను, కోశాలను తొలగించాలి. మైనపు పెంకు పురుగు (వాక్స్‌ బీటిల్స్‌) (ప్లాటీ బోలియం) పురుగులన్నిటినీ ఏరిపారేయాలి. పెద్దవాటిని చంపేయాలి. మైట్స్‌ పెట్టె ఫ్రేమ్‌ను కింది పలకను తాజాగా తయారుచేసిన పొటాషియం పెర్మాంగనేట్‌ ద్రావణంలో ముంచిన దూది లేదా నూలుగుడ్డ పీలికలతో బాగా తుడవాలి. కింది పలక మీద మైట్స్‌ అన్నీ పూర్తిగా పోయే వరకు ఇలా పదే పదే తుడవాలి.

తేనె సేకరణ తక్కువగా ఉండి, సీజన్లో నిర్వహణ సూపర్స్‌ను తొలగించి, పిల్ల ఈగల అరలో ఆరోగ్యవంతమైన పిల్ల ఈగలను దగ్గరదగ్గరగా వుంచాలి. అవసరమైతే అరను విడదీసే డివిజన్‌ బోర్డును ఉపయోగించాలి.

రాణి ఈగ సెల్స్‌, పోతుటీగ సెల్స్‌ కనిపిస్తే వాటిని నాశనం చేయాలి. ఒక్కొక్క తేనె పట్టుకు వారానికి 200 గ్రాముల చక్కెరను సమాన పరిమాణపు నీటిలో కలిపి తయారు చేసిన ద్రావణాన్ని అందుబాటులో ఉంచాలి.

తేనె పెట్టెలోని అన్ని తేనె పట్టులకు ఆహారం అందుబాటులో ఉంచాలి.

తేనె సేకరణ ఎక్కువగా ఉండే సీజన్లో నిర్వహణ తేనె సేకరణ ఎక్కువగా ఉండే సీజన్‌కు ముందే తన పట్టులో ఈగలు తగిన సంఖ్యలో ఉండేలా చూడాలి. మొదటి సూపర్‌కు, బ్రూడ్‌ ఛేంబర్‌కు మధ్య వీలున్నంత ఎక్కువ ఖాళీ జాగా ఉండేలా చూడాలి. అయితే మొదటి సూపర్‌ పైన ఖాళీజాగా ఉంచకూడదు.

రాణి ఈగను పిల్లల (బ్రూడ్‌) అరకే పరిమితం చేసే విధంగా, బ్రూడ్‌ - సూపర్‌ ఛేంబర్‌ల మధ్య రాణిని వేరుపరచు జల్లెడ (క్వీన్‌ ఎక్క్సూడర్‌)ను ఉంచాలి.

తేనె పట్టును వారానికొకసారి గమనిస్తూ, తేనె నిండుగా ఉన్న చట్రాలను సూపర్‌ పక్కగా జరపాలి. మూడు వంతులు తేనె, లేదా పుప్పొడితో ఒక వంతు అంటుకుపోయిన పిల్ల ఈగలతో ఉన్న చట్రాలను బ్రూడ్‌ చేంబర్‌ నుంచి తీసివేయాలి. వాటి స్థానంలో ఖాళీ పట్టెలను లేదా చట్రాలను ఉంచాలి.

పూర్తిగా లేదా మూడింట రెండు వంతులు తేనెతో నిండిన చట్రాలను బయటకు తీసి తేనె పిండుకున్న తర్వాత తిరిగి సూపర్స్‌లో పెట్టాలి.

తేనె తీయడం :

పొగపెట్టి ఈగలను పక్కకు మళ్ళించి, తేనె పట్టిన భాగాలను జాగ్రత్తగా కత్తిరించి, తేనెను తీయాలి.

సాధారణంగా పూలు బాగాపూచే అక్టోబరు / నవంబరు, ఫిబ్రవరి / జూన్‌ సీజన్లలోను, ఆ తర్వాత కొది ్దరోజుల పాటు తేనె తీయడానికి అనువైన కాలం.

బాగా తేనె నిండిన తేనె పట్టె లేత రంగులో ఉంటుంది. రెండు వైపుల సగానికి పైగా తేనె గూళ్ళు మైనంతో నిండి ఉంటాయి.

పుట్ట 'తేనెపట్టు' కనుమరుగు ఎందుకు? ఎలా?

ప్రకృతి వరప్రసాదాల్లో తేనె ఒకటి. బహుశా ఎలాంటి కల్తీకి లోనుకానిది. బలవర్ధక ఆహారం కూడా ఇదేనేమో! ఒకప్పుడు అడవుల్లో మాత్రం లభించే ఈ తేనె ఇప్పుడు పట్టణాల్లో కూడా తయారవుతోంది. ఇలా కృత్రిమంగా జరిగే ఈ తేనెటీగల పెంపకం, తేనె సేకరణ వల్ల తేనెపట్టులో లభించే తేనె ప్రయాణం క్రమంగా తగ్గిపోతూ ఉంది. ఇప్పటికే సగానికి క్షీణించిన ఈ అడవి తేనె మరి కొన్ని సంవత్సరాలు గడిస్తే కనుమరుగే అవుతుందేమోననే భయాన్ని ప్రకృతి ప్రేమికులు వ్యక్తం చేస్తున్నారు.

తేనె వాడకం ఈ నాటిది కాదు. అనాది నుండి కూడా వాడుకలో ఉంది. శిలాయుగం చివర్లోనే అడవి తేనె సేకరణ జరిగిందని చెప్పడానికి ఆధారాలున్నాయి. నిజానికి తేనెటీగ జీవన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన కీర్తి స్పెయిన్‌ శాస్త్రజ్ఞుడు హ్యూబర్‌కు దక్కుతుంది. రెండు వందల సంవత్సరాల క్రితం స్వతహాగా గుడ్డివాడయినప్పటికీ భార్య, సహాయకురాలి సాయంతో రాణి ఈగ తన గూడుకు చాలా దూరంలో ఉన్న మగ ఈగతో ఎలా సంపర్కం పెంచుకుంటుంది? తేనె పట్టుపై ఉన్న రంధ్రాల సైజును చూసి కూలి మగ ఈగలను, వాటి సంఖ్యను ఎలా గుర్తించవచ్చో హ్యూబర్‌ వివరంగా తెలియజేశారు.

ఇప్పుడు అడవి తేనెటీగ సైజు సైతం సగానికి తగ్గిపోయింది. అప్పట్లో ఒకసారి ఒక చెట్టుకు 350కి పైగా తేనెపట్టులు ఉండిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేదానికి ఆధారాలున్నాయి. ఇప్పుడు అదే చెట్టుకు వంద తేనెపట్టులుంటే గొప్ప అని అంటున్నారు. అంతేకాదు అరణ్య సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న వారు తెలిసీ తెలియనితనంతో గడువుకన్నా ముందే తేనెను సంగ్రహిస్తున్నారని, దీనివల్ల తేనె దిగుబడి తగ్గడమే కాక ఆడ ఈగలు, వాటి పిల్లలు చనిపోతున్నాయని కూడా అంటున్నారు.

అడవుల నాశనం - తేనెటీగకు శాపం!

ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత తేనెటీగల సంతతి తగ్గిపోవడానికి కారణమని తెలుస్తోంది. అంతేకాదు, వాటి నివాస స్థలాలు అంటే అడవుల్లోని చెట్లను నిరంతరం నరికి వేస్తూ ఉండటం, విపరీతంగా కీటక నాశకాలు, రసాయనిక ఎరువులను ఉపయోగించడానికి తోడుగా రకరకాల జబ్బులు, శత్రువుల సంఖ్య పెరిగిపోవడం అన్నీ చేరి తేనెటీగల పాలిట శాపాలుగా మారాయి. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా తేనె ఉత్పత్తి ఏడాదికేడాది తగ్గిపోతూ ఉంది. ఏడాదికి 6లక్షల మెట్రిక్‌ టన్నుల తేనెను ఉత్పత్తి చేస్తున్న చైనాలో ఇప్పుడు ఉత్పత్తి 3 లక్షల మెట్రిక్‌ టన్నులకు తగ్గిపోయింది. అయినప్పటికీ ఇప్పటికీ తేనె ఉత్పత్తిలో చైనాదే ప్రథమ స్థానం. తర్వాతి స్థానాలు అమెరికా, అర్జెంటీనాలవి. మన దేశంలో ఏటా ఉత్పత్తి అయ్యే తేనె కేవలం 50 వేల టన్నులు.

కాపాడటం ఎలా?

తేనెటీగల ఆహారమైన మకరందం కోసం రకరకాల పూల రక్షణ, వాటికి ఆశ్రయం ఇచ్చే వృక్షాల రక్షణ ఎలా? నాణ్యమైన తేనె సేకరణ, నాణ్యతా పరిశీలన, మార్కెట్‌ అవకాశాల గురించి, సేకరించిన తేనెను ఎక్కువకాలం నిల్వ ఉండేలా చేయడం ద్వారా ఎక్కువ లాభాలు వచ్చేలా మార్కెట్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం లాంటి వాటిపై దృష్టి పెట్టాలి. అలాగే తేనెటీగలకు రోగాలు, శత్రువుల బాధ లేకుండా చూడటంతో పాటుగా దేశంలోకి దిగుమతి అయిన 'మెల్లిఫెరా' దోమ వల్ల స్థానికంగా తేనెటీగల కుటుంబాలకు కలిగే నష్టం గురించి మరింత సమాచారాన్ని తేనె సేకరణే వృత్తిగా ఉండే వారికి అందించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. తేనెటీగల పెంపకం వల్ల గ్రామీణులకు అందులోనూ పేద మహిళలకు ఎక్కువ లాభం చేకూరుతుందనే విషయాన్ని వారికి కల్పించాలి. వీటన్నిటికి తోడు అడవి తేనె సేకరణను ప్రోత్సహించడంతో పాటు తేనె తీసిన తర్వాత పట్టునుంచి స్థానికంగా మైనం తయారీని ప్రోత్సహించాలి. చివరగా తేనెటీగలు పుష్పపరాగాన్ని, మకరందాన్ని సేకరించడంతో పాటుగా పరపరాగ సంపర్కానికి దోహదపడి పూలు, పండ్లు కాయగూరల అభివృద్ధికి సైతం పరోక్షంగా తోడ్పడుతాయని ఇప్పటికే రుజువైంది. అందువల్ల తేనెను సేకరించే వారు సంయమనంతో వ్యవహరించడం వల్ల తేనెటీగల జాతితో పాటు ప్రకృతి సంపదను సైతం కాపాడిన వారవుతారు.

- వై.వి. నరసింహారావు, అసోసియేట్‌ ఎడిటర్‌