ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని మామిడి తోటల్లో దాదాపుగా పిందె కట్టి కాయ ఎదుగుదలతో ఉన్నాయి. ఈ సమయంలో కాయలు పిందెలు రాలిపోవడం, తెగుళ్ళు, పురుగుల వల్ల మంగుమచ్చలు వచ్చి కాయ నాణ్యత తగ్గిపోవడం వంటి అనేక సమస్యల నుండి బయటపడడానికి ఈ కాయ ఎదుగుదల సమయంలో సరైన యాజమాన్యం చేపట్టడం ద్వారా మంచి నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు.

ఎరువులు - నీటి యాజమాన్యం :

పిందె దశలో నీటి తడిని ఇవ్వడం ప్రారంభించాలి. మొదటిసారి తడి ఇచ్చే ముందు యూరియా, పొటాష్‌ ఎరువులను పాదుల్లో వేసి తడివ్వాలి. 1.1 కిలో యూరియా, 750 గ్రా. మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ ఎరువులను మొదలుకు 1 నుండి 1.5 మీ. దూరంలో గాడి తీసి అందులో వేసి మట్టితో కప్పాలి. డ్రిప్‌ ద్వారా నీరు పెట్టే తోటల్లో ఫర్టిగేషన్‌ పద్ధతిలో నీటిలో కరిగించి ఎరువులను అందించితే మంచిది. అలాగే పిందె బఠాణి సైజు నుండి గోళీ కాయ సైజు మధ్యలో ఉన్నప్పుడు పిందెరాలడం ఎక్కువగా గమనించవచ్చు. దీన్ని తోటకు నీరు పెట్టడంవల్ల కొంత వరకు తగ్గించవచ్చు. మరియు ఈ దశలో ప్లానోఫిక్స్‌ మందును 3 మి.లీ. 15 లీటర్ల నీటిలో కలపి ఒకసారి పిచికారి చేయడం ద్వారా పిందెలు రాలడాన్ని తగ్గించవచ్చు. కాయ ఎదిగే సమయంలో పూత ఆలస్యంగా వచ్చిన తోటల్లో మల్టి-కె 10 గ్రా., లీటరు నీటికి కలిపి పిచికారి చేయడం వల్ల మంచి దిగుబడిని పొందవచ్చు. కాయ ఎదుగుదల సమయంలో ప్రతి 15-20 రోజుల వ్యవధిలో 2-3 తడులివ్వాలి.

సస్యరక్షణ చర్యలు :

ఈ సమయంలో ఉష్ణోగ్రతలు పెరిగి, పొడి వాతావరణం ఉంటుంది. కాబట్టి రసంపీల్చే పురుగుల వల్ల ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మామిడిలో తామర పురుగులు మరియు తేనే మంచు పురుగుల వల్ల ఈ నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇవి మామిడి తోటల్లో ఏడాది పొడవునా ఉంటాయి. అయితే అవి నష్టం చేసేది మాత్రం పూత, కాత దశల్లోనే. పూత నుండి రసం పీల్చడంవల్ల పూత రాలిపోతుంది. ఈ పురుగులు విసర్జించిన తేనెవంటి జిగురుపై ''మసి తెగులు'' వృద్ధి చెందుతుంది. వాటి నివారణకు ఫిప్రోనిల్‌ 2 మి.లీ. లేదా థయోమిధాక్సామ్‌ 0.3 గ్రా. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఈ సమయంలో పక్షికన్ను తెగులు కూడా ఎక్కువగా ఉంటుంది. కాయలపై మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు హెక్సాకొనజోల్‌ 2 మి.లీ లేదా కాపర్‌ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. కాయ ఎదుగుదల సమయంలో మామిడి పండ్లను ఆశించి సుమారుగా 40-50 శాతం దిగుబడిని తగ్గిస్తున్న కాయతొలుచు పురుగు మరియు టెంకె పురుగు నివారణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి. కాయతొలుచు పురుగు ఆశించిన తోటల్లో కాయ అడుగు భాగంలో నల్లటి రంధ్రం పురుగు విసర్జితాలతో కనిపిస్తుంది. టెంకెపురుగు తోతాపురి, నీలం రకాల్లో ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది.

ఈ పురుగు ఆశించిన తోటల్లో కాయలు రాలిపోవడం మరియు ఎండిపోవడం గమనించవచ్చు. ఆ కాయలకు రంధ్రాలు ఉండి కాయలను కోసి చూస్తే ఈ పురుగు కనిపిస్తుంది. ఈ రెండు పురుగుల నివారణకు పిందె దశలో ఉన్నప్పుడు ఎండుపుల్లలను తీసిన తరువాత చెట్లకు క్లోరిపైరిఫాస్‌ 20 శాతం ఇసి మందును 5 మి.లీ. / లీటరు నీటికి లేదా వేపనూనె 1000 పిపియం లీటరు నీటికి 50 మి.లీ. చొప్పున కాండం చుట్టూ మొదలు నుండి మీటరున్నర ఎత్తు వరకు కలిపి పూతగా పూయాలి. దీనివల్ల కోశస్థ దశలో ఉన్న గొంగళి పురుగులు చనిపోతాయి.

తోటల్లో కాయతొలిచే పురుగు యొక్క గొంగళి పురుగు దశ ఉన్నప్పుడు ధర్మాకోల్‌ ముక్కలను లేక మెత్తని ఎండు పుల్లలు ముక్కలు కట్టగా కట్టి చెట్టు కొమ్మకు కట్టి ప్రతి 10 రోజులకొకసారి ఈ కట్టిన కట్టలను తీసివేసి తగులబెట్టాలి.

ఈ పురుగు ఆశించిన తోటల్లో క్లోరిపైరిఫాస్‌ 20 శాతం ఇసి 2.5 మి.లీ. / లీటరు లేదా డైక్లోరోవాస్‌ 76 శాతం (1.5 మి.లి /లీటరు) 15 రోజుల వ్యవధిలో పిచికారి చేయడం వల్ల ఉధృతి తగ్గుతుంది. ఈ పురుగు ఆశించిన కాయలను, పండ్లను ఏరి నాశనం చేయాలి.

తామర పురుగులు :

కాయ ఎదుగుదల దశలో తామర పురుగులు ఆశించి కాయపైన చర్మాన్ని గోకడం వల్ల గజ్జి మచ్చలు ఏర్పడి కాయ ఆక్షణీయంగా ఉండదు. దీని నివారణకు థయోమిధాక్సామ్‌ 0.3 గ్రా. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. / లీటరు నీటికి కలిపి కాయ ఎదుగుదల దశలో పిచికారి చేయాలి.

కాయ కోత మరియు కోత అనంతర చర్యలు :

సరిగ్గా పక్వానికి వచ్చిన కాయలను మాత్రమే కోయాలి. కాయలను సరైన పరికరాలతో అంటే చిక్కాలు లేది దాపోలి హార్వెస్టర్‌ వంటి పరికరాలతో కాయలను 5-7 సెం.మీ. పొడవు గల తొడిమలతోసహా కోసి సొనకారిపోయే వరకు తొడిమలు కిందికి ఉండే విధంగా నీడలో ఆరబెట్టి తరువాత ప్లాస్టిక్‌ ట్రేలలో పేపర్‌ ముక్కలను కుషన్‌లా మెత్తగా అమర్చి మార్కెట్‌కు పంపాలి.

మామిడిలో కాయకోత అనంతరం చెట్టుకు ఉండే ఎండిపోయిన కొమ్మలు, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను, చీడపీడలు సోకిన కొమ్మలను కత్తిరించాలి. ఉత్తరం, దక్షిణం వైపు గుబురుగా ఉన్న కొమ్మలను మధ్య మధ్యలో తీయించడం వల్ల సూర్యరశ్మి చెట్టులోపలికి ప్రవేశించి కొత్త చిగురురావడానికి మరియు త్వరగా కొమ్మలు కూడా ముదరడం జరుగుతుంది. కాయకోత అనంతరం తొడిమ ఎండిపోయి ఉన్న కొమ్మల్లో ఒక కణుపు వెనుకకు కత్తిరించడం ముఖ్యమైనది. దీనివల్ల కొత్త చిగురువచ్చి వచ్చే సంంవత్సరం కాపుకు తోడ్పడుతుంది. వర్షాకాలంలో మనం చేపట్టే యాజమాన్య పద్ధతులను బట్టి పూత రావడం మరియు దిగుబడికి ప్రభావితం అవుతుంది.

కాపుకొచ్చిన తోటల్లో కోత అనంతరం 15 రోజులపాటు విశ్రాంతినిచ్చిన తరువాత నేలలో పదును చూసుకొని జూన్‌-జులైలో పొలం బాగా దున్నుకొని 10 సం|| ఆపైన వయసున్న తోటల్లో 50-100 కిలోల పశువుల ఎరువు 1.1 కిలోల యూరియా, 2.5 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ 900 గ్రా. మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ ఎరువులను మొక్కలకు అందించాలి. లేత తోటల్లో వర్షాకాలంలో జనుము, జీలుగ, పచ్చిరొట్ట పైర్లను పెంచి పూత దశలో కలియదున్నుకోవడం ద్వారా నేలలను సారవంతంగా తయారుచేసుకోవచ్చు.

ఎం. రవీంద్రబాబు, ఉద్యాన పరిశోధనా స్థానం, వెంకట్రామన్నగూడెం, పశ్చిమగోదావరి జిల్లా, ఫోన్‌ : 9849733741