వేసవిలో చేయవలసిన ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు

ఎండాకాలంలో రైతులు అకాల వర్షం వచ్చినా వెంటనే దుక్కి దున్నుతారు. సాధారణంగా ఈ దుక్కులు ఏరువాకతో ప్రారంభమౌతాయి. ఇటీవల సాగు పద్ధతిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వర్షాల కోసం ఎదురుచూడకుండా నీటివసతి ఉన్న ప్రాంతాల్లో తడికట్టి వేసవిదుక్కులు దున్నడం ఎంతో ప్రయోజనకరం.

రబీ పంట కోత కోయగానే నేలలో ఉన్న పదునుతో కూడా దుక్కిదున్నవచ్చు. వేసవి దుక్కుల వల్ల మొదట భూమి గుల్లబారుతుంది. భూమిపై ఉన్న కలుపు మొక్కల నియంత్రణకు ఎంతో సహాయంగా ఉంటుంది. అరకొరగా వచ్చే వర్షాల వల్ల కలుపు గింజలు మొలకెత్తుతాయి. గుంటక లేదా దంతెకొడితే మొలకెత్తిన లేత కలుపు మొక్కలు ఏరివేయడానికి వీలుంటుంది. చనిపోయిన మొక్కల అవశేషాలు నేలల్లో కలిసి పోషకాలు విడుదల చేస్తాయి. ఇవి ప్రధానపైరుకు ఎంతో ప్రయోజనం. వేసవిదుక్కులు ఆ విధంగా భూసారపెంపకు తోడ్పడుతాయి. అంతేకాకుండా నేలల్లో బంకరేణువులుపైకి వచ్చి వేడి పరిస్థితులను ఎదుర్కోవడంలో కలిగే మార్పులు రేణువులలో ఉన్న పోషకాల లభ్యత పెరుగుతుంది.

లోతుగా దున్ని వదిలేయడం :

రాష్ట్రంలో మెట్ట సేద్యం ఈనాటికీ దాదాపు 60 శాతం వరకు కొనసాగుతుంది. నైరుతి రుతుపవనాల కాలంలో 80 శాతం వర్షం వస్తుంది. తరువాత వచ్చేది చాలా తక్కువ. వేసవి వర్షం కానీ, తొలకరిలో వచ్చే చిరుజల్లులు కూడా భూమిలో ఇంకాలి. కలుపును పూర్తిగా తీసివేయాలి. నాగలిసాలు ఆకు ఇంచెల వరకు భూమిలోపలికి వెళ్ళే విధంగా దున్నాలి. దున్నడం వల్ల పైన ఉన్న కలుపు మొక్కలు లోపలికి వెళ్తాయి. భూమిలోపల ఉన్న చీడపీడలు బయటకు వస్తాయి.

వాలుకు అడ్డంగా దున్నడం :

దీనివల్ల మొదటిసారి కాకుండా రెండో సారి కురిసిన వర్షపు నీరు పొర్లిపోకుండా ఉంటుంది.

పురుగులు పెట్టే గుడ్లు, ఇతర దశలు భూమిలోపల ఉంటాయి. ఎండాకాలంలో 400 వరకు వేడి ఉండడంవల్ల ఇవి ఆ ఉష్ణోగ్రతలకు తట్టుకోలేవు. దీనివల్ల సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లవుతుంది.

రెండోసారి గుంటకు కానీ దంతెకానీ తొలాల్సి ఉంటుంది. ఎప్పుడైతే నేలను దున్ని గుల్ల చేస్తామో అప్పటి నుండి కలుపు మొక్కలు పుట్టుకొస్తాయి. అవి నేలకు పైభాగానే ఉంటాయి కనుక గుంటక లేదా దంతి తోలినట్లయితే తేలికగా పైకి వచ్చేస్తాయి. మొక్కజొన్న, వేరుశనగ, మిరప పంటలు వేసేవారు వేసవి దుక్కులు తప్పనిసరి. ఈ ఏడాది పత్తిజోలికి వెళ్ళవద్దని ప్రభుత్వం చెబుతోంది. కనుక కంది, సోయాబీన్‌ పంటల వైపు దృష్టిసారించాలి.

అడ్డుకట్టలు వేసుకోవాలి :

ఎర్రజెక్క భూముల్లో అడ్డుకట్టలు వేసుకోవాల్సి ఉంటుంది. ఒక మీటరు ఫాల్‌ పైన 100 మీటర్లు ఉంటే 99 మీటరున్నర దగ్గర కట్ట వేయాలి. ఎర్రభూములకు అడ్డుకట్ట వేస్తే సరిపోతుంది. నల్లరేగడి భూముల్లో వాలు తక్కువగా ఉంటుంది. నీరు త్వరగా పీల్చుకోదు. మట్టి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ఇది మరీ ప్రమాదకరం. కనుక సమతల గట్లు వేయాల్సి ఉంటుంది. వర్షపు నీరు చుక్క కూడా బయటకు పోనీయకూడదు.

పెంట ఎరువులు, చెరువు మట్టి :

చెరువుల్లో తీసే పూడిక మట్టి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చెరువు మట్టి ఎకరానికి సుమారు 10-15 ట్రాక్టర్లు తోలితే సరిపోతుంది. ఈ బంకమట్టి నీటిని పీల్చుకొని ఎక్కువకాలం తేమ ఉంచుకుంటుంది. ఇసుక నేలల్లో ఈ గుణం ఉండదు. వేసవి దుక్కులు పూర్తయ్యాక చెరువు మట్టిని, పెంట ఎరువులు చల్లినట్లయితే మంచిది. దీనివల్ల భూమిలో పోషకాల లభ్యత పెరుగుతుంది.

యస్‌.యస్‌ సిద్ధార్థ్‌ నాయక్‌, బి. రూపేష్‌, తిరుణగిరి, పెనుబల్లి స్వాతి, బొమ్మన సువర్చల,

మహారాణా ప్రతాప్‌ యూనివర్సిటి ఆఫ్‌ అగ్రికల్చర్‌ & టెక్నాలజి, ఉదయపూర్‌, రాజస్థాన్‌, ఫోన్‌ : 91 8309452458