సంపాదకీయం

సాధించిన దానితో సంతృప్తిని పొంది...

పాడవోయి భారతీయుడా....ఆడిపాడవోయి విజయగీతిక... అని విజయ ఢంకా మోగించే పరిస్థితి మన దేశానికి ఇంకా రాలేదు. మహాకవి శ్రీశ్రీగారు వెలుగు నీడలు చిత్రం కొరకు రాసిన ఈ పాట ఇంకా ఎన్నో దశాబ్ధాలు పాడుకోవలసిందే..స్వాతంత్య్రం వచ్చెనని సంబరపడిపోకోయ్‌ అని హెచ్చరించిన ఆ మహనీయుడి మ¬పదేశాలు మూగబోయిన కోట్లాది రైతులు, పేదలు, కష్టజీవుల కంఠాలలో ఇంపుగా పలకడంలేదు. ఆకలి, దారిద్య్రం, నిరక్ష్యరాస్యత, అజ్ఞానం ఇంకా ఈ దేశపు మూలాల నుండి కదలనని భీష్మించుకు కూర్చున్నాయి. దానికి తోడు ఎల్లెడలా దాగి ఉన్న నైరాస్యం వీడని స్థితిలో మళ్ళీ పంద్రాగస్టు వచ్చేసింది. రెక్కాడితేగాని డొక్కాడని బడుగుజీవులొకవైపు.... లక్షల కోట్ల రూపాయలు దోచుకుని బలిసిన కార్పోరేట్‌ ఆసాములొకవైపు ఏమౌతుందీ దేశం.. ఎటుపోతుందీ దేశం అనే నిస్పృహతో భారంగా రోజులు, నెలలు, సంవత్సరాలు దొర్లిపోతున్నా మన జీవన విధానంలో మార్పులేదు... మార్పు వస్తుందన్న నమ్మకం కలుగడం లేదు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో కరువు కరాళ రక్కసిని ఎదుర్కునేందుకు, మొదటి సస్యవిప్లవం ద్వారా డొక్కల కరువును అధిగమించి దేశ ప్రజల ఆహార భద్రతకు ఎనలేని కృషి చేసిన కోట్లాది మంది రైతాంగానికి నిజమైన రుణాన్ని ఈ దేశం తీర్చుకోలేదు. ైపెచ్చు నిమిషానికొక ఆత్మహత్య చేసుకునేటట్లుగా కార్పోరేట్‌ కబంధ హస్తాలు ప్రేరేపిస్తుండడం, జనాభాలోనూ, ఆదాయ వనరుల్లోనూ, ఆహార భద్రతలోనూ బాధ్యతాయుతంగా నడుచుకుంటున్న రైతాంగ సాధికారతను కాదని పరాన్నభుక్కుల చేతుల్లో రాజ్యాధికారం కేంద్రీకృతం కావడం, చట్ట సభల్లో, పాలనా యంత్రాంగంలో రైతు బిడ్డల ప్రాధాన్యత తగ్గిపోవడం ఇవన్నీ మానవత్వపు విలువలను మంటగలిపే చర్యలకు పాల్పడే నీరోచక్రవర్తుల పాలనకు దోహదం కావడం విచారకరం. ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణమని భావించవలసి వస్తుంది తప్పా అన్నంపెట్టే అన్నదాతను ఆదుకునే దిశగా ప్రయత్నం సాగడం లేదు.

ప గిట్టుబాటు ధరలు ప్రశ్నార్ధకమై, పంట ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి, ప్రకృతి ప్రతి పంటపైన వికృతంగా పరిహాసం చేయడం, జాతీయ వ్యవసాయ విధానం లేకపోవడం, ఎన్నికల సమయంలో తప్ప రైతు బాధలు గుర్తుకు రాకపోడం విచారకరం. భారత రాజకీయ వ్యవస్థలో ఒక విషాదకర పరిణామంగా మారిన ఓటు బ్యాంకు రాజకీయాలను రైతులపైన ప్రయోగించడం... ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోవడం ఇప్పుడు రైతుల వంతైంది. ఎన్నికల్లో పబ్బం గడుపుకునేందుకు వాగ్ధానాల వెల్లువను ప్రయోగించడం, బిచ్చగాళ్ళలాగా రైతులకు తాయిలాలు చూపించి విశాలమైన ఓటు బ్యాంకును కొల్లగొట్టడం దళారీ పాలకుల వంతైంది. ఒక రైతు బిడ్డకు ఇంకొక రైతు పిల్లనివ్వకపోవడం, ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో కనీసం ఒక కోతి చనిపోతే ఎన్నో వానరాలు మూగగా రోధిస్తున్న సంఘటనలు చూసైనా రైతుల పట్ల సమాజ దృక్పదం మారకపోవడం, రైతు సెంటిమెంటు పండించి సినిమా వాళ్ళు సైతం ధనార్జన చేసుకోవడం, అదే మార్కెట్‌ సంస్కృతి పైసాకు కూడా రైతులకు వినియోగపడక పోవడం ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితులు ఇకనైనా మారాలి. ఎన్నో సంవత్సరాలుగా ఎర్రకోట బురుజుల సాక్షిగా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటనలు చేసి మోసపుచ్చే పార్టీలు, ప్రభుత్వాలు చివరకు మధ్యప్రదేశ్‌లోని మాండసర్‌లో రైతులను విచక్షణారహితంగా కాల్చిపారేసి ఆ శవాలపై పేలాలమ్ముకునే స్థితిలో భారత రాజ్యాంగ వ్యవస్థ రైతుల పాలిట చూపిస్తున్న వివక్షత ఇకనైనా ఆగుతుందా? ఢిల్లీలో పార్లమెంటుకు సమీపంలో జంతర్‌ మంతర్‌ మద్ద ఒక రాజపుత్ర రైతు వీరుడు దేశ విదేశీ మీడియా సాక్షిగా ఉరివేసుకుంటే ఫోటోలు, వీడియాలు తీసి రేటింగ్‌ పెంచుకునే మీడియా వ్యవస్థలు, మొక్కుబడిగా సంతాపాలు ప్రకటించే ప్రజాప్రతినిధులున్న ఈ దేశ స్వాతంత్య్రం రైతులకేమిచ్చిందని ప్రశ్నించడంలో తప్పులేదేమో...