వెర్రి నువ్వులని గడ్డి నువ్వులు లేదా ఒడిసలు / ఒలిసలు అని కూడ అంటారు. ఒలిసలు మొక్క యొక్క మొదటి పుట్టుక స్థానం ఆఫ్రికాలోని ఇథియోపియా ప్రాంతం. విదేశాల్లో వెర్రి నువ్వులు పంట సాగుచేయు దేశాలు ఇథియోపియా, భారతదేశం, నేపాల్‌, వెస్ట్‌ ఇండియన్‌, బ్రెజిల్‌, మెక్సికో, చీనా, నేపాలు మరియు మయన్మార్‌. భారతదేశంలో కర్నాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ మరియు ఒడిషా. ఆంధ్ర ప్రదేశ్లో విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతంలో ఈపంటను బాగా సాగుచేస్తారు.

ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ఒడిసలు / ఒలిసలు నూనెలో 50 శాతం ఈథోపియాలోను, మనదేశంలో 3-5 శాతం వరకు ఉత్పత్తవుతుంది. నూనె, పాలిపోయిన పసుపు లేదా ఆరేంజి రంగులో ఉండి మంచిరుచి మరియు వాసన కలిగి ఉండును. నూనెలో ఏక బంధ, బహు బంధ అసంతప్త కొవ్వు ఆమ్లాలైన ఒలిక్‌ మరియు లినొలిక్‌ కొవ్వు ఆమ్లాలు అధికశాతంలో ఉండటం వల్ల ఆరోగ్యనికి మేలు చేస్తుంది. వెర్రి నువ్వులు నూనెలో కరిగే చక్కెరలు (12-18 శాతం), మాంసకత్తులు (10-25 శాతం), కొవ్వు (32-40 శాతం) ముడిపీచు (10-20 శాతం), తేమ (10-11 శాతం) ఉన్నాయి. అంతే కాకుండ నూనెలో చాలా గొప్ప ఖనిజాలైన సోడియం, మెగ్నీషియం, జింక్‌, కాల్షియం, రాగి, పొటాషియం మరియు స్టియరిక్‌ ఆమ్లం, రైబొఫ్లేవిన్‌, ఏస్కొర్బిక్‌ ఆమ్లం మరియు యాంటీహిస్టమైన్స్‌ ఎక్కువగా ఉంటాయి.

వెర్రి నువ్వుల నూనె - ఉపయోగాలు :

గుండె ఆరోగ్యానికి :

ఈ నూనెలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మరియు లినొలిక్‌ యాసిడ్‌ ఉండటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ను సమతుల్యంగా ఉంచటంలో సహాయపడుతుంది. తద్వారా గుండె పోటు మరియు ఇతర హద్రోగాలు రాకుండా రక్షిస్తుంది.

1. ఈ నూనెలో మెగ్నీషియం, పొటాషియం మరియు జింక్‌ మొదలైన ఉపయోగకరమైన మూలకాలు పుష్కలంగా ఉంటాయి. అవి మన శరీరానికి అవసరమైన రోజు వారి దిన చర్యలను సమర్ధవంతంగా నిర్వహించటానికి దోహదపడతాయి మరియు ఈ మూలకాల్లోని మెగ్నీషియం మన రక్తంలోకి న్యూరోట్రాన్స్మిటర్స్‌ అనే రసాయనాలు విడుదల చేసి శరీరానికి కావలసిన విశ్రాంతిని ఇవ్వటంలో సహాయపడుతుంది.

2. గాయాలు మాన్పటం : ఈ నూనెలో గల యాంటీఆక్సిడెంట్లు తగిలిన మరియు కాలిన గాయాలు తొందరగా మానటంలో సహాయపడతాయి. ఈ నూనెలో మాంసక తులు, పీచు పదార్ధాలు మరియు రిబోఫ్లావిన్‌, 'సి' విటమిన్లు అధికంగా ఉండటం వల్ల గాయాలు త్వరగా మానటంలో సహాయపడుతుంది.

3. శరీరంలో మంట మరియు వాపులను తగ్గించటం : ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు శరీరపు మంటలను తగ్గించే మూలకాలు అధికంగా ఉండటం వల్ల ఇది కీళ్ళ నొపలు,కీళ్ల వాపులను, వేళ్ళ మధ్యలో ఏర్పడే పుండ్లు, కీళ్ల వాతం, జ్వరాలను మరియు అధిక రక్త పోటును తగ్గించటంలో ఉపకరిస్తుంది.

4. జీర్ణ సమస్యలకు పరిష్కారం : ఈ నూనెకు మలబద్ధకం, పొట్ట ఉబ్బరం, పొట్టలో వికారంగా ఉండటం మొదలైన జీర్ణ సమస్యలను నివారించగలిగే శక్తి కలిగి ఉంటుంది. ఈ నూనెలోగల ఔషధ గుణాలు పొట్టలోని చెడు బ్యాక్టీరియాలను నివారించడంలో తోడ్పడతాయి.

5. ఈ నూనెలో మాంసకతులు, పిండి పదార్ధాలు మరియు శరీరానికి కావలసిన మూలకాలు అధికంగా ఉండి శరీర జీవక్రియలు సక్రమంగా జరగడంలో తోట్పాటును అందిస్తాయి ఈ నూనెకు శరీరంలో గల ఉదజని సమతుల్యంగా ఉంచి శరీరాన్ని నిర్జలీకరణం నుండి కాపాడే శక్తి ఉంటుంది

6. నొప్పుల నివారణకు : ఈ నూనెను శరీరంలో నొప్పులు ఉన్న చోట పూసినా లేదా నోటి ద్వారా తీసుకున్నా నొప్పులు నివారించబడతాయి.

7. బరువు పెరుగుటకు : ఈ నూనెను వాడటం వల్ల అవసరమైన శరీర బరువు పెరగటంలో సహకరిస్తుంది మరియు అనారోగ్యం కారణంగా కోల్పోయిన బరువును పెంచి త్వరగా కోలుకునేలా సహాయం చేస్తుంది.

8. మొత్తంగా ఈ నూనెకు జలుబు, జ్వరం, గుండె సంబంధ వ్యాధులు తగ్గించటం, అధిక రక్తపోటును అదుపులో ఉంచటం, రక్త ప్రసరణ సరిగా జరిగేలా చూడటం, కీళ్ల నొప్పుల నివారణ, శరీర నొప్పులు మరియు మంటలను తగ్గించటం మరియు వ్యాధి నోరోధకతను పెంచి గాయాలను తొందరగా మానేటట్లు చేసి శరీర వ్యాధులు రాకుండా కాపాడే శక్తి ఉంటుంది.

వెర్రి నువ్వుల గింజలను వాడే విధానం :

1. వీటి గింజలను ఒక పాత్రలో ఉంచి పొయ్యి మీద పెట్టి సన్నని మంటతో వేయించి , వాటిని మెత్తని పొడి చేసి ఏదైనా వుడికించిన పప్పుతో కలిపి వాడుకోవచ్చు.

2. ఈ నూనెను నెయ్యికి ప్రత్యమ్నాయంగా వంటల్లో మరియు సలాడ్ల తయారీకి ఉపయోగించవచ్చు.

3. వీటి గింజలను శ్రేష్ఠమైన ఆహారపదార్ధాలను తయారు చేయటానికి, సుగంధ ద్రవ్యాలుగాను లేదా అల్పాహారం (స్నాక్స్‌) గానూ ఉపయోగించవచ్చు

ఇతర ఉపయోగాలు :

1. వీటి గింజల మొలకలను వెల్లుల్లి మరియు తేనెతో కలిపి దగ్గు నివారణకు ఉపయోగించవచ్చు

2. నూనెను కీళ్ల నొప్పులు మరియు కీళ్ల వాత నివారిణిగా వాడవచ్చు

3. కాలిన గాయాల నివారణకు ఉపయోగించవచ్చు

వెర్రి నువ్వులు సంబంధించి మరి కొన్ని ఉపయోగాలు :

1. ఈ మొక్కలను గొర్రెలు తింటాయి కానీ ఆవులు మరియు ఎద్దులు ఆహారంగా తీసుకోవు

2. నేల సారాన్ని పెంచే ఎరువుగా ఈ మొక్కలను ఉపయోగించవచ్చు.

3. ఈ గింజల నూనెను వంటకు, దేవుని అభిషేకానికి, యంత్ర పరికరాలు మరియు యంత్రాలను శుభ్రపరచటానికి, పెయింటింగ్‌ వేయటానికి ఉపయోగిస్తారు.

4. మందుల మరియు సబ్బుల తయారీలో నువ్వుల నూనెకు బదులుగా ఈ నూనెను ఉపయోగిస్తారు

5. ఈ నూనెను వంటల కొరకు మాత్రమే కాకుండా పక్షుల దాణాగా అమెరికా మరియు ఐరోపా లాంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

6. ఈ గింజల్లో నూనె తీయగా మిగిలిన పొట్టును ఇథియోపియా లో పశువుల దాణాగా ఉపయోగిస్తారు మరియు ఈ గింజలను నూరగా వచ్చిన ముద్దను చర్మాల శుద్ధి చేయటానికి ఉపయోగిస్తారు.

డి. పుష్ప, బి. ఉషాకిరణ్‌, భారతీయ నూనెగింజల పరిషోధన సంస్థ, హైదరాబాద్‌