మన రాష్ట్రంలో సాగు చేయబడుతున్న వాణిజ్య పంటల్లో పత్తి పంట ముఖ్యమైనది. ఆదిలాబాద్‌ జిల్లాలో పత్తి పంటను వర్షాధార మరియు నీటి వసతి కలిగిన భూముల్లో దాదాపుగా 1.5 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. పత్తి పంటకు నల్లరేగడి నేలలు అనుకూలమైనవి. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బి.టి పత్తిని సాగుచేయడం జరుగుతుంది. గత కొద్ది సంవత్సరాలుగా రాష్ట్రంలో పత్తి సాగు చేస్తున్న రైతులు యాజమాన్య పద్ధతులు గమనించినట్లయితే ...

1. చాలా ప్రాంతాల్లో పంట మార్పిడి చేయకుండా పత్తిని సాగుచేస్తున్నారు.

2. బి.టి పత్తి సంకరాలను నిరంతరంగా సాగుచేయడం వల్ల నేలలో పోషకాల లభ్యత, నేల సారవంతత తగ్గిపోతుంది.

3. సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోతుంది.

4. బి.టి పత్తి నీటిపారుదల కింద సాగుచేస్తూ పంట కాలం పొడగించడం, తద్వారా గులాబి రంగు పురుగు తరువాత పంట తొలిదశలో ఆశిస్తుంది.

5. నవంబరు నెల మొదలు గులాబి రంగు పురుగు ఉధృతమై పురుగు మందుల వాడకం పెరుగుతుంది.

పై అంశాల వల్ల రైతుకు పంటకు అయ్యే ఖర్చు పెరుగుతుండడం మరొక వైపు దిగుబడి తగ్గడం జరుగుతుంది. దీనికి ప్రత్యామ్మాయంగా నీటి పారుదల కింద మరియు నల్లరేగడి నేలల్లో సాగు చేసే బి.టి పత్తి పంటను నవంబరు తరువాత పొడిగించకుండా పత్తి పంటను తీసివేసి నల్లరేగడి నేలలకు అనుకూలమైన మరియు చలికాలంలో అధిక దిగుబడులను ఇచ్చే శనగ పంటను సాగు చేయడం.

ఈ విధంగా చేయడం వల్ల గులాబి రంగు పురుగు యొక్క ఉధృతి తగ్గడంతో పాటు పురుగు యొక్క జీవితచక్రం ఆగిపోవడం జరుగుతుంది. అధిక దిగుబడినిచ్చే మరియు తక్కువ పంటకాలం కలిగిన శనగ పంట సాగుచేయడం వల్ల పంట మార్పిడి అవడంతో పాటు నేల సారవంతం అవుతుంది.

ఆదిలాబాద్‌ జిల్లాలోని బెల్లాం గ్రామానికి చెందిన గడ్డం హరీష్‌ అనే రైతు గత సంవత్సరం జూన్‌ నుండి నవంబరు వరకు పండించిన పత్తి పంటలో రూ. 21,530/- పంట ఖర్చుతో 8 క్వింటాళ్ళ దిగుబడిని సాధించారు. అప్పటి మార్కెట్‌ ధరల (రూ. 4500/-) ప్రకారం రూ. 36 వేల స్థూల ఆదాయం మరియు రూ. 14,470/- నికర ఆదాయం సాధించాడు.

పత్తి పంట తీసివేసిన తరువాత నవంబరులో శనగ పంటను వేయడం జరిగింది. ఈ పంటకు అయిన ఖర్చు రూ. 23,460/- కాగా దిగుబడి 8 క్వింటాళ్ళు సాధించాడు. అప్పటి మార్కెట్‌ ధరల ప్రకారం (రూ. 4, 400/- క్విం) రూ. 35,200/- స్థూల ఆదాయం. మరియు రూ. 21,740/- నికర ఆదాయం సాధించాడు.

అదే గ్రామానికి చెందిన మరొక రైతు పత్తి పంటను జూన్‌ నుండి ఏప్రిల్‌ వరకు పొడిగించి 11 క్వింటాళ్ళ దిగుబడి సాధించాడు. అంటే నవంబరు నెల తరువాత పత్తి పంట పొడిగించి 3 క్వింటాళ్ళ దిగుబడి సాధించాడు. అప్పటి మార్కెట్‌ ధరల ప్రకారం రూ. 46,500/- స్థూల ఆదాయం, రూ. 19,670/- నికర ఆదాయాన్ని రూ. 26,830/- పంట ఖర్చు సాధించాడు.

అంటే నవంబరు తరువాత పత్తి పంటను పొడిగించడం వల్ల రైతుకు రూ. 5,200/- నికర ఆదాయం రాగా అదే నవంబరులో శనగ పంట వేయడం ద్వారా రూ. 21,740/- నికర ఆదాయం పొందవచ్చు.

పత్తి పంటను పొడిగించకుండా నవంబరులో తీసివేసి శనగ పంట వేయడం వల్ల రూ. 16, 540/- అదనపు ఆదాయం పొందవచ్చు.

డా|| వై. ప్రవీణ్‌ కుమార్‌, సీనియర్‌ సైంటిస్టు, పోగ్రాం కో-ఆర్డినేటర్‌, డా|| జి. శివచరణ్‌, విషయ నిపుణులు, విస్తరణ విద్య, డా|| యం. రఘువీర్‌, విషయ నిపుణులు, సస్య విభాగం,

డా|| ఎ. రమాదేవి, విషయ నిపుణులు, కీటక శాస్త్రం, కృషీ విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్‌, ఫోన్‌ : 9989623829, 8688181618