దీన్ని సాధారణంగా ''మేతీ'' అని కూడా పిలుస్తారు. ఈ పంట దక్షిణ తూర్పు ఐరోపా మరియు పశ్చిమ ఆశియా దేశానికి సంబంధించినది. దీన్ని ఆకు కూరగాను (మెంతి కూర), సుగంధ ద్రవ్యంగాను మరియు ఔషద మొక్కగానూ ఉపయోగిస్తారు. ఈ మొక్క యొక్క లేత ఆకులు మరియు కాండాన్ని ఆకు కూరగా మరియు విత్తనాలను సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తారు. దీని ఆకుల్లో ప్రోటీన్‌ మరియు విటమిన్‌-సి లు అధికంగా ఉంటాయి.

ఈ మొక్కల్లో అధిక ఔషద గుణాలు ఉండటం వల్ల దీన్ని మలబద్ధకం నివారణకు, అజీర్ణం సంబంధ వ్యాధుల నివారణకు, కాలేయ మరియు ప్లీహంలను ఉత్తేజ పరచటానికి, ఆకలి పుట్టించటానికి మూత్ర సంబంధ వ్యాధుల నివారణకు, కొలస్ట్రాల్‌ తగ్గించటానికి, మధుమేహ నివారణకు, క్యాన్సర్‌ రాకుండా ఉంచటానికి, టెస్టొస్టీరాన్‌ హార్మోన్‌ సమతుల్యతకు మరియు బరువు తగ్గటానికి మందుగా ఉపయోగిస్తారు.

ఈ పంటను ముఖ్యంగా మన దేశం నుండి సౌదీ అరేబియా, జపాన్‌, శ్రీలంక, కొరియా మరియు ఇంగ్లాండ్‌ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తర ప్రదేశ్‌, మహరాష్ట్ర, పంజాబ్‌ మరియు తమిళనాడు రాష్ట్రాలు మన దేశంలో ఈ పంటను పండించే ముఖ్యమైన రాష్ట్రాలు. ఇది ఒక ఏక వార్షిక మొక్క సుమారుగా ఒక మీటరు ఎత్తు పెరుగుతుంది.

పంట కాల వ్యవధి :

పంట ఆకుకూరగా సాగు చేసుకున్నట్లయితే 20-25 రోజులు లేదా గింజల కోసమైతే 90-100 రోజులు.

నేలలు, వాతావరణ స్వభావం :

ఇది ఎటువంటి వాతావరణంలోనైనా పెరుగుతుంది. ఈ మొక్క చలి మరియు గడ్డకట్టే వాతారణాన్ని తట్టుకోగలదు. దీన్ని అత్యల్ప మరియు మోస్తరు వర్షపాతం కలిగిన ప్రదేశాల్లో సాగు చేసుకోవచ్చు. అధిక వర్షపాతం గల ప్రదేశాలు మాత్రం ప్రతికూలమైనవి. దీనికి అన్ని రకాల నేలలు అనుకూలమైనవి కానీ బంకమట్టి మరియు కొంచం క్షార గుణం కలిగిన నేలలు చాలా అనుకూలం.

రకాలు :

కో-1, రాజేంద్ర కాంతి, ఆర్‌ ఎం టి-1, లాం సెలెక్షన్‌-1, కసూరి, ఆర్‌ ఎం టి-143, మేథి నెం-47, మేథి నెం-14, ఇ సి-4911, హెచ్‌-103 మరియు హిస్సార్‌ సొనాలి మొదలైనవి ముఖ్యమైన రకాలు. వీటిలో మేథి నెం-47 మరియు మేథి నెం-14 రకాలు అధిక దిగుబడినిచ్చే రకాలు.

భూ యాజమాన్యం, విత్తుకోవటం :

భూమిని కనీసం మూడు సార్లు బాగా దుక్కి దున్ని, ఏకరీతిగా మడులను తయారు చేసుకొని, వాటిపై విత్తనాన్ని వెదచల్లుకోవచ్చు. వరుసల మధ్య 20-25 సెం.మీ. దూరం ఉండేటట్లు నాటుకుంటే అంతరకషి సులభంగా చేసుకునే వీలుకలుగుతుంది. సాధారణంగా మైదానాల్లో సెప్టెంబర్‌ నుండి నవంబర్‌ నెలల్లో విత్తుతారు. అదే పర్వత ప్రాంతాల్లో అయితే మార్చి నెలలో విత్తుకుంటారు. దక్షిణ భారత దేశంలో, ఈ పంటను ఖరీఫ్‌ మరియు రబీ రెండు కాలాల్లోనూ సాగు చేసుకోవచ్చు కానీ, ఖరీఫ్‌తో పోలిస్తే రబీ పంట అధిక దిగుబడినిస్తుంది. సాధారణంగా హెక్టారుకు 20-25 కిలోల విత్తనం అవసరమౌతుంది. విత్తిన 6-8 రోజుల్లో విత్తనం మొలకెత్తటం జరుగుతుంది.

విత్తన శుద్ధి :

విత్తనాన్ని నాటుకునే ముందు రైజోబియం కల్చర్‌తో శుద్ధి చేసుకోవటం వల్ల అధిక దిగుబడిని పొందవచ్చు.

ఎరువుల యాజమాన్యం :

హెక్టరుకు సుమారు 15 టన్నుల సేంద్రీయ ఎరువుతో పాటు, 25 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం మరియు 50 కిలోల పొటాష్‌ ఎరువులు అవసరం. సగం నత్రజని ఎరువు మరియు మొత్తం భాస్వరం, పొటాష్‌ ఎరువులను విత్తుకునే సమయంలోనే వేసుకోవాలి. మిగిలిన సగం నత్రజని ఎరువును, పంట 30 రోజుల వయసు ఉన్నప్పుడు వేసుకోవాలి. నత్రజని ఎరువును ఆకులు కత్తిరించిన ప్రతిసారి వేసుకున్నట్లయితే ఆకుల దిగుబడి బాగా రావటానికి ఉపయోగపడుతుంది.

నీటి యాజమాన్యం :

మొదటిసారి విత్తిన వెంటనే నీటిని అందించాలి. తరువాత నుండి, ప్రతి 7-10 రోజులకు ఒకసారి నీటిని అందించాలి. ముఖ్యంగా పూత మరియు కాయ సమయాల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.

కలుపు యాజమాన్యం :

పంట నాటిన మూడు నుండి నాలుగు వారాలకు మొదటిసారి గొప్పు తవ్వి కలుపు మొక్కలను తీసివేయాలి. తరువాత 40-60 రోజులకు మరొకసారి కలుపు నివారణ చేపట్టాలి. దీనితోపాటుగా ఫ్లూక్లోరాలిన్‌ అనే కలుపు మందును హెక్టారుకు 0.75 కిలోలను ఉపయోగించి కలుపు మొక్కలను నివారించవచ్చు.

సస్యరక్షణ :

సాధారణంగా ఈ పంటకు వేరుకుళ్ళు తెగులు వ్యాపిస్తుంది. దీని నివారణకు 0.5 గ్రా. లీటరు నీటిలో కలిపి లేదా కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 2 గ్రా. లీటరు నీటికి కలిపి తెగులు కనిపించిన వెంటనే పిచికారీ చేసుకొని తరువాత పదిహేను రోజులకు మరొకసారి పిచికారీ చేసుకోవాలి.

పంట కోయుట :

నాటిన మొదటి 25-30 రోజులకు లేత కొమ్మలను నేల నుండి 4-5 సెంటీమీటర్ల ఎత్తులో కత్తిరించుకోవాలి. తరువాత నుండి ప్రతీ 15 రొజులకు ఒకసారి కత్తిరించుకోవచ్చు. విత్తనాల కోసం సాగు చేసేదైతే పంట పూతదశకు రాక మునుపు 1-2 సార్లు కత్తిరించుకుంటే మంచిది.

గింజల కోసం సాగుచేసే పంటకైతే, మొక్క దిగువ భాగాన గల ఆకులు ఎండి రాలుతూ, కాయలు లేత గోధుమ రంగులోకి మారే సమయం కోతకు అనుకూలమైనది. కాయలు ఎండిన తరువాత మొక్కలను పూర్తిగా భూమిలోనుండి పీకివేసి, ఎండలో బాగా ఎండబెట్టుకొని, కర్రలతో కొట్టీ లేదా చేతులతో నలుపుకొని కానీ గింజలను వేరుచేసుకోవాలి. అలా వేరుచేసుకోగా వచ్చిన గింజలను బాగా శుభ్ర పరచుకొని, ఎండలో బాగా ఆరబెట్టుకొవాలి. తరువాత వాటిని గోనెసంచుల్లో నిల్వ వుంచుకోవచ్చు.

దిగుబడి :

పంటను ఆకులు మరియు విత్తనం రెండింటి కోసం సాగుచేసుకున్నట్లైతే, హెక్టారుకు సుమారు 1200 నుండి 1500 కిలోల గింజలు మరియు సుమారు 800 నుండి 900 కిలోల ఆకుల దిగుబడిని పొందవచ్చు.

పి. రవి యుగంధర్‌, బి. ఉషా కిరణ్‌, శాస్త్రవేత్త,

భారతీయ నూనె గిజల పరిశోధనా సంస్థ, హైదరాబాద్‌, ఫోన్‌ : 9502471491