హస్తిన మళ్ళీ ఎరుపెక్కింది. అఖండ రైతు శక్తితో ప్రచండంగా మెరిసింది. అన్నదాతల డిమాండ్లతో, నినాదాలతో ఇంద్రప్రస్తం ¬రెత్తింది. గత లోక్‌సభ వివిధ శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానా అమలుకు నోచుకోకపోవడంతో రైతన్నల్లో తీవ్ర నిరాశ, నిస్తృహ ఏర్పడింది. దశలవారీగా ఈ సంవత్సరకాలంలో అనేకసార్లు ఢిల్లీని తాకిన రైతల అసమ్మతి సెగ ఇటీవల కాలంలో పెను ఉప్పెనగా మారి సంఘటిత ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక, 'అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి' చందంగా రైతుల జీవితాలు కొడిగట్టి కునారిల్లుతున్న సమయంలో సంఘటిత రైతాంగం దేశ అత్యన్నత ప్రజాస్వామ్య పీఠమైన పార్లమెంటును ముట్టడించడానికి తరలి రావడం ఈ సంవత్సరంలో ఇది ఐదవసారి కావడం విశేషం.

ఈసారి ఈ ఆందోళనలో రైతు సంఘాల నేతలతో పాటు 13 ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ, ఆప్‌ అధ్యక్షులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌, సిపియం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేంద్ర మాజీ వ్యవసాయ మంత్రి, ఎన్‌సిపి అధ్యక్షులు శరద్‌పవార్‌తో పాటు సిబిఐ మాజీ ఉన్నతాధికారి వివి లక్ష్మీనారాయణ, సిపిఐ జాతీయ నాయకుడు సురవరం సుధాకర్‌ రెడ్డి రైతు ఆందోళనా వేదికను ఎక్కి అఖండ రైతు శక్తికి తమ మద్ధతు తెలిపారు.

2014 సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు రైతులకు సంపూర్ణ రుణమాఫీ ప్రకటించి అధికారంలోకి వచ్చిన టిడిపి, తెరాస ప్రభుత్వాలు కొంత మేరకు రుణమాఫీ హామీని నెరవేర్చగా ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో అక్కడి బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి యోగి ఆదిత్యానాధ్‌ రైతులకు సంపూర్ణ రుణ మాఫీ ప్రకటించి ప్రస్తుతం అమలు చేసే పనిలో పడ్డారు. 2014 ఎన్నికల్లో రుణమాఫీ ప్రస్తావన చేయని ప్రధాని మోడి ఉత్తర ప్రదేశ్‌ నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యుడిగా ఆదిత్యానాద్‌ ప్రతిపాదనకు సుముఖత ప్రకటించారు. దీన్ని ఆసరాగా చేసుకొని విపక్ష పార్టీలు జాతీయ స్థాయిలో రైతు రుణమాఫీకి విధానపరమైన నిర్ణయం తీసుకోవలసిందిగా మోదిపై ఒత్తిడి తెస్తూ ఉన్నారు. అదే సందర్భంలో రుణమాఫీ అంశం జాతీయ స్థాయిలో ప్రభావం చూపడంతో దేశ వ్యాప్తంగా ఉన్న 207 రైతు సంఘాలు, ఉద్యమ సంస్థలు ఒక కార్యాచరణను ప్రకటించి ఆందోళనను తీవ్రతరం చేశారు. సంపూర్ణ రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం, రైతుకు సామాజిక భద్రత కల్పించి ఆత్మహత్యలను నివారించడం, సంక్షోభ నివారణకు జాతీయస్థాయిలో చర్చ జరిగేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఉద్యమాన్ని ప్రారంభించారు.

అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ సమితి (ఎఐకెఎస్‌సిసి) ఆధ్వర్యంలో ఉధృతంగా ప్రారంభమైన ఈ ఉద్యమం ఢిల్లీలో శుక్రవారం జరిగిన ర్యాలీతో పతాక స్థాయికి చేరింది. దేశంలోని పలు రాష్ట్రాల నుండి గురువారం నాడే ఢిల్లీకి చేరుకున్న వేలాది మంది రైతులు దేశ చరిత్రలో కనీ, వినీ ఎరుగని రీతిలో రాజధాని నగర పురవీధుల్లో కథం తొక్కారు. ఎముకలు కొరికే చలిలో, చెప్పులు లేని పాదాలతో తలపాగాలే శిరస్త్రాణాలుగా భావించి, ఏక వస్త్రలుగా కథం తొక్కిన రైతన్న ప్రతి హృదయంలోనూ తమ భవిష్యత్‌ పైన తాము చేపట్టిన పవిత్రవృత్తి మనుగడపైన పుట్టెడు అనుమానాలతో, భవిష్యత్‌ అగమ్యగోచరంగా భావించి ముందుకు కదలాడు. పదండి ముందుకు పదండి తోచుకు అంటూ సింహాలై గర్జించి పదంపాడుతూ కదం తొక్కుతూ పతాకాలతో ఎరుపెక్కిన రోడ్లపై శుశిక్షితులుగా బారులు తీరారు.

చీమల దండులాగా, అలనాటి స్వాతంత్య్ర సమర ఉత్సాహంతో దేశం నలుమూలల నుండి ఢిల్లీకి వచ్చిన రైతులు 5 మార్గాల ద్వారా రామ్‌లీలా మైదానంకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయానికే రామ్‌లీలా మైదానం నిండిపోగా పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన రైతులతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయి ఉద్విగ్నంగా మారిపోయింది. రైతు సోదరులు గర్జన చూసిన పాతతరం రైతులు అలనాడు మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ నేతృత్వంలోనూ, ఆ తరువాత ఉప ప్రధానిగా పనిచేసిన చౌదలి దేవీలాల్‌ నేతృత్వంలోనూ, ఝాట్‌ రైతు సింహం మహేంద్రసింగ్‌ తికాయత్‌ ఆధ్వర్యంలోనూ బోట్స్‌క్లబ్‌ తదితర ప్రాంతాల్లో జరిగిన కిసాన్‌ మేళాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్‌, హర్యాన, పంజాబ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆ మహానేతలు అస్తమించిన అనంతరం రైతు సాధికారత ఉద్యమాలకు తెరపడిన నేపద్యంలో మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత కార్పోరేట్‌ కుట్రలను ఛేదిస్తూ అన్నదాతలు వెల్లువలా కదలిరావడం, నూతన సంవత్సరానికి, ఈ నెలలో జరిగే కిసాన్‌ దివస్‌కు స్వాగతంగా ఉద్యమ నీరాజనాలను రైతు నేతలు అర్పిస్తున్నారు.

రైతు నిరసన నేపధ్యం..

ప్రపంచంలో అన్ని సామాజిక వర్గాలూ, సంఘాలు, విభాగాలు, వాణిజ్య వర్గాలకు దినోత్సవాలు జరుపుతుండగా, మానవాళికి ఆహారం అందించే రైతన్నకు ప్రత్యేకమైన ఉత్సవం లేకపోవడం, ఆయన శ్రమకు సమాజం నీరాజనం పట్టకపోవడం శోచనీయమైన విషయం. పైపెచ్చు అన్నదాతకు, అతని కుటుంబ సభ్యులకు కేవలం ఆత్మన్యూనత మాత్రమే మిగిలి ఉండడం గమనార్హం. రైతు దేశానికి వెన్నుముక అని, అన్నదాతా సుఖీబవ అని చిలకపలుకులు పలికే వారు సైతం తమ ఇంటి ఆడపడుచును పవిత్రవృత్తిలో ఉన్న వ్యవసాయ దారునికి ఇచ్చి వివాహం చేయలేని దుస్థితిలో ఉండడం మన సమాజ దౌర్భాగ్యానికి, పతనావస్థకు నిదర్శనం.

దేశంలో ఎన్నో కుల సంఘాలు, మత ఘర్షణలు, ప్రాంతీయ ఉద్యమాల్లో, చివరకు వ్యక్తిగత కారణాలతో కూడా మరణించిన వారికి సమాజం సానుభూతి లభించడం, నివాళులర్పించడం, ఆర్ధిక భద్రత కల్పించడం వంటి పనులను సులభంగా చేసుకు పోతున్న తరుణంలో జీవకోటి మనుగడకు, ప్రాణం నిలుపుకునేందుకు ఆహారాన్ని పండించే రైతన్న ఆత్మహత్యలను పట్టించుకోకపోవడం, కనీసం వాటి వెనుక ఉన్న బాధలను అర్ధం చేసుకోకపోవడం మరింత శోచనీయం. నూతన ఆర్థిక విధానం, ఆర్థిక సరళీకరణ ప్రారంభమైన 1990వ దశకం నుండి ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా రైతులు సంక్షోభాల సుడిగుండంలో చిక్కుకొని శలభాల్లా మాడిపోతే పట్టించుకునే నాధుడే లేకపోవడం దురదృష్టకరం. మొదటి సస్య విప్లవంలో విలువైన భూసారాన్ని కోల్పోయి కరువునుండి, పోషకాహార లేమి నుండి అన్నార్తులను, బాధార్తులను, వ్యధార్తులను ఆదుకునేందుకు అశధారావ్రతం చేసిన రైతులకు పవిత్ర భారత దేశంగా నీతులు వల్లించే నేతలకు ఈ చావుల పాపాల మర్మం అర్ధం కాలేదేమో. కోట్లాది మంది రైతు వితంతువుల పుస్తెలు తెగిపోయి వివాహ తరుణానికి వచ్చిన పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక, చదువులను అర్ధాంతరంగా ఆపివేసిన రైతుబిడ్డల గోడు పట్టించుకునే నాధుడు లేక కాశ్మీరం నుండి కన్యాకుమారం వరకు అస్సాం నుండి గోవా వరకు అఖండ భారతదేశం రోదన, వేదనా భరితమై తమ గోడు వినిపించుకునే నేతల కొరకు తపిస్తున్న నేపధ్యంలో 207 సంస్థలు ఒకే తాటిపైకి వచ్చాయి.

సంవత్సరం ప్రారంభంలో పార్లమెంటు సమీపంలోని జంతర్‌ మంతర్‌ వద్ద తమిళరైతులు అర్ధనగ్నంగా ప్రదర్శన జరిపి, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పుర్రెలతో ప్రపపంచ వ్యాప్తంగా భారత రైతుల వ్యధలను వెలికితీశారు.

మహారాష్ట్రలోని నాశిక్‌ నుండి ముంబయి వరకు 200 కి.మీ. మహాపాదయాత్ర నిర్వహించి వేలాది మంది రైతులు మహారాష్ట్ర ప్రభుత్వాన్నే కాకుండా, నిత్యం కార్పోరేట్‌ కనుసన్నల్లో తమ పాలనను వారి కాళ్ల వద్ద ఉంచి మనుగడ కాపాడుకుంటున్న కేంద్రప్రభుత్వం కళ్ళు కూడా తెరిపించారు. రైతుల నిరసనద్వనులకు భీతిల్లిన మహారాష్ట్ర ఫడ్నవిస్‌ ప్రభుత్వం దిగివచ్చినట్లే వచ్చి హామీలను అమలు చేయలేదు.

మధ్యప్రదేశ్‌లోని మహాసముంద్‌ జిల్లా, మాండసార్‌లో గిట్టుబాటు ధరలకై పోరాటం చేస్తున్న రైతులను కాల్చిచంపిన సంఘటన దేశాన్నే నివ్వెరపరచింది. చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని అడ్డుకొని అక్కడి ప్రభుత్వం నిర్భందకాండకు తెరతీసింది. వాస్తవానికి అధికారంలోకి రాగానే కార్పోరేట్లకు అనుకూలంగా 2013 భూసేకరణ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో రైతుల హక్కులు హరించే చర్యలు చేపట్టాలని బిజెపి ప్రభుత్వం భావించినా రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో ఆ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవలసి వచ్చింది.

దేశంలోనే రైతు సంఘాలు. ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతృత్వంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ రైతు వ్యతిరేక చర్యలను అడ్డగించి తీరుతామనే పట్టుదలతో ఈ సంవత్సరంలోనే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో రైతులు స్వచ్ఛందంగా గ్రామబంద్‌ పేరుతో దేశంలోని పట్టణ ప్రాంతాలకు వ్యవసాయ ఉత్పత్తులను నిలిపివేసింది.

గత నెలలో దేశంలోని పశ్చిమ రాష్ట్రాల రైతులు మూకుమ్మడిగా ఢిల్లీ నగరంలోకి దూసుకువచ్చి ''చక్కాఝామ్‌'' ఉద్యమాన్ని ప్రారంభించింది. నగర సరిహద్దుల్లోనే వారిపై విరుచుకుపడ్డ పోలీసులు లాఠీచార్జీలు, భాష్పవాయు ప్రయోగాలు, వాటర్‌ క్యానర్ల ప్రయోగం ద్వారా ఆ ఉద్యమాన్ని కఠినంగా అణచివేసింది. ఈ సందర్భంగా పెక్కుమంది రైతులకు గాయాలు కావడం, ఆస్పటళ్ళ పాలు కావడం జరిగింది.

ఈ నేపద్యంలో జాతీయ రైతు సంఘాలు, ఉద్యమ సంఘాలు రైతు సాధికారతపై నమ్మకమున్న 207 సంస్థలు ఒకే పతాకం పై సంఘటితమై నవంబరు 29-30 తేదీల్లో మ¬ద్యమానికి శ్రీకారం చుట్టారు. 13 ప్రతిపక్ష పార్టీల ప్రోత్సాహం, ఉమ్మడి కార్యాచరణతో పాటు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాలు గత రెండు నెలలుగా కృషి చేస్తున్నాయి. రైతులు క్రమ శిక్షణతో, సంఘటితంగా నిరసన ప్రదర్శన శాంతియుతంగా నిర్వహించి ముంబయి తరహా స్పూర్తిని ప్రదర్శించారు. వీరికి ఢిల్లీలోని ఆప్‌ కార్యకర్తలు, విద్యార్ధులు, మేధావులు, వివిధ ప్రజాసంఘాల నేతలు కార్యకర్తలు దారిపొడవునా సహకరించి రైతులకు కావలసిన వసతులు, మంచినీళ్ళ సౌకర్యాలు, భోజన వసతి సౌకర్యాలను స్వచ్ఛందంగా ఏర్పాటు చేశారు.

మహాత్ముని బాటలో స్వచ్చందంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఈ రైతు నిరసన ప్రదర్శన చరిత్ర ఉన్నంత కాలం నిలిచిపోతుంది. అంతేకాకుండా దశాబ్దాలుగా రైతుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో సాచివేత ధోరణి ప్రదర్శిస్తున్న జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్ధలు రైతుల సంఘటిత శక్తికి తలొగ్గి విస్తృతంగా నిరసన ప్రదర్శనా విశేషాలను ప్రదర్శించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. గతంలో లాగానే సోషల్‌మీడియా కూడా రైతుల వెన్నంటి ఉండి వారి సమస్యలను ప్రపంచం దృష్టికి తీసుకురావడం భారత వ్యవసాయ రంగం సంక్షోబం నుండి బయటపడేందుకు కావలసిన సహకారాన్ని అందించడానికి తన వంతు సామాజిక బాధ్యతగా మీడియాలోని ప్రముఖులు స్పందిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపద్యంలో ఉత్తేజభరితంగా జరిగిన కిసాన్‌ మహా ప్రదర్శన, ప్రతిపక్షాల సంఘటితమైన తీరు రాబోయే ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావాన్ని చూపితీరుతుందనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా ఉద్యమ బాట పట్టిన రైతుల వెంట తామున్నామని వారికి ధైర్యాన్నిస్తూ ప్రతిపక్ష నేతలు పాల్గొనడం మరొక ప్రధానమైన పరిణామం. ఈ సందర్భంగా ప్రముఖుల స్పందనను ఈ కింద ప్రచురిస్తునాం.

సంపూర్ణ రుణమాఫీ తథ్యం :

మోది ప్రభుత్వం దేశంలోని 50 మంది ఆశ్రిత పెట్టుబడి దారుల చేతిలో బందీ అయిందని, రైతాంగంతో సహా శ్రామిక వర్గాలకు, వ్యతిరేకంగా తనను ఆశ్రయించిన పెట్టుబడిదారుల సంపద పెంపుకు మాత్రమే కృషి చేస్తున్నదని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, పారిశ్రామిక వేత్తల అవసరాల కోసం అడ్డగోలుగా భూ సేకరణ జరపడం, పంటలకు కనీస మద్దతు ధర లభింపచేయకపోవడం వంటి కారణాల వల్ల వ్యవసాయ సంక్షోభం తీవ్రమైందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే సంపూర్ణ రుణమాఫీ అమలు చేస్తూ స్వామినాథన్‌ కమీషన్‌ నివేదికను పూర్తిగా అమలు చేయడానికి కట్టుబడి ఉందని రాహుల్‌గాంధీ అన్నారు.

ఉద్యమ రైతుల వెంట మేముసైతం...

ఓటు అనే ఆయుదం రైతులకు రానున్న రోజుల్లో మంచి గుణపాఠం చెప్పడానికి ఉపయోగ పడుతుందని ప్రభుత్వ వైఖరి మారకపోతే 2019 ఎన్నికల్లో రైతుల ఆగ్రహం ప్రతి ఫలించేలా సర్కారుకు బుద్ధి వచ్చేలా ఐక్యమవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని సిపిఎమ్‌ నాయకుడు సీతారాం ఏచూరి తెలిపారు.

పెట్టుబడి దారులకు దాసోహం :

ప్రధాన మంత్రి నరేంద్ర మోది దేశంలోని బడా పెట్టుబడి దారులకు దాసోహం చేస్తున్నారు. రైతుల కష్ట సుఖాలను పట్టించుకోని మోది రైతులను అధోగతి పాలు చేస్తున్నారని సిపిఐ నాయకడు సురవరం సుధాకర్‌ రెడ్డి దుయ్యబట్టారు.

రైతులు కన్నీరు పెడుతూన్నారు..

సరిహద్దుల్లో జవాన్‌...పొలంలో కిసాన్‌ కన్నీరు పెడుతున్నారు. స్వామినాధన్‌ కమీషన్‌ నివేదికను అమలు చేయక మోది రైతులను వెన్నుపోటు పొడిచారు. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. రైతల ఓట్లను అడక్కండి. అంబాని, అద్వానీలనే అడగండి అని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు.

మోది రైతు వ్యతిరేకి..

ఎన్‌డిఎ ప్రభుత్వం మొదటి నుండే రైతు వ్యతిరేక విధానాన్నే అనుసరిస్తుంది. రైతుకు మేలు చేసే ఒక్క పని కూడా చేపట్టలేదు. పైగా రైతుల భూములను కార్పోరేట్లకు ఇచ్చేయడమే ద్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని నర్మదా బచావో ఆందోళన్‌ ఉద్యమకర్త మేధాపాట్కర్‌ అన్నారు.

అరకొర మద్దతు ధర పెంచి గొప్పలు....

ప్రస్తుత పాలకులు అరకొరగా మద్ధతు ధర పెంచి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎన్‌సిపి అధినేత, మాజీ కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌ ఎద్దేవా చేశారు.

ప్రఖ్యాత పాత్రికేయుడు, గ్రామీణ భారతంలో పేదల సమస్యలను ప్రపంచం దృష్టికి తీసుకువచ్చిన మెగసెసే అవార్డు గ్రహీత, హిందు పత్రిక మాజీ సంపాదకులు పాలగుమ్మి సాయినాథ్‌ ఈ ఉద్యమంలో ప్రముఖపాత్ర వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలను వ్యక్తిగత సమస్యగా కాకుండా దేశ సమస్యగా గుర్తించాలని పిలుపునిచ్చారు. అన్నదాతలకు మద్ధతుగా వైద్యులు, న్యాయవాదులు, పాత్రికేయులు, విద్యార్ధులు సంఘీభావాన్ని ప్రకటించి ముందుకు రావడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. ప్రదర్శన సందర్భంగా ఎంతో ఆవేదనతో భవిష్యత్‌ మీద నమ్మకం లేని సమయంలో తోటి రైతులు కలసిరాగా మిన్నంటిన నినాదాలు నిరసన ఎజెండాను ప్రస్పుటితంగా నిర్ధారించాయి. రైతుల ఆగ్రహానికి ప్రతిరూపంగా గుండె రగిలిన రైతన్నలు మండే గొంతుకతో నినదించారు. మోది ప్రభుత్వ రైతు వ్యతిరేకతను అడుగడుగునా ప్రశ్నించి తమ వివేకాన్ని చాటుకున్నారు. అంతే కాదు సమస్యలను సానుభూతితో పరిష్కరించుకోకపోతే సమరం తప్పదని గర్జించారు. పంటలకు గిట్టుబాటు కల్పించని ప్రభుత్వమెందుకని నిలదీశారు. దేశంలోని రుణ పరపతి వ్యవస్థలో ధనికులకు, పేదలకు ఉన్న తారతమ్యాన్ని, బ్యాంకుల అచేతనత్వాన్ని నిలదీశారు. ప్రకృతి మాత విలయతాండవం చేస్తున్నప్పుడు కరువు ప్రాంతాలుగా ప్రకటించి ఆదుకునే కర్తవ్యాలేవని ప్రశ్నించారు.

ఎవరోవస్తారని, ఏదో చేస్తారని, ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు మార్చుకున్న తీరని వెతలపై ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటితంగా ఉండి, రాజకీయాలకు అతీతంగా సాధికారత కోసం కృషి చేసి తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటామని నినదిస్తూ దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిజ్ఞ చేశారు.

దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన అన్నదాతల మహాశక్తికి కేంద్రప్రభుత్వం లొంగక తప్పలేదు. ప్రదర్శనను విచ్ఛినం చేయడానికి వేసిన వ్యూహాలకు ప్రతి వ్యూహంగా రైతు నేతలు వ్యవహరించారు. గతంలో లాగా కాకుండా 5 ప్రవేశ ద్వారాల నుండి నగరంలో ప్రవేశించి రామ్‌లీలా మైదానంలో ఒక చోట గుమిగూడి అక్కడి నుండి ఒక ఉత్తుంగ తరంగంలా, పోటెత్తిన ఆకుపచ్చ సైన్యంలా తమను శాశించే పార్లమెంటు ప్రాంగణానికి జంతర్‌ మంతర్‌ నుండి చేరువై సంచలనం సృష్టించారు. రైతు మ¬జ్వల శక్తి ముందు పోలీసు బారికేడ్లు నిలబడలేదు. వారి ఆత్మ విశ్వాసం ముందు ప్రభుత్వ వ్యూహాలు పటాపంచలై కార్పోరేట్‌ శక్తుల, రైతు వ్యతిరేక ప్రభుత్వాల గుండెల్లో దడ పుట్టే విధంగా గత చరిత్రను తిరగరాస్తూ, గతంలో బోట్స్‌ క్లబ్‌ వద్ద మాజీప్రధాని చరణ్‌సింగ్‌ నిర్వహించిన రైతు గర్జన కంటే మిన్నగా నభూతో నభవిష్యతిగా ఈ ఆకుపచ్చ సైన్యం నూతన వ్యవసాయ విప్లవం ద్వారా, అశేష జనచైతన్యం ద్వారా సాధికారతకు చేరువ కావడమే సంక్షోభ నివారణకు పరిష్కారమని ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొని గర్జించిన ప్రతి రైతన్నకు, ఆత్మ హత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులకు, పోలీసు నిర్భందాలను ఎదిరించి, చివరకు బారీకేడ్లను సైతం అదిగమించిన యావత్‌ రైతు, శ్రామిక వర్గాలకు అగ్రిక్లినిక్‌ ఆకుపచ్చ స్వాగతం తెలియజేస్తున్నది. డిసెంబర్‌ 23వ తేదీన భారత మాజీ ప్రధాని, రైతు ఉద్యమ మహానేత చౌదరి చరణ్‌సింగ్‌ జన్మదిన సందర్భంగా జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న 'కిసాన్‌ దివస్‌' సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు! సస్య విప్లవ అభినందనలు....

- వై.వి. నరసింహారావు, అసోసియేట్‌ ఎడిటర్‌

ఎలిమిశెట్టి రాంబాబు, అగ్రిక్లినిక్‌ ప్రతినిది, ఫోన్‌ : 9949285691