ఉద్యాన పంటల్లో ముఖ్యంగా మిరప, టమాట, వంగ, బెండ మరియు బొప్పాయిలో రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, పేనుబంక, దీపపు తామర పురుగులు ఆశించడం వల్ల మిరపలో పైముడత, టమాటా, వంగలో వెర్రి తెగుళ్ళు, బెండలో శంఖు లేదా పల్లాకు తెగులు ముఖ్యంగా బొప్పాయిలో ఆకు ముడత తెగులు ఎక్కువగా వ్యాప్తి చెంది ఈ పంటల సాగులో అధిక నష్టాన్ని కలుగచేస్తాయి. వీటి నివారణకు రైతులు విచక్షణా రహితంగా వివిధ రకాల పురుగు మందులను ఎక్కువ మోతాదులో వాడడం వల్ల పెట్టుబడులు పెరగడమే కాకుండా పర్యావరణ కాలుష్యం పెరగడం కూరగాయలపై పురుగు మందుల యొక్క అవశేషాలు ఎక్కువగా ఉండడం ద్వారా మానవ ఆరోగ్యం చెడిపోతుంది. అంతేకాకుండా పంట ఉత్పత్తిలో రసాయన అవశేషాలు ఉండడం వల్ల ఎగుమతులు నిరాకరించబడుతున్నాయి.

ఈ చీడపీడల నివారణకు మరియు రైతుకు సాగు ఖర్చు తగ్గించే దిశగా సమగ్ర సస్యరక్షణ పద్ధతులతో ఈ జిగురు అట్టలు ఉపయోగించుకోవాలి.

ఆకర్షింపబడే పురుగులు, లాభాలు :

పసుపురంగు అట్టలు రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పేనుబంక మరియు దీపపు పురుగులు

పంటలు మిరప, టమాట, వంగ, తీగజాతి కూరగాయలైన బీర, ఆనప, కాకర, దోస, పుచ్చకాయ అలాగే పండ్ల తోటలైన మామిడి, జీడిమామిడి మరియు బొప్పాయి.

నీలి రంగు అట్టలు తామర పురుగులు

పంటలు మిరప మరియు ఉల్లి పంటల్లో ఎక్కువగా ఉపయోగించేవి

లాభాలు :

1. ఈ అట్టలు ప్రకాశవంతమైన పసుపు, నీలం రంగులో ఉండి వీటికి రెండు వైపులా పురుగులు ఆకర్షించే జిగురు వ్రాసి ఉండడం వల్ల పురుగులు వీటికి ఆకర్షించబడి వాలినప్పుడు అతుక్కొని తిరిగి ఎగరలేక చనిపోతాయి. తద్వారా వైరస్‌ తెగుళ్ళు వ్యాప్తి తగ్గించవచ్చు.

2. ఈ జిగురు ఎరల వల్ల ముఖ్యంగా పంటల్లో ఎలాంటి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉందో గమనించి వాటిని అరికట్టడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలో తెలుసుకోవచ్చు.

3. ఈ పసుపు మరియు నీలిరంగు అట్టలను నారును పెంచే క్షేత్రంలోను మరియు షేడ్‌ నెట్‌లో కూడా ఉపయోగించవచ్చు.

4. వీటిని కూరగాయపంటల్లో ఒక అడుగు ఎత్తులో కట్టి వేలాడదీయాలి. మరియు పంట ఎదుగుదలను బట్టి జిగురు ఎరలను మార్చుకోవాలి. అలాగే తోట పంటల్లో కొమ్మలకు లేదా చెట్ల మధ్యన వెలుతురు ఉన్న ప్రదేశంలో కర్రకు కట్టి వేలాడదీయడం ద్వారా వైరస్‌ తెగుళ్ళు వ్యాప్తికి కారణమైన రసంపీల్చు పురుగుల వ్యాప్తిని తగ్గించవచ్చు.

5. ఈ జిగురు అట్టలు ఎకరానికి 10-12 అట్టలు సరిపోతాయి. వీటి యొక్క ధర ఒక్కొక్కటి రూ. 15/- ఉంటుంది.

డా|| ఎన్‌. సత్తిబాబు, డా|| ఇ. చండ్రాయుడు, డా|| కె. ధనశ్రీ, డా|| డి. ఉమా మహేశ్వరరావు,

కృషీ విజ్ఞాన కేంద్రం, కొండెంపూడి, విశాఖపట్నం, ఫోన్‌ : 9010619130