గత మూడు సంవత్సరాల నుండి మార్కెట్‌లో పొగాకు పంటకు మంచి గిట్టుబాటు ధర లేక రైతులు చాలా నష్టపోతున్నారు. దీనివల్ల చాలా మంది రైతులు పొగాకు పంటకు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. చాలా మంది రైతులకకు పొగాకు పంట మీద వచ్చినంత నికర లాభం మరి ఏ పంటలోనూ రాదని ఆ నాటి రైతులు ఘంటాపథంగా చెప్పేవారు. కానీ నేడు పొగాకు పంటపై రైతులకు ఆశించిన మేర లాభాలు రాకపోవడంతో క్రమ క్రమంగా పొగాకు సాగు తగ్గుతూ వస్తుంది. నేడు వ్యవసాయం లాభదాయకంగా మార్చాలనే తలంపుతో రైతులు పొగాకు బోర్డు సంస్థల సైతం ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు.

నేడు పొగాకు మార్కెట్‌లో ఆశించిన లాభాలు రాకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ప్రత్యామ్నాయ పంటల ద్వారా రైతులకు ఆదాయం సమకూరుతుందనే తలంపుతో పొగాకు పంటకు బదులుగా అధిక ఆదాయం వచ్చే పంటల సాగు చేయాలని పొగాకు బోర్డు రైతులకు శిక్షణా కార్యక్రమాల సైతం చేపట్టి రైతు పండించిన పంట తక్షణమే మార్కెట్‌లో అమ్ముకునే విధంగా ఉండేటట్లుగా ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు నల్ల నేలలు, వర్షాధార నేలలు మరియు ఎర్రనేలల్లో సాగు చేస్తున్న పొగాకు పంటలను పరిశీలించిన పిదప ప్రత్యామ్నాయ పంటలు అవసరమని గుర్తించి ఈ కింది సిఫార్సులను చేయడమైనది...

వాతావరణ పరిస్థితి సిఫార్సు చేసిన పంటలు
నల్ల నేలలు వర్షాధారం కింద శనగ, మినుము, మొక్కజొన్న, కంది, మిరప, పత్తి, ధనియాలు, జొన్న, ఆముదం
నల్ల నేలలు వర్షాధారం కింద మినుము, బొబ్బర్లు, కంది, జొన్న, వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు, తీపి మొక్కజొన్న

మినుము :

మినుము పంటను కూడా పొగాకు పంటకు ప్రత్యామ్నాయ పంటగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి రకాలు ఎకరానికి 8-10 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. అంతేకాకుండా మినుములో వచ్చే పల్లాకు తెగులు తట్టుకునే రకాలు ఉన్నాయి. అందువల్ల మినుము కూడా పొగాకు పంటకు ప్రత్యామ్నాయ పంటగా చెప్పవచ్చు.

రకాలు :

మినుములో ప్రధాన సమస్య పల్లాకు తెగులు, ఈ తెగులుకు రైతులు భయపడి మినుము పండించకుండా మానుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో మినుము పల్లాకు తెగులు తట్టుకునే రకాలైన జి.బి.జి-1 (80-85 రోజులు), టి.బి.జి-104 (80 రోజులు) ఈ రెండు రకాలు గింజ పాలిష్‌గా ఉంటుంది. నల్లరేగడి నేలలు ఎకరాకు 8-10 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది.

విత్తన శుద్ధి :

విత్తనం విత్తే ముందు తప్పకుండా విత్తనశుద్ధి చేయాలి. విత్తనశుద్ధి కోసం ఒక కిలో విత్తనానికి 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్‌ (లేదా) 5 మి.లీ. థయోమిథాక్సామ్‌ కలిపి విత్తనశుద్ధి చేసినట్లయితే సుమారు 15-20 రోజుల వరకు రసం పీల్చే పురుగుల బారి నుండి పంటను రక్షించుకోవచ్చు.

నేలలు :

తేమను నిలుపుకోగలిగి మురుగునీరు పోయే వసతి గల భూములు అనువైనవి.

ఎరువులు :

ఎకరానికి 20 కిలోల యూరియా మరియు 125 కిలోల సింగిల్‌సూపర్‌ ఫాస్ఫేట్‌ ఎరువులను వాడాల్సి ఉంటుంది. భాస్వరం ఎరువును సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ రూపంలో వేయడం వల్ల పంటకు అదనంగా గంధకం కూడా లభ్యమవుతుంది. మంచి నాణ్యమైన దిగుబడి వస్తుంది.

కలుపు యాజమాన్యం :

పెండిమిధాలిన్‌ 30 శాతం ద్రావకం ఎకరాకు 1-1.5 లీ. 2 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని మరుసటి రోజుగాని పిచికారి చేయాలి. విత్తిన 20-25 రోజులకు గడ్డిజాతి మొక్కల నివారణకు ఫినాక్స్‌ప్రొప్‌ ఇథైల్‌ 250 మి.లీ. లేదా క్విజలోపాఫ్‌ ఇథైల్‌ 5 శాతం 400 మి.లీ. 200 లీటర్ల నీటిలో ఎకరానికి పిచికారి చేయాలి. గడ్డి మరియు వెడల్పాకు కలుపు ఉన్నప్పుడు 200 మి.లీ. ఇమజితాఫిర్‌ 5 శాతంను 200 లీటర్ల నీటికి కలిపి 20-25 రోజుల్లోపు పొలంలో తేమ ఉన్నప్పుడు కలుపు 2-4 ఆకుల దశలో పిచికారి చేయాలి.

పురుగులు :

మినుములో రసంపీల్చే పురుగులైన తామర పురుగులు, పచ్చ దోమ, తెల్ల దోమ, పేనుబంక మరియు కాండం ఈగ మొదలగునవి మినుము పంట మొదట 30 రోజుల్లో ఆశించిన పంట దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు మోనోక్రోటోఫాస్‌ 320 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 300 గ్రా. (లేదా) డైమిథోయేట్‌ 450 మి.లీ ఒక ఎకరానికి పిచికారి చేయాలి.

పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్‌ 500 మి.లీ. లేదా నోవాల్యూరాన్‌ 200 మి.లీ. లేదా ఇమామెక్టిన్‌ జెంబోయేట్‌ 80 గ్రా. లేదా థైయోడికార్బ్‌ 200 గ్రా. లేదా ఫ్లుబెండిమైడ్‌ 40 మి.లీ. లేదా రైనాక్సిఫిర్‌ 60 మి.లీ. ఎకరం పొలంలో పిచాకిర చేయాలి.

తెగుళ్ళు :

కొరినోస్పారా ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, బూడిద తెగులు నివారణకు 30-35 రోజుల్లో ఒక లీటరు నీటికి 3.0 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్‌ 40-45 రోజుల దశలో 2.5 గ్రా. మాంకోజెబ్‌ + 1.0 డైనోకాప్‌, 60-65 రోజుల దశలో రెండవసారి వాడిన మందులు లేదా 1.0 మి.లీ. కిలిక్సిప్‌ పిచికారి చేయాలి. తెగులు సోకిన చాలా రోజుల తరువాత మందును పిచికారి చేయడం వల్ల లాభముండదు.

మినుములో పల్లాకు తెగుళ్ళ నివారణ :

ఇది జెమిని వైరస్‌ వల్ల వచ్చే తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు, కాయల మీద పసుపు పచ్చ మచ్చలు ఏర్పడతాయి. తొలిదశలో ఆశించినట్లయితే పైరు గిడసబారిపోయి, పూత పూయక ఎండిపోతుంది. ఈ వైరస్‌ తెల్లదోమ ద్వారా వ్యాప్తిచెందుతుంది.

పల్లాకు తెగులు తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. పి.యు-31, టిబిజి-104, ఎల్‌.బి.జి-787 మరియు టి-9 రకాలను సాగు చేసుకోవాలి.

ఇమిడాక్లోప్రిడ్‌ 5 మి.లీ. లేదా థయోమిధాక్సామ్‌ 5 మి.లీ. కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి.

పైరు చుట్టూ నాలుగు వరుసల జొన్న పైరు విత్తుకోవాలి.

పొలం గట్ల మీద మరియు రోడ్డు పక్కన వైరస్‌ ఆశించిన కలుపు మొక్కలను పీకి నాశనం చేయాలి.

5 శాతం వేప గింజల కషాయం లేదా వేప నూనె 5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెల్లదోమ నివారణకు ట్రైజోఫాస్‌ 2.0 మి.లీ. (లేదా) ఎసిఫేట్‌ 1.5 గ్రా. (లేదా) ఎసిటామిప్రిడ్‌ 0.2 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

శనగ :

శనగ పంటకు కూడా ఈ ఏడాది మార్కెట్‌ రేటు బాగా ఉంది. అందుకే చాలా మంది రైతులు శనగ పండించడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ మన జిల్లాలో శనగ పండించే నల్ల రేగడి భూముల్లో పొలమంతా ఖరీఫ్‌లో ఖాళీ ఉంచి రబీలో మాత్రమే శనగ సాగు చేసే విధానం ఉంది. కానీ ఖరీఫ్‌లో ఏదైనా తక్కువ రోజులకు కోతకు వచ్చే పంట సాగు చేసి మరలా పొలంలో రబీలో శనగ పండించినట్లయితే రైతుకు ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది.

రకాలు :

మంచి దిగుబడి వచ్చు మరియు ఎండు తెగులు తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి.

దేశవాళీ రకాలు :

జెజి-11, జెజి-130, నంధ్యాల శనగ-1, యన్‌.బి.జి-1, యన్‌.బి.జి-47 (మిషన్‌ కోతకు అనువైన రకం)

కాబూలీ రకాలు :

కె.ఎ.కె-2, పూలేజి-95311, యమ్‌.ఎన్‌.కె-1, యన్‌.బి.ఇ.జి-119

నేలలు :

సారవంతమైన నల్లరేగడి నేలలు అనువైనవి.

విత్తన మోతాదు :

దేశవాళీ రకాలైతే ఎకరానికి 30-35 కిలోల విత్తనం సరిపోతుంది. కాబూలీ రకాలైతే ఎకరానికి 45-50 కిలోల విత్తనం సరిపోతుంది.

విత్తన శుద్ధి :

విత్తనాన్ని విత్తుకునే ముందు ప్రతి కిలో విత్తనానికి 3 గ్రా. థైరామ్‌ లేదా 2.5 గ్రా. కార్బండిజమ్‌తో విత్తనశుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారా మరియు నేల ద్వారా వ్యాపించే రోగాలను చాలా వరకు అరికట్టవచ్చు. కిలో విత్తనానికి 1.5 గ్రా. టెబ్యుకినజోల్‌ లేదా 1.5 గ్రా. ఎటావాక్స్‌ పవర్‌ను కూడా విత్తనశుద్ధికి వాడవచ్చు.

విత్తే సమయం :

శనగ పంటలో మంచి దిగుబడులు పొందాలంటే శనగ పంటను అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు వెదపెట్టుకోవచ్చు. ఆలస్యంగా విత్తనం వెదపెట్టాల్సి వచ్చినపుడు 10-20 శాతం విత్తనం అధికంగా వాడుకోవాలి.

ఎరువులు :

ఎకరానికి 20 కిలోల యూరియా మరియు 125 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ ఎరువులను వాడాలి. భాస్వరం ఎరువును సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ రూపంలో వేయడం వల్ల పంటకు అధనంగా గంధకం కూడా లభ్యమవుతుంది. దీనివల్ల మంచి నాణ్యమైన దిగుబడి వస్తుంది.

కలుపు యాజమాన్యం :

పెండిమిథాలిన్‌ 30% ద్రావణం ఎకరాకు 1-1.5 లీ. / 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని, మరుసటి రోజు కానీ పిచికారి చేయాలి.

ధనియాలు :

ధనియాలు కూడా పొగాకు పంటకు మంచి ప్రత్యామ్నాయ పంటగా చెప్పవచ్చు. ఎందుకంటే మార్కెట్‌లో ధనియాలకు మంచి ధర ఉండడమే కారణం.

రకాలు :

ధనియాల్లో మంచి దిగుబడినిచ్చే రకాలైన స్వాతి, సాధన, సింధు వంటి రకాలను ఎంపిక చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు.

నేలలు :

నల్లరేగడి నేలలు, ఎర్రనేలలు మరియు గరప నేలలు

విత్తన మోతాదు :

ఎకరానికి 6-7 కిలోల విత్తనం సరిపోతుంది.

విత్తే సమయం :

ధనియాలను అక్టోబరు 15 నుండి నవంబరు 15 లోపు నేలలోని తేమను బట్టి వెద పెట్టుకోవాలి.

ఎరువులు :

ఎకరానికి 40 కిలోల యూరియా మరియు 100 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ మరియు 20 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి.

రసం పీల్చే పురుగులు :

రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, నల్లి మరియు తామర పురుగుల నివారణకు మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. (లేదా) ఫిప్రోనిల్‌ 2 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రా. (లేదా) డైమిథోయేట్‌ 2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెగుళ్ళు :

బూడిద తెగులు నివారణకు ఒక లీటరు నీటికి 1 గ్రా. కార్బండిజమ్‌ లేదా ఇన్‌డెక్స్‌ 1 గ్రా. కలిపి పిచికారి చేయాలి.

దిగుబడి :

ఎకరానికి 5-6 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది.

జొన్న :

నేలలు :

తక్కువ వర్షపాతం కలిగిన ఎర్రనేలలు మరియు నల్లరేగడి నేలలు అనుకూలం.

రకాలు :

హైబ్రీడ్స్‌ : సి.ఎస్‌.హెచ్‌-15, 16, 14, 18

రకాలు : పిబిఎస్‌-1, నంధ్యాల, జొన్న-1,2,3 మరియు 4 సిఎస్‌వి-216, ఎన్‌-13, 14

విత్తన మోతాదు :

ఎకరానికి 3-4 కిలోల విత్తనం సరిపోతుంది.

విత్తన శుద్ధి :

ఒక కిలో విత్తనానికి 3 గ్రా. థైరామ్‌ మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి. నివారణకు ఒక కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిధాక్సామ్‌ మందును కలిపి విత్తనశుద్ధి చేయాలి.

ఎరువులు :

వర్షాధార పంటకు 24-32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం మరియు 12 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను వాడాలి. నత్రజని ఎరువులను రెండు సమదఫాలుగా విత్తేటప్పుడు మరియు మోకాలు ఎత్తు పైరు దశలో వేయాలి.

కలుపు నివారణ :

కలుపు నివారించేందుకు అట్రాజిన్‌ 50 శాతం పొడి మందును ఎకరానికి 800 గ్రా. చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 2వ రోజు తడినేలపై పిచికారి చేయాలి.

నీటి యాజమాన్యం :

రబీ జొన్నకు పూత మరియు గింజ పాలుపోసుకునే సమయంలో నీటి అవసరం ఉంటుంది. ఆ సమయంలో నీరు ఉన్న చోట జొన్నకు తడి ఇచ్చినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు.

సస్యరక్షణ :

మొవ్వు తొలుచు ఈగ :

ఈ ఈగ ఆశించినట్లయితే మొవ్వు సులువుగా వచ్చి కుళ్ళిపోయిన వాసన కలిగి ఉంటుంది. తరువాత మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. దీని నివారణకు కార్బోప్యూరాన్‌ 3 జి గుళికలను 1 మీటరు సాలుకు 2 గ్రా. చొప్పున విత్తేటప్పుడు వేయాలి. లేదా థయోడికార్బ్‌ 1.5 గ్రా. లేదా ల్యాంబ్డా సైహలోత్రిన్‌ 2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కాండం తొలుచు పురుగు :

కార్బోఫ్యూరాన్‌ గుళికలను ఎకరానికి 4 కిలోలు మొక్క కాండపు సుడుల్లో పంట విత్తిన 30-35 రోజుల్లో వేయాలి.

రాగి :

నేలలు :

రాగి పంటను తేలిక మరియు బరువు నేలల్లో పండించుకోవచ్చు.

రకాలు :

వకుళ, హిమ, శ్రీచైతన్య, భారతి, చంపావతి, మారుతి మొదలగు రకాలు అనువైనవి.

విత్తనం :

రాగి విత్తనం ఎకరానికి 3-4 కిలోలు వెదజల్లే పద్ధతి సరిపోతుంది.

విత్తన శుద్ధి :

ఒక కిలో విత్తనానికి 2 గ్రా. కార్బండిజమ్‌ లేదా 3 గ్రా. మాంకోజెబ్‌తో కలిపి విత్తనశుద్ధి చేయాలి.

ఎరువులు :

ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. ఎకరాకు 12 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం మరియు 8 కిలోల పొటాష్‌ ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. నాటిన 30 రోజులకు మరో 12 కిలోల నత్రజని పై పాటుగా వేయాలి.

సస్యరక్షణ :

శనగ పచ్చ పురుగు :

ఇది రాగి పంటను కంకి దశలో ఆశించి పూత, గింజలు తిని నష్టపరుస్తుంది. పురుగులను, కంకులను దులిపి లేదా చేతితో ఏరివేయాలి. ఒక లీటరు నీటికి 3 గ్రా. కార్బరిల్‌ 50 శాతం పొడి మందును కలిపి పిచికారి చేయాలి.

అగ్గి తెగులు :

ఎదిగిన మొక్కల ఆకులు, కణుపులు, వెన్నులపైన దాదాపు కండె ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల చుట్టూ ఎరుపు, గోధుమ రంగు అంచులు కలిగి ఉంటాయి. దీనివల్ల దిగుబడులు తగ్గిపోతాయి. దీని నివారణకు కార్బండిజమ్‌ 1 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

దిగుబడి :

ఎకరానికి 10-15 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది.

మొక్కజొన్న :

రకాలు :

సంకర రకాలు :

డి.హెచ్‌.యమ్‌-117, డి.హెచ్‌.యమ్‌-10, డి.హెచ్‌.యమ్‌ - 105, డి.హెచ్‌.యమ్‌-119 మరియు ప్రైవేటు హైబ్రీడ్స్‌

తీపి మొక్క జొన్న :

మాధురి, ప్రియ

నేలలు :

సారవంతమైన మరియు నీరు ఇంకే నల్లరేగడి నేలలు మరియు ఎర్రనేలలు మొక్కజొన్నకు అనుకూలమైన నేలలు

విత్తనం :

ఎకరానికి 8 కిలోల విత్తనం అవసరం

విత్తే పద్ధతి :

మొదట బోదె నాగలితో బోదెలు చేసుకోవాలి. తరువాత విత్తనాన్ని బోదెకుపై నుండి 1/3 వంతు ఎత్తులో విత్తినట్లయితే నీటిపారుదల సులభంగా ఉండడమే కాక, వర్షపాతం ఎక్కువైనప్పుడు నీరు బయటకు తీయడానికి కూడా వీలవుతుంది. మొలకెత్తిన 10 రోజుల తరువాత ఒత్తుగా మొలిచిన చోట ఒక్కొక్క మొక్క మాత్రమే ఉంచి అదనంగా ఉన్న మొక్కలు తీసివేయాలి.

విత్తే సమయం :

మొక్కజొన్నను అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు విత్తుకోవాలి.

ఎరువులు :

ఎకరానికి 96 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం మరియు 32 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను వేయాలి. 1/3వ వంతు నత్రజని విత్తే సమయంలోనూ, 1/3వ వంతు 30-35 రోజుల మధ్య మిగిలిన 1/3వ వంతు 50-55 రోజుల మధ్య వేయాలి. మొత్తం భాస్వరం ఎరువును విత్తే సమయంలో సగం పొటాష్‌ ఎరువును విత్తే సమయంలో మిగతా పొటాష్‌ ఎరువును పూత దశలో వేసుకోవాలి.

కలుపు యాజమాన్యం :

పంట విత్తిన తరువాత 2-3 రోజుల్లోపు అట్రజిన్‌ అనే కలుపు మందును తేలిక నేలలో ఎకరాకు 800 గ్రా., బరువు నేలలో అయితే ఎకరాకు 1200 గ్రా. 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారి చేయాలి. విత్తిన నెల రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు గమనిస్తే 2, 4-డి సోడియం సాల్ట్‌ ఎకరాకు 500 గ్రా. 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

సస్యరక్షణ :

కాండం తొలుచు పురుగు :

ఈ పురుగు పైరు మొలకెత్తిన 10-20 రోజులకు ఆశిస్తుంది. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రహరితాన్ని గోకి తింటాయి. తరువాత ముడుచుకున్న ఆకుల ద్వారా కాండం లోపలికి చేరతాయి.

దీని నివారణకు

పొలంలో కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి.

పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి.

పొలం చుట్టూ 3-4 వరుసల్లో జొన్నను ఎరపంటగా వేసి 45 రోజుల తరువాత తీసివేయాలి.

మోనోక్రోటోఫాస్‌ 320 మి.లీ. లేదా క్లోరాంట్రినిలిప్రోల్‌ 60 మి.లీ. ఒక ఎకరానికి పంట 10-15 రోజుల దశలో పిచికారి చేయాలి.

ఉధృతి ఎక్కువగా ఉంటే కార్భోఫ్యూరాన్‌ 3 జి గుళికలు ఎకరాకు 3 కిలోల చొప్పున పైరు మొలకెత్తిన 25-30 రోజులకు ఆకుల సుడుల్లో వేయాలి.

వేరు శనగ :

నేలలు :

వేరుశనగ పంటకు ఇసుకతో కూడిన గరప నేలలు, ఎర్రనేలలు అనుకూలమైనవి.

రకాలు :

వేరుశనగలో మంచి దిగుబడినిచ్చే రకాలైన కె-5, ధరణి, టిఎజి-24, హరితాంధ్ర, కె-9 మొదలైన రకాలను ఎంపిక చేసుకున్నట్లయితే వేరుశనగలో మంచి దిగుబడులు సాధించవచ్చు.

విత్తనం :

ఎకరానికి 70-80 కిలోల విత్తనం ఎంపిక చేసుకొని విత్తే ముందు తప్పకుండా విత్తనశుద్ధి చేయాలి. విత్తనశుద్ధి కోసం రాక్సితో ఒక గ్రాము మందు ను ఒక కిలో విత్తనానికి పట్టించి విత్తుకున్నట్లయితే ఎకరానికి సిఫార్సు చేసిన మొక్కల సంఖ్య ఉండి దిగుబడి బాగా పెరుగుతుంది.

ఎరువుల యాజమాన్యం :

ఎకరానికి 30 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ మరియు 35 కిలోల పొటాష్‌ ఎరువులను వేరుశనగ పైరుకు వాడవలసి ఉంటుంది. భాస్వరం ఎరువును సింగిల్‌ సూపర్‌ఫాస్ఫేట్‌ పూరంలో వాడినప్పుడు అదనంగా 10 శాతం దిగుబడి పెరిగే అవకాశం ఉంది. వేరుశనగలో కాయ పరిమాణం బాగా పెరగాలంటే వేరుశనగ పైరుపూత దశలో ఎకరానికి 200 కిలోల జిప్సం తప్పని సరిగా వాడుకోవాలి.

కలుపు యాజమాన్యం :

మొక్క మొలకెత్తక ముందే నశింపచేయగల కలుపు మందులైన అలాక్లోర్‌ ఎకరాకు 1 లీటరు లేదా పెండిమిథాలిన్‌ ఎకరాకు 1.5 లీటరు చొప్పున విత్తనం విత్తిన వెంటనే లేదా 2-3 రోజుల లోపు నేలపై పిచికారి చేయాలి. విత్తిన 45 రోజుల్లోపు ఎలాంటి కలుపు లేకుండా చూడాలి. 45 రోజుల తరువాత ఏ విధమైన అంతరకృషి చేయరాదు. లేనిచో ఊడల దెబ్బతిని దిగుబడి తగ్గుతుంది. విత్తనం విత్తిన 20-25 రోజుల మధ్య వేరుశనగలో కలుపు సమస్య ఉంటే ఇమాజితాఫిర్‌ మందును ఎకరానికి 200 మి.లీ. పిచికారి చేయాలి.

సస్యరక్షణ :

రసం పీల్చేపురుగులు :

రసంపీల్చే పురుగులైన తామర పురుగులు, పేనుబంక, పచ్చదోమ మొదలగునవి పంటలపై ఆశించి రసం పీల్చడం ద్వారా మొక్కలు గిడసబారిపోతాయి. దీని నివారణకు మోనోక్రోటోఫాస్‌ 320 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 300 గ్రా. లేదా ఎసిటాప్రిడ్‌ 40 గ్రా. ఒక ఎకరానికి పిచికారి చేయాలి.

ఆకుముడత :

నివారణకు క్లోరిఫైరిఫాస్‌ 400 మి.లీ. లేదా థయోడికార్బ్‌ 300 గ్రా. ఎకరానికి 200 లీ. ద్రావణం పిచికారి చేయాలి.

పొగాకు లద్దె పురుగు :

5 శాతం వేపగింజల కషాయం పిచికారి చేయాలి. నొవాల్యురాన్‌ 200 మి.లీ. లేదా రైనాక్సిఫిర్‌ 20 మి.లీ. ఒక ఎకరానికి పిచికారి చేయాలి.

తెగుళ్ళు :

ఆకుమచ్చ తెగులు :

ఆకుమచ్చ తెగులు నివారణకు మాంకోజెబ్‌ 400 గ్రా. లేదా హెక్సాకొనజోల్‌ 400 మి.లీ. ఒక ఎకరానికి పిచికారి చేయాలి.

కాండం కుళ్లు తెగులు :

కాండం కుళ్లు తెగుళ్ళ నివారణకు హెక్సాకొనజోల్‌ 400 మి.లీ. ఒక ఎకరానికి పిచికారి చేయాలి.

మిరప :

ఎక్కడైతే నీటి తడుల ఇవ్వడానికి అవకాశం ఉందో అక్కడ మిరప పంటను పొగాకు పంటకు మంచి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు.

రకాలు :

మార్కెట్‌లో మిరపలో చాలా రకాలు హైబ్రీడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. మరి మనం పచ్చిమిరప కోసమా లేదా ఎండు మిరప కోసమా అనేది నిర్ణయం తీసుకొని రకాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

నేలలు :

మిరప పండించడానికి నల్లరేగడి నేలలు, ఇసుకతో కూడిన ఒండ్రునేలలు, గరప నేలలు అనుకూలం.

విత్తన మోతాదు :

నారు పెంచుటకు 650 గ్రా. ఒక సెంటుకు, వెద పెట్టు పద్ధతికి 2.5 కిలోలు / ఎకరానికి

విత్తన శుద్ధి :

రసం పీల్చే పురుగులకు ఒక కిలో విత్తనానికి 3 గ్రా. ఇమిడాక్లోప్రిడ్‌ మరియు ఎండుతెగుళ్ళకు 3 గ్రా. మాంకోజెబ్‌తో విత్తనశుద్ధి చేయాలి.

విత్తే సమయం :

40 రోజుల వయసు ఉన్న నారును ఎంపిక చేసుకొని ఆగష్టు-సెప్టెంబరులో వర్షాలు కురిసిన వెంటనే నాటుకోవాలి.

విత్తే పద్ధతి :

రకాలైతే - 75 సెం.మీ. I 30 సెం.మీ., సంకర రకాలైతే - 75 సెం.మీ. I 60 సెం.మీ.

ఎరువుల యాజమాన్యం :

ఎకరానికి 120 కిలోల నత్రజని, 48 కిలోల భాస్వరం మరియు 48 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను వాడుకోవాలి.

కలుపు యాజమాన్యం :

మిరప మొక్కలు నాటడానికి 2-3 రోజుల ముందే పెండిమిథాలిన్‌ ఎకరానికి 1.5 లీటరు మందును పిచికారి చేయాలి.

సస్యరక్షణ :

పై ముడత :

స్పైనోసాడ్‌ 0.25 మి.లీ. / డైఫెంద్యురాన్‌ 1.25 గ్రా. / ఫిప్రోనిల్‌ 2 మి.లీ. / ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

క్రింది ముడత :

డైకోఫాల్‌ 5 మి.లీ. / క్లోరిఫిన్‌పైర్‌ 2 మి.లీ. / నీళ్ళ గంథకం 3 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కాయ తొలుచు పురుగు :

స్పైనెసాడ్‌ 0.25 మి.లీ. / నొవాల్యురాన్‌ 1.5 గ్రా. థయోడికార్బ్‌ 1 గ్రా., ఎసిఫేట్‌ 1.5 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పూత పురుగు :

క్లోరిఫైరిఫాస్‌ 2.5 మి.లీ. / ట్రైజోఫాస్‌ 2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

వైరస్‌ తెగులు నివారణ :

పొలం చుట్టూ జొన్న లేదా సజ్జ పైరులను 2-3 వరుసలు విత్తుకోవాలి.

తెల్ల దోమ ద్వారా జెమిని వైరస్‌ వస్తుంది. కాబట్టి పొలంలో పసుపు రంగు జిగురు అట్టలు ఎకరానికి 10 చొప్పున ఏర్పాటు చేసుకున్నట్లయితే జెమిని వైరస్‌ తెల్ల దోమ ద్వారా వ్యాప్తి అవుతుంది. కాబట్టి తెల్లదోమను అరికట్టవచ్చు.

తెల్లదోమ నివారణకు ట్రైజోఫాస్‌ 400 మి.లీ. లేదా ఒబేరాన్‌ 200 మి.లీ. ఒక ఎకరానికి పిచికారి చేయాలి.

డా|| జి. రమేష్‌, శాస్త్రవేత్త, డా|| సి.హెచ్‌ వర ప్రసాద్‌ రావు, సీనియర్‌ శాస్త్రవేత్త,

డా|| జి.యమ్‌.వి ప్రసాద్‌ రావు, పోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌, డాట్‌ సెంటర్‌, దర్శి, ఫోన్‌ : 9440358336