సంపాదకీయం

అనుబంద రంగాలనూ ఆదుకోవాలి!

దేశంలో వ్యవసాయ రంగం అనేక ఆటుపోట్లకు గురై సంక్షోభానికి దారితీస్తున్న పరిస్థితుల్లో రైతుకు అదనపు ఆదాయాన్నిచ్చే అనుబంద రంగాల అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేయాలి. తోటల పెంపకం, పశు పోషణ, డైరీల స్థాపన, మత్స్య పరిశ్రమ, కోళ్ల పరిశ్రమల అభివృద్ధి ద్వారా సంపూర్ణ వ్యవసాయాన్ని పరిపుష్టం చేయాలి. ఇప్పటివరకు వ్యవసాయంలోని కొన్ని రంగాలకు మాత్రమే సబ్సిడీలు, రుణమాఫీలు, విద్యుత్‌ వెసులుబాటు లభిస్తున్నాయి. ఈ సేవలను అన్ని వ్యవసాయ అనుబంద రంగాలకు విస్తరింపచేయడం ద్వారా ఆయా రంగాల్లో ఉన్న రైతులు అధిక దిగుబడులు సాధించడం, ఎగుమతుల సాధన ద్వారా దేశానికి అదనపు ఆదాయాన్ని లభింపచేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ తోడ్పాటు లేకుండానే స్వయంకృషితోనే ఎదిగిన పౌల్ట్రీ రంగ అభివృద్ధి కొరకు ప్రత్యేక కృషి జరగాల్సి ఉంది. ఇన్ని రాయితీలు ఇచ్చి, ఉచిత విద్యుత్‌, రుణమాఫీ వంటి సౌకర్యాలను కలుగచేసినా కాని వ్యవసాయంపై వచ్చే ఆదాయం కేవలం 2 శాతం మాత్రమే కాగా, అదే పౌల్ట్రీ రంగంలో ఆదాయం 12 శాతం ఉండటం గమనార్హం. జాతీయ ఆదాయంలో మత్స్య పరిశ్రమ వాటా కూడా అధికంగా ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాము. ఇటీవల కాలంలో పట్టు రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే విధంగా జాతీయ ప్రభుత్వం, జాతీయ సిల్క్‌ బోర్డు అనేక రాయితీలను, బైబాక్‌ సౌకర్యాలను కల్పించడంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెంది ఆ రంగంలోని రైతులు, పారిశ్రామిక వేత్తలు

హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా పశుపోషణ అనాదిగా వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే! ఒక దశలో పాల వెల్లువ పథకం ద్వారా దేశం మొత్తం మీద తెల్ల విప్లవానికి శ్రీకారం చుట్టి విజయవంతంగా పాడిపరిశ్రమను ముందుకు తీసుకువెళ్ళిన రైతులు నేడు అనేక కారణాల వల్ల నిరంతరాయంగా పశుపోషణ చేయలేని దుస్థితిలో ఉన్నారు. మేలుజాతి పశువులను సబ్సిడీపై అందించి పాల కొనుగోలు ధరలను పెంచడం ద్వారా, పశుగ్రాస క్షేత్రాల ఏర్పాటుకు చొరవ తీసుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రస్తుతం అంత మెరుగైన స్థితిలో లేని పాల ఉత్పత్తి రంగాన్ని తిరిగి పట్టాలెక్కించవచ్చు. పాల విప్లవం కొరకు సహకార ఉద్యమాన్ని తీసుకువచ్చి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రతి పల్లెల్లో పాల సొసైటీలను ఏర్పాటు చేసిన ఘనత వహించిన ప్రోత్సాహక చర్యలు మరింత వేగవంతంగా రైతులను ఆదుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతం పాల సొసైటీలతో పాటు పాడి రంగం కార్పోరేట్‌ ధృక్కోణంతో ముందుకు నడుస్తున్న నేపథ్యంలో తద్విదంగా రైతులకు తోడ్పడే విధంగా జాతీయ స్థాయిలో ఉమ్మడి పాల కొనుగోలు ధరలను నిర్ణయించి ఈ రంగానికి తిరిగి జవసత్వాలు కల్పించాలి. నేషనల్‌ డైరీ డెవలప్‌మెంట్‌ వారి సూచనల మేరకు లీటరు పాల కొనుగోలు ధరపై కనీసం రూ. 4/-లు అధనంగా చెల్లించే విధంగా  విధంగా ఉత్తర్వులను తీసుకురావాలి. ఆయా అనుబంద రంగాల అభివృద్ధికి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి, నిల్వ సామర్ధ్యం పెంచే విధంగా గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మన దేశంలో కొత్త వెలుగుతో దూసుకువెళ్తున్న ఉద్యాన పంటల ప్రగతికి, అధిక దిగుబడుల సాధనకు అవసరమైన, నీటి యాజమాన్య పద్ధతులకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు మరింత కృషి జరగాలి. వ్యవసాయ రంగాన్ని ఉద్ధీపింపచేయడానికి ఒక సమగ్ర వ్యవసాయ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. మిగిలిన పంటలకు ఇచ్చిన విధంగానే ఉచిత విద్యుత్‌, రుణమాఫీ సౌకర్యాలు, కనీస మద్దతు ధరలను అనుబంద రంగాల రైతులకు కూడా ప్రకటించి సమన్యాయం పాటించాలి. ముఖ్యంగా కోళ్ళ పరిశ్రమ అభివృద్ధికి విదేశాల నుండి మన దేశంలోకి చొరబడుతున్న బహుళజాతి సంస్థల మాంసపు ఉత్పత్తులపై అంకుశం ప్రయోగించాలి.