ఆదర్శ మామిడి రైతు శ్రీనివాసరెడ్డి

బిందు సేద్యం – సమగ్ర సస్యరక్షణ – అదే విజయరహస్యం నిజమైన సామాజిక బాధ్యత ఉన్నవాడు రైతన్నే. ఎండనక, వాననక, శ్రమకోర్చి అతను బాధ్యతతో తీస్తున్న ఉత్పత్తి దేశంలో కోట్లాది మంది కడుపు నింపుతున్నది. అందుకే ఆయనను ‘‘అన్నదాత’’ అంటారు. కానీ ఆయనను ‘‘సుఖీభవ’’ అని ఆశీర్వదించే స్వరాలు మాత్రం పేలవంగా ఉంటాయి. ఆది మానవుని కాలం నుండీ, ఆ మాటకొస్తే భూమి పుట్టిన నాటినుండి తిండి గింజలను సంపాదించి పెట్టే రైతన్న విజయగాధలే చరిత్రను శాసించాయి. ప్రతికూల పరిస్థితులలో కూడా స్వానుభవంతో సమగ్ర సస్యరక్షణతో రెట్టింపు దిగుబడులు సాధించిన భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గాధ కూడా అందులో ఒకటి.

దేశ, విదేశాల లోని పౌరులకు నోరూరించే మధురమైన మామిడి ఫలాలను పండిరచడంలో ఈ రైతు దిట్ట. ఖమ్మంజిల్లాలోని ఇతర రైతులకు మార్గదర్శకంగా గత 20 ఏళ్ళుగా మామాడిపంట దిగుబడిలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న శ్రీనివాసరెడ్డిది ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం, రాజాపురం గ్రామం.

ఈ సంవత్సరం వాతావరణం సరిగా లేక మామిడి దిగుబడులు తగ్గిపోయాయని సర్వత్రా ఆందోళన వ్యక్త మవుతున్నది. ప్రతికూల పరిస్ధితులలో గతంలో కంటే అధికదిగుబడులు సాధించి, శ్రీనివాసరెడ్డి తన అంకిత భావాన్ని చాటుకున్నాడు. ప్రతి సంవత్సరం అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు శ్రీనివాసరెడ్డి ఎకరానికి 8 నుండి 10 టన్నుల మామిడి పండ్లను ఉత్పత్తి చేసేవారు. ఈ సంవత్సరం 12 నుండి 13 టన్నుల దిగుబడి రావచ్చని శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు.

శ్రీనివాసరెడ్డి వయసు 33 ఏళ్ళు. 20 ఏళ్ళ క్రితం మామిడి తోటల పెంపకానికి శ్రీకారం చుట్టారు. తండ్రి నుండి వారసత్వంగా సంక్రమించిన 15 ఎకరాల్లో మామిడి చెట్లను నాటిన నాటి నుండి వాటిని కంటికి రెప్పలా కాపాడటం ప్రారంభించారు. అప్పటి నుండి ఎడతెగని శ్రమ శక్తితో ప్రతి సంవత్సరం దిగుబడులు పెంచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తన విజయరహస్యాన్ని ‘అగ్రి క్లినిక్‌’ ప్రతినిధితో పంచుకున్న శ్రీనివాసరెడ్డి చెప్పిన విషయాలు ఇతర రైతులకు ఆదర్శంగా ఉంటాయనడంలో సందేహం లేదు.

రైతు శ్రీనివాసరెడ్డి కథనం ప్రకారం తన మొట్టమొదటి విజయ రహస్యం బిందు సేద్య విధానాన్ని అమలుపరచడమే అన్నారు. బిందుసేద్యం వలన 80 శాతం నీరు, ఎరువులు, క్రిమిసంహారకాలను చెట్టు తనలో ఇముడ్చుకుంటుందని, దాని వలన కొమ్మలు, రెమ్మలు బలంగా ఉండి , పూత. పిందె పడుతుందని తెలిపారు. ప్రతి సీజన్‌ అయిపోయిన వెంటనే మొట్ట మొదట మోడైపోయిన కొమ్మలను నరికి వేయగా ఎండు పుల్లలను ఏరివేయడం జరుగుతుందన్నారు. తరువాత నేలబారున అడ్డదిడ్డంగా ఉన్న కొమ్మలను నరికి వేస్తామని దీన్ని ‘‘ప్రూనింగ్‌’’ విధానమని అంటారని తెలిపారు. మూడు దశలలో తగినంత మోతాదులో ఎరువులు, రసాయనాలు, క్రిమిసంహారక మందులు పద్దతి ప్రకారం వినియోగిస్తామని తెలిపారు. తొలకరి వర్షం పడటంతోనే చెట్టుమొదళ్ళలో ట్రాక్టరుతో దున్ని పాదులు చేస్తామని, చెట్టుకు ఒక మీటరు దూరంలో నాలుగు నుండి ఐదు సెంటీమీటర్ల గొయ్యి త్రవ్వి, దానిలో ఒక్కో చెట్టుకు 5 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌, 2 కిలోల యూరియా, ఒకటిన్నర కిలోల పొటాష్‌ వేసి, గొయ్యిని పూడ్చివేస్తామని వివరించారు. ఆగస్టు, సెప్టెంబరు నెలలో కలుపు ఉధృతిని బట్టి మరొక్కసారి దుక్కిదున్నుతారు. డిసెంబరు నుండి వరుసగా చెట్లకు నీటి సరఫరా జరుగుతూనే ఉంటుంది. బిందు సేద్యం వలన నీటి వృధాను అరికట్టడమేగాక, ఎరువులు, క్రిమిసంహారకాలను కూడా వెదజల్లడంతో కూలి ఖర్చు తగ్గుతుంది. దీని వలన కలుపు ప్రమాదం కూడా లేకపోవడంతో కూలీలకు వెచ్చించాల్సిన భత్యం మరింత ఆదా అవుతుంది. సమగ్ర నీటి యాజమాన్యం ద్వారా 50 శాతం ఫలితాలు రాగా ఎరువులు, పురుగు మందులు సస్య రక్షణ ద్వారా దిగుబడులు అధికమవుతాయని శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాయ జొన్న గింజ పరిమాణంలో ఉన్నప్పుడు నుండి క్రమం తప్పకుండా నీటిలో కరిగే నత్రజని, పొటాష్‌ ఎరువులను సిఫార్సు మేరకు ఇస్తూ నెలకు ఒకసారి ఎన్‌ ` డ్రిప్‌బూస్‌ మందును ఎకరానికి ఒక లీటరు చొప్పున అందించామని తెలిపారు. దీనితో కాయ త్వరగా పక్వానికి వచ్చి మంచి నాణ్యత, రంగు, రుచి కూడా పెంపొందిందని వివరించారు. రైతు అనుభవాల కొరకు చిరునామా: భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాజాపురం (గ్రా) చండ్రుగొండ (మం), ఖమ్మం జిల్లా, ఫోన్‌ : 9000322163