ఆలుగడ్డ స్వల్పకాలంలో పండించే శీతాకాలపు పంట. దీన్ని ప్రస్తుతం హైదరాబాద్‌, చిత్తూరు, మెదక్‌ మరియు విశాఖపట్నం జిల్లాల్లో సాగు చేస్తున్నారు. ఆలుగడ్డ కార్బోహైడ్రేట్లు, విటమిన్‌ సి మరియు బి కాంప్లెక్స్‌ ఇంకా పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌ మరియు జింక్‌ వంటి మినరల్స్‌ కలిగి ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది.

వాతావరణం :

దీనికి చల్లటి వాతావరణం అవసరం. పగలు ఉష్ణోగ్రత 320 సెం. మరియు రాత్రి ఉష్ణోగ్రత 200 సెం. ఉంటే ఈ పంట బాగా పండుతుంది.

నేలలు :

నీటి పారుదల మరియు మురుగు నీటి వసతి గల ఇసుక లేక ఎర్రగరప నేలలు అనుకూలమైనవి. నల్లరేగడి నేలలు (బరువైన నేలలు) మరియు ఆమ్ల లక్షణాలు గల నేలలు దుంప పెరుగుదలకు అనుకూలమైనవి కావు. మెదక్‌ జిల్లాలో కోహిర్‌, జహీరాబాద్‌, గజ్వేల్‌, ములుగు, వర్గల్‌, సిద్దిపేట, దౌల్తాబాద్‌ మండలాల్లో రైతులు అధికంగా సాగు చేస్తున్నారు.

పంట కాలం :

ఈ పంటకు రబీకాలం చాలా అనుకూలం. సాధారణంగా అక్టోబరు రెండవ పక్షం నుండి నవంబరు మొదటి వారం వరకు నాటుకోవచ్చు.

నేల తయారీ :

నేలను 4-5 సార్లు బాగా దున్ని హెక్టారుకు 25-30 టన్నుల పశువుల ఎరువును వేయాలి. చివరి దుక్కిలో 50-100 కిలోల వేప పిండిని మరియు ఎకరాకు 8-10 కిలోల కార్భోఫ్యూరాన్‌ గుళికలను వేస్తే వేరుపురుగు (లద్దె పురుగు), దుంప పురుగులు రాకుండా నివారించవచ్చు.

50 సెం.మీ. ఎడంతో బోదెలు మరియు కాలువలు చేయాలి. ఈ మధ్యకాలంలో రైతులు విత్తుకోవడానికి దుంపలకు బదులు నేరుగా విత్తనాలను కూడా విత్తుకుంటున్నారు. ఎక్కువగా రైతాంగం గత సంవత్సర పంట నుండి విత్తనంగా ఎంపిక చేసి శీతల గిడ్డంగిలో ఉంచిన దుంపలను నేరుగా విత్తుతున్నారు. దీని వల్ల నిద్రావస్థ దశలో ఉన్న విత్తనం (దుంప) సరిగా మొలకెత్తదు.

త్వరగా మొలకెత్తడానికి లేదా

నిద్రావస్థను తొలగించడానికి చేయాల్సిన పనులు :

శీతల గిడ్డంగుల నిల్వ నుండి తీసిన ఆలుగడ్డ విత్తన దుంపలను త్వరితంగా మొలకెత్తించడానికి వాటిని 30 సెం.మీ. కన్నా మించకుండా నీడలో పరచి కనీసం 7-10 రోజుల పాటు ఆరనీయాలి. గాలి చొరబడకుండా 2-3 సార్లు విత్తన దుంపలను తిరగతిప్పాలి.

పెద్ద సైజు దుంపలను శుభ్రంగా నీటిలో కడిగి 30-40 గ్రా. ఉండేలా దుంపలను ముక్కలుగా కోయాలి. 100 గ్రా. థయోయూరియా + 10 మి. గ్రా. జిబ్బరిల్లిక్‌ ఆసిడ్‌ 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణంలో విత్తన దుంపలను ముంచి తీసి బాగా ఆరబెట్టి ఆ తరువాత కుప్పగా చేసి 24-48 గంటలుంచిన తరువాత విత్తుకుంటే మొలక శాతం బాగా ఉంటుంది. ఈ ద్రావణంలో 500 కిలోల వరకు విత్తనాన్ని శుద్ధి చేయవచ్చు.

విత్తన శుద్ధి :

విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే శిలీంద్రాల నివారణకు విత్తనశుద్ధి తప్పని సరిగా చేయాలి. తెగులు సోకని, ఆరోగ్యమైన దుంపలను ఎన్నిక చేసుకోవాలి. దాదాపు 30-40 గ్రా. బరువుతో 2-3 కళ్లు ఉండి, అప్పుడే మొలకెత్తడం ప్రారంభించిన వాటిని విత్తటానికి ఎంపిక చేయాలి. లీటరు నీటికి 3 గ్రా. మాంకోజెబ్‌ తయారు చేసిన ద్రావణంలో దుంపలను సుమారు 30 నిమిషాలు ఉంచి విత్తన శుద్ధి చేసుకోవాలి.

ఎరువుల యాజమాన్యం :

ఆఖరి దుక్కిలో ఎకరాకు 10-12 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 40 కిలోల యూరియా, 150 కిలోల సూపర్‌ ఫాస్ఫేట్‌, 30 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేయాలి. విత్తిన 30 రోజుల తరువాత 40 కిలోల యూరియా 50 రోజులకు మరో 20 కిలోల యూరియా, 30 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేసుకోవాలి.

నీటి యాజమాన్యం :

నేలను, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని నీరు పెట్టాలి. చల్కా నేలల్లో, మొలకెత్తడానికి ముందు 7-8 రోజుల వ్యవధితోనూ, దుంప ఏర్పడేటట్లు 4-5 రోజుల వ్యవధితోనూ నీరు పెట్టాలి.

అంతర కృషి :

ఎదుగుతున్న దుంపలపై సూర్యరశ్మి పడినచోట దుంప ఆకుపచ్చ రంగుకు మారి నాణ్యత కోల్పోతుంది. కాబట్టి నాటిన 30 రోజులకు మట్టిని ఎగత్రోసి దుంపలు బయటికి కనబడకుండా చేయాలి.

కోత :

నేలపై భాగంపై మొక్క పాలిపోయినట్లు పసుపు రంగుకి మారుతుంది. తరువాత ఎండినట్లుగా గోధుమ రంగుకు మారతాయి. నాటిన 90-100 రోజుల్లో కోతకు సిద్ధమవుతుంది. దుంపలకు దెబ్బతగల కుండా జాగ్రత్తగా తవ్వి నీడలో ఆరబెట్టిన తరువాత నిల్వ చేయాలి.

దిగుబడి :

ఎకరాకు 10-14 టన్నుల వరకు వస్తుంది.

భీమిరెడ్డి అనూరాధ, ఉద్యానపరిశోధనా కళాశాల, రాజేంద్రనగర్‌, ఫోన్‌ : 8801328124