మన దేశంలో ముడిపట్టును ఉత్పత్తి చేసే పట్టు పురుగులు 4 రకాలు అవి 1. మల్బరీ 2. ఇరి 3. మూగ 4. దసళి పట్టు వీటిలో మల్బరీ పట్టుకు ప్రత్యేకమైన స్థానం కలదు. మన తెలంగాణలో మల్బరీ మరియు దసళి (టస్సర్‌) పట్టు పురుగులను సాగు చేస్తున్నారు. ఈ పట్టు పరుగులు ముడిపట్టును ఉత్పత్తి చేసే సమయంలో వాతవరణ పరిస్థితులు మరియు వివిధ చీడ పీడలకు లోనై పట్టునాణ్యత మరియు దిగుబడితగ్గిపోయి అపారమైన నష్టాన్ని కలుగచేస్తాయి, ముఖ్యంగా పట్టు గొంగళి పురుగు దశలో ఆశించే ఊజి ఈగ మరియు పెబ్రైయిన్‌ వ్యాధి పట్టు కాయల ఉత్పత్తిని అధికంగా తగ్గిస్తున్నాయి.

''ఊజి'' ఈగ :

ఈగ అన్ని రకముల పట్టు పురుగులను టాస్సార్‌, ఎరి, మల్బరీ మరియు ముంగా పట్టు పురుగులను కూడా ఆశిస్తుంది ఇది అంతర్గత పరాన్న జీవి. ఈ ఈగ వలన పట్టు దిగుబడి చాలా వరకు తగ్గుతుంది. వర్షాకాలంలో ఎక్కువగా, వేసవి కాలంలో తక్కువగా ఆశిస్తుంది. ఈ ఈగ 4వ మరియ 5వ దశ పురుగులపై 2-3 గ్రుడ్లను పెడుతుంది గ్రుడ్లు పొదిగి వచ్చిన మ్యగాట్స్‌ పట్టు పరుగు లోపలికి ప్రవేశించి లోపల గల క్రొవ్వును తిని పెరుగుతాయి, ఫలితంగా మిరప గింజ ఆకారంలో గల మచ్చలు పురుగుకు ఇరువైపుల ఏర్పడతాయి బాగా ఎదిగిన మ్యగాట్స్‌ లార్వాను చిల్చుకొని బయటకు వచ్చి కోశస్థ దశకు చేరుకుంటాయి. ఊజి ఈగ ఆశించిన పట్టు గూళ్ళ నుండి పట్టు ఉత్పత్తి కాదు.

యాజమాన్యం :

40-70 మెష్‌ తెరలను ఉపయోగించి ఈ ఈగను రేరింగ్‌ గదిలోకి రాకుండా నిరోధించవచ్చును.

ఊజి ఈగ ఆశించిన పురుగులను ఏరి నాశనం చేయడం ఊజి ఈగమ్యగాట్స్‌ కోశస్థ దశలను ఏరి నాశనం చేయాలి.

డైఫ్లూబెంజురాన్‌ (డిమిలిన్‌ 25 డబ్ల్యూపి) మరియు చైనా మట్టి (1:9) మూడవ దశ పురుగులపై చల్లి ఈ ఈగను సమర్ధవంతంగా అరికట్టవచ్చును.

డెర్మిస్టేడ్‌ పెంకు పురుగు :

పట్టు గూళ్ళు నిల్వ ఉంచిన ప్రదేశంలో ఈ పెంకు పురుగు రంధ్రాలు చేసి లోపల గల కోశస్థ దశలను తింటాయి.

యాజమాన్యం :

రేరింగదిని మరియు గూళ్ళు భద్రపరిచే గదులను శుభ్రపరచాలి.

పాడైన గూళ్ళను ఎక్కువ రోజులు నిల్వ చేయరాదు.

గూళ్ళను భద్రపరిచే గదిని మిథెల్‌ బ్రోమైడ్‌ (0.5 /283 మి.)తో ఒక రోజు మొత్తం ప్యూమిగేట్‌ చేయాలి.

మిథెల్‌ బ్రోమైడ్‌ లేని ఎడల క్లోరోపిక్రిన్‌ అదే మోతాదులో ఉపయోగించాలి.

నల్లి :

నల్లి పురుగును అన్ని దశల్లో ఆశిస్తాయి. నల్లి పురుగులు ఆశించిన పురుగులపై నల్లని మచ్చలు ఏర్పడతాయి. నల్లి పురుగులు ఆశించిన పురుగులు మల విసర్జన చేయలేక మలము ఆ పురుగుల పాయువుకు అతుక్కొని ఉంటుంది. నల్లి ఆశించిన పురుగులు పచ్చని ద్రావణాన్ని వాంతి చేసుకుని మరణిస్తాయి.

చీమలు :

చీమలు పురుగులను ఆశించి పట్టి చంపి వేస్తాయి. చీమలు ఎక్కకుండా రేరింగ్‌ స్టాండు కాళ్ళు పాత్రలో ఉంచి నీళ్ళు పోసినట్లయితే చీమలు ఎక్కవు వీటినే చీమల బావులు అంటారు.

పట్టు పురుగులను ఆశించే వ్యాధులు - యాజమాన్యం :

1. పెబ్‌రైయిన్‌ :

ఈ వ్యాధి పెరోటోజువాన్‌ పరాన్న జీవి ''నాసిమబాంబోసిన్‌'' వల్ల వ్యాపిస్తుంది. ఈ వ్యాధిని ''మిరియాల'' వ్యాధి అంటారు. ఈ వ్యాధి ఆశించిన పురుగులో మొదట్లో ఎటువంటి లక్షణాలు కనిపించవు. వ్యాధి ముదిరిన తరువాత మాత్రం పురుగులు ఆహారాన్ని తినవు మరియు కదలికలు కూడా తగ్గిపోతాయి చివరగా ''మిరియాల'' లాగ నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ వ్యాధి ఒక తరం నుండి ఇంకోక తరానికి వ్యాపిస్తుంది.

యాజమాన్యం :

పట్టు గుడ్లను 2 శాతం ఫార్మలిన్‌లో ముంచి కొన్ని నిమిషాల తరువాత కడగాలి. రేరింగ్‌ గదిని ''క్రిమి రహితంగా (డిసిన్ఫెక్షన్‌)'' చేసిన యెడల వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చు.

2. శిలీంద్ర వ్యాధులు (సున్న కట్టు రోగం) :

''బవేరియా బసయానా'' (వైట్‌ మాస్కరిడైన్‌) ఆస్పర్‌ జిల్లస్‌ ప్లావస్‌'' (బ్రౌన్‌ మాస్కరిడైన్‌) శిలీంద్ర వ్యాధులు వచ్చినప్పుడు పురుగులపై చమురు మచ్చలు ఏర్పడతాయి. పురుగులు ఆహారాన్ని తీసుకోకుండా, కదలకుండా ఉంటాయి పురుగులు మరణించిన తరువాత శరీరం గట్టిగా తయారవుతుంది.

యాజమాన్యం :

డిసిన్ఫెక్షన్‌ కొరకు 2 శాతం ఫార్మలిన్‌ లేదా 5 బ్లీచింగ్‌ పౌడర్‌తో రేరింగ్‌ గదిని కడగాలి. సున్నపు పొడిని బెడ్‌పై చల్లి తేమను తగ్గించాలి. ఫార్మలిన్‌ 0.4 శాతం 1వ 2వ దశపురుగులపై మరియు 0.5 శాతం, 0.6 శాతం, 0.8 శాతం 3వ, 4వ, 5వ దశ పురుగులపై పిచికారి చేయాలి.

3. పాలు కారు రోగం (గ్రాసరీ) :

పట్టుపురుగులను పెంచే గహంలో అనుకూల వాతావరణ పరిస్థితులు లేక పోవుట వల్ల సోకుతుంది. వ్యాధిసోకిన పురుగుల నుండి తెల్లని పాల వంటి ద్రవం కారుతుంది. అందువల్ల ఈ వ్యాధి పాలు కారు రోగం అని కూడా అంటారు. రోగం ముదిరితే పట్టు పురుగులు తట్టల అంచులపై తిరుగుతాయి.

యాజమాన్యం :

అనుకూల ఉష్ణోగ్రత మరియు గాలిలో తేమ కల్పించడం, పుష్టికరమైన ఆకు వేయటం, తట్టలలో పురుగులను సిన స్థలావాకాశామును కల్పించడం, వ్యాధి సోకిన పురుగులను కాల్చి వేయటం, రేషమ్‌ కీట్‌ ఔషధాన్ని (2 గ్రా./చ. అడుగు) పురుగులపై చల్లటం వల్ల ఈ వ్యాధి నిరోధించవచ్చు.

4. నచ్చు రోగం (ప్లాచరీ):

వడలిపోయిన, పండుబారిన ఆకు వేయటం వల్ల ఈ వ్యాధి వస్తుంది. వ్యాధిసోకిన పురుగులు ఆకు మేయవు. పురుగు చర్మం మెత్తబడి కశించిపోతుంది. చనిపోయిన తరువాత పురుగులు నల్లగా మారతాయి రోగగ్రస్తమైన పురుగులపై నూనె మచ్చలు ఏర్పడతాయి.

యాజమాన్యం :

వ్యాధి సోకిన పురుగులను ఎప్పటికప్పుడు ఏరి వేయాలి. బెడ్‌ డిసిన్‌ ఫేక్టెంట్‌ దశల వారీగా తగిన మోతాదులో వాడాలి. మోతాదుకు మించిన ఆకును వేయరాదు.

ఇతర వివరాలకు సంప్రదించ వలసిన ఫోన్‌ నెం.8802345027 శాస్త్రవేత్త, (సస్యరక్షణ) జిల్లా ఏరువాక కేంద్రం, ఆదిలాబాద్‌

డా|| డి. వీరన్న, డా|| యం. సంపత్‌ కుమార్‌, డా|| సుధాన్షుకస్బే, శాత్రవేత్తలు, జిల్లా వ్యవసాయ సలహా మరియు

సాంకేతిక పరిజ్ఞాన బదిలి కేంద్రం (జిల్లా ఏరువాక కేంద్రం) ఆదిలాబాద్‌, ఫోన్‌ : 9989623816