బూర్జుగడ్డతాండ వాస్తవ్యులు, శంషాబాద్‌ మండలం, రంగారెడ్డి జిల్లాకు చెందిన 48 సం|| వయసు ఉన్న అబ్బూరి శ్రీనివాసరావు అనే రైతు ఉస్మానియా విశ్వ విద్యాలయంలో యమ్‌.ఎ డిగ్రీలో పట్టాను పొంది కూడా వ్యవసాయంపై ఉన్న మక్కువతో రైతుగా మారి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. కానీ వ్యవసాయంలో రసాయనాల వాడకం ద్వారా నేల ఆరోగ్యంతోపాటు, రైతు ఆరోగ్యం, తినే వారి ఆరోగ్యం కూడా పాడై వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. కాబట్టి శ్రీనివాసరావు గారు సేంద్రీయవ్యవసాయం వైపు మొగ్గుచూపి గత 7 సం||లుగా తనకున్న నాలుగు ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని వివిధ రకాల పంటలైన వరి, మామిడి, కూరగాయల పంటల్లో విజయాన్ని సాధించారు. ఇంతేకాకుండా ఈ రైతు తనపొలంలో వర్మికంపోస్టు షెడ్‌ను నిర్మించి వానపాముల ఎరువును తయారుచేసి, దానినే తాను పండించే పంటలో (వరి, మామిడి, కూరగాయల్లో) వాడుతున్నారు. మిగిలిన ఎరువును బయట రైతులకు విక్రయించి లాభాలు గడిస్తున్నారు.

వరి సాగులో ఈ రైతు అవలంభిస్తున్న విధానం :

సాగు రకం : తెలంగాణసోన

పచ్చిరొట్ట ఎరువులైన జనుమును పొలంలో పెంచి పూత దశలో కలియదున్నుతాడు. ఈ సమయంలోనే గ్లైరిసీడియా ఆకులను కూడా వేసి కలియదున్నుతాడు. ఎకరానికి ఒక టన్ను వర్మికంపోస్టు కూడా నాటువేయడానికి ముందే వేసి నేలను తయారు చేస్తాడు.

నారుమడి తయారీ :

ఈ రైతు ఎకరానికి 4 కిలోల విత్తనాన్ని మాత్రమే వాడి మ్యాట్‌ నర్సరీ విధానం ద్వారా నారుమడి తయారు చేస్తారు. ప్రధాన పొలంలో ఒక్క అడుగుదూరంలో రెండు లేదా మూడు మొక్కలు నాటుతాడు. నాటిన తరువాత ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని ఒక ఎకరాకు 200 లీ. చొప్పున చల్లుతాడు.

జీవామృతం తయారీ విధానం :

20 కిలోల గోవు పేడ + 10 లీ. గోమూత్రం + 2 కిలోల బెల్లం + 2 కిలోల శనగపిండి వాడతారు. వీటన్నింటినీ 200 లీ. నీటిలో కలిపి మిశ్రమాన్ని తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని వారం రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం సవ్యదిశలో కలిపి జీవామృతం తయారు చేస్తారు.

పంటలకు ఏదైనా చీడపీడలు ఆశించినట్లయితే ఒక ఎకరాకు 15 లీ. డబ్బాలో పిచికారీకి 200 మి.లీ. వేపనూనెను 12-13 లీటర్ల నీటిలో కలిపి ఒకసారి, మరోకసారి 15 లీ. డబ్బాలో గోమూత్రం నింపి పిచికారి చేయడం ద్వారా చీడపీడల సమస్యను అధిగమిస్తున్నారు. ఈ విధంగా యాజమాన్య పద్ధతులు చేపట్టి సేంద్రీయ వ్యవసాయం చేయడం ద్వారా ఒక ఎకరాకు సగటున 24 క్వింటాళ్ళ దిగుబడిని సాధిస్తున్నారు.

సేద్యపు ఖర్చు, నికరలాభం వివరాలు :

జనుము విత్తన ఖర్చు (15 కిలోలు) వర్మికంపోస్టు
రూ. 450/- (వ్యవసాయ శాఖ నుండి రాయితీపై) స్వయం తయారీ
గ్లైరిసీడియా ఆకులు తన పొలానికి సమీపంలో ఉన్న చెట్ల నుండి
దున్నడం మరియు నేల తయారీ రూ. 3,008/-
విత్తనం (4 కిలోలు) రూ. 400/-
నాటువేయడానికి రూ. 2,500/-
కలుపు తీయడానికి రూ. 1,500/-
కోత కోయడానికి రూ. 3,000/-
మొత్తం ఖర్చు రూ. 7,550/-

ఈ రైతు వడ్లను ముడి బియ్యంగా చేసి క్వింటాలుకు రూ 5,000.00 చొప్పున అమ్ముతున్నారు. ఎకరాకు ఈ రైతుకు 18 క్వింటాళ్ళ ముడి బియ్యం వస్తుంది. కాబట్టి బియ్యం నుండి రూ. 90,000.00 వరకు ఆదాయం వస్తుంది. మొత్తం ఖర్చులు పోను రూ. 82,450.00 లాభం గడిస్తూ ఇతర రైతులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.

- కె. అరుణ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌,

ఎ. నిర్మల, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, వ్యవసాయ కళాశాల,

రాజేంద్రనగర్‌, హౖెెదరాబాద్‌, ఫోన్‌ : 9963712126