వ్యవసాయ రంగంలో సాంకేతికతను మెరుగైన రీతిలో వినియోగించుకోవడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రకృతి వైపరీత్యాలు ఎదురైన, రాష్ట్రం విడిపోయి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా ఈ ప్రాధాన్యతారంగ అభివృద్ధికి, రైతుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అకుంటిత దీక్షతో ముందుకు వెళుతున్నామని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖా మంత్రి అన్నారు. డిసెంబరు 21వ తేదీన గుంటూరులోని ఆచార్య ఎన్‌.జి. రంగ వ్యవసాయ విశ్వ విద్యాలయం నెలకొన్న లాం ప్రాంగణంలో ఆయన ప్రసంగించారు. అసోచాం, నాబార్డుల ఆధ్వర్యంలో రైతుల ఆదాయం రెట్టింపు చేసే ప్రక్రియలపై నిర్వహించిన ఒక జాతీయ స్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

జాతీయస్థాయిలో 2020 లక్ష్యంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం లక్ష్యంగా నరేంద్రమోది ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న నేపద్యంలో నాబార్డు, అసోచం సంస్థలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సదస్సుల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.

గత నాలుగేళ్ళుగా వ్యవసాయ ఆదాయం వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కృషి వల్ల ఆంధ్రప్రదేశ్‌ 11 శాతం వృద్ధితో దేశంలో అగ్రస్థానంలో ఉందని జాతీయస్థాయిలో 2.4 శాతం వృద్ధి రేటు కన్నా ఇది ఎంతో అధికమని ఆయన సోదాహరణగా వివరించారు. సాంకేతికతను ఆధునిక వ్యవసాయానికి వినియోగించి అనేక మెరుగైన ఫలితాలను సాధించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుండడం హర్షణీయమని, కరువు ప్రాంతాల్లో భూగర్భజల వనరుల మట్టాలను పెంచడానికి విశేషమైన కృషి జరుగుతుందని, అనంతపురంలో వేరుశనగ రైతులను నీటి కొరత నుండి ఆదుకునేందుకు చేపట్టిన చర్యలు అధిక దిగుబడులను సాధించిపెట్టాయని, నేరుగా సచివాలయం నుండి ముఖ్యమంత్రి పర్యవేక్షణలో రైతుల ఆదాయం పెంపు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయని తెలిపారు.

ఆచార్య ఎన్‌జిరంగ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉపకులపతి దామోదర్‌నాయుడు ప్రసంగిస్తూ సాంకేతికత ఆలంబనగా అధిక దిగుబడులు వచ్చేలా తాము చేస్తున్న కృషిని వివరించారు. ఈ సందర్భంగా 1.75 కోట్లతో లాంలో నిర్మించనున్న వ్యవసాయ పర్యవేక్షణ కార్యాలయ నిర్మాణానికి మంత్రి శంఖుస్థాపన చేశారు.

మార్కెట్‌ నిఘా కేంద్రం, డిజిటలైజేషన్‌ కేంద్రాన్ని 64 లక్షలతో నిర్మిస్తున్నారు. అంతేకాకుండా 50 లక్షలతో నిర్మించిన విత్తన శుద్ధి నిల్వ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. సమావేశంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌తో పాటు అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. జిల్లాకు చెందిన రైతులు, వ్యవసాయ విశ్వ విద్యాలయ విద్యార్థులు, అనేక మంది వ్యవసాయ అనుబంధ రంగాల ప్రముఖులు సదస్సులో పాల్గొన్నారు.

- అగ్రిక్లినిక్‌ డెస్క్‌