ప్రపంచ వ్యాప్తంగా 88 శాతం మంది ప్రజలు విటమిన్‌-డి లోపంతో అవస్థలు పడుతున్నారు. విటమిన్‌-డి సరిగా అందకపోవడంతో మనిషి అనేక రకమైన వ్యాధులకు లోనవుతున్నాడు. కాల్షియం లోపానికి సంబంధించిన ఎముకల వ్యాధి చర్మ సమస్యలు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, కాలేయం, మూత్రపిండాల వ్యాధులు సంక్రమించి నిత్య జీవితంలో ఆరోగ్య ఒత్తిళ్ళకు లోనవుతున్నారు. ముఖ్యంగా నేత్ర సంబంధిత వ్యాధులతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్నది. చిన్న వయసులోనే అనేక మంది గుండే సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా ప్రపంచంలో సంపద సృష్టించి, మానవాళిని సర్వసౌఖ్యాలతో నింపే మానవ వనరులు నిస్థీర్యమై సమాజం ప్రగతి బాటన నడవాల్సింది తిరోగమనానికి లోనవుతుంది. వీటన్నింటికీ పరిష్కారంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను ఇచ్చే కోడిగుడ్లు, కోడి మాంసం వినియోగం పెంచి ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా నడిపించేందుకు కోళ్ళ పరిశ్రమకు సంబంధించిన వర్గాలతో పాటు, ప్రభుత్వాలూ, స్వచ్ఛంద సంస్థలు ఈ దిశలో భారీ ఎత్తున గుడ్ల వినియోగ అవసరం పై ప్రచారాన్ని ప్రారంభించాయి.

అనేక ఒడిదుడుకులు, వ్యాధులు, తెగుళ్ళ సంభవించి కోళ్ళ పరిశ్రమ దిగాలు పడుతుండడం, రైతులు తరచుగా సరైన ధర లేక మార్కెటింగ్‌ సమస్యలతో సతమతమవుతున్న నేపధ్యంలో జాతీయ గుడ్ల సమన్వయ కమిటి ఏర్పాటు చేసుకున్నారు. భారత పౌల్రీ పితామహులు స్వర్గీయ డా|| బి.వి రావు తన విశేష కృషి ప్రతిభతో దేశంలోని కోళ్ళ పరిశ్రమను ప్రపంచపు చిత్రపటంలో ఉంచి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించిన సంగతి విదితమే.

డా|| రావు చొరవ తీసుకోకముందు సంక్షోభంలో ఉన్న కోళ్ళ రైతులు ప్రతి సంవత్సరం నష్టాల ఊబిలో కూరుకుపోయి ఉండేవారు. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆయన తన దార్శనికత, ప్రతిభతో సాంకేతికపరంగా భారత పౌల్ట్రీ పరిశ్రమను ముందుకు నడిపి భారత ప్రభుత్వంచే పద్మశ్రీ బిరుదాంకితులు కూడా అయ్యారు.

ఆయన సృజియించిన సాంకేతికత ఆలంబనగా నేడు కోళ్ళ పరిశ్రమ రైతుల కష్టార్జితంతో సాధికారతను పొంది శాస్త్రీయ పరిశ్రమగా పునర్మించబడి ఇతర రంగాల్లోని రైతాంగానికి మార్గదర్శకంగా నిలబడిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ''నా గుడ్లు, నా ధర, నా జీవితం'' అనే మూడు అంశాల ప్రాతిపదికపై డా|| రావు సారధ్యంలో ఏర్పడిన జాతీయ గుడ్ల సమన్వయ కమిటీ (నెక్‌) నేడు కోళ్ళ రైతాంగానికి కావలసిన మార్కెటింగ్‌ వేదికగానూ, సమస్యల పరిష్కార ప్రాతిపదికగానూ నిలబడి నడుస్తున్న తరుణంలో కోడిగుడ్ల వినియోగం పై, పౌష్టికాహార అవసరంపై జాతీయ స్థాయి ఉద్యమ రూపంలో ముందుకు వెళుతున్న నేపద్యంలో అగ్రిక్లినిక్‌ మాసపత్రిక తనవంతు కర్తవ్యంగా నెక్‌ కార్యకలాపాలకు ప్రచార సారధిగా తన వంతు విధులను నిర్వహిస్తూ ఈ ప్రత్యేక వ్యాసాన్ని పాఠకుల ముందుంచుతున్నాం....

ప్రకృతిలో విటమిన్‌ - డి లభించే పదార్థాలు :

మన జీవన విధానంలో విటమిన్‌-డి (కాల్షియం) అవసరాన్ని చాలా మంది తెలుసుకోవడం లేదు. శరీరంలో తగిన మోతాదులో కాల్షియం లేనట్లయితే ఏర్పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. అందుకే మన పెద్దలు ప్రభాత సమయాన సూర్యనమస్కారాలను ప్రతిపాదించి ఆచరణకు ప్రోత్సహించేవారు. ఉదయపు సూర్యుని లేత కిరణాల్లో అత్యధికంగా లభించే విటమిన్‌-డిని ఆస్వాదించే అవకాశం లేకుండా మన జీవన విధానం రోజు రోజుకూ యంత్రమయమై పోతుంది. రాత్రి పూట ఆలస్యంగా నిద్రించడం, ఉదయం పొద్దెక్కి లేవడంతో అపురూపమైన సూర్యభగవానుని ప్రసాదితమైన కాల్షియంను మన శరీరం వినియోగించుకోలేక పోతుంది. కాల్షియం లోపాన్ని సరిదిద్దుకోవడానికి మనకు ప్రకృతి ప్రసాదించిన పదార్థాల్లో చేపలు, పాలు, గుడ్లు అతి ముఖ్యమైనవి. సూర్యరశ్మి ద్వారా విటమిన్‌-డిని పొందలేకపోతున్న మానవజాతికి ప్రత్మామ్నాయంగా చేపలు, పాలు, గుడ్లను పరిగణించవచ్చు.

చేపలు :

ఇవి అన్ని ప్రాంతాల్లో అందరికీ లభించే అవకాశం లేదు. ఆహార అలవాట్ల రీత్యా కొంత మంది వీటిని భుజించరు. ఖర్చుతో కూడినది కావడం మరో అవరోధం.

పాలు :

పాలు, పాల పదార్థాల్లో కొంత శాతం విటమిన్‌-డి లభించినా లోప నివారణకు ఇది పరిపూర్ణ ఆహారం కాదు. ఇక అందరికీ అందుబాటులో ఉండేవి కోడిగుడ్లు మాత్రమే. ఎటువంటి కల్తీలేకుండా లక్ష్యం మేరకు ఆహారంలో గుడ్ల వినియోగాన్ని లభ్యపరచుకుంటే అంతకుమించిన ఆరోగ్య సూత్రం మరొకటి ఉండదు. మన రోజు వారీ ఆహారంలో ఎంతో ఖర్చుపెట్టి కూరగాయలు, మాంసం మనం తీసుకుంటూ ఉంటాము. కానీ ఒక్క గుడ్డు వల్ల వచ్చే పోషకాలు మరి దేనిలోనూ కనబడవు. సూర్యరశ్మి, చేపలు, పాలు సరైన సమయంలో, సరైన మోతాదులో తీసుకోలేని వారు ఖచ్చితంగా ఎటువంటి కల్తీ లేని కోడి గుడ్డును ఆహారంగా తీసుకుంటే ఎటువంటి వ్యాధులు దగ్గరకు రావు. ధరలు కూడా అందుబాటులో ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ రోజుకు 2 గుడ్ల చొప్పున తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు సలహాఇస్తున్నారు. దీనివల్ల శరీరానికి కావలసిన విటమిన్‌-డితో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయని మన స్వానుభవంలో తేలుతున్న విషయం.

గుడ్డులో లభించే విటమిన్‌-డి వల్ల కలిగే లాభాలు :

ఎముకల వ్యాధిని నివారించుకోవచ్చు

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ని తగ్గిస్తుంది.

చర్మ సంబంధ వ్యాధులను నివారిస్తుంది.

వయసు పెరగడం వల్ల చర్మంలో వచ్చే మార్పులను నివారిస్తుంది.

సూర్యకాంతిని నేరుగా చూడవచ్చు.

లివర్‌, కిడ్నీ వ్యాధుల నుండి కాపాడుతుంది. చిన్న పిల్లల్లో, గర్భిణీ స్త్రీలలో ఎముకల పటిష్టతకు దోహదపడుతుంది.

హై కొలస్ట్రాల్‌, క్యాన్సర్‌, గుండె జబ్బుల నుండి రక్షణ పొందవచ్చు.

వయసు పై బడిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆహారంలో గుడ్డు ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.

అనుకోని అతిధి మర్యాదకు - అనుకూలం కోడిగుడ్డు :

ప్రకృతి ప్రసాదించిన అత్యంత పోషక విలువలు కలిగిన కల్తీలేని ఆహారం కోడిగుడ్డు. సహజ సిద్ధంగా ప్యాక్‌ చేయబడిన స్వచ్ఛమైన కోడిగ్రుడ్డు నందు ఎంతో విలువైన విటమిన్లు, కార్బోహైడ్రేట్స్‌, మినరల్స్‌, అమినోయాసిడ్స్‌ లభిస్తాయి. వీటిలో 13 శాతం మాంసకృత్తులు, 10-12 శాతం కొవ్వు పదార్ధాలు, విటమిన్‌-ఎ, బి-1, బి-2, బి-3, బి-5, బి-6, బి-12 మరియు డి విటమిన్లు కలవు. విటమిన్‌-డి కోడిగుడ్లలో మాత్రమే లభిస్తుంది. గుడ్లు తింటే వేడి చేస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. ఏ కాలంలోనైనా, ఏ వయసు వారైనా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, పిల్లలు, బాలింతలు, అనారోగ్యం నుండి కోలుకుంటున్నవారు తీసుకోదగిన బలవర్థక ఆహారం కోడిగుడ్డు. క్రమం తప్పకుండా గుడ్డు వాడేవారు వైద్యుల వద్దకు వెళ్ళే అవసరం కలుగదు. ఇన్ని రకాలుగా కోడిగుడ్డు అనేక పోషక విలువలు కలిగి అతి చౌకగా దొరికే సమతుల్య ఆహారం అయినప్పటికీ కొందరు లేనిపోని అనుమానాలతో, అపోహలతో వాటికి దూరంగా ఉండడం దురదృష్టకరం.

కోడి గుడ్డును ఏయే విధాలుగా ఆహారంలోకి తీసుకోవాలి. గుడ్డుతో ఎన్ని రకాల వంటకాలు చేయవచ్చు, అనే విషయంలో గృహిణులకు సమగ్రమైన సమాచారం అందచేయాలనేది ఈ ప్రచురణ వెనుక ముఖ్య ఉద్దేశం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే కోడిగుడ్డు వినియోగం పెంచేందుకు ప్రతి గృహిణి ఈ ''విందు పసందుల గుడ్డు'' సహాయంతో వంటింట్లో గుడ్ల ఘుమఘుమలతో కుటుంబ ఆరోగ్యాన్ని పెంపొందించుకొని అతిధులను ఆనందపర్చగలరని ఆశిస్తూ...

గుడ్ల నాణ్యతా పరీక్ష - నిల్వ చేయుట :

తక్కువ ఖర్చుతో పొందగల సంపూర్ణ ఆహారం గుడ్లు. పూర్తి ఆహారం మాత్రమే కాక, ఉత్తమ శ్రేణి ప్రొటీన్లను అందించే అతి చవకైనవి కూడా.

గుడ్లను వినియోగించే ముందు వాటిని నీళ్ళ గిన్నెలోకి వదలండి. అది అడుగు వరకు పోయి, పక్కకు వాలితే తాజాగా ఉన్నట్టే! నిలుచుంటే తాజాగా లేదని అర్ధం. నీళ్ళలో తేలిపోతే పూర్తిగా పాడైపోయినట్లు లెక్క అలా పాడైపోయింది తినకూడదని అర్ధం.

గుడ్లను చల్లగా ఉండే చోట నిల్వచేయవచ్చు. మరీ పొడిగా ఉండకూడదు. తీవ్రమైన వాసననిచ్చే వెన్న. ఉల్లిపాయలు వంటి వాటికి గుడ్లను దూరంగా ఉంచాలి. గుడ్లను ఎప్పుడూ లావుగా ఉండే వైపు పైకి ఉండేలా నిలబెట్టి ఉంచాలి. వండేముందు గుడ్లు మన ఇంట్లో ఉండే ఉష్ణోగ్రతలో ఉండాలి. రిఫ్రిజరేటర్‌ నుండి తీసినవైతే వాటి మీద కాస్త వేడినీరు పోయాలి.

గుడ్డు దాని పోషక విలువలు :

మనిషికి రోజంతా అవసరమయ్యే అతి ముఖ్యమైన ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పొందేందుకు గుడ్డు ఎంతో ఉపయోగపడుతుంది.

ప్రొటీన్లు :

అత్యుత్తమ శ్రేణికి చెందిన ప్రొటీన్లు ఒక్కొక్క గుడ్డులో 7 గ్రాములు ఉంటాయి. వీటిలో పెరుగుదలకు అవసరమైన 8 అమినో యాసిడ్లు ఉన్నాయి. చిన్న పిల్లలకు అవి చాలా అవసరం. గర్భిణీ స్త్రీలకు గుడ్లలోని ప్రొటీన్లు చాలా అవసరం. కడుపులోని బిడ్డ పెరుగుదలకు ఇవి తోడ్పడతాయి. తల్లికి గర్భాశయం, పాలిండ్లు, జఠయువు, ఇతర నిల్వలను వృద్ధి చేస్తాయి.

విటమిన్లు :

మంచి దృష్టికి ఆరోగ్యకరమైన చర్మానికి అవసరమైన ''ఎ'' విటమిన్లు గుడ్డులో అధికంగా ఉన్నాయి. మంచి ఆకలిని పుట్టించడానికి, ఆరోగ్యదాయక ద్రవ్య విక్రయకూ, నరాల సత్తువకు అవసరమైన విటమిన్‌ ''బి'' సముదాయమంతా గుడ్డులో ఉంది. బలమైన దంతాలకు, ఎముకలకు అవసరమైన విటమిన్‌ ''డి'' కూడా గుడ్డులో ఉంది.

ఖనిజాలు :

మానసిక, శారీరక శక్తి సామర్థ్యాలకు మూలం శారీరక రసాయనికాలు, గుడ్లులో 11 ఖనిజాలు లభ్యమౌతాయి. మెదడును, నరాలను ఉత్తేజపరచే భాస్వరం (ఫాస్పరస్‌), ఆరోగ్యకరమైన రక్తం, మంచి శ్వాసకు అవసరమైన ఇనుము (ఐరన్‌), కాల్షియం, సోడియం, క్లోరిన్‌, పొటాషియం, సల్ఫర్‌ (గంధకం), మెగ్నీషియం, జింక్‌, రాగి ఇంకా అయోడిన్‌ వంటివి మన దేహం సర్వ సామాన్యంగా పనిచేసేందుకు కావలసినవి ఎన్నో ఇందులో ఉన్నాయి.

కొవ్వు పదార్థాలు :

ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి వారికి కొంత కొవ్వు ఉండాలి. సిఫారసు చేసిన గరిష్ట పరిమితిలో గుడ్డు నుండి లభించే కొవ్వు పదార్ధం ఆరు శాతం మాత్రమే ఉంటుంది. గుడ్డు సులభంగా అరిగిపోయి, ఆహారంలో ముఖ్యభాగంగా తోడ్పడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకూ, అనారోగ్యానికి గురై కోలుకుంటున్న వారికి, వృద్ధులకు గుడ్డు బాగా ఉపకరిస్తుంది.

గుడ్డు ఉడకబెట్టడంలో పద్ధతులు :

గుడ్డును సన్నని మంటపై వండాలి. లేనట్టయితే అవి గట్టిపడి రుచిపోతుంది.

గుడ్డును అల్యూమినియం పాత్రలో ఉడికించరాదు. ఈ పాత్రలు నల్లబడిపోతాయి. స్టీల్‌ పాత్రల్లో గుడ్లని ఉడికించడం శ్రేయస్కరం. భోజనాలకు, పులి¬ర మొదలగు వంటల్లో ఉడకబెట్టిన గుడ్లను జోడించవచ్చు.

గుడ్లను బాగా ఉడకబెట్టేందుకు నీళ్ళలో వేసి ఉడికించాలి. వేడి తగ్గించి, సన్నని మంటలో 10 నిమిషాలు ఉడికించాలి. గుడ్లు ఉడికిన వెంటనే చన్నీటి ధారలో పెట్టి చల్లార్చాలి. దీనివల్ల పచ్చ, తెలుపు సొనల మధ్య నల్లనిపొర ఏర్పడదు.

గుడ్లు - పాలు పోషక విలువల్లో పోలిక :

సమగ్ర పోషక విలువలు కలిగిన ఆహారానికి ఉదాహరణంగా పాలను పేర్కొంటున్నారు. ఈ కారణాలవల్లనే శిశువులు సాంప్రదాయ ఆహారాన్ని తీసుకునేందుకు సిద్ధమయ్యేవరకు వారికి పాలను ఇవ్వడం ద్వారా వారి జీవనానికి ఆధారంగా ఉపయోగిస్తున్నారు. అదే విధంగా ప్రకృతి ప్రసాదించిన పోషక పదార్థాల్లో కోడిగుడ్డు కూడా ఒకటి. ఎదుగుతున్న శిశువుకు మొత్తం జీవన విధానానికి కూడా గుడ్డు ఉపయోగపడుతుంది.

రెండు పెద్ద గుడ్లలో 160 కాలరీలు లేదా ఒక మహిళ సగటున సమకూర్చుకునే కాలరీల్లో 9 శాతం కోడిగుడ్ల ద్వారానే లభిస్తుంది. అదే సమయంలో మనిషికి రోజుకు ఈవసరమైన ప్రోటీన్‌, విటమిన్‌-ఎ, రిబోఫ్లావిన్‌, ఇనుము, విటమిన్‌-డి, ఫాలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి-12, ఫాస్ఫరస్‌, అయోడిన్‌, పాంటోధినిక్‌ యాసిడ్‌లలో 9 వాతానికి పైగా గుడ్ల ద్వారానే లభ్యమవుతుంది. ఈ కారణాల వల్ల గుడ్లు పోషక పదార్థాలతో నిండిన ఆహారంగా పేర్కొనవచ్చు. బడ్జెట్‌ పరంగా కూడా గుడ్లు అందరికీ అందుబాటులో ఉండే పోషకాహారమే.

గుడ్ల వంటల్లో కిటుకులు :

గుడ్లతో చేసే వంటకాలను అల్యూమినియం పాత్రలలోనే వండాలి. వండే సందర్భంలో కర్ర చెంచాగాని, గరిటెగానీ వాడడం, లేదంటే గుడ్లు ఆకుపచ్చ కలసిన బూడిద రంగులోకి మారిపోతాయి.

గుడ్లలోని పచ్చనిసొన, తెలుపు సొన నుండి వేరు చేయడానికి గుడ్డును గిన్నె అంచున కొట్టి, పై పెంకులు రెండు ముక్కలుగా పగిలేలా చేయాలి. ఒక వైపు భాగాన్ని మెల్లగా వంచుతూ తెలుపు అంతా గిన్నెలో పడేలా చేయాలి. ఆ తరువాత పచ్చసొనను మరో గిన్నెలోకి వంపుకోవాలి.

పచ్చ సొన పలుకో, తొరకో తెలుపులోకి కాస్త జారితే గుడ్ల పెంకు ముక్కలతోగానీ, టీస్పూన్‌తో గానీ వంటింటిలో వాడుకునే అద్దుడు కాయితపు అంచుతో తీసేయాలి. పచ్చసొన ఏ మాత్రం ఉన్నా తెలుపును బాగా చిలకడానికి వీలవ్వదు.

గుడ్డు అంతా కలియబెట్టాలి. అంటే ఫోర్క్‌తో గానీ, చెంచాతోగానీ కింద నుండి పైదాకా బాగా తిరగకలపాలి. ఎలక్ట్రికల్‌ మిక్సర్‌ అయితే మరీ మంచిది. ఇలా కలపడంలో గాలి చొరబడి కలిపినది ఊరినట్లు పెద్దదవుతుంది. ఇలా కలిపిన దాన్ని గాలిపోకుండా వెంటనే వాడుకోవాలి.

పచ్చసొనకు పంచదార కలపాలి అంటే ముందు పచ్చసొనను బాగా కలియతిప్పాలి. తరువాత పంచదార కలుపుతూ బాగా కలియ తిప్పాలి. వెడల్పాటి రిబ్బన్లు మాదిరిగా సాగేంతవరకు తిప్పాలి.

గుడ్డులోని తెల్లసొనను బాగా గట్టిపడేలా (మరీ పొడి నురగలా అయిపోలా కాదు) కలియబెడితే భోపుల్స్‌లోకి, మెరింగ్స్‌లోకి వాడుకోవచ్చు. ఇందుకు శుభ్రంగా పొడిగా ఉండే గిన్నెనే ప్రతి పర్యాయం వాడుతూ ఉండాలి.

గుడ్డులోని తెలుపును చక్కగా తేర్చేందుకు బాగా కలిపిన తెలుపు మిక్చరుపైన పోగుగా పోసి మెటల్‌ చెంచాతో గిన్నె అడుగు నుంచి మిక్చర్‌ను పై వరకూ తీస్తూ తెలుపు మీద పోయాలి. అలా చక్కగా అందులో చొరబడిన గాలి బయటికిపోకుండా చూస్తూ కలపాలి.

గుడ్డూ, శాఖాహారమే - మహాత్మాగాంధీ

అహింసావాదిగా, శాఖాహార ప్రియుడిగా పేరొందిన జాతిపిత మహాత్మాగాంధీ కోడిగుడ్డును శాఖాహారంగానే అభివర్ణించారు. జంతువుల నుండి సేకరించిన పాలు ఎలా శాఖాహారమవుతాయో గుడ్లు కూడా పక్షి ఉత్పత్తులైనప్పటికీ వాటిని కూడా శాఖాహారంగానే పరిగణించాలని మహాత్మాగాంధీ ఒక దశలో తన అభిప్రాయాన్ని సుస్పష్టంగా వ్యక్తం చేశారు. ఔషధ బాషలో పాలను, గుడ్లును జంతు సంబంధిత ఉత్పత్తులుగానే పరిగణించినా గానీ సామాన్య మానవుని దృష్టిలో గుడ్లు ముఖ్యంగా పాలు శాఖహారమేనని భావించడం జరుగుతుంది. పాలను మనం ఎలా శాఖాహారంగా స్వీకరిస్తున్నామో గుడ్లను కూడా అలాగే పరిగణించాలని మహాత్మాగాంధీ అభిప్రాయం.

- వై.వి. నరసింహారావు, అసోసియేట్‌ ఎడిటర్‌

ది నేషనల్‌ ఎగ్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ (చీజుజజ) సౌజన్యంతో