ప్రస్తుతం మనదేశంలో ఆహారపదార్ధాలు ధరలు పెద్ద ఎత్తున పెరిగిపోయి వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కూరగాయలు, పండ్ల ధరలకు రెక్కలొచ్చి సగటు వినియోగదారుడు దిక్కుతోచని స్ధితిలో పడ్డాడు. ప్రభుత్వాలు తాత్కాలిక ఉపశమనాలు ప్రకటించిన దీర్ఘకాలికంగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. కూరగాయల ధరల పెరుగుదలకు ప్రధానమైన కారణం నగరీకరణ. విస్తరిస్తున్న నగరాలు, పట్టణాల చుట్టూ పొలాలు జనారణ్యాలుగా మారిపోయి సాంప్రదాయకంగా పండించే కూరగాయల క్షేత్రాలు, ఆకుకూరలు, పండ్ల తోటలు నశించిపోయాయి. దీనితో పట్టణాలలో సుదూర ప్రాంతాల నుండి రవాణా చేసుకోవలసి రావడంతో ఖర్చులు పెరిగిపోయి, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దానికితోటు వాతావరణంలో హెచ్చుతగ్గులు పురుగులు, తెగుళ్ళ బెడద వలన కూడా పంటలు సరిగా పండడం లేదు.

భారతదేశంలో సగటున సంవత్సరానికి దాదాపు 150 మిలియన్‌ టన్నుల కూరగాయలు, పండ్ల ఉత్పత్తి జరుగుతుంది. ఈ మొత్తం ఉత్పత్తి వినియోగదారుడికి అందుబాటులో వచ్చే సమయానికి 35 నుండి 40 శాతం పంట నష్టం జరుగుతుంది. ఈ నష్టాన్ని తగ్గించడానికి ఉద్యాన ఉత్పత్తుల సద్వినియోగానికి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడానికి ఎంతో కృషి జరుగుతుంది. పండిన పంటను జాగ్రత్తగా వినియోగదారునికి చేర్చడానికి నాలుగు రకాల సాంకేతిక పరిజ్ఞానం అవసరం. ఆ పరిజ్ఞానాన్ని నాలుగు విధాలుగా విభజించవచ్చు.

1. తాజా పండ్లు, కూరగాయలను కోసి భద్రపరచి జాగ్రత్తగా రవాణా చేయడం.

2. మార్కెట్‌ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కునేందుకు నిల్వ చేసే సౌకర్యాలను కలుగజేయడం.

3. విలువైన ప్రక్రియ పదార్ధాలను రూపొందించడం.

4. వృధా పదార్ధాల నుండి అతి విలువైన ప్రకృతి పదార్ధాలను రూపొందించడం.

పండ్లు, కూరగాయల నష్టం జరగడానికి నాలుగు ముఖ్య కారణాలున్నాయి. అవి

1. కాయ పగుళ్ళు, 2. కాయ కుళ్ళు

ఈ నష్టాలను తగ్గించడానికి కొన్ని మెళుకువలను పాటించడం అవసరం. అవి

1. పండ్ల్లజాతి కాయలను పరి పక్వానికి వచ్చినప్పుడు కోయడం మంచిది.

2. కూరగాయలను లేతవిగా ఉన్నప్పుడే కోసుకోవాలి.

3. పండ్లుగాని, కూరగాయలు గాని క్రిందపడకుండా కోయాలి. ఎతైన చెట్టునుండి కాయలు కోసి నేలపై ఉన్న గడ్డి మెత్తలపై జారవిడవడం మంచిది.

4. పండ్లు, కూరగాయలను చల్లని వాతావరణం ఉన్నప్పుడు ఉదయం, సాయంత్రం మాత్రమే కోయాలి.

కోత ఎంపిక :

కాయల రంగు, ఆకారం, బరువును అనుసరించి ఎంపిక చేయాలి. ఆ ఎంపిక తోటలోని నీడ ప్రాంతంలోనే చేయాలి. చేతిలో ఎంపిక చేయడం సహజ పద్ధతి.

పంటను శుభ్రపరచడం, భద్రపరచడం : "

కోసిన కాయలను అట్టలలో గాని, బుట్టలలో గాని, పెట్టెలలో గాని భద్రపరచుకోవచ్చు. కాగితపు పొరలను అట్టపెట్టెల అడుగుభాగాన ప్రక్కల ఉంచి కాయలను భద్రపరచాలి. కాయలను కోసిన తురువాత నేరుగా వాహనాలలో నింపి మార్కెట్‌కు రవాణా చేయరాదు. బుట్టలలో, కర్రపెట్టెలలో కాగితపు పొరలు లేకుండా కాయలను భద్రపరచరాదు. అట్లాగే జనుము సంచులలో పండ్లు, కూరగాయలను నింపి రవాణా చేయకూడదు.

సహజ వేడిమి :

సాధారణంగా చెట్టు నుండి అప్పుడే కోసిన కాయలు సహజ వేడిమి కలిగి ఉంటాయి. అతి సామాన్య శీతల గదిని నిర్మించుకుని లేదా ప్రీ కూలింగ్‌ యూనిట్‌తో వేడిని తగ్గించడం ద్వారా ఎక్కువ రోజులు నిల్వ ఉంచవచ్చు. సహజ వేడిని తగ్గించకుండా శీతల గదిలో నిల్వ ఉంచరాదు.

పంట రవాణా :

ఎప్పుడైనా కూరగాయల, పండ్ల ధరలను నిర్ధేశించడంలో రవాణా పాత్ర చాలా కీలకమైనది. ప్రపంచమంతా ఒకే పెద్ద మార్కెట్‌గా పరిగణించబడుతున్న దశలో జాగ్రత్తగా రవాణా చేయడం అతి ముఖ్యమైన అంశం. దానికి ముందే పంట చేలు, తోటలకు ప్రాధమికంగా ప్రధాన రహధారి వరకు రోడ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఆ రోడ్లు కూడా మంచి నాణ్యత కలిగినవి కావాలి. గతుకులున్న రోడ్ల ద్వారా రవాణా చేయడం వలన కాయలకు పగుళ్ళు ఏర్పడి అవి నిర్ధేశిత ప్రాంతాలకు చేరే సమయానికి కుళ్ళిపోయి నష్టం వాటిల్లుతుంది. వాహనాలలో భద్రపరచే సమయంలో గట్టి రేక్స్‌ (అలమర)లు కలిగిఉన్న వాహనాలను ఎంచుకోవాలి. ఒక వరుసలోని బుట్టలు లేదా పెట్టెలు మరో వరుసతో అంటకుండా కాయలకు దీని ద్వారా భద్రత కలిపించాలి. కూరగాయలను ప్రత్యేకంగా నిర్మించిన వాహనాలలో రవాణా చేయడం వలన జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు. స్థల మార్పిడి సందర్భంలో, పండ్లు, కూరగాయలను బుట్టలలోగాని, పెట్టెలలో గాని ఉంచి ఒక్క చోట నుండి మరో చోటికి చేర్చడం అవసరం. యంత్ర సహాయంతో పెట్టెలను ఒకేసారి చేర్చడం వలన కాయలకు దెబ్బతగిలే అవకాశం తక్కువ. కాయలను వాహనంలో నింపేటప్పుడు, దింపేటప్పుడు పెట్టెలను విసిరి వేయరాదు. పొరపాటున పెట్టె కింద పడిపోతే లోపల ఉన్న కాయలకు పగుళ్ళు ఏర్పడతాయి.

నిల్వతో పంటకు భద్రత, రైతుకు ఊరట :

శీతల గదులలో పండ్లు, కూరగాయలను నిల్వ ఉంచడం ద్వారా రైతు తనకు వీలైన సమయంలో గిట్టుబాటు ధర లభించే విధంగా అమ్ముకునే అవకాశం ఉంది. అయితే నిల్వచేసే సమయంలో శీతల గదులలోని ఉష్ణోగ్రత పంటలను బట్టి మారుతుంది. ఒకే ఉష్ణోగ్రతలో అన్ని పండ్లు, కూరగాయలను నిల్వ ఉంచరాదు. కొన్ని ఫలజాతులలో (అరటి, మామిడి, సపోటా) నల్లని మచ్చలు ఏర్పడి విలువను కోల్పోతాయి. పండ్లు, కూరగాయల సహజ వేడిమి తగ్గించేందుకు ముందుగా వాటిని పెట్టెలలో గాని, బుట్టలలో గాని భద్రపరచి ఆరబెట్టాలి. అదేవిధంగా పండ్లు కూరగాయల ఉపరితల భాగాన తేమతో శీతల గదిలో నిల్వ ఉంచరాదు.

శీతల గదిలో ఉత్పత్తులను భద్రపరచుకోవడం రైతులకు వ్యక్తిగతంగా సాధ్యం కాదు. ఎందుకంటే ప్లాస్టిక్‌ క్రేేట్లు కొనడం గాని, రవాణాకై రేకింగ్‌ పద్ధతిలో ఉన్న అత్యంత సాంకేతిక నైపుణ్యం గల వాహనాన్ని కొనడం గాని సాధ్యపడదు. ఈ ఖర్చును సమకూర్చుకునేందుకు పంటల వారీగా రైతులు సమిష్టిగా సొసైటీని ఏర్పాటు చేసుకోవాలి. ఈ సొసైటీలకు ఆర్ధిక సహాయం అందించేందుకు జాతీయ ఉద్యానవన బోర్డు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యానవన, మార్కెటింగ్‌ శాఖలు వివిధ పధకాల ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందజేస్తున్నాయి. అదే విధంగా జాతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ (నాబార్డ్‌) కూడా ఈ వసతులను సమకూరుస్తున్నది. దేశంలోని వివిధ వాణిజ్య బ్యాంకులు కూడా రైతుల అభ్యున్నతికి వివిధ పధకాల ద్వారా సహాయ సహకారాలను వివిధ రూపాలలో అందజేస్తున్నాయి. ముఖ్యంగా అధిక ధరలతో సతమతమయ్యే అటు వినియోగదారునిని, ఇటు రైతును ఆదుకునేందుకు రవాణాలో జరిగే నష్టాన్ని తగ్గించడం ద్వారా సరుకులను నిల్వ చేసుకోవడం ద్వారా ఆదుకోవచ్చు. అదే సందర్భంలో త్వరగా పాడైపోయే టమాటా ఇతర కూరగాయలను, పండ్లను లాభసాటిగా మార్చుకునేందుకు ఆహార ప్రక్రియ (ఫుడ్‌ ప్రొసెసింగ్‌) సాంకేతిక విజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీర్ఘకాలం ఉపయోగపడేవిధంగా జామ్‌లు తయారు చేసుకోవడం, ఐస్‌క్రీమ్‌, ఫ్రూట్‌ సలాడ్‌లుగా మార్చుకుని వాణిజ్య ప్రక్రియలతో ముందుకు వెళ్ళడం, రంగుల అద్దకాల పరిశ్రమలకు ఇతర ఉత్పత్తులకు కూరగాయలు, పండ్లను మలచుకోవడం, అమెరికా, యూరప్‌ లాంటి ఖండాంతర దేశాలకు ప్రక్రియ పదార్ధాల రూపంలో పంపించేందుకు అనేక రకాలైన సాంకేతిక ప్రక్రియలు అమలులోకి వచ్చాయి. పండ్లు, కూరగాయల ద్వారా తయారయ్యే భారతీయ పచ్చళ్ళకు కూడా ఇతర దేశాలలో మంచి డిమాండ్‌ ఉంది. ఈ నేపధ్యంలో పంట పండించడం వరకు అనుభవజ్ఞుడైన నిపుణుడిగా పేరొందిన రైతు ఇక తన ఉత్పత్తికి తానే సాధికారికుడిగా ధర నిర్ణయించుకునే అవకాశాన్ని సాంకేతిక ప్రక్రియ ద్వారా అందిపుచ్చుకోవడమే తక్షణ కర్తవ్యం. ఇటు దేశానికి ఆహార భద్రతను, అటు తన స్వంత భద్రతను, ఇతరులపై ఆధారపడని స్వావలంబనానికి సాంకేతిక పరిజ్ఞానం బాటలు వేస్తున్నది. అంకిత భావంతో ఆ బాటలో పయనిస్తే ఇక వ్యవసాయం పండగే....

-అగ్రిక్లినిక్‌ డెస్క్‌