మన రాష్ట్రంలో సాగు చేయబడుతున్న పండ్లతోటల్లో మామిడి అతి ముఖ్యమైనది. ప్రస్తుతం మామిడి తోటలు పూత దశలో ఉన్నాయి. పూత మరియు కాయ దశలో అనేక రకాల పురుగులు, తెగుళ్ళు మామిడిని ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగచేస్తాయి. వీటితోపాటు పోషకాల లోపాలు మరియు నీటియాజమాన్యం సరిగా చేపట్టకపోవడం వల్ల కాయ నాణ్యత మరియు దిగుబడులు తగ్గుతున్నాయి. దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. కాబట్టి అత్యంత కీలకమైన ఈ దశలో కింది జాగ్రత్తలు పాటించినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు.

సస్యరక్షణ :

పురుగులు :

తేనె మంచు పురుగులు :

తల్లి పురుగులు, పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులు, పుష్పగుచ్ఛాలు, పూలు మరియు పిందెల నుండి రసాన్ని పీల్చుతాయి. దీనివల్ల పూత మాడిపోయి రాలిపోతుంది. పిందెలు ఏర్పడవు, ఒకవేళ ఏర్పడినా బలహీనంగా ఉండి రాలిపోతాయి. ఈ పురుగులు విసర్జించిన తేనెలాంటి తియ్యని పదార్థంపై శిలీంధ్రాలు పెరిగి ఆకులు మరియు కాయలపై నల్లని మసి మంగు ఏర్పడుతుంది. ఈ పురుగులు పూత మరియు కాయ దశలో ఆశించి నష్టపరుస్తాయి. మిగతా సమంయలో కాండం మరియు బెరడు పగుళ్ళలో దాక్కొని ఉంటాయి.

నివారణ :

పూ మొగ్గ దశలో ఆమిడాక్లోప్రిడ్‌ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పూత మొదలయ్యే దశలో మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పిందె దశలో ఎసిఫేట్‌ 1.5 గ్రా. లేదా ఫాస్టోమిడాన్‌ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తామర పురుగులు :

తామర పురుగులు 2 మి. మీ. పొడవు ఉండి జాలరు వంటి రెక్కలు కలిగి సూక్ష్మంగా ఉంటాయి. ఈ పురుగులు పిందెలు ఏర్పడే దశలో చర్మాన్ని గోకి రసం పీల్చడం వల్ల వక్క రంగులో గరుకు మచ్చలు ఏర్పడతాయి. దీన్నే రాతి మంగు అంటారు. దీనివల్ల కాయ నాణ్యత తగ్గి సరైన మార్కెట్‌ ధర పలకదు. ఈ తామర పురుగులు చిన్నగా ఉండి కంటికి కనిపించవు. కాబట్టి పూ రెమ్మలను తెల్లని కాగితం పై తట్టినట్లయితే చిన్న చిన్న లేత గోధుమ రంగు పురుగులు కనిపిస్తాయి.

నివారణ :

పిందె దశలో ఫిప్రోనిల్‌ 2 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఆకుజల్లెడ గూడు పురుగు :

ఈ పురుగులు ఆకులు మరియు పూతను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంది. దీని ఉధృతి ఈ మధ్యకాలంలో పెరుగుతూ వస్తుంది. ఈ పురుగు లార్వాలు ఆకుల మధ్యనున్న కణజాలాన్ని తినేసి జల్లెడలాగా చేసి గూడు ఏర్పరచుకుంటాయి. దీనివల్ల పూత ఏర్పడదు. పూత దశలో పూగుత్తులను కూడా గూడుగా ఏర్పరచుకోవడం వల్ల పూత రాలిపోయి, పిందెలు ఏర్పడవు.

నివారణ :

ఈ పురుగు గూళ్ళను ఇనుప కొక్కెము కలిగిన పొడవాటి వెదురు కర్రతో తొలగించి నాశనం చేయాలి.

ఆ తరువాత క్లోరిఫైరిఫాస్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పిండినల్లి :

తల్లిపురుగులు చెట్టు పాదుల్లోని మట్టిలో గుడ్లు పెడతాయి. ఈ గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు పాకడం ద్వారా లేదా చీమల ద్వారా కాయలపై మరియు కాయ తొడిమల పైకి చేరతాయి. ఈ పురుగులు పూత రెమ్మలు, కాయలు, తొడిమలపై గుంపులుగా చేరి రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి. ఇవి విసర్జించిన తియ్యని పదార్ధంపై నల్లని మసి మంగు ఏర్పడుతుంది. వీటి తీవ్రత ఫిబ్రవరి, మార్చి నెలల్లో అధికంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా ఆశించిన కాయలు సరిగా ఎదగకుండాపోతాయి.

నివారణ :

పిండినల్లి ఆశించిన రెమ్మలు, కాయలపై ఇమిడాక్లోప్రిడ్‌ 0.3 మి.లీ. లేదా పాస్ఫామిడాన్‌ 2 మి.లీ. కలిపి పిచికారి చేయాలి.

టెంక పురుగులు :

పిందెలు గోళీకాయ పరిమాణంలో ఉన్నప్పుడే తల్లి పురుగులు పిందె పై గుడ్లు పెడతాయి. గుడ్ల నుండి బయటికి వచ్చిన పిల్లపురుగులు కాయలోని టెంకలోకి చొచ్చుకొనిపోయి తీవ్రనష్టాన్ని కలుగచేస్తాయి.

నివారణ :

దీని నివారణకు పిందెదశలో ఫినిట్రోధియాన్‌ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెగుళ్ళు :

బూడిద తెగులు :

ఈ తెగులు సోకినప్పుడు పైరెమ్మలు, పూత మరియు పిందెల మీద బూడిదలాంటి తెల్లటి పదార్ధం ఏర్పడుతుంది. ఈ శిలీంధ్రం పూత మరియు పిందె నుండి పోషకాలను పీల్చివేయడం వల్ల అవి రాలిపోతాయి. రాత్రి పూట చలి ఎక్కువగా ఉండి పగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది.

నివారణ :

నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేదా కెరాధియాన్‌ 1 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

మసి తెగులు / మసి మంగు :

రసం పీల్చే పురుగులైనటువంటి తేనెమంచు పురుగు, పిండినల్లి, తామర పురుగులు ఆశించి ఆకులు, పూత, పిందె మరియు కాయలమీద తేనె లాంటి తియ్యని పదార్థాన్ని విసర్జిస్తాయి. ఈ తియ్యని పదార్ధంపై శిలీంధ్రాలు పెరిగి నల్లని మసి మంగు ఏర్పడుతుంది. ఆకులపై మసి మంగు ఏర్పడడం వల్ల కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం కలిగి కాయ పరిమాణం తగ్గి రాలిపోతాయి. తెగులు సోకిన కాయలు అమ్మడానికి పనికిరాకుండా పోతాయి.

నివారణ :

మొదటిగా రసంపీల్చే పురుగులను నివారించాలి.

ఈ తరువాత 3 కిలోల గంజిపొడిని 3-4 లీ. గోరువెచ్చని నీటిలో కలిపి 100 లీ. గంజిద్రావణం తయారు చేసి తెగులు కనిపించిన భాగాలపై ఎండ బాగా ఉన్న రోజుల్లో పిచికారి చేయాలి.

పక్షికన్ను తెగులు :

ఈ తెగులు సోకినప్పుడు ఆకులు, పూ రెమ్మలు, పిందెలు మరియు కాయలపై నల్లని గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. పండ్లపై కూడా నల్లని మచ్చలు స్పష్టంగా కనిపిస్తాయి. వాతావరణంలో అధిక తేమ, అకాల వర్షం వచ్చినప్పుడు ఈ తెగులు కాయలను ఆశిస్తుంది.

నివారణ :

పచ్చిపూత దశలో కార్భండిజమ్‌ 1 గ్రా. లేదా థయోఫినేట్‌ మిథైల్‌ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

పిందె దశలో మాంకోజెబ్‌ 2.5 గ్రా. లేదా ఆంట్రకాల్‌ 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పోషకాల యాజమాన్యం :

మామిడి కాయలు నిమ్మకాయ సైజు నుండి భుజాలు ఏర్పడేంత వరకు చాలా త్వరగా పెరుగుతాయి. కావున ప్రధాన పోషకాలైన నత్రజని, పొటాష్‌ అవసరం ఎక్కువగా ఉంటుంది.

ఈ సమయంలో నీటి వసతి గల తోటల్లో చెట్టుకి 1 కిలో యూరియా, 1 కిలో మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేసి నీరు కట్టాలి.

నీటి వసతి లేని తోటల్లో 10 గ్రా. పాలిఫిడ్‌ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

బోరాన్‌ లోపం ఉన్న నేలల్లో కాయ పగుళ్ళు కనబడతాయి. దీని నివారణకు బోరాన్‌ 1.25 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

నీటి యాజమాన్యం :

మామిడి తోటల్లో కాయ ఎదిగే దశలో సరైన నీటియాజమాన్యం చేపడితే కాయ పరిమాణం పెరిగి మంచి నాణ్యత వస్తుంది.

పిందెలు బాదం కాయ సైజులో ఉన్నప్పుడు పాదుల్లో 4 అంగుళాల లోతులో నల్లపదును ఉండేలా తడులివ్వాలి.

కాయకోతకు 15-20 రోజుల ముందు నీరు పెట్టడం నిలిపి వేసినట్లయితే కాయ నాణ్యత పెరుగుతుంది.

నీటి వసతిలేని తోటల్లో కాయ సైజు పెంచడానికి పొటాషియం నైట్రేట్‌ 13-0-45 లీటరు నీటికి 10 గ్రా. చొప్పున కలిపి కాయలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు పిచికారి చేయాలి.

- డా|| యమ్‌. సునీల్‌ కుమార్‌, డా|| ఎ. రమాదేవి, డా|| వై. ప్రవీణ్‌ కుమార్‌, డా|| యమ్‌. రఘువీర్‌,డా|| జి. శివచరణ్‌, డా|| పోశాద్రి,

కృషీ విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్‌, ఫోన్‌ : 9676363948