మనిషి పండించిన ప్రాధమిక పంటల్లో చిరుధాన్యాలు ప్రధానమైనవి వర్షాభావ మరియు గిరిజన ప్రాంతాల్లో ఈధాన్యాలే ముఖ్య ఆహారం. భారత దేశంలో ఈ నాటికి కూడా జొన్నలు, సజ్జలు, రాగులు వరిగలు వాడుకలో ఉన్నాయి. మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి అంటే చిరుధాన్యాలు తప్పనిసరిగా స్వీకరించాలి. అయితే ఆధునిక జీవనానికి అలవాటుపడి మనిషి అనారోగ్య సమస్యలు తెచ్చుకొంటున్న ప్రస్తుత పరిస్ధితుల్లో మళ్ళీ చిరుధాన్యాలకు ప్రాధాన్యం పెరుగుతుంది.

ఈ నేపథ్యంలో చిరుధాన్యాలను అందరూ పండించి తినడం వీలుకాదు కనుక ఏదో ఒక రూపంలో స్వీకరించాలని తెలియచేశారు. అందులో ముఖ్యంగా ఈ కాలంలో చిరుధాన్యాలతో చేసిన బిస్కెట్లకు ఎంతో డిమాండ్‌ పెరుగుతోంది. వీటివల్ల గుండె జబ్బులు, రక్తపోటు (బి.పి), చక్కెరవ్యాధి (షుగర్‌), కొవ్వు (కొలస్ట్రాల్‌), తగ్గుముఖం పడతాయి. అందువల్ల చిరుధాన్యాలతో తయారు చేసిన బిస్కెట్లు (కొర్ర, రాగి, సజ్జ, జొన్న) మరియు వీటితో చేసిన కేకులు తినడానికి ఎంతో రుచికరంగాను, ఆరోగ్యంగాను ఉంటాయి. వీటిని ఈ కింద తెలిపిన విధంగా తయారు చేసుకోవచ్చు.

కొర్ర స్వీట్‌ బిస్కెట్లు :

కావలసిన వస్తువులు :

కొర్ర పిండి 3/4 కి. గోధుమ పిండి 1/4 కి. ఎసెన్స్‌ ఒకట్టిన్నర మూత, వంటసోడా 20 గ్రా., వనస్పతి 500 గ్రా., ఐసింగ్‌ షుగర్‌ 1/2 కి.

తయారు చేసే విధానం :

ఐసింగ్‌ షుగర్‌, వనస్పతి డాల్డా, ఎసెన్స్‌, వంటసోడా ఈ నాలుగింటిని మెత్తగా క్రీంలా కలపాలి. తరువాత బల్లపైన చపాతీలా చేసి అచ్చులతో డై కొట్టి ట్రేలలో వరుసగా పేర్చాలి . తరువాత ఓవెన్లో 1500 సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద ట్రేలో వరుసగా పేర్చాలి. రంగు వచ్చిన తరువాత తీసి బిస్కెట్లు చల్లార్చి ప్యాక్‌ చేయాలి.

కొర్ర సాల్ట్‌ బిస్కెట్లు :

కావలసిన వస్తువులు :

కొర్ర పిండి -3/4 కి., గోధుమ పిండి - 1/4 కి., ఐసింగ్‌ షుగర్‌ -200 కి., అమ్మోనియం సాల్ట్‌ -20 గ్రా., ఉప్పు-20 గ్రా., వనస్పతి 1/2 కి. వాము తగినంత మరియు నీళ్లు 200 మి.లీ.

తయారు చేసే విధానం :

వనస్పతి, ఐసింగ్‌ షుగర్‌, ఉప్పు, అమ్మోనియం సాల్ట్‌, నీళ్లు వేసి బాగా మెత్తగా కలిపిన తరువాత గోధుమపిండి మరియు కొర్ర పిండి వేసి ముద్దలా కలపాలి. కలిపిన తరువాత కర్రతో చపాతీలా వత్తుతూ కావాలంటే పైన కాస్త వాము వేయడంతో రుచి పెరుగుతుంది అచ్చులతో పిండిని డై కొట్టి ట్రేలలో వరుసగా పేర్చాలి ఓవెన్లో 1500 సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద ట్రేలను 10 నిముషాలు ఉంచాలి. రంగు వచ్చిన తరువాత తీసి బిస్కెట్లు చల్లార్చి ప్యాక్‌ చేయాలి. ఈ విధంగా కొర్ర సాల్ట్‌ బిస్కెట్లు తయారు చేసుకోవాలి .

రాగి స్వీట్‌ బిస్కెట్లు :

కావలసిన వస్తువులు :

ఐసింగ్‌ షుగర్‌ 400 గ్రా., వనస్పతి 400 గ్రా., రాగి పిండి 700 గ్రా., ఎసెన్స్‌ ఒక మూత, వంటసోడా 15 గ్రా. , మరియు గోధుమ పిండి 200 గ్రా.

తయారు చేసే విధానం :

ఐసింగ్‌ షుగర్‌, డాల్డా, ఎసెన్స్‌, వంటసోడాని వేసి మెత్తగా కలపాలి. క్రీంలా తయారు చేసుకున్న తరువాత గోధుమ పిండి మరియు రాగి పిండిని వేసి ముద్దలా కలపాలి. తరువాత 1/8 అంగుళం మందంగా అప్పడాల కర్రతో రుద్ది అచ్చులతో కాని బిస్కెట్‌ కట్టరుతో కాని కోసి 1500 సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద ట్రేలను 10 నిముషాలు ఉంచి బేక్‌ చేయాలి. తరువాత ట్రేలను బయటకు తీసి చల్లార్చిన తరువాత బిస్కెట్లను ప్యాక్‌ చేయాలి.

రాగి సాల్ట్‌ బిస్కెట్లు :

కావలసిన వస్తువులు :

ఐసింగ్‌ షుగర్‌ 200 గ్రా., వనస్పతి 400 గ్రా., రాగిపిండి 700 గ్రా., వంటసోడా 5 గ్రా., గోధుమ పిండి 200 గ్రా., అమ్మోనియం సాల్ట్‌ 20 గ్రా., వెనిలా పౌడర్‌ 5 గ్రా., ఉప్పు 200 గ్రా. వాము తగినంత, నీళ్లు 200 మీ.లీ.

తయారు చేసే విధానం :

ఐసింగ్‌ షుగర్‌, వనస్పతి, ఉప్పు, అమ్మోనియం సాల్ట్‌ మరియు నీళ్లు వేసి బాగా మెత్తగా కలపాలి. కలిపిన తరువాత గోధుమ పిండి, రాగి పిండి, వెనిలా పౌడర్‌ వేసి చపాతి పిండిలా చేసి కర్రతో చపాతీలా చేస్తూ మధ్యలో కాస్త పిండిని చల్లుకుంటూ, తరువాత అచ్చులతో బిస్కెట్లను తీసి ట్రేలలో పెట్టి 10 నిముషాలు ఒవేన్‌లో బేక్‌ చేసిన తరువాత రాగి సాల్ట్‌ బిస్కెట్లు తయారవుతాయి.

జొన్న స్వీట్‌ బిస్కెట్లు :

కావలిసిన వస్తువులు :

ఐసింగ్‌ షుగర్‌ 400 గ్రా., వనస్పతి 400 గ్రా., రాగి పిండి-700 గ్రా ., ఎసెన్స్‌ ఒక మూత, వంట సోడా 15 గ్రా., మరియు గోధుమ పిండి 200 గ్రా.

తయారు చేసే విధానం :

ఐసింగ్‌ షుగర్‌, డాల్డా, ఎసెన్స్‌, వంట సోడాని వేసి అన్నింటిని మెత్తగా క్రీంలా కలపాలి. తరువాత గోధుమ పిండి మరియు జొన్న పిండిని వేసి ముద్దలా చపాతీ పిండిలా కలపాలి. తరువాత చపాతీలలా రుద్ది అచ్చులతో కాని బిస్కేట్‌ కట్టర్తో కానీ 1500 సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద ట్రేలను బయటకు తీసి చల్లారిన తరువాత బిస్కెట్లను ప్యాక్‌ చేయాలి .

జొన్న సాల్ట్‌ బిస్కెట్లు :

కావలసిన వస్తువులు :

ఐసింగ్‌ షుగర్‌ 200 గ్రా., వనస్పతి 400 గ్రా., జొన్న పిండి 700 గ్రా., వంట సోడా 5 గ్రా., గోధుమ పిండి 200 గ్రా., అమ్మోనియం సాల్ట్‌ 20గ్రా., వెన్నెల పొడి 5 గ్రా., ఉప్పు 200 గ్రా., వాము తగినంత మరియు నీళ్లు 200 మీ.లీ.

తయారు చేసే విధానం:

ఐసింగ్‌ షుగర్‌, వనస్పతి, ఉప్పు, అమ్మోనియం సాల్ట్‌, వెనీలా పౌడర్‌ మరియు నీళ్లు వేసి బాగా మెత్తగా కలపాలి. మెత్తగా క్రీంలా కలిపిన పిండికి గోధుమ పిండి, జొన్న పిండిని వేసి అప్పడాల కర్రతో చపాతీల్లా రుద్ది అచ్చులతో డై కొట్టి బిస్కేట్లను ట్రేలలో 10 నిముషాలు ఒవేన్‌లో బేక్‌ చేయాలి. వాము కావలనుకునే వారు తగినంత వాము చల్లుకుంటే రుచికరమైన జొన్న సాల్ట్‌ బిస్కేట్లు తయారవుతాయి.

మల్టీ గ్రైన్‌ బిస్కెట్లు (స్వీట్‌ మరియు సాల్ట్‌) :

కావలసిన వస్తువులు :

జొన్న పిండి 200 గ్రా., రాగి పిండి 200గ్రా., సజ్జ పిండి 200గ్రా., కొర్ర పిండి 200 గ్రా., గోధుమ పిండి 200 గ్రా., ఐసింగ్‌ షుగర్‌ 500 గ్రా, (స్వీట్‌ బిస్కేట్లకు), ఎసెన్స్‌ 11/2 మూత, వంట సోడా 20 గ్రా., వనస్పతి 500 గ్రా., సాల్ట్‌ బిస్కెట్లకు అమ్మోనియం సాల్ట్‌ 20 గ్రా., ఉప్పు 20 గ్రా., వాము తగినంత కలుపుకోవాలి.

తయారు చేసే విధానం :

ముందుగా ఐసింగ్‌ షుగర్‌, వనస్పతి, ఎసెన్స్‌, వంట సోడాని బాగా మెత్తగా క్రీంలా చేయాలి. క్రీంలా చేసిన తరువాత గోధుమ పిండి, కొర్ర పిండి, సజ్జ పిండి, జొన్న పిండి మరియు రాగి పిండిని బాగా కలిపి ముద్దలా (చపాతీ ముద్దలా) చేసుకోవాలి . తరువాత బల్లపై చపాతీలు చేసి అచ్చులతో తీసి బిస్కెట్లను ట్రేలలో పెట్టి 10 నిముషాలు ఉంచినట్లయితే రుచికరమైన మల్టీ గ్రైన్‌ బిస్కెట్లు తయారవుతాయి.

ఇందులో సాల్ట్‌ బిస్కెట్ల కొరకు ఉప్పు, అమ్మోనియం సాల్ట్‌ వేసుకొని కొంచం ఐసింగ్‌ షుగర్‌ను తగ్గించి మిగిలిన పిండి అంతా కలుపుకొని సాల్ట్‌ బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు (స్వీట్‌ బిస్కెట్లలాగే).

కేక్‌ల తయారీ :

జొన్న కేక్‌ :

కావలిసిన పదార్థాలు :

జొన్న పిండి 300 గ్రా., పంచదార 350 గ్రా., కేక్‌ జెల్‌ 20 గ్రా., గుడ్లు 10 మరియు నూనె 100 గ్రా.

తయారీ విధానం :

పంచదార, కేక్‌ జెల్‌ గిన్నెలో వేసి గుడ్లు ఒక్కొక్కటిగా కలిపిన తరువాత చివరగా జొన్న పిండి, నూనె వేసి బాగా కలిపి మనకు కావలిసిన రీతిలో ట్రేలలో పోసి ఒవేన్‌లో అరగంట పెట్టాలి. ఆ తరువాత తీసి జొన్న కేక్‌ ను కట్‌ చేసి తినేయడమే.

సజ్జ కేక్‌ :

కావలిసిన పదార్థాలు :

సజ్జ పిండి 300 గ్రా., పంచదార 350 గ్రా., కేక్‌ జెల్‌ 20 గ్రా., గుడ్లు 10 మరియు నూనె 100 గ్రా.

తయారీ విధానం :

పంచదార, కేక్‌ జెల్‌ గిన్నెలో వేసి గుడ్లు ఒక్కొక్కటిగా కలిపిన తరువాత చివరిగా సజ్జ పిండి, నూనె వేసి బాగా కలిపి మనకు కావలసిన రీతిలో ట్రేలలో వేసి ఓవెన్లో అరగంట పెట్టాలి. తరువాత సజ్జ కేక్‌ తయారైనట్టే.

కొర్ర కేక్‌ :

కావలిసిన పదార్థాలు :

కొర్ర పిండి 300 గ్రా., పంచదార 350 గ్రా., కేక్‌ జెల్‌ 20 గ్రా., గుడ్లు 10 మరియు నూనె 100 గ్రా.

తయారీ విధానం :

పంచదార, కేక్‌ జెల్‌ గిన్నెలో వేసి గుడ్లు ఒక్కొక్కటిగా కలిపిన తరువాత చివరిగా కొర్ర పిండి, నూనె వేసి బాగా కలిపి మనకు కావాలసిన రీతిలో ట్రేలలో వేసి ఓవెన్‌లో అరగంట పెట్టాలి. తరువాత కొర్ర కేక్‌ తయారైనట్టే.

రాగి కేక్‌ :

కావాల్సిన పదార్థాలు :

రాగి పిండి 300 గ్రా., పంచదార 350 గ్రా., కేక్‌ జెల్‌ 20 గ్రా., గుడ్లు 10 మరియు నూనె 100 గ్రా .

తయారీ విధానం :

పంచదార, కేక్‌ జెల్‌ గిన్నెలో వేసి గుడ్లు ఒక్కొక్కటిగా కలిపిన తరువాత చివరగా రాగి పిండి, నూనె వేసి బాగా కలిపి మనకు కావాలసిన రీతిలో ట్రేలలో వేసి ఒవేన్‌లో అరగంట పెట్టాలి తరువాత రాగి కేక్‌ తయారైనట్టే .

మల్టీ గ్రెయిన్‌ కేక్‌ :

కావాల్సిన పదార్థాలు :

సజ్జ,కొర్ర, జొన్న, రాగులు, గోధుమ పిండి 60 గ్రా., పంచదార 350 గ్రా., కేక్‌ జెల్‌ 30 గ్రా., గుడ్లు 10 మరియు నూనె 100 గ్రా.

తయారీ విధానం :

పంచదార కేక్‌ జెల్‌ గిన్నెలో వేసి గుడ్లు ఒక్కొక్కటిగా కలిపిన తరువాత చివరగా రాగి పిండి , కొర్ర , జొన్న, గోధుమ పిండి మరియు నూనె వేసి బాగా కలిపి మనకు కావాల్సిన రీతిలో ట్రేలలో వేసి ఓవెన్లో అరగంట పెట్టాలి . తరువాత మల్టీ గ్రెయిన్‌ కేక్‌ తయారైనట్టే .

వెజ్‌ పఫ్‌ :

కావాల్సిన పదార్థాలు :

మైదా -1 కిలో, ఉప్పు 15 గ్రా., నీరు తగినంత, వనస్పతి 15 గ్రా.

కూరగాయలు (కర్రీ కోసం) :

బంగాళాదుంప 1 కిలో, ఉలిపాయ 1/2 కిలో, పచ్చి మిర్చి 150 గ్రా., క్యారెట్‌ 1/4 కిలో, టమోటా 1/4 కిలో, కొత్తిమీర అరకట్ట, పసుపు 1 స్పూన్‌, ఉప్పు తగినంత, మసాల పౌడర్‌ 2 స్పూన్లు, నూనె 150 మి.లీ., అల్లం 50 గ్రా.

తయారు చేసే విధానం :

మైదా పిండి ,ఉప్పు,నీరు,వేసి మెత్తగా కలిపిన తరువాత ఆముద్దను ఒక కవర్లో పెట్టి పక్కన కొంతసేపు (ఒక గంట) పెట్టవలెను. తరువాత దాన్ని చపాతీలా చేసి 250 గ్రా. డాల్డాను రాసి నాలుగు మడతలుగా పెట్టి మరలా చపాతీలా చేసి మిగిలిన 250 గ్రా. డాల్డాను కూడా రాయాలి. మరల నాలుగు మడతలుగా పెట్టి ఒక గంట సమయం తరువాత కర్రీ కొరకు బంగాళదుంపలను ఉడకపెట్టుకుని, చల్లారాక తొక్కలు వలిచి కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమోటా, అల్లం పేస్ట్‌ అన్ని కలిపి నూనెలో వేయించాలి. చివరిగా బంగాళాదుంప మరియు పోపును కలిపి మసాలా పొడి వేసి ఉప్పు తగినంత వేసి దించేస్తే కర్రీ తయారైనట్టే .

తయారు చేసుకున్న పిండిని చపాతీలా చేసి నాలుగు పలుకలుగా కోసి అందులో కర్రీని పెట్టి మడతపెట్టి ట్రేలలో పెట్టవలెను. ఆ తరువాత అరగంట ఒవేన్‌లో పెట్టి తీసి వేసాక కరకరలాడే వెజ్‌ పఫ్‌ తయారవుతుంది.

ఎగ్‌ పఫ్‌ :

కావలసిన పదార్థాలు :

మైదా 1 కిలో, ఉప్పు 15 గ్రా., నీరు తగినంత, వనస్పతి 500 గ్రా., కూరగాయలు కర్రీ కోసం (వెజ్‌ పఫ్‌కి వాడే పదార్థాలే) మరియు గుడ్లు 10

తయారు చేసే విధానం :

మైదా పిండి, ఉప్పు మరియు నీరు వేసి మెత్తగా కలిపిన తరువాత ఆముద్దను ఒక కవర్లో పెట్టి ఒక్క గంట సేపు పక్కన పెట్టాలి. తరువాత దాన్ని చపాతీలా చేసి 250 గ్రా. డాల్డాను రాసి నాలుగు మడతలుగా పెట్టి మరల చపాతీలా చేసి మిగిలిన 250 గ్రా. డాల్డాను కూడా రాయాలి. మరలా నాలుగు మడతలుగా చేసి ఒక గంట సమయం తరువాత కర్రీ కొరకు బంగాళదుంపలను ఉడక పెట్టుకొని చల్లారాక తొక్కలు వలిచి పక్కన పెట్టుకోవాలి. తరువాత పచ్చి మిర్చి, ఉల్లిపాయ, టమోటా, అల్లం పేస్ట్‌ అన్ని కలిపి నూనెలో వేయించాలి. చివరగా బంగాళదుంప మరియు పోపును కలిపి మాసాల పొడి వేసి ఉప్పు తగినంత వేసి దించేస్తే కర్రీ తయారైనట్టే. తరువాత గుడ్లు ఒక్క 10 ఉడకపెట్టుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.

తయారు చేసుకున్న పిండిని చపాతీలా చేసి నాలుగు పలుకులుగా కోసి అందులో కర్రీ పెట్టి అందులో సగం కోసిన గుడ్డు పెట్టి మడత పెట్టి ట్రేలలో పెట్టాలి. అరగంట ఓవేన్లో ఉంచి తీసేస్తే ఎగ్‌ పఫ్‌ తయారైనట్టే.

దిల్‌ పసంద్‌ :

కావాల్సిన పదార్థాలు :

మైదా 1250 గ్రా., వనస్పతి గోల్డెన్‌ స్ప్రెడ్‌ 1/2 కిలో., ఉప్పు 15 గ్రా., నీళ్లు 1 లీటరు, టూటీఫ్రూటీ 1 కిలో, కొబ్బరి తురుము 1 కిలో, యాలకుల పొడి 20 గ్రా., బ్రెడ్‌ ఒక ప్యాకెట్‌ మరియు పంచదార 1 కిలో

తయారు చేసే విధానం :

మైదా పిండి, ఉప్పు, నీరు వేసి మెత్తగా కలిపిన తరువాత ఆ ముద్దను ఒక్క కవర్లో పెట్టి పక్కన కొంత సమయం అంటే ఒక్క గంట సమయం ఉంచాలి. తరువాత దాన్ని చపాతీలా చేసి 250 గ్రా. వనస్పతిని రాసి నాలుగు మడతలుగా పెట్టి మరల చపాతీలా చేసి మిగిలిన 250 గ్రా. డాల్డాను కూడా రాయాలి

మరలా నాలుగు మడతలుగా పెట్టి ఒక్క గంట సమయం ఉంచాలి. ఒక గంట సమయం తరువాత టూటీఫ్రూటి, కొబ్బరి తురుము, యాలకుల పొడి, బ్రెడ ్‌(బ్రెడ్‌ ను పొడి చేయాలి)మరియు పంచదారను బాగా కలుపుకొని చపాతీలా చేసుకున్న దాని పైన ఈ పదార్థాలను పరిచి ఒక్క అరగంట సేపు ఒవేన్‌ లో ఉంచి తీసి వేయాలి. తరువాత రుచికరమైన దిల్‌ పసందులు తయారైనట్టే.

ఎన్‌. శ్రీ విద్య రాణి, డా|| ఏ. శ్రీనివాస్‌, పి. రాజశేఖర్‌,

డా.ఎస్‌. ఆదర్శ, కె.సి. భానుమూర్తి,

కషీ విజ్ఞాన కేంద్రం, పందిరిమామిడి, తూర్పు గోదావరి జిల్లా, డా.వై.ఎస్‌.ఆర్‌.ఉద్యాన విశ్వవిద్యాలయం,

ఫోన్‌ : 9398982828, 9494728324