కొబ్బరి తోటలు అధికంగా పెంచే దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, కర్నాటకలో కనిపించే ముఖ్యమైన పురుగు కొమ్ము పురుగు. కొమ్ము పురుగు అన్ని వయసుల కొబ్బరి చెట్లను ఆశిస్తుంది. కొబ్బరి చెట్లతో పాటు తాటి, పామాయిల్‌, ఈత మొదలగు చెట్లను ఆశించి నష్ట చేకూర్చును.

లక్షణాలు :

విప్పారిన ముదురు ఆకులపై నిహకు ఆకారంలో కత్తిరించినట్లు ఉంటుంది. కొబ్బరి చెట్టు మొవ్వులో పురుగు తొలచిన రంధ్రం మరియు పురుగు నమిలిన పిప్పి ఉండును.

జీవిత చరిత్ర :

తెల్లని అండాకారం గల గుడ్లను 2-6 అంగుళాల లోతులో ఒక మాదిరి తేమగల ప్రాంతంలో విడివిడిగా పెట్టి అక్కడ పదార్ధంలో కప్పుతుంది. పగిలే సమయానికి గుడ్లు ఉబ్బి, పసుపు, గుధుమ రంగులోకి మారును. 7-20 రోజుల్లో గుడ్లు పగిలి లార్వాలుగా మారును. ఒక తల్లి పురుగు దాదాపు 140 గుడ్లు 6-7 దఫాల్లో తోటలో కుళ్ళుతున్న సేంద్రియ పదార్థం చనిపోయి పడిపోయిన కొబ్బరి చెట్లు, మొదళ్ళు మొదలగు చోట్ల గుడ్లు పెడుతుంది. గుడ్ల నుండి పగిలిన లద్దె పురుగు తెల్లగా ధృడమైన భాగాలు కలిగి ఉంటుంది. సేంద్రియ పదార్థాన్ని విపరీతంగా తింటూ 99-180 రోజుల్లో కోశస్థ దశకు చేరుతుంది. కోశస్థ దశ గడపడానికి నున్నని గది ఏర్పాటు చేసుకొని ఎర్రని గోధుమ రంగులోకి లార్వా మారుతుంది. 17-62 రోజుల్లో కోశస్థ దశ నుండి తల్లి పురుగు వస్తుంది. తల్లి పురుగు కొబ్బరి చెట్ల మొవ్వులు చనిపోయిన కొబ్బరి చెట్లు పశువుల ఎరువుల కుప్పలపై తిరుగుతూ దాదాపు 200 రోజుల కంటే ఎక్కువ రోజులు బ్రతుకుతుంది.

నష్టం :

కొమ్ము పురుగు కొబ్బరి లేత మొవ్వు భాగాన్ని, పొత్తులను తొలుచుడం వల్ల విప్పారని లేత ఆకులు, పొత్తులు నష్టపోయి కొబ్బరి దిగుబడులు తగ్గుతాయి.

చిన్న మొక్కల్లో ఈ పురుగు ఆశించి మొవ్వు దెబ్బతిని మొక్క చనిపోయే ప్రమాదముంది. అంతేకాక కొమ్ము పురుగు ఆశించిన మొక్కల మొవ్వు వంకర తిరిగి ఉంటాయి.

ఈ పురుగు ప్రత్యక్షంగా కలుగ చేసే నష్టమేకాక ఈ పురుగు ఆశించిన చెట్లు మొవ్వుకుళ్ళు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కొమ్ము పురుగు నష్టపరచిన మొవ్వు భాగం నుండి వచ్చే పులిసిన వాసనకు కొబ్బరి కాండం తొలిచే ఎర్రముక్కు పురుగు ఆశించి నష్టం కలుగచేసే ప్రమాదం ఉంది.

సమగ్ర యాజమాన్యం :

తోటలో ఉన్న పడిపోయిన చెట్లను తొలగించి, వాటిని తగిన విధంగా వినియోగించుకోవాలి లేదా నాశనం చేయాలి.

పడిపోయిన చెట్ల మొదళ్ళు (భూమిలో ఉన్న భాగం) తవ్వించి తగలబెట్టించాలి.

తోటలో పశువుల ఎరువు కుప్పలు ఉంచరాదు. దగ్గరలోని పశువుల ఎరువు కుప్పలను 3 నెలలకొకసారి తిరగేస్తూ వివిధ దశల్లో ఉన్న కొమ్మ పురుగులను తీసి నాశనం చేయాలి.

బాక్యులో వైరస్‌ తెగులు సోకించిన కొమ్ము పురుగును ఒక హెక్టారుకు 10 లేక 15 చొప్పున ప్రతి మూడు నెలలకొకసారి తోటలో వదలాలి.

3 నెలలకొకసారి కొబ్బరి చెట్ల మొవ్వుల్లో ఆకు వలయాల్లో వేపపిండి లేక 100 గ్రా. వేప గింజలపొడి 150 గ్రా. ఇసుకలో కలిపి చల్లాలి.

నాలుగు నెలలకొకసారి కొబ్బరి చెట్ల మొవ్వుల్లో ఆకు వలయాల్లో 2-3 నాఫ్తలిన్‌ గోళీలు ప్రతి చెట్టుకు పెట్టవలెను.

లేత మొక్కలో మొవ్వులోని మరియు ప్రక్కన ఉన్న ఆకు వలయాల్లో 4 నెలలకొకసారి 6 గ్రా. ఫెర్టిరా గుళికలను కన్నాలు గల 2 పెన్సిల్‌ సైజు వ్యాసం గల పాలిథీన్‌ సాచెట్‌లో నింపి పెట్టాలి.

మెటారైజియం అనే శిలీంద్ర ద్రావణాన్ని పెంటకుప్పలపై చల్లి కొమ్ముపురుగు యొక్క పిల్ల పురుగు దశను సమర్థవంతంగా నివారించవచ్చు. ఒక లీటరు నీటికి 5 గ్రా. మెటారైజియమ్‌ పొడిని కలిపి పురుగు ఉత్పత్తి కేంద్రాలైన పశువుల పెంటపైన చల్లితే ఈ శిలీంద్రం కలుగ చేసే తెగులు పురుగుల్లో వ్యాప్తి చెందుతుంది. సుమారుగా ఒక టన్ను పెంట కుప్పకు నాలుగు కిలోల మెటారైజియమ్‌ శిలీంద్రపు పొడి అవసరం అవుతుంది.

కొమ్ము పురుగు ఆకర్షించు రైనోల్యూర్‌ అనే ఫిరమోన్‌ ఎరలను బక్కెట్లో పెట్టి 5 ఎకరాల తోటకు ఒకటి చొప్పున పెట్టి ఆకర్షితమైన తల్లి పురుగులను చంపాలి.

కె. చక్కని ప్రియ, రీసెర్చె అసోసియేట్‌ (ఎంటమాలజీ), డా|| ఎన్‌.బి.వి చలపతి రావు, ప్రిన్సిపల్‌ సైంటిస్టు, (ఎంటమాలజీ),

డి. రక్షిత్‌ రోషన్‌, రీసెర్చ్‌ అసోసియేట్‌ (ఎంటమాలజీ), డా|| జి. రామానందం, ప్రిన్సిపల్‌ సైంటిస్టు (హార్ట్‌ & హెడ్‌),

ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట, తూర్పుగోదావరి, ఫోన్‌ : 9441474967, 7382633653