పంట ఏదైనా విత్తనాన్ని శుద్ధి చేసి వాడటం వల్ల నాటిన తరువాత 30 రోజుల వరకు చీడపీడల నుండి కానీ, తెగుళ్ళ నుండి కానీ పంటకు రక్షణ లభిస్తుంది. అయితే ఇప్పుడు చాలా వరకు విత్తనాలను శుద్ధిచేసి అమ్మడం జరుగుతుంది. ఒకవేళ విత్తనం శుద్ధి చేసినదే అయినా రైతులందరూ జాగ్రత్త వహించి విధిగా విత్తనశుద్ధి చేసుకోవాలి. రెండవ సారి శుద్ధి చెయడం వల్ల పంటకు ఎటువంటి నష్టం కలుగకపోగా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఎక్కువ. ఈ నేపధ్యంలో వివిధ పంటల్లో పాటించవలసిన విత్తనశుద్ధి పద్ధతులగురించి, వాటికి ఉపయోగించవలసిన రసాయనాల గురించి తెలుసుకుందాం.

వరి :

కిలో విత్తనానికి 3 గ్రా. కార్బండిజం 50 శాతం మందును కలిపి 24 గంటల తరువాత నారుమడిలో చల్లుకోవాలి. దుంప నారుమళ్ళకైతే లీటరు నీటికి 1 గ్రా. కార్బండిజం 50 శాతం మందును కలిపి, ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండెకట్టి మొలకెత్తిన విత్తనాన్ని దుంప నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనాలు నానబెట్టడానికి లీటరు మందు నీరు సరిపోతుంది. కార్బండిజం 25 శాతం మరియు మాంకోజెబ్‌ 50 శాతం మిశ్రమ శిలీంద్ర నాశినిని వాడితే 2 గ్రా. కిలో విత్తనానికి, లీటరు నీటికి వంతున వాడాలి.

ద్రవరూప జీవన ఎరువులు వాడే పద్ధతి :

అజోస్పైరిల్లమ్‌ 250 మి.లీ.ను 5-10 లీటర్ల నీటిలో కలిపి నారు నాటే ముందు అరగంట వరకు నారును ద్రావణంలో ముంచి నాటుకోవాలి.

జొన్న :

కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్‌ లేదా కాప్టాన్‌ మందును కలిపి విత్తనశుద్ధి చేయాలి. మొవ్వు ఈగ నివారణకు ఒక కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిథాక్సమ్‌ మందును కలిపి విత్తనశుద్ధి చేయాలి.

సజ్జ :

2 శాతం (20 గ్రా./ లీటరు) ఉప్పునీటి ద్రావణంలో విత్తనాలను 10 నిమిషాలు ఉంచడం ద్వారా ఎర్గాట్‌ శిలీంద్ర అవశేషాలను తేలేటట్టు చేసి తొలగించవచ్చు. ఆరిన కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్‌ను కలిపి విత్తన శుద్ధి చేయాలి.

రాగి :

కిలో విత్తనానికి 2 గ్రా. కార్బెండజం లేదా 3 గ్రా. మాంకోజెబ్‌ కలిపి విత్తనశుద్ధి చేయాలి.

మొక్కజొన్న :

కిలో విత్తనానికి 3 గ్రా. మాంకోజెబ్‌ లేదా థైరమ్‌ లేదా కాప్టాన్‌తో విత్తనశుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ళ బారినుండి కాపాడుకోవచ్చు.

కంది :

ద్రవరూప రైజోబియం కల్చర్‌ను 200 మి.లీ విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడులు పొందవచ్చు.

వేరుశనగ :

కిలో విత్తనానికి 1 గ్రా. టెబ్యుకొనజోల్‌ 2 డి. యెస్‌. లేదా 3 గ్రా. మాంకోజెబ్‌ మరియు ట్రైకోడెర్మా విరిడి పొడి మందును పట్టించాలి. కాండం కుళ్ళు వైరస్‌ తెగులు (పి యెస్‌ ఎన్‌ డి) మరియు వేరు పురుగు ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 1 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్‌ 600 ఎఫ్‌.ఎస్‌. 6 మి.లీ. నీళ్ళ మిశ్రమం మందుతో విత్తనశుద్ధి చేయాలి. వరి మాగాణుల్లో లేక కొత్తగా వేరుశనగ సాగు చేసేటప్పుడు విత్తనానికి రైజోబియం కల్చరుని పట్టించాలి. మొదలు కుళ్ళు, వేరు కుళ్ళు, కాండం కుళ్ళు తెగులు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడిని పట్టించాలి. విత్తనాన్ని మొదట క్రిమిసంహారక మందుతో శుద్ది చేసి, నీడలో ఆరబెట్టిన తరువాత శిలీంద్రనాశనితో శుద్ధి చేయాలి. అవసరమైతే రైజోబియం కల్చర్‌ను కూడా విత్తనాలకు పట్టించవచ్చు.

నువ్వులు :

కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్‌ లేదా కాప్టాన్‌ లేదా మాంకోజెబ్‌తో విత్తనశుద్ధి చేయడం వల్ల నేల నుంచి సంక్రమించే తెగుళ్లను 21 రోజుల వరకు నివారించవచ్చు.

పొద్దు తిరుగుడు :

ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు క్వింటాల్‌ (ఇప్రోడియోన్‌ 25 శాతం + కార్బండిజం 25 శాతం) లేదా సాఫ్‌ (కార్బండిజం 12 శాతం + మాంకోజెబ్‌ 63 శాతం) అనే మందులను 2 గ్రాములు కిలో విత్తనానికి వాడి విత్తనశుద్ది చేయాలి. నెక్రోసిస్‌ వైరస్‌ అధికంగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి థయోమిథాగ్జమ్‌ ( క్రూయిజర్‌ ) 4 గ్రా. మందును లేదా 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్‌ అనే మందుతో విత్తనశుద్ధి చేయాలి.

చెఱకు :

మూడు కళ్ళ ముచ్చెలను 300 లీటర్ల నీటికి 150 గ్రా. కార్బండిజం మరియు 600 మి.లీ. మలాథియాన్‌ కలిపిన ద్రావణంలో 15 నిమిషాలు ఉంచి నాటినట్లైతే పొలుసు పురుగు, అనాస కుళ్ళు తెగులును అరికట్టవచ్చు. లేవడి తోటలను పెంచేందుకు ముదురు తోటల నుంచి సేకరించిన గడలను (మొదలు, చివరి 1/3 భాగాలను తీసివేసి ) మూడు కళ్ళ ముచ్చెలుగా చేసి, వేడి నీటిలో (5200 సె. వద్ద 30 నిమిషాలు) లేదా తేమతో మిళితమైన వేడి గాలిలో (5400 సె. వద్ద 4 గంటలు) విత్తనశుద్ధి చేయాలి. వేడి నీటి విత్తనశుద్ధి ద్వారా కాటుక, గడ్డిదుబ్బు, ఆకుమాడు తెగుళ్లను అరికట్టవచ్చు.

పత్తి :

పత్తిలో రసం పీల్చే పురుగుల తాకిడి ఎక్కువ. బి.టి. పత్తిని పండిస్తున్న రైతులు కూడా పిండి నల్లి, నులి పురుగులు, పేనుబంక పురుగులతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కాబట్టి కిలో విత్తనానికి తగినంత జిగురు కలిపి 9 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్‌ 600 ఎఫ్‌ యెస్‌ లేక 5 గ్రా. థయోమిధాక్సాం 70 డబ్ల్యూ యస్‌ మరియు 2 గ్రా. కార్బండిజం లేదా 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడితో విత్తనశుద్ది చేసి విత్తితే పంటను 30 రోజుల వరకు పురుగులు మరియు తెగుళ్ళ నుండి రక్షించుకోవచ్చు.

మిరప :

కిలో మిరప విత్తనానికి మొదటగా వైరస్‌ తెగుళ్ళ నివారణకుగాను 150 గ్రా. ట్రైసోడియం ఆర్థోఫాస్ఫెట్‌ను, తరువాత రసం పీల్చే పురుగుల నివారణకుగాను 8 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్‌ను, చివరగా ఇతర తెగుళ్ళ నివారణకుగాను 3 గ్రా. కాప్టాన్‌ లేదా 3 గ్రా. మాంకోజెబ్‌ కలిపి విత్తనశుద్ధి చేయాలి.

ద్రవరూప జీవన ఎరువులు వాడే పద్దతి :

అజటోబ్యాక్టర్‌ 200 మి.లీ ను 5-10 లీటర్ల నీటిలో కలిపి నారు నాటే ముందు అరగంట వరకు నారును ద్రావణంలో ముంచి నాటుకోవాలి.

ఉల్లి :

కిలో విత్తనానికి 8 గ్రా. ట్రైకోడెర్మా విరిడి లేదా 3 గ్రా. థైరమ్‌ కలిపి విత్తనశుద్ధి చేయాలి.

కొర్ర :

కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్‌ లేదా కాప్టాన్‌ లేదా మెటలాక్సిల్‌తో విత్తనశుద్ధి చేయడం వల్ల నేల నుంచి సంక్రమించే తెగుళ్లను 21 రోజుల వరకు నివారించవచ్చు.

ఆముదం :

కిలో విత్తనానికి 3 గ్రాముల థైరమ్‌ లేదా కాప్టాన్‌ పొడి మందును కలిపి విత్తనశుద్ధి చేయాలి. ఇలా చేయడం వల్ల మొలక కుళ్ళు తెగులు (ఫైటోఫ్తోరా బ్లైట్‌), ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు మరియు కొంత వరకు వడలు తెగులును అరికట్టవచ్చు. వడలు తెగులు ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 3 గ్రా. కార్బండిజం లేదా 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడితో విత్తనశుద్ధి చేయాలి.

మినుము :

కిలో విత్తనానికి 2.5 గ్రా. థైరమ్‌ లేదా కాప్టాన్‌ లేదా మాంకోజెబ్‌ లేదా కార్బండిజం వంటి తెగుళ్ళ మందులతో మరియు 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్‌ లేక 5 గ్రా. థయోమిథాక్సమ్‌ను కలిపి విత్తనశుద్ధి చేసినట్లైతే సుమారు 15-20 రోజుల వరకు తెగుళ్లు మరియు రసం పీల్చు పురుగుల బారి నుండి రక్షించుకోవచ్చు. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడు, రైజోబియం కల్చర్‌ను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందవచ్చు.

బి. షైనీ ప్రియాంక, రీసర్చ్‌ అసోసియేట్‌ (సస్య రక్షణ), ఎస్‌. నజ్మ, రీసర్చ్‌ అసోసియేట్‌ (సస్య ఉత్పత్తి), డా|| జి. ప్రసాద్‌ బాబు, సమన్వయ కర్త,

కె. రాఘవేంద్ర, ఎస్‌.ఎమ్‌.ఎస్‌, విస్తరణ, ఏరువాక కేంద్రం, బనవాసి,