ఆధునిక వ్యవసాయ రంగంలో ఇంటర్నెట్‌ అఫ్‌ థింగ్స్‌ వివిధ రకాలుగా ఉపయోగపడుతున్నాయి. చీడలు మరియు వ్యాధుల పర్యవేక్షణ, ఆధునిక నీటి పారుదల విధానాలు, రిమోట్‌ సెన్సింగ్‌ మరియు వాతావరణ సూచనలు వంటివి అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల సెన్సార్లు కూడిన స్మార్ట్‌ ఫోన్‌ ప్రస్తుతం విభిన్న వ్యవసాయ విభాగాల్లో ప్రాచుర్యంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పంటల్ని ఆశించే చీడలు మరియు వ్యాధుల కారణంగా వార్షిక దిగుబడిలో 25 శాతం వరకు నష్టం జరుగుతుంది. దీన్ని నివారించేందుకు తెగుళ్లు మరియు చీడ పరుగుల పర్యవేక్షణ చాలా ఆవశ్యకం.

పంట దిగుబడులను పెంచటానికి మరియు తెగుళ్ళ నుండి రక్షించడానికి ప్రోగ్రెసివ్‌ ఎన్విరాన్మెంటల్‌ & అగ్రికల్చరల్‌ టెక్నాలజీ అనే జర్మనీ అగ్రి కంపెనీ, ప్లాంటిక్స్‌ అను మొబైల్‌ అప్లికేషన్‌ రూపొందించారు. స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా ప్లాంటిక్స్‌ అప్లికేషన్‌ సహాయంతో తెగుళ్లు సోకిన మొక్కని ఫోటో తీసి అప్లోడ్‌ చేసిన వెంటనే ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారా ఆ మొక్కకి సోకిన తెగుళ్ల వివరాలు మరియు నివారణ చర్యలతో కూడిన సమస్త సమాచారం అందిస్తుంది.

ఇక్రిశాట్‌ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాల (ఆచార్య ఎన్‌ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం) సహకారంతో భారతదేశంలోని ప్రాధమిక పంటల సమాచారాన్ని ప్లాంటిక్స్‌ ఆప్‌లో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా ఇక్రిశాట్‌ భారతదేశంలోని ప్లాంటిక్స్‌ అప్‌ ప్రాచుర్యం పొందడానికి కషి చేసింది.

ప్లాంటిక్స్‌ అప్‌ రైతులకి పలు విధాలుగా ఉపయోగంలో ఉంది.

ఆరోగ్య పరీక్ష :

స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించి, తెగుళ్లు సోకిన మొక్క యొక్క ఫోటోని అప్లోడ్‌ చేసిన 30 సెకండ్లో ఆ పంట యొక్క వివరాలు మరియు దానికి సోకిన తెగుళ్లు గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. దీనితో పాటుగా తెగుళ్లు నియంత్రణలో భాగంగా జీవనియంత్రణ మరియు రసాయన నియంత్రణ పద్ధతులను సూచించటమే కాకుండా ఏ మోతాదులో వాడాలో తెలియపరిస్తుంది.

సంఘం :

ఈ సంఘంలో ఉన్న అనుభవజ్ఞులైన శాస్రవేత్తలు, విస్తరణ అధికారులు మరియు తోటి రైతులతో పంటకి సంబంధించిన సమస్యలకు వారి స్థానిక భాషలో సమాధానం పొందగలుగుతున్నారు.

అడ్వైజరీ :

ఇది ఒక పంట క్యాలండర్‌ లేదా సమాచార పట్టిక వంటిది. ఇందులో భాగంగా, ఒక పంట కాలంలో రైతు చేపట్టవలసిన వివిధ వ్యవసాయ పనులను ప్రతి వారం గుర్తుచేయడం ద్వారా పంట ఉత్పాదకతను పెంచడంలో దోహదపడుతుంది. ఇది పంట నాటినప్పటినుండి కోత వరకు పంట కాలం మొత్తం కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది.

గ్రంధాలయం :

పంటలకుసోకే వివిధ రకాల తెగుళ్లు, చీడ పురుగులు, పోషక లోపల యొక్క లక్షణాలు మరియు నివారణ చర్యలకి సంబంధించిన పూర్తి సమాచారం ఈ గ్రంధాలయంలో పొందపరచడం జరిగింది. ఏకంగా 555 (తెగుళ్లు, చీడపురుగులు, పోషక లోపాలు) రకాల పంట సమస్యలకు సంబంధించిన పూర్తి వివరాలను ఏ సమయంలోనైనా చూసుకోవడానికి అనువుగా ఈ ఆప్‌ తయారుచేయడం జరిగింది.

ప్లాంటిక్స్‌ యొక్క ఇతర ఉపయోగాలు :

ప్రాంతీయ వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతుకి తెలియజేసి, సరైన కాలంలో సరైన చర్యలు తీసుకోవడానికి వీలు కలిపిస్తుంది. జిపియస్‌ ద్వారా రైతుకి 50 కి.మీ. పరిధిలో ఉన్న పంటల్ని ఆశించిన తెగుళ్లను గురించి పుష్‌ మెసేజ్‌ ద్వారా ముందుగానే హెచ్చరిస్తుంది.

ప్లాంటిక్స్‌ ప్రత్యేకతలు :

ఈ ఆప్‌ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 8 విదేశీ భాషలు మరియు భారతదేశం యొక్క 8 ప్రాంతీయ భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠి, మలయాళం, బెంగాలీ& పంజాబీ) అందుబాటులో ఉంది. ఇప్పట ివరకు ప్రపంచ వ్యాప్తంగా 7 మిలియన్‌ డౌన్లోడ్స్‌ నమోదయ్యాయి, అందులో ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్‌ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో సుమారుగా 2 మిలియన్‌ డౌన్లోడ్స్‌ చేయబడ్డాయి. అగ్రి బిజినెస్‌ సమ్మిట్‌ మరియు అగ్రి అవార్డ్స్‌ 2019 ఆధ్వర్యంలో ఇచ్చే ''బెస్ట్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ డిజిటల్‌ ఫార్మింగ్‌ టెక్నాలజీ కంపెనీ'' అవార్డు ూజుూు కంపెనీ పొందడం జరిగింది.

డా|| శ్రీకాంత్‌, డా|| సాయిరేఖ, పి. నరసింహారావు, డిజిటల్‌ అగ్రికల్చర్‌, ఇక్రిసాట్‌, హైదరాబాద్‌, ఫోన్‌ : 8977379077