అకుంఠిత దీక్ష, మొక్కవోని ధైర్య సాహసాలు, నిరంతర ప్రజాసేవ చింతన ఆయనను విజయ శిఖరాల పైకి అధిరోహింప చేశాయి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లుగా బాల్యం నుండి నాయకత్వ లక్షణాలను ఔపోసన పట్టి, పట్టుదలతో తాను తలపెట్టిన పనిని నిర్విఘ్నంగా నెరవేర్చుకోవడం, విజయాలను ఆస్వాదించడం ఆయన ప్రత్యేకత. మోడువారిన, బీడుబారిన పొలాల దాహార్తిని తీర్చి, కఠిన శిలావృతమైన భూములను వ్యవసాయ యోగ్యం చేయడంలో ఎంతటి కృషి చేశారో, అపర భగీరధుడిలా కరువుతో నోళ్లు తెరచుకున్న పర్చూరు నియోజకవర్గ భూముల్లో అపూర్వమైన దిగుబడులు సాధించి, అఖండ రైతాంగ దీవెనలను అందుకొని రెండవసారి దిగ్విజయంగా మళ్ళీ శాసన సభకు ఎన్నిక కావడం, ఒక రాజకీయ దిగ్గజాన్ని, అతిరథ మహారధున్ని ఢీకొని గెలిచి, శాసన సభలో అడుగుపెట్టడం అంతటి విశేషం.

ఒక వైపు సర్వజనామోదంగా రాజకీయ కర్తవ్యాలను నిర్వహిస్తూనే, మరో వైపు అన్నదాత సేవలో తనదైన శైలిలో అంకిత భావంతో పనిచేసి, సంక్షోభ దిశగా సాగుతున్న వ్యవసాయానికి దశ-దిశను చూపించడంలో తాను నెలకొల్పిన పత్రిక ద్వారా అక్షర యజ్ఞాన్ని కొనసాగిస్తూనే ఉండడం ఒక అపూర్వమైన అంశం కూడా.

ఎవరూ సాహసించని విధంగా తెలుగు వ్యవసాయ విజ్ఞాన రంగంలో తనదంటూ ఒక శైలిని ప్రారంభించి దాన్ని 'కష్టాల్‌, నష్టాల్‌' ఎదురైనా కొనసాగించడం ఆయన దీక్షా దక్షతకు నిదర్శనం. ఒక ఆదర్శ వ్యవసాయ విద్యావేత్తగా తాను అభ్యసించిన విద్యకు ప్రతిఫలంగా రైతు ఉద్ధారణకు 2010లో 'అగ్రిక్లినిక్‌' సమగ్ర వ్యవసాయ మాసపత్రికను ప్రారంభించారు. తెలుగు వ్యవసాయ విజ్ఞానంలో రంగుల హరివిల్లులా, విజ్ఞాన ఖనిలా ప్రారంభమైన ఈ పత్రిక అనతి కాలంలోనే ఏలూరి సారధ్యంలో 'ట్రెండ్‌సెట్టర్‌'గా మారింది. అంతకు ముందు రంగుల్లో రైతును చూపించడానికి ఇష్టపడని దిగ్గజాల్లాంటి పత్రికలు సైతం 'అగ్రిక్లినిక్‌' ప్రచురణ ప్రారంభమైన తరువాత తమ దిశను మార్చుకున్నాయి. పాత సంచికలను తిరగదోడి అవే వ్యాసాలను మళ్ళీ మళ్ళీ సంవత్సరాల తరబడి ప్రచురిస్తూ కేవలం వ్యాపారం తప్ప రైతు ప్రయోజనాలను కాపాడలేని వ్యవసాయ మాసపత్రికలను భూమార్గం పట్టించిన ఘనత అగ్రిక్లినిక్‌కే దక్కింది.

వ్యవసాయ రంగంలో వినూత్నమైన ఆవిష్కరణలను, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సులువైన ఆచరణ సాధ్యమైన సాగు విధానాలను తెలుగు రైతులకు పరిచయం చేసి, ఆ పద్ధతుల ద్వారా సాగు రంగంలో పురోగమించిన రైతుల విజయగాధలను తిరిగి స్ఫూర్తివంతంగా ఇతర రైతులకు చేరవేసే వారధిగా అగ్రిక్లినిక్‌ మాసపత్రిక దూసుకుపోతున్నది. పత్రికల్లో వచ్చే విలువైన వ్యాసాలు విజయగాధలను సామాజిక మాధ్యమాలు విస్తరింపచేసి మేటి పత్రికగా ఏలూరి సారధ్యంలో రూపుదిద్దుకుంది.

ఒక సమగ్ర పత్రికాధిపతిగా రూపుదిద్దుకునే ముందే ఒక బృహత్తరమైన వ్యవసాయ వాణిజ్య సంస్థకు అధిపతిగా ఏలూరి ప్రాచుర్యం వహించారు. వర్ధమాన పారిశ్రామికవేత్తగా ప్రముఖ స్థాయికి ఎదిగే సమయంలోనే ఆయనకు అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌, అప్పటి కేంద్ర చిన్న పరిశ్రమల మంత్రి గార్ల చేతుల మీదుగా ఎమ్‌.ఎస్‌.ఎమ్‌.ఇ. అవార్డు లభించింది. దీనితో సంక్షుభిత వ్యవసాయ రంగాన్ని కునారిల్లుతున్న స్థితి నుండి మెరుగైన లక్ష్యం వైపు తీసుకువెళ్ళేందుకు అనుబంధ రంగాల అభివృద్ధి, పరిశోధనలపై దృష్టి సారించి తద్విధంగా దూసుకువెళ్ళారు. నోవా గ్రూపు సంస్థల స్థాపన, నోవా రైతు సేవాకేంద్రం స్థాపించి అభివృద్ధి చెందుతున్న దశలోనే ఏలూరి తనకు ఎంతో ప్రీతిపాత్రమైన వ్యవసాయ రంగంపై వినూత్న ఆవిష్కరణల వైపు దృష్టిసారించారు.

వాణిజ్యపరంగా అత్యంత పెట్టుబడి, ఉపాది కల్పించే మిరప, పత్తి సాగులో వినూత్నమైన సాగు పద్ధతులను ప్రవేశపెట్టి తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పరిశోధనా - అభివృద్ధి కేంద్రాలను ప్రారంభించారు. నోవా అగ్రిటెక్‌ వయవసాయ ఉపకరణాల రంగంలో తనదంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుని ముందుకు వెళుతున్న నేపధ్యంలో రైతుల ఆదాయ వనరులను పెంచి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను ఆర్జించి ముందుకు వెళ్ళడం ఎలా అనే అంశాలపై ఈ కేంద్రాల్లో శిక్షణ అందుబాటులోకి తెచ్చారు.

వాణిజ్య కార్యకలాపాల విస్తరణతో పాటు వ్యవసాయ విస్తరణను కూడా ఒక బాధ్యతగా స్వీకరించి ఉత్పాదకాల నాణ్యతను తొలుత అభివృద్ధి - పరిశోధనా కేంద్రాల్లో కొలబద్దకు నిలిపి రైతులకు వాటిని సరఫరా చేయడం ద్వారా ఒక నమ్మకం, ఒక విశ్వాసం, విశ్వసనీయతల ఆధారంగా తన సహజ నాయకత్వ లక్షణాలతో హైదరాబాద్‌లో ఉద్భవించిన ఒక చిన్న పరిశ్రమను దేశంలోని 11 రాష్ట్రాల్లో కార్యకలాపాల విస్తరణకు నాంది పలికారు. తనతో సమానంగా లక్ష్యసిద్ధితో పనిచేసే యాజమాన్యం, మార్కెటింగ్‌ సిబ్బంది, పరిపాలనా సిబ్బంది, సాంకేతిక నిపుణులు అండ రాగా 'వ్యవసాయం దండగ కాదు, పండుగ అని' నిరూపించి ఒక నూతన శకానికి శ్రీకారం చుట్టారు.

ప్రపంచంలోనే అత్యంత వ్యయ ప్రయాసలతో సాగు చేయవలసిన మిరప పంటపై పరిశోధనలు నిర్వహించి అన్ని కాలాల్లోనూ దాన్ని పండించి, పురుగులు, తెగుళ్ళ నివారణకు కొత్త పద్ధతులను కనిపెట్టి దేశంలోని యావత్‌ రైతాంగానికి అండగా నిలిచారు. దానిలో భాగంగా మెదక్‌ జిల్లా, జహీరాబాద్‌ సమీపంలోని హుగ్గెళ్ళి అభివృద్ధి - పరిశోధనా కేంద్రంలో మల్చింగ్‌పై మిరప పంటను సాగు చేసి వినూత్నమైన కార్యక్రమం యావత్‌ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోనే కాకుండా సాంకేతిక ప్రగతితో నడిచే సాగు విధానం దేశ వ్యాప్తంగానూ, ప్రపంచ పటంలోనూ నిలిచిపోయింది. 80 సెంటిగ్రేడ్‌ అతితక్కువ ఉష్ణోగ్రతలో, గడ్డకట్టే చలిలో కూడా మిరప సాగు సాధ్యమేనని నిరూపించారు. అంతేకాకుండా తక్కువ భూగర్భజల వసతితో, తక్కువ పరిణామంలో ఎరువులు, పోషకాలతో, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులను సాధించి చూపించారు.

అంతేకాకుండా మల్చింగ్‌పై సబ్సిడీలేని కాలంలో ఒక ఎకరాకు భారీ ఖర్చు అవుతుండగా రైతులు దానిపట్ల విముఖత చూపడంతో దానికి కూడా పరిష్కారం కనుగొన్నారు. ఒక్కసారి మిరప పంట బోదెలపై వినియోగించిన మల్చింగ్‌ షీటుపై జీరో టిల్లేజ్‌ పద్ధతిలో పత్తి, మొక్కజొన్న సాగుకు ఉపక్రమించి భారీ ఎత్తున పంటపై లాభాలను ఆర్జించే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి చూపారు. స్వయంగా వ్యవసాయ నిపుణులైన ఏలూరి సాంబశివరావు ఈ ప్రక్రియకు కర్త, కర్మ, క్రియగా మారి ప్రపంచ చరిత్రలోనే జీరోటిల్లేజ్‌తో భారీ ఎత్తున పత్తి సాగును నిర్వహించిన అసాధారణ రైతుగా కీర్తింపబడ్డారు. దీనిపై సోషల్‌ మీడియాలో ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో నెటిజన్లు పుంఖాను పుంఖాలుగా హర్షం వ్యక్తం చేశారు. తమిళనాడులోని సేలంలోని ఒక టార్పాలిన్‌ కంపెనీ ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌ కవర్‌ పేజీలోనే మన ఏలూరి ఫోటోను ప్రచురించి సంచలనం సృష్టించారు. జీరోటిల్లేజ్‌ పద్ధతిపై మొక్కజొన్నతోపాటు, కూరగాయలు, ఆకుకూరలు పండించి ఈ క్షేత్రాన్ని ప్రపంచపటంలో నిలిపారు. జహీరాబాద్‌ సమీపంలోని హుగ్గెళ్ళి వ్యవసాయ క్షేత్రంతో పాటు ప్రకాశం జిల్లాలోని జొన్నతాళి, కృష్ణాజిల్లాలోని మక్కపేట వ్యవసాయ క్షేత్రాల్లో ఈ వినూత్నమైన సాగు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించడమే కాకుండా ఏలూరి ఉద్యానవన నిపుణతకు ప్రశంసల వర్షం కురిపించింది.

హుగ్గెళ్ళి వ్యవసాయ క్షేత్రంలో ఇబ్బడి ముబ్బడిగా ఆవిష్కరణలు విజయవంతమవుతున్న నేపధ్యంలోనే మీకోసం పాదయాత్ర నిర్వహిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు దృష్టిని ఏలూరి ఆకర్షించారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జ్‌గా నియమించి, అక్కడ పార్టీని పునరుజ్జీవించే బాధ్యతలను ఏలూరికి అప్పగించారు.

ఒకవైపు ఒక బృహత్తరమైన కంపెనీ దాని అనుబంధ సంస్థల నిర్వహణ, మరోకవైపు అగ్రిక్లినిక్‌ మాసపత్రిక సంపాదకులుగా విధుల నిర్వహణతోపాటు, పర్చూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యతలను చాకచక్యంతో సవ్యసాచిలాగా నిర్వహిస్తూనే మరొక అద్భుతమైన వ్యవసాయ క్షేత్ర అభివృద్ధికి ఏలూరి వ్యూహరచన చేశారు. అప్పటి నిజామాబాద్‌ జిల్లా, కామారెడ్డి సమీపంలోని ఎండ్రియాల గ్రామంలో చీమలు దూరని చిట్టడవి, కాకులు చేరని కారడవిని ఈసారి తన వ్యవసాయ అభివృద్ధి - పరిశోధనా కేంద్రంగా ఎంచుకున్నారు. కఠిన శిలావృతమైన ఈ భూమిలో ఇజ్రాయిల్‌ నీటియాజమాన్య తరహాలో ప్రారంభించిన సాగు దేశ విదేశాల్లోని శాస్త్రవేత్తలను, తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలోని రైతులను విశేషంగా ఆకర్షించింది. అదేదో సినిమాలో 'ఎడారిలోన పూలు పూచి ఎంత సందడి ఇదేమి లాహిరి' అన్నట్లు దిన దిన ప్రవర్థమానంగా ఈ వ్యవసాయ క్షేత్రం వెనుకబడిన నిజామాబాద్‌ రైతులతోపాటు ఇరు రాష్ట్రాల్లోని తెలుగు రైతులను ఆకర్షించింది. బొప్పాయి ఆధునిక సాగుతో ప్రారంభమై 27 పంటల ఆధునిక సాగుకు కేంద్రంగా మారింది. పట్టిందల్లా బంగారమైనట్లు అధిక సంఖ్యలో ఫలసాయాన్నిచ్చి, ఆధునిక సాగు పద్ధతులకు నిలయంగా మారింది.

ఒక ప్రత్యేక ప్రణాళికతో వర్షపు నీటిని ఆకట్టుకొని, భూమిలో నిక్షిప్తం చేసుకునే విధంగా కందకాలను నిర్మించి దానితోపాటు ప్రారంభంలో భూసారాన్ని అభివృద్ధి చేసే పంటలను సాగుచేసి క్రమేణా భూమి స్వభావాన్ని మార్చివేశారు. 26 బోరుబావులు తవ్వించగా అందులో లభించిన ఆరుబావుల నీటిని రెండు, మూడు ఫామ్‌పాండ్లకు మళ్ళించి, ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఖచ్ఛిత వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా ఒక అసాధారణ వ్యవసాయ క్షేత్రంగా ఎండ్రియాల అనే మారుమూల గ్రామం ప్రపంచ పటానికి ఎక్కింది.

పైన తెల్పిన విధంగా ఆధునిక ఆవిష్కరణల సృష్టికర్తగా తనదైన సంచలన రికార్డులతో దూసుకు వెళుతున్న ఏలూరిని క్రియాశీల రాజకీయాల్లోకి ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ ఆయనలోని పట్టుదల, క్రియాశీలతను చూసి 2014లో పర్చూరు ఎమ్మెల్యే సీటుకు పార్టీ అభ్యర్దిగా పోటీలో నిలిపింది. దానికి ముందే నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఏలూరి తన పట్టును నిరూపించుకున్నారు. నియోజకవర్గంలోని తన స్వగ్రామం కోణంకి నుండి సముద్ర తీరం వరకు 789 కి.మీ. మేర పాదయాత్ర చేసి ప్రజాసమస్యలను పూలహారాలుగా స్వీకరించారు. 117 గ్రామాల్లో 32 రోజులు పర్యటించి ప్రతి ఓటరును కలుసుకొని తానేమిటో నిరూపించిన తరువాతనే పార్టీ నాయకత్వం ఆయనకు పోటీచేసే అవకాశాన్ని కల్పించింది.

స్వాతంత్య్రానికి ముందు ఆ తరువాత కూడా ఏ నాయకుడూ సాహసించని విధంగా పర్చూరు నియోజకవర్గంలో రాత్రి, పగలు తనదికాదంటూ అధికారమున్నా, లేకపోయినా పనిచేస్తూ అక్కడి ప్రజాజీవితంలో తాను ఒక భాగమైనారు. 2014 ఎన్నికల్లో విజయం అనంతరం కూడా ఆయన విశ్రాంతి తీసుకోలేదు. ఏమరుపాటుగా నిద్రించలేదు. నిత్యం ప్రజా సమస్యలే ఆయుధాలుగా పాలకపార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి కూడా విలాసాలకు పోకుండా, వివాదాలకు తావులేకుండా విశిష్ట జీవన శైలిలో తనదంటూ మార్గంలో పయనించారు. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా నియోజకవర్గంలో తాను రచించుకున్న ప్రత్యేక అభివృద్ధి వ్యూహాలను ఎన్నికల ప్రణాళికగా మలచుకొని రంగంలోకి దిగారు. ఈ నూతన రాజకీయ చైతన్యాన్ని ప్రజలు స్వాగతించారు. ఈ నేల తల్లి బిడ్డను ఆశీర్వదించారు.

ఆకాశమే హద్దుగా ఆయన తన సేవలను కొనసాగించుకుంటూ రైతులు, కార్మికులు, మహిళలు, యువతరం దృష్టిని ఆకర్షించి గట్టి పునాదులు వేసుకొని రెండవసారి 2019 సాధారణ ఎన్నికల్లో అసాధారణ విజయాన్ని పొందారు. పర్చూరు గడ్డలో, కోనంకి అనే కుగ్రామంలో జన్మించిన రైతు బిడ్డ నేడు అసాధారణ, అసమాన నాయకుడిగా, పత్రికా సంపాదకుడిగా, ప్రజా ప్రతినిధిగా వెలుగొందడం సాధారణ శ్రామిక జన విజయంగా ఖచ్చితంగా భావించవచ్చు.

నిరాడంబరుడు, నిగర్వి, గొప్ప రాజనీతి లక్షణాలతో పైపెచ్చు రైతు పక్షపాతిగా నిలబడడం ఎంతో గర్వకారణం 'అగ్రిక్లినిక్‌' మాసపత్రిక అప్రతిహతంగా 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అనేక భవిష్యత్‌ ప్రణాళికలతో తెలుగు పత్రికా రంగంలో మరింత విశ్వసనీయంగా, రైతుల విశ్వాస పత్రికగా వెలుగొందాలని, ఉజ్వల భవిష్యత్‌తో మా సంపాదకుడు ఏలూరి సాంబశివరావు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తూ....

అభివందనములతో...

సంపాదక వర్గం, అగ్రిక్లినిక్‌ సిబ్బంది