మన దేశంలో దాదాపు 70 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వివిధ పంటల దిగుబడులు ప్రధానంగా వాతావరణంపై ఆధారపడి ఉంటాయి. అదే విధంగా పంటలపై వాతావరణ ప్రభావం ఎక్కువ. నేల దున్నిన దగ్గరి నుండి ఆ పంట మార్కెట్‌లో అమ్మే వరకు ఈ వాతావరణ పరిస్థితులు రైతులకు ఒక పరిక్షగా నిలుస్తాయి.

పత్రికూల వాతావరణ పరిస్థితులు అంటే రుతుపవనాల రాక ఆలస్యం కావడం, పొడి వాతావరణం, బెట్ట పరిస్థితులు, వరదలు, అకాల వర్షాలు, అకస్మాత్తుగా వడగండ్లు పడడం, వేడిగాలులు మరియు ఉష్ణోగ్రతలలో హెచ్చు తగ్గులు వంటివి పంట దిగుబడులపై గణనీయ ప్రబావం చూపుతాయి.

ఖరీఫ్‌ పంటలో మెళకువలు :

జూన్‌ 1 తరువాత 60-75 మి.మీ. వర్షపాతం పడినట్లయితే వర్షాధార పంటను విత్తుకోవాలి.

ఎరువులు వేసే ముందు నేలలో తగినంత తేమ పదును ఉండాలి. లేదా 20-25 మి.మీ. వర్షపాతం కురిసిన తరువాత మాత్రమే ఎరువులను వేసుకోవాలి.

పంట మధ్యలో బెట్ట పరిస్థితులు ఏర్పడితే వర్షాధారపు పంటల్లో అంతరకృషి చేయాలి.

విత్తిన 48 గంటల్లోపు పొలంలో తగిన తేమను చూసుకొని కలుపు మందును పిచికారి చేయాలి.

కలుపు మందులు పిచికారి చేసిన తరువాత కనీసం 4-6 గంటలు వర్షం లేకుండా ఉండాలి.

గాలి వేగం 15 కి.మీ. కంటే ఎక్కువ ఉంటే క్రిమిసంహారక మందులు మరియు కలుపు మందులు పిచికారి చేయరాదు.

వర్షసూచన ఉంటే క్రిమిసంహారక మందులు పిచికారి చేయరాదు

క్రిమిసంహారక మందులు పిచికారి చేసిన తరువాత కనీసం 6 గంటలు వర్షం లేకుండా ఉండాలి.

వర్ష సూచన ఉన్నట్లయితే నీటి తడులు ఇవ్వడం ఆపాలి.

వరి నాటిన 4-5 రోజుల వరకు మరియు పిలకలు తొడిగే దశలో 2 సెం.మీ. నీరు పెట్టాలి.

వరి అంకురం దశ నుండి గింజ గట్టి పడే వరకు 5 సెం.మీ. లోతు వరకు నీరు పెట్టాలి.

మొక్కజొన్నలో జల్లు మరియు పేను దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.

పత్తిలో విత్తిన 15 రోజులకు తరువాత పూత దశకు వచ్చే ముందు వర్షాలు లేనట్లయితే ఒకసారి నీరు కట్టాలి. పూత దశ నుండి కాయ పెరిగే వరకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి.

వేరుశనగలో పూత దశ, ఊడలు దిగే సమయంలో మరియు కాయ పెరిగే సమయంలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.

పొద్దు తిరుగుడు మొగ్గ తొడుగు, పూత మరియు గింజ కట్టే దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.

వివిధ పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి పంట కీలకదశల్లో ఎర్రచల్కా నేలల్లో సుమారు 50 మి.మీ. మరియు నల్లరేగడికి 60 మి.మీ. నీరు ఇవ్వాలి.

అపరాల్లో పూత మరియు గింజకట్టు దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.

రుతుపవనాల రాక ఆలస్యమైనప్పుడు వివిధ పంటల్లో రైతులు చేపట్టవలసిన చర్యలు :

వరి :

మధ్యకాలిక రకాలు (130-135 రోజులు) లేదా స్వల్పకాలిక రకాలు (110-120 రోజులు) ఎంచుకోవాలి.

దీర్ఘకాలిక రకాలు (145-150 రోజలు) వేయకూడదు.

ముదురు నారును మామూలు కంటే దగ్గరగా నాటాలి. కుదురుకు 4 లేదా 6 మొక్కలు ఉండేలా చూసుకోవాలి.

నత్రజనిని మూడు దఫాలుగా కాక, రెండు దఫాలుగా 2/3 వంతు దమ్ములోను మిగతా భాగం అంటే 1/3 వంతు చిరుపొట్ట దశలోను వేసుకోవాలి.

పత్తి :

త్వరగా వచ్చే రకాలను ఎంచుకోవాలి.

ఎరువుల యాజమాన్యంలో మెళకువలు

మధ్యలో వర్షాలు కురవక బెట్ట పరిస్థితులు నెలకొంటే :

నేలలో తేమ లేకపోతే ఎరువులు వేయడం ఆపాలి.

రెండు శాతం యూరియా ద్రావణాన్ని 10-15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.

చదునుగా గుంటక లేదా గొర్రు తోలి అంతరకృషి చేయాలి.

వివిధ పురుగులు మరియు తెగుళ్ళ ఉదృతి, వాతావరన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. దాదాపు 30 శాతం దిగుబడులు ఈ చీడపీడల వల్ల నష్టపోతూ ఉన్నాం. కొన్ని పురుగులు బెట్ట పరిస్థితుల్లో ఎక్కువగా ఆశిస్తే మరికొన్ని ఎక్కువ వర్షపాతం ఉధృతంగా ఆశిస్తాయి. అలాగే కొన్ని తెగుళ్ళు వర్షపాతం, గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఎక్కువైతే మరికొన్ని చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువవుతాయి. ఏఏ వాతావరణ పరిస్థితుల్లో ఏఏ చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయో అనే అవగాహన మన రాష్ట్ర రైతాంగానికి ఎంతైనా అవసరం.

వివిధ పంటల్లో చీడపీడల ఉధృతికి వాతావరణ పరిస్థితులు :

వరిలో.. కాండం తొలుచు పురుగు :

ప్రధానంగా కరువు పరిస్థితులు నెలకొన్న సంవత్సరాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి సూర్యరశ్మి రోజుకు 7 గంటలు మించి ఉన్నప్పుడు ఉధృతి ఎక్కువ.

ఆకు ముడత :

అధిక వర్షాలు పడిన తరువాత బెట్ట పరిస్థితులు నెలకొని, వారంపాటు మబ్బులతో కూడిన వాతావరణం అనుకూలం.

ఉల్లి కోడు :

రుతుపవనాలు ఆలస్యమైన, ఆలస్యగా నాట్లు వేసిన ప్రాంతాల్లో ఉల్లికోడు సోకడానికి అనుకూలం.

సుడి దోమ :

ఆగష్టు-సెప్టెంబరు నెలల్లో అధిక వర్షపాతం (వారానికి 30 మి.మీ. కంటే ఎక్కువ కనీసం 2 వారాలు) అధిక తేమతో కూడిన వేడి వాతావరణం, రాత్రి ఉష్ణోగ్రతలు 21-230 సెం. మధ్య ఉంటే ఎక్కువగా ఆశిస్తుంది.

కంపు నల్లి :

మేలో వర్షాలు పడినట్లయితే సెప్టెంబరు-నవంబరులో కంపునల్లి ఉథృతంగా ఉంటుంది.

కంకి నల్లి :

నవంబరులో తక్కువ వర్షపాతం ఉండి సూర్యరశ్మి రోజుకు 7 గంటలు మించి ఉన్నప్పుడు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.

అగ్గి తెగులు లేదా మెడవిరుపు :

ప్రధానంగా అక్టోబరు నుండి ఫిబ్రవరి వరకు ఒక వారం పాటు రాత్రి ఉష్ణోగ్రతలు 18-220 సెం. గాలిలో తేమశాతం 99 ఉంటే తెగులు సోకుటకు అనుకూలం.

పొడ తెగులు :

ప్రధానంగా ఆగష్టు-సెప్టెంబరు మధ్య ఉష్ణోగ్రతలు 23-320 సెం. గాలిలో తేమ శాతం 90, మబ్బులతో కూడిన వాతావరణం మరియు వర్షం తెగులు వ్యాప్తికి అనుకూలం.

ఆకు ఎండు తెగులు :

ఉష్ణోగ్రతలు 25-300 సె. గాలిలో అధిక తేమ, గాలితో కూడిన వర్షం లేదా మంచు కురవడం

పొట్ట కుళ్ళు తెగులు :

రాత్రి ఉష్ణోగ్రత 200 సె. కంటే తక్కువ. గాలిలో తేమ 90 శాతం కంటే ఎక్కువ.

గోధుమ ఆకుమచ్చ తెగులు :

గాలిలో తేమ 90 శాతం కంటే ఎక్కువ. నైరుతీ రుతుపవనాలు ఆలస్యమైన సంవత్సరాల్లో ఎక్కువ ఆశిస్తుంది.

మాని పండు తెగులు :

పూత దశలో మంచు లేదా మబ్బులతో కూడిన జల్లులు, గాలిలో తేమ శాతం 90 కంటే ఎక్కువ.

ఎలుకలు :

ప్రకృతి వైపరీత్యాలు, వరదలు సంభవించినప్పుడు ఎలుకలు సూపర్‌ బ్రీడింగ్‌ జరిగి ఉధృతి ఒక్కసారిగా పెరుగుతుంది.

మొక్కజొన్న :

టర్పికం ఆకు ఎండు తెగులు :

పూత దశలో అధిక తేమతో కూడిన వాతావరణం, ఉష్ణోగ్రతలు 18-270 సెం. మధ్య మంచుతో కూడిన వర్షపు జల్లుల వ్యాప్తికి అనుకూలం.

వడలు తెగులు :

గింజపాలు పోసుకునే దశలో నీటి ఎద్దడి, వేడి వాతావరణం (ఉష్ణోగ్రతలు 20-320 సెం.) అధిక తేమ వ్యాప్తికి అనుకూలం.

పెసర, మినుము

ఆకు ముడత వైరస్‌) :

పొడి వాతావరణం, బెట్ట పరిస్థితులు ఎక్కువకాలం (దాదాపు 7-10 రోజులు) కొనసాగితే తెల్లదోమ ఉధృతి ఎక్కువై తద్వారా తెగులు ఎక్కువగా ఆశిస్తుంది.

బూడిద తెగులు :

విత్తిన 30-35 రోజుల తరువాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు బూడిద తెగులు వ్యాపిస్తుంది.

తుప్పు తెగులు :

చల్లని పొడి వాతావరణం వ్యాప్తికి అనుకూలం.

జొన్న (గింజ బూజు తెగులు) :

పూత మరియు గింజ ఏర్పడే సమయంలో వర్షాలుపడితే ఎక్కువగా వ్యాపిస్తుంది.

బంక కారు తెగులు :

పూత మరియు గింజ గట్టిపడే సమయంలో ఆకాశం మేఘావృతమై చల్లని తేమతో కూడిన వాతావరణం ఉంటే ఎక్కువగా వ్యాపిస్తుంది.

కంది :

పచ్చ పురుగు :

ఖరీఫ్‌లో ముందుగా తక్కువ వర్షాలు, నవంబరులో అధిక వర్షాలు రాత్రి ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా పెరుగుదల కందిలో ఉధృతికి అనుకూలం. గుడ్డుదశ లేదా చిన్న లార్వాల దశలో ఎక్కువ వర్షం కురిస్తే ఉధృతి తగ్గుతుంది.

పత్తి :

తెల్ల దోమ :

10 రోజులకు మించి బెట్ట పరిస్థితులు మరియు పొడి వాతావరణం అనుకూలం.

వేరు కుళ్ళు తెగులు :

అధిక వర్షాలుపడి నేలలో తేమ ఎక్కువైతే ఆశిస్తుంది.

కాయ కుళ్ళు తెగులు :

పత్తి కాయ దశలో ఉన్నప్పుడు వర్షాలు ఎక్కువ పడితే పురుగు ఎక్కువగా ఆశిస్తుంది.

బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు :

ఎక్కువ గాలి వేగం, అధిక తేమ, రాత్రి ఉష్ణోగ్రత 210 సెం. కన్నా తక్కువ ఉండడం, వర్షంతో కూడిన వాతావరణం అనుకూలం.

అరిగెల కిరణ్‌, డా|| మద్దల సురేందర్‌, ప్రిన్సిపల్‌ ఏకలవ్య ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల, జింగుర్తి, వికారాబాద్‌