ఆంధ్రప్రదేశ్‌లో చెఱకు పంటను సుమారు 1.20 లక్షల హెక్టార్లు విస్తీర్ణంలో సాగుచేసి 107.5 లక్షల టన్నులు చెఱకు ఉత్పత్తి చెఱకు పంట ద్వారా పంచదార, బెల్లం, కండసారి, మొలాసిస్‌ మరియు ఫిల్టర్‌ మడ్డి ఉత్పత్తవుతున్నాయి. అధిక చెఱకు దిగుబడితో పాటు ఎక్కువ పంచదార పొందటానికి అనువైన సాగు పద్ధతులు మరియు సస్యరక్షణ ప్రభావితం చేస్తాయి.

చెఱకు పంటను ఆశించే చీడ పీడలు :

పీక పురుగు :

ఈ పురుగు లేత దశలో పీక పురుగుగా, కాండం ఏర్పడిన తరువాత కాండం తొలుచు పురుగుగా పైరును నష్ట పరుస్తుంది. పైరును పిలకలు వేసే దశలో పిల్ల పీక పురుగు మొవ్వులోపలికి తొలుచుకుపోయి దవ్వ లోపలి భాగాన్ని తినేయడం వల్ల మొవ్వులు ఎండి చనిపోతాయి. చచ్చిన మొవ్వులను పీకిన తేలికగా బయటకు వస్తాయి. కుళ్ళిపోయిన మొవ్వు నుండి చెడు వాసన వస్తుంది. పీక పురుగు తాకిడి వర్షధారపు చెఱకులో హెచ్చుగా ఉంటుంది.

కాండం తొలుచు పురుగు :

చెఱకు కణుపులు ఏర్పడినది మొదలు తోట నరికే వరకు ఈ పురుగు ఆశించి నష్టం కలుగజేస్తుంది. ఈ పురుగు ఉధతి జూన్‌- జూలై మాసాల్లో ఎక్కువగా ఉంటుంది.

సస్యరక్షణ :

చెఱకు నాటిన నుండి, చెఱకు నరికే వరకు ఈ పీక పురుగు, కాండం తొలుచు పురుగులు పైరును ఆశించి బాల్యదశలో పీక పురుగుగా, 120 రోజుల వరకు పైరును నష్ట పరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షధారపు చెఱకుపై హెచ్చుగా ఉంటుంది. లోతైన కాలువలో ముచ్చెలను నాటాలి. నాటే ముందు, మిథైల్‌ పరాధియాన్‌, పొడి మందు ఎకరాకు 10 కిలోల చొప్పున వేయాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గర దగ్గరగా నీటి తడులు ఇవ్వాలి. మొక్క తోటల్లో, నాటిన మూడవ రోజున, కార్సి తోటల్లో కార్సి చేసిన వెంటనే ఎకరాకు 1.25 టన్నుల చొప్పున చెరకు చెత్త కలపాలి. కార్బరిల్‌ 3 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మి. లీ. లీటరు నీటికి కలిపి నాటిన 4, 6 మరియు 9 వారాల్లో పిచికారి చేసుకోవాలి. ట్రైకోగ్రామా కిలోనిస్‌ గుడ్డ్డు పరన్నజీవిని ఎకరాకు 20,000 చొప్పున చెఱకు నాటిన 30 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి.

దవ్వ తొలుచు పురుగు :

ఇది ఆంధ్రప్రదేశ్‌లో తొలకరి వానలతో మొదలై జూలై- సెప్టెంబర్‌ నెలల మధ్య ఈ పురుగు వృద్ధి చెంది చెరకు పంటకు ఒక మోస్తరుగా ఆశించి నష్టం కలిగిస్తుంది.

సస్యరక్షణ :

లద్దె పురుగు చెరకు నాటిన 120 రోజులు మొదలుకొని చెఱకు నరికే వరకు చెఱకు గెడల కింది భాగం నుండి పై భాగం వరకు తొలుచుకుంటూ పోవడం వల్ల గెడ ఎండిపోతుంది. పురుగు ఆశించిన కణుపులు గట్టిపడి, కణజలం ఎర్రబడి, గెడల నాణ్యత, దిగుబడి తగ్గుతుంది. అధికంగా నత్రజని వాడటం, ఆలస్యంగా నత్రజని ఎరువుల వాడటం, మురుగు నీటిపారుదల సౌకర్యం కలిపించాలి. ట్రైకోగ్రామా కిలోనిస్‌ గుడ్డ్డు పరన్నజీవిని ఎకరాకు 20,000 చొప్పున చెఱకు నాటిన 120 రోజుల నుండి ప్రతి 7-10 రోజుల వ్యవధిలో 6,8 సార్లు పైరులో వదలాలి లేదా క్రింద రెలచి, క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మి. లీ. లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు జూన్‌-జూలైల్లో పిచికారి చేయాలి.

తెల్ల నల్లి :

ఈ పురుగు ఉధతి నీరు నిల్వ ఉండే ప్రదేశంలో సరిగ్గా నత్రజని ఎరువుల వేయక, నిర్లక్ష్యం చేయబడిన తోటల్లో ముఖ్యంగా కార్సి తోటల్లో ఆగస్టు, అక్టోబర్‌ల మధ్య హెచ్చుగా ఉంటుంది. ఈ పురుగు తీవ్రంగా ఆశించినప్పుడు వేలకొలది పిల్ల పురుగులు, తల్లి పురుగులు, ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. చెఱకు గెడలు పెరుగుదల ఆగిపోవడమే కాకుండా చనిపోవడం కూడా జరుగుతుంది.

సస్యరక్షణ :

మలాథియాన్‌ 2 మి.లీ. లేక మోనోక్రోటోఫాస్‌ 1.6 మి. లీ. లేదా డైమిథోయేట్‌ 1.7 మి.లీ. లీటరు నీటికి కలిపి రెండుసార్లు 10-12 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి ఆకుల క్రింది, పై భాగాలు తడిచేలా పిచికారి చేయాలి.

వేరు పురుగు :

వేరు పురుగు అప్పుడప్పుడూ చెఱకు పంటకు అధిక నష్టం కలుగజేస్తుంది. సంవత్సరానికి ఒకే జీవిత చక్రం ఉంటుంది. ఈ పురుగులు వేళ్ళను, కాండాన్ని తినడం వల్ల చెఱకు మొక్కలు నశిస్తాయి, ఇసుక కోడి భూముల్లో పెంచిన మొక్క తోటలలోను ఇవి ఎక్కువ నష్టం కలుగ చేస్తాయి. జూలై-సెప్టెంబరు మాసాల మధ్య ఈ పురుగు ఎక్కువుగా ఆశిస్తుంది. ఈ పురుగు సోకినప్పుడు 80 శాతం వరకు కూడా నష్టం వస్తుంది.

సస్యరక్షణ :

తొలకరి వర్షాలు పడిన వెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా ఫ్రౌడ పెంకు పురుగులు ఆకర్షితమై, దీపపు ఎర కింద అమర్చుకొన్న పురుగు మందు ద్రావణంలో పడి చనిపోవును. తద్వారా దాదాపు 50 శాతం పురుగులను నిర్మూలించవచ్చు ఎకరాకు 8-10 కిలోల చొప్పున ఫోరేట్‌ 10 శాతం గుళికలను నాటే సమయంలో భూమిలో వేసి పురుగు వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.

చెదలు :

చెద పురుగులు చెఱకు నాటిని నుండి తోట నరికే వరకు పంటకు హాని చేస్తాయి. తేలిక నేల్లలోని, వర్షాభావ పరిస్థితుల్లో వీటి ఉధతి ఎక్కువుగా ఉంటుంది. ముచ్చెల చివళ్ళ నుండి లోపలి మెత్తటి పదార్థాని తినడం వల్ల ముచ్చెలు డొల్లగా మారిమొలక శాతం దెబ్బ తింటుంది. ఎదిగిన చెఱకు తోటల్లో కూడా 6-7 కణుపుల వరకు తొలచి డొల్ల చేసి మట్టితో నింపడంవల్ల నష్టం కలుగుతుంది.

సస్యరక్షణ :

చెద పురుగుల నివారణకు పుట్టలను తవ్వి, రాణి ఈగను చంపాలి. ఒక్కొక్క పుట్టకు 200 గ్రా. మిథైల్‌ పరాథియాన్‌ పొడి చల్లి, చదును చేయాలి. నాటే ముందు కాలువల్లో ఎకరాకు 10 కిలోల మిథైల్‌ పారాథియాన్‌ చల్లుకోవాలి. ఎదిగే తోటల్లో ఈ పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్‌ 5 మి. లీ. ఒక లీటరు నీటికి చొప్పున కలిపి గెడలు తడిచేటట్లు పిచికారి చేయాలి.

ఎర్ర కుళ్ళు తెగుళ్ళు :

చెఱకును ఆశించే తెగుళ్ళులో ఎర్ర కుళ్ళు చాలా ప్రమాద కరమైనది. ఈ తెగులు వల్ల తొలి దశలోపై నుండి 3 లేక 4 వ ఆకు పసుపు పచ్చగా మారి, మొవ్వు అంత క్రమేపి వడలి ఎండి పోతుంది. ఈ తెగులు సోకిన చెఱకులను నిలువుగా చీల్చినప్పుడు పులిసిన పిండి పదార్థాల వాసన వస్తుంది. తెగులు ముదిరే కొద్దీ కణజాలం చచ్చి పోయి, చెఱకులు గుల్లబారి బూజుతో నిండి ఉంటాయి. తెగులు సోకిన ఆకుల మధ్య ఈనెల పై రక్తపు రంగు మచ్చలు ఏర్పడి ముదిరినప్పుడు మధ్య బాగం గడ్డ్డి రంగులో కనిపిస్తుంది. ఇట్టి మచ్చల మధ్య బాగంలో నల్లని, గుండు సూది మొనలాంటి శిలింద్రబీజాల సముదాయాలు ఏర్పడుతాయి. వర్షాలు ఎక్కువగా పడి, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కుమ్మడిగా వ్యాపించి నష్టాన్ని ఎక్కువగా కలుగజేస్తాయి.

కాటుక తెగుళ్ళు :

తెగులు సోకిన మొక్కల మొవ్వు నుంచి పొడవైన నల్లని కోరడాగా మారుతుంది. మొవ్వు నుంచి కొరడా వచ్చిన 3,4 రోజుల దాక తెల్లటి, పలుచటి పొర కప్పబడి ఉంటుంది. ఆ తరువాత పొర చిట్లి అసంఖ్యాకమైన శిలింద్ర బీజాలు గాలి ద్వారా, వర్షపు జల్లులు ద్వారా పరిసరాల్లోకి వెదజల్లుబడతాయి. ఈ తెగులు వల్ల చెఱకు దిగుబడిలో 50-60 శాతం వరకు తగ్గవచ్చు.

సస్యరక్షణ :

మూడుకళ్ళ ముచ్చెలను వేడి నీటిలో (520 సెం. వద్ద 30 నిముషాలు) లేదా తేమతో మిళితమైన వేడి గాలిలో (540 వద్ద 2 గంటలు) విత్తశుద్ధి చేసి లేవడి తోటల పెంచి వాటి నుంచి వచ్చిన ముచ్చెలను నాటుకొన్నట్లయితే తెగులను నివారించవచ్చు. కార్సి తోటల్లో ప్రోపికానజోల్‌ (1.0 మి.లీ./ లీటరు) మందును కార్సి చేసిన 30-35 రోజులకు ఒకసారి పిచికారి చేయాలి. విత్తనపు ముచ్చెలను నాటే ముందు వేడినీటిలో 520 వద్ద కార్బండిజం 0.5 మి.లీ./ లీటరు నీటికి చొప్పున కలిపి 30 నిముషాలు శుద్ధి చేయాలి. ఎర్ర కుళ్ళు తెగులును తట్టుకునే రకాలైన కొఎ 7602, కొ 7706, 83 ఆర్‌ 23, 87 ఎ 397, 87 ఎ 297, 83 వి 15, 93 ఎ 145, 94 ఎ124, 96 ఎ 136, 96 ఎ 3, 97 ఎ 85, 2003 ఎ 46, 2001 ఎ 63, 2000 ఎ 225, 2000 ఎ 56లను సాగు చేయాలి.

డా|| యం. కిషన్‌ తేజ్‌, శాస్త్రవేత్త, కె . రెడ్డెమ్మ, రీసెర్చ్‌ అసోసియేట్‌, డా|| యం. రెడ్డి కుమార్‌, సమన్వయకర్త, జిల్లా ఎరువాక కేంద్రం, కలికిరి, చిత్తూరు జిల్లా.