ఆరోగ్యకరంగా ఉండటానికి పోషక విలువలు కలిగిన ఆహారం అవసరం. మన ఆరోగ్యానికి అవసరమైనటువంటి విటమిన్లు, పోషకాలు, ఖనిజ లవణాలు, ఇతర ఫైటోహార్మోన్లను రోజువారీగా అందించడంలో కూరగాయలు అతిముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. తక్కువ కేలరీలు, ఎక్కువ విటమిన్లు, ఖనిజ లవణాలతో ఆరోగ్యానికి మారుపేరు పందిరి కూరగాయలు. ఇవి సులువగా జీర్ణమవుతాయి. పైగా శరీరానికి చల్లదనం కూడా. ఇంట్లోనే కూరగాయలు పెంచుకుంటే ఆరోగ్యానికి మంచిది.

పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదలతో ఎక్కువ భూమి ఇంటి నిర్మాణానికి వినియోగించ బడుతుంది. అందువల్ల కూరగాయలను పెంచడానికి భూమి దొరకదు. ప్రత్యేకంగా బహుళ అంతస్థుల భవనాల్లో కుండీలను, కంటైనర్లను, ఉపయోగించి కూరగాయలను పెంచడానికి టెర్రస్‌ గార్డెనింగ్‌ ఒక్కటే మార్గం. టెర్రస్‌పై మొక్కల పెంపకం ఆరోగ్యకరమైన అలవాటు. ఈ కార్యక్రమంలో మనిషి వారానికి 2 గంటలు పనిలో నిమగ్నమయినప్పటికీ, తోటలో ఉన్నప్పుడు ఆనందం, ఆహ్లాదాన్ని పొందుతాడు. నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపడే కూరగాయలను పండించడానికి 40-50 చం.మీ. స్థలం కావాలి. పందిరి కూరగాయల్లో ముఖ్యమైనది సొర, బీర, దోస, కాకర, పొట్టకాయ. వాటిని అన్నికాలాల్లో పెంచుకోవచ్చు. వీటికి పందిరి లేదా జాలీ వంటి సరైన ఆధారం ఇవ్వగలిగితే పెంచుకోవడం సులువే. ఈ పాదులకు సారవంతమైన మట్టిమిశ్రమం, 6-7 గంటలపాటు ఎండ, నాణ్యమైన విత్తనాలు, అన్నిటినీ మించి కొంచెం శ్రద్ద ఉంటే చాలు, ఆరోగ్యకరమైన, రుచికరమైన కూరగాయలను పెంచుకోవడం సులువు.

ఉపయోగించే కంటైనర్లు :

ప్లాస్టిక్‌ కుండీలు, ప్లాస్టిక్‌ సంచులు మరియు గ్రోబ్యాగులు కూరగాయలను పెంచడానికి ఉపయోగించవచ్చు. బంకమన్ను, సిమెంటు కుండీలు అధిక బరువుతో వుంటాయి. అందువల్ల కొత్తగా వస్తున్న ప్లాస్టిక్‌ కుండీలు, సింథటిక్‌ కుండీలు ఎంచుకోవడం మంచిది. ఇవి తేలికా ఉండటమే కాకుండా, నీటిని బాగా నిల్వ ఉంచుకుంటాయి. కుండీలతో అనేక లాభాలున్నాయి. ఎండ ఎక్కువైందనుకుంటేే నీడలోకి జరపవచ్చు. నీడ ఎక్కువై పూత సరిగా లేదనుకుంటే ఎండలోకి మార్చుకోవచ్చు. ఏదైనా తెగులు ఆశించిన మొక్కను అది తగ్గేదాకా మిగిలిన మొక్కల నుంచి దూరంగా తీసుకుపోవచ్చు.

మట్టి మిశ్రమం :

మట్టి మిశ్రమంలో మట్టి, ఇసుక, కంపోస్టు / వర్మికంపోస్టు, కొబ్బరిపొట్టు సమపాళ్ళలో కలుపుకోవాలి. వేపపిండి మరియు జీవన ఎరువులు కూడా వాడితే మొక్కలు బాగా పెరుగుతాయి. మట్టి ఉదజని సూచిక 6-7.5 మద్య ఉండాలి. ఈ మిశ్రమం సారవంతంగా ఉంటుంది. నీరు కూడా నిల్వదు, పొడారిపోదు. చెదలు, వేరు పురుగులు రావు. పైగా ఇది తేలికగా ఉంటుంది కాబట్టి కుండీలను అటూ, ఇటూ జరపడం కూడా సులువే.

వీలైతే ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్‌ లాంటి జీవ శలీంద్రనాశనులను, అజటోబాక్టర్‌, ఫాస్పోబ్యాక్టీరియా లాంటి జీవ ఎరువులను ఒక్కోటి వంద గ్రాముల చొప్పున తీసుకోవాలి. దీన్ని 10 కిలోల పశువుల ఎరువు లేదా కంపోస్టుకు కలిపి, కొద్దిగా నీళ్ళు చల్లి, నీడలో పైన గోనె సంచితో కప్పి, వారం పదిరోజుల తరువాత మట్టి మిశ్రమంలో కలిపితే ఎంతో మంచిది. ఇది ఎక్కువైనా నష్టం ఉండదు. మొక్కకు మేలు చేసే బ్యాక్టీరియా వృద్ది చెంది మొక్కలకు పోషకాలు అదనంగా అందజేయడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.

ఎలా ప్రారంభించాలి ?

కంటైనర్‌ను శుభ్రంగా కడిగి అడుగును మురుగునీరు పోవడానికి రంధ్రాలు చేయాలి.

కుండీలలో పైభాగం, ఒక అంగుళం ఖాళీలో నీరు పెట్టడానికి వీలుగా కుదుర్చుకోవాలి.

సొర, బీర, కాకర, పొట్టకాయ విత్తనాలను నేరుగా కుండీల్లో పాదుకు నాలుగైదు గింజలు నాటుకోవాలి. ఇవి మొలకెత్తిన తరువాత ఆరోగ్యవంతమైన మొక్కలుంచుకొని, బలహీనంగా ఉన్నవాటిని తీసేయాలి.

అనుకూలించే పందిరిజాతి కూరగాయలు :

పంట విత్తే సమయం విత్తన మోతాదు ఒక కుండీకి విత్తిన తరువాత వ్యవధి కోతలు 10చ.మీ. దిగుబడి
పొట్లకాయ జూన్‌-జులై డిసెంబర్‌-జనవరి 2-3 విత్తనాలు 3 నెలలు 7 25-20 కేజీలు
కాకర జూన్‌-జులై డిసెంబర్‌-జనవరి 2-4 విత్తనాలు 3 నెలలు 7 10-15 కేజీలు
దోస జూన్‌-జులై డిసెంబర్‌-జనవరి 2-3 విత్తనాలు 2-3 నెలలు 6-7 20-25 కేజీలు
సొర జూన్‌-జులై 2-4 విత్తనాలు 2-4 నెలలు 5-6 20-25 కేజీలు

టెర్రస్‌పై పందిరి కూరగాయల పెంపకంలో ముఖ్యమైన అంశాలు :

ఇంటిపై రూఫ్‌ని స్ట్రక్చరల్‌ ఇంజనీర్‌ చేత పరీక్ష చేయించాలి. నీరు కారకుండా ఉంటుందని, మొక్కలు, మట్టి, మనుషుల బరువును భరించగలదని దృవీకరించుకోవాలి.

మొక్కలు పెరిగే సమయంలో పందిరి ఏర్పాటు చేసి తీగలు ప్రాకించాలి. ఈ కూరగాయలను పందిరి / జాలి / కంచె మీదికి అల్లించేటప్పుడు పది కణుపుల వరకు పక్క కొమ్మలు, నులితీగలు తీసివేయాలి. మొక్క ఆదారం కోసం కర్ర లేదా జాలికి పురికొసతో కట్టి, తరువాత వచ్చే ప్రతి కొమ్మను 10-12 కణుపుల తరువాత తుంచేస్తే ఎక్కువ కాపు వుంటుంది.

నీటి యాజమాన్యం పట్ల శ్రద్ద వహించాలి. వేడి, పొడి వాతావరణంలో మొక్కలకు రోజుకు రెండు మూడు సార్లు నీరు ఇవ్వాలి.

లోతుగా పెరిగే వేర్లున్న మొక్కలను పెద్ద కుండీలలోను, పైపైన పెరిగే వేర్లున్న మొక్కలను చిన్న కుండీల్లో పెంచాలి.

బరువైన పెద్ద కుండీలను భవనం యొక్క బలమైన భాగంలో (భీములపైన) ఉంచాలి.

గాలి వేగాన్ని తగ్గించే మొక్కలను చుట్టూ పెంచాలి.

ఎరువులు :

క్రమం తప్పకుండా వర్మికంపోస్టు జీవన ఎరువులు వేసుకోవాలి. అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు అవసరమైన ఎరువులను ద్రవ రూపంలో పిచికారీ చేసుకోవాలి.

ట్రైకోడెర్మా కాని, సూడోమోనాస్‌కాని కంపోస్టులో కలిపితే తెగులు రాకుండా ఉంటుంది.

15 రోజలకొకసారి జీవామృతం లేదా 3 శాతం పంచగవ్య ఇవ్వాలి.

2 నెలలు తరువాత ఇంకొకసారి వర్మికంపోస్టు వేయాలి.

సస్యరక్షణ :

మొక్కలను జాగ్రత్తగా గమనించి, కీటకముల గుడ్లను, పురుగులను వేరుచేసి మొక్కలను రక్షించవచ్చు.

ఎండి రాలిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు ఏరివేసి కుండీలను శుభ్రంగా ఉంచాలి.

ప్రారంభంలో తగినంత వేపపిండిని చల్లి శిలీంద్రాలను అరికట్టవచ్చును. ఒక లీటరు నీటికి 5 మి.లీ. వేపనూనె మరియు కొంచెం సబ్బు పౌడరును కలిపి వారానికొకసారి పిచికారి చేయాలి. ఇలా చేయడం వల్ల చీడ పురుగులు, పురుగుల గుడ్లు కూడా నశిస్తాయి.

రసంపీల్చే పురుగుల నివారణకు పసుపుపచ్చ జిగురు అట్టలను అయిదు మొక్కలకు ఒకటి అమర్చుకోవచ్చు.

ఫిరమోన్‌ ట్రాపులను పెట్టుకోవడం వల్ల పండు ఈగ ప్రమాదం ఉండదు.

చీమల నివారణకు పావు కప్పు పంచదార, పావు కప్పు బోరాక్స్‌ కలిపి చీమలు వెళ్ళేదారిలో వేయాలి. బోరాక్స్‌ చీమలకు విషతుల్యం.

పంటకోత :

నాటిన 45-70 రోజుల్లో రకాన్ని బట్టి కాపుకొస్తాయి. ఇలా 2-3 నెలలు పాటు కాస్తూనే ఉంటాయి. పిందె వేసిన పదిరోజుల్లోపు కోసుకుంటే కాయలు లేతగా ఉంటాయి.

ప్రతి రెండు నెలలకోసారి కొత్తగింజలు నాటుకుంటే ఏడాదంతా తాజా కూరగాయలు అందుతాయి.

టెర్రస్‌పై మొక్కలు పెంచేటప్పుడు చేయకూడని పనులు :

కుండీల్లోని మొక్కలకు నీరు అధికంగా ఇవ్వరాదు.

డాబా కప్పుపై ఎక్కువగా బరువుంచరాదు.

మొక్కలను పెంచేటప్పుడు లోతుగా పెరిగే వేరు వ్యవస్థ ఉన్న మొక్కలకన్నా పీచు వేరు వ్యవస్థగల మొక్కలను ఎంచుకోవాలి.

బహువార్షిక మొక్కలను పెంచరాదు. వీటి వేరు వ్యవస్థ డాబా కప్పుకు నష్టం కలిగిస్తుంది.

డి. త్రివేణి, జి. క్రాంతి రేఖ, ఉద్యాన పరిశోధనా స్థానం, వెంకట్రామన్నగూడెం, పశ్చిమగోదావరి జిల్లా