తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విత్తనోత్పత్తిలో వరి జొన్న, సోయాబీన్‌, శనగతో పాటు మరొక ముఖ్యమైన విత్తన పంట మొక్కజొన్న . ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు విత్తన కంపెనీలు, పెద్ద మొత్తంలో హైబ్రీడ్‌ మొక్కజొన్న విత్తనోత్పత్తిని తెలంగాణ, రాయలసీమ, కోస్తా జిల్లాల్లో చేపడుతున్నారు. ముఖ్యంగా కరీంగర్‌లో 10,000 ఎకరాలు ఖమ్మంలో 35,000 ఎకరాలు, పశ్చిమగోదావరిలో 45,000 ఎకరాలు, తూర్పుగోదావరిలో 5000 ఎకరాలు, కడపలో 5000 ఎకరాల్లో మొక్కజొన్న విత్తనోత్పత్తి జరుగుతుంది.

ఈ విధంగా పెద్ద మొత్తంలో విత్తనోత్పత్తి చేపట్టి దేశంలో వివిధ రాల్ర మొక్కజొన్న విత్తన అవసరాలు తీర్చడమే కాకుండా, వివిధ దేశాలకు అంతర్జాతీయ విత్తన దృవీకరణ ద్వారా హైబ్రీడ్‌ మొక్కజొన్న విత్తనాలను ఎగుమతి చేసి విత్తన రైతులకు లబ్ధి చేకూరడమే కాకుండా విత్తన కంపెనీలు కూడా మంచి లాభాలు పొంది రాష్ట్ర విత్తన పరిశ్రమతోపాటు దేశ విత్తన పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుంది.

తెలంగాణలో కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లో పెద్ద మొత్తంలో ఎక్కువ ఏరియా మొక్కజొన్న విత్తనోత్పత్తి కింద ఉండేది. కాని దాదాపు గత సంవత్సరం నుండి మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉధృతి పెరగడం వల్ల రాను రాను అంతర్జాతీయ విత్తన ధృవీకరణ కింద మొక్కజొన్న ఎరియా తగ్గుతూ వస్తుంది.

ఈ నేపధ్యంలో అంతర్జాతీయ విత్తన ధృవీకరణ చేయడానికి ఎలాంటి చీడపీడలు లేని నాణ్యమైన విత్తనం కావాలి. కాబట్టి పశ్చిమగోదావరి జిల్లాలో మొక్కజొన్న విత్తనోత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. ఇందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో సీతానగరం మండలంలోని మునికొడాలి లంక గ్రామంలో అంతర్జాతీయ విత్తన ధృవీకరణ కింద విత్తనోత్పత్తి చేపడుతున్న మొక్కజొన్న పంటను తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ మరియు విత్తనాభివృద్ధి సంస్ధల డైరెక్టర్‌ డా|| కేశవులు సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డా|| కేశవులు మాట్లాడుతూ ఈ కత్తెర పురుగు ప్రభావం జొన్న, మొక్కజొన్న పంటల విత్తనోత్పత్తిపై ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ప్రభావం చూపించిందని తద్వారా విత్తన రైతులు, విత్తనోత్పత్తి దారులు, విత్తనోత్పత్తి చేయడానికి ముందుకు రాకపోవడమే కాకుండా విత్తన ధృవీకరణ కింద మొక్కజొన్న విత్తనోత్పత్తి ఏరియా తగ్గుతూ వస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఈ కత్తెర పురుగు సెప్టెంబరు, అక్టోబరులో పంట వేసుకోవడం వల్ల ఉధృతి ఎక్కువగా వస్తుందని అదే ఆలస్యంగా పంట వేసుకుంటే అంటే నవంబరులో, డిసెంబరులో వేసుకుంటే ఉధృతి తగ్గే అవకాశం ఉంటుందని అదేవిధంగా నీటివసతి లేని నీటి ఎద్దడికి గురయ్యే ప్రాంతాల్లో కూడా ఈ కత్తెర పురుగు ప్రభావం అధికంగా ఉంటుందని గుడ్డు దశలోనే ఉధృతిని గమనించి తగిన జాగ్రత్తలు విత్తన రైతులు తీసుకోవాలని సూచించారు.