అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా పెట్రోలియం ఉపఉత్పత్తుల్లో వాడే సింథటిక్‌ రబ్బరుకు గిరాకీ పెరిగింది. మనదేశంలో 12 లక్షల టన్నుల రబ్బరును వినియోగిస్తుండగా ప్రస్తుతం 7 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తవుతూ, ఇతర రబ్బరు ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల భవిష్యత్‌లో రబ్బరు పంటకు గిరాకీ పెరిగే అవకాశాల మెండుగా ఉన్నాయి. రబ్బరు శాస్త్రీయ నామం హీవియా బ్రాసిలెన్సిస్‌ కాగా రబ్బరు పాలను లేటెక్స్‌ అంటారు. జీవితకాలం 35 సంవత్సరాలు కాగా, ఆర్థిక ఆదాయాన్నిచ్చేది 28 సం|| రబ్బరును కేవలం ఆరేళ్ళ పాటు మనం పెంచగలిగితే అది మనల్ని 35 ఏళ్ళ పాటు పోషిస్తుందని ప్రతీతి. బాగా ముదురు తోటలు అంటే 35 ఏళ్ళు దాటిన రబ్బరు చెట్లను ఫర్నిచర్‌గా ఉపయోగించుకోవచ్చు.

వాణిజ్య పంటైన రబ్బరును కేరళ రాష్ట్రంలో సారవంతమైన నేలలు, అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండడంతో వేలాది ఎకరాల్లో విస్తారంగా సాగుచేస్తున్నారు. దేశీయ రబ్బరు ఉత్పత్తుల్లో 90 శాతం కేరళ నుండే లభిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలోని మారేడుమిల్లి, రంపచోడవరం, వై. రామవరం, అడ్డతీగల, గంగవరం, రాజవొమ్మంగి మండలాల్లోని ఎగువ ప్రాంతాలు అంటే 20-350 సె. ఉష్ణోగ్రత కలిగి, 1500 మి.మీ. వర్షపాతం కలిగిన ప్రాంతాలు రబ్బరు సాగుకు అనువైనవి. సుమారు దశాబ్దం క్రితం 160 ఎకరాల విస్తీర్ణంలో ఐ.టి.డి.ఏ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన రబ్బరు తోటలు ఇటీవలే ఆదాయాన్నిస్తున్నాయి. రబ్బరు తోటల వల్ల ఎకరాకు రూ. 40-70 వేల వరకు ఆదాయం పొందే అవకాశాలున్నాయి. హెక్టారుకు 1000 కిలోల రబ్బరు దిగుబడి వస్తుంది. సగటున హెక్టారుకు రూ. లక్ష వరకు ఆదాయాన్ని రైతులు పొందవచ్చు.

రబ్బరు సాగు :

తొలకరి వర్షం ప్రారంభం కాగానే జూలై-ఆగస్టులో 2I2I2 అడుగుల గోతులను తీసి, గోతులను సేంద్రియ ఎరువును పైనును మట్టిని కలిపి గోతులను నింపి రబ్బరు మొక్కలను నాటాలి. పశువులు మేకలు మొక్కలను తినకుండా చుట్టూ కంచె నాటుకొని, మొక్కలను నీటి ఎద్దడి నుండి సంరక్షించుకోవాలి. క్రిమికీటకాల బారి నుండి సంరక్షించుకోవడానికి ఎసిఫేట్‌ లేదా క్లోరోపైరిఫాస్‌ వంటి తేలికపాటి మందులను లీటరు నీటికి 2 గ్రా. చొప్పున పిచికారి చేసుకుంటే మంచిది. ఈ విధంగా ఆరేళ్ళపాటు పంటను కాపాడుకోవాలి.

రబ్బరు తయారీ :

రబ్బరు పాలను తీసే విధానాన్ని టేపింగ్‌ అంటారు. ఈ టేపింగ్‌ ఉదయం పూట సేకరిస్తే ఎక్కువ పాటు లభిస్తాయి. రబ్బరు చెట్టు కాండంపై మొదలు నుండి సుమారు 2-4 అడుగుల ఎత్తులో కత్తి వంటి సాధనంతో స్ప్రింగు ఆకారంలో గాటు పెట్టాలి. గాటు కింద భాగంలో కొబ్బరి చిప్ప లేదా ప్లాస్టిక్‌ డొక్కును లోహపు తీగతో కట్టి ఉంచాలి. గాటు పెట్టిన 1-2 గంటల్లోపు కొబ్బరి చిప్ప రబ్బరు పాలతో నిండుతుంది. ఈ విధంగా రబ్బరు చెట్ల నుండి సేకరించిన పాలకు ట్రే ఒక్కింటికి 50 గ్రా. చొప్పున ఫార్మాలిన్‌ను కలిపి వెడల్పాటి ట్రేలో పోసి 12 గంటల పాటు ఆరనిచ్చి మరో 12 గంటల పాటు సూర్యరశ్మిలో ఆరనిచ్చి మూడు రోజుల పాటు ఎండనిస్తే రబ్బరు షీటు తయారవుతుంది. ఈ విధానానికి 4 రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం రబ్బరు కిలో ఒక్కంటికి రూ. 170-200 వరకూ ధర పలుకుతుంది.

రబ్బరుతో పలు ఉత్పత్తులు :

చేతి తొడుగులు, బొమ్మలు, జిగురు, కాగితం పరిశ్రమ, కార్పెట్స్‌, రబ్బరు బ్యాండ్స్‌, ఎరేజర్స్‌. వివిధ రకాలైన టైర్ల వంటి ఉత్పత్తుల తయారీలో రబ్బరును విరివిగా ఉపయోగిస్తున్నారు.

పనిదినాలు :

కేరళలో ఏడాదికి 120 పనిదినాలుండగా మన రాష్ట్రంలో ఏడాదికి 70-80 రోజుల వరకు మాత్రమే రబ్బరును గిరిజనులు కేటాయిస్తున్నారు. రోజుకు కేవలం మూడు గంటల పని ఉంటుంది. ఈశాన్య ప్రాంతాల్లో పోలిస్తే రబ్బరు పాల దిగుబడి తక్కువగా ఉంటుంది.

రబ్బరులో అంతర పంటలు :

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రబ్బరులో అంతర పంటగా సాగు చేస్తున్నారు. ఎకరాకు 1500-2000 అనాస మొక్కలు నాటడం ద్వారా రెండో సంవత్సరం నుండి రైతుకు గణనీయమైన ఆదాయం లభిస్తుంది. అనాస నాటిన ఏడాదికే కాపుకు రావడంతో ప్రతి 6 నెలలకు దిగుబడి ఇస్తుంది. అనాస కాకుండా కాఫీ, మిరియాలు, కోకో వంటి పంటలను అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. తేనెటీగల పెంపకాన్ని రబ్బరు తోటల్లో చేపట్టవచ్చు.

మార్కెటింగ్‌ :

గిరిజన ప్రాంతాల్లో రబ్బరు తోటలకు అయ్యే పెట్టుబడిలో 70 శాతం రబ్బరు బోర్డు సమకూరుస్తుండగా ఎకరానికి రూ. 30 వేల రాయితీని ప్రభుత్వం అందచేస్తుంది. ప్రస్తుతం రబ్బరును కేంద్ర రబ్బరు బోర్డు వారి సహాయంతో కేరళలోని కొట్టాయం, హైదరాబాద్‌కు చెందిన హిందూస్తాన్‌ రబ్బరు కంపెనీలు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. 2008 సం||లో 30 వేల ఎకరాల లక్ష్యంతో 5 లక్షల రబ్బరు మొక్కలను ఏజెన్సీ ప్రాంతంలో నాటగా, అవగాహన లోపం వల్ల గిరిజనులు పంటను సంరక్షించుకోలేకపోరు. అయితే ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు రబ్బరు పంటపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, వారిని ప్రోత్సహిస్తే భవిష్యత్‌లో ఉపాధి మార్గం లభిస్తుంది.

విజయ పథంలో గిరిజన రైతు :

ప్రస్తుతం 120 కుటుంబాలు ఈ పంటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. మారేడుమిల్లి మండలంలోని దేవరపల్లి గ్రామంలో ఒక దశాబ్ద కాలం నుండి రబ్బరు పంటలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకళింపచేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకున్న గిరిజన రైతు వెలుగురి మంగి రెడ్డి రెండెకరాల తోటకు సంవత్సరానికి లక్ష రూపాయల పైచిలుకు ఆదాయాన్ని ఆర్జిస్తూ రబ్బరు పంటను సిరులు కురిపించేపంటగా పేర్కొన్నారు. రబ్బరు పంటతో పాటు ఈ రైతు కుటుంబం వాళ్ళు రేయింబవళ్ళు శ్రమిస్తూ పెరటి తోటలు, వరి, మొక్కజొన్న, జీలుగ, బొప్పాయి వంటి పంటలను అంతర పంటలుగా పండిస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.