అనాదిగా మానవులకు, జంతువులకు ఉన్న సంబంధంతోనే ప్రగతి, అధునాతనత్వం, నాగరికత పెరుగుతున్నాయి. జంతు సంబంధమైన ఉత్పత్తుల్లో పాలు, పెరుగు, మాంసం, గుడ్లు మానవజాతికి పోషకాహారం కాగా, అత్యున్నతమైన పట్టుబట్టల ధారణ నాగరికతకు చిహ్నంగా నిలుస్తుంది. అందంతో, సున్నితత్వంతో, తేజోమయంగా వెలిగే పట్టుబట్టల ఉత్పత్తివెనుక ఉన్న చరిత్రను గమనిస్తే మనకెన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తాయి.

మానవుడు వస్త్రాన్ని కనిపెట్టి ఎండ వేడిమల నుండి శరీరాన్ని కాపాడుకునేందుకు ప్రకృతి సహాయంతో చేపట్టిన వస్త్రాల తయారీ ఎన్నో మలుపులు తిరిగి పత్తి, ఇతర నూలు దారాల నుండి పట్టుదారాల ఉత్పత్తి వరకు జరిగిన శ్రమ, పెరిగిన సాంకేతికతను రైతులు మానవ మనుగడకు వినియోగిస్తున్నారు. ప్రపంచంలో డబ్బు, అధికారం, దర్పాలను ప్రదర్శించే ఏకైక సాధనం పట్టు ఉత్పత్తిలో పట్టు పురుగుల ప్రాముఖ్యతను ఈ వ్యాసంలో మనం గమనించవచ్చు.

పట్టు చరిత్రను పరిశీలిస్తే క్రీస్తుపూర్వం 2700 శతాబ్దంలో తొలిసారిగా చైనాలో ఈ పట్టు ఆవిర్భవించినట్లు చారిత్రక కథనాలున్నాయి. సీలింగ్‌-ఛీ అనే చైనా దేశపు మహారాణి దీన్ని కనుగొన్నట్లు చరిత్రకారులు చెబుతారు. ఒకనాడు మలబారు చెట్టుకింద తేనీరు సేవిస్తున్న రాజదంపతులకు కొద్దిదూరంలో ఒక కాయ పడినట్లు కనుగొన్నారు. ఆ కాయను విప్పిచూడగా అందమైన దారాలు కనిపించి, ఆ కాయ వెనుక ఉన్న పట్టు చరిత్రను లోతుగా అధ్యయనం చేసి పట్టుపరిశ్రమ ఆవిర్భావానికి వారు శ్రీకారం చుట్టినట్లు పట్టుకథ ప్రాచుర్యంలో ఉంది. అందుకే సీలింగ్‌-చీ మహారాణిని మదర్‌ఆఫ్‌ సిల్క్‌గా అభివర్ణించడం కూడా జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా రహస్యంగా చైనాలోనే ఉండిపోయిన ఈ పట్టు సంస్కృతి అనంతరం భారతదేశానికి వ్యాపించింది. ఆంగ్లేయులు మనదేశాన్ని పాలించడానికి ముందు అగ్గిపెట్టెలో భద్రపరచుకునే విధంగా అత్యద్భుత ప్రావీణ్యంతో పట్టుచీరలను భారత నేతగాళ్ళు నేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేవారని ప్రతీతి.

మన భాగ్యనగర సమీపంలోని పోచంపల్లి ఒకప్పుడు 'పట్టు పట్టణంగా' వ్యవహరించబడేది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో ధర్మవరం పట్టణం పట్టుచీరల ఉత్పత్తికి, నాణ్యతకు పేరుగాంచింది. గ్రామీణ ఉపాధికి, తక్కువ నీటితో ఎక్కువ ఫలసాయాన్ని సాధించేందుకు అనువైన మెట్ట ప్రాంతాల్లో అనువైన మల్బరీ తోటల్లో పట్టుపురుగుల పెంపకాన్ని ప్రారంభించి రైతులు రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మంచి దిగుబడులను సాధించి నిలదొక్కుకుంటున్నారు. వ్యవసాయం దండగని ఇతర వృత్తులకు తరలి వెళ్ళిపోతున్న కుటుంబాలు కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ప్రోత్సాహకాలతో పట్టుసాగుకు ముందుకువస్తున్నారు.

పట్టు - ప్రయోజనాలు :

పట్టు బట్టలు చక్కగా మెరుస్తూ ధృడంగా, తేలికగా, హుంగాదా ఉంటాయి.

ఇవి ఉష్ణాన్ని బయటికి పోనీయవు.

వైద్య సేవలకు కూడా పట్టు దారాలు ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్‌ సమయంలో గాయాలను కలిపి కుట్టడానికి వీటినే ఉపయోగిస్తారు.

పారాషూట్స్‌, బెలూన్ల తయారీకి పట్టును వినియోస్తారు.

వివాహ వేడుకల్లో మన దేశంలో సాంప్రదాయకంగా పట్టును వినియోగించడం తప్పనిసరి.

ప్రజల జీవన శైలిలో పట్టు ఒక భాగంగా మారిపోయింది.

పట్టు సంవర్థనం అంటే మల్బరీ చెట్లను పెంచడం, గుడ్లని సేకరించడం, గొంగళి పురుగులను పెంచడం, కొకూన్లను ఉత్పత్తి చేసి చివరకి పట్టుదారాలను దాని నుండి లాగడాన్నే పట్టు సంవర్థనంగా పిలుస్తారు.

మల్బరీ సాగుకు నేలల ఎంపిక :

మల్బరీ సాగుకు నేల సారవంతమైనదిగా ఉండాలి అనగా మొక్క పెరుగుదలకు అవసరమైన పోషకాలను నిరంతరం సరఫరా చేయగలగాలి.

నీరు నిల్వ వుండకుండా, తేమను బాగా నిల్వచేసే సామర్థ్యంతో వేర్లకు ఆధారాన్నిచ్చేదిగా ఉండాలి.

నేల కొద్దిగా ఆమ్లలక్షణాలు కలిగి ఉండాలి (6.2-6.8 ఉదజని సూచిక)

నేలలో ఎటువంటి హానికర లక్షణాలు ఉండకుండా జాగ్రత్త వహించాలి.

మల్బరీ మొక్కలు అన్ని రకాల నేలల్లోను పెరుగుతాయి. కాని ఇసుక మిశ్రిత ఎర్రనేలలో బాగా పెరుగుతాయి.

మల్బరీ తోటల సాగుకు ఎంపిక చేసుకోబడిన నేలలో అవసరమైన పోషక పదార్థాలను నిరంతరం మొక్కలకు అందించటంలో తోడ్పడే సూక్ష్మక్రిమలు కలిగి ఉండటం అత్యంతవసరం.

మల్బరీ తోటలను పెంచటానికి ముందుగా భూసార పరీక్షలు చేయించి అధికారుల సూచనల మేరకు నేల భౌతిక మరియు రసాయనిక లక్షణాలను మల్బరీ తోటల పెంపకానికి అనువుగా మార్పుచేయాలి.

భూసార పరీక్షకు మట్టిని సేంద్రియ మరియు రసాయనిక ఎరువులు వేసినా తరువాత సేకరించారాదు.

భూసార పరీక్షల కొరకు, నేలను ''హ'' ఆకారంలో 30 సెం.మీ.ల లోతు మరియు 60 సెం. మీల లోతు నుండి తీసిన మట్టి ఉండే విధంగా సేకరించాలి.

మట్టి నమూనాతో పాటు తప్పనిసరిగా రైతు పేరు, చిరునామా భూమి సర్వే నంబరు, సేకరించిన తేది మరియు ఎంత లోతు నుండి సేకరించిన మట్టి తదితర వివరాలు పొందుపచాలి.

మల్బరీ సాగుకు ఆచరణీయమైన సాగుబడి విధానాలు :

సారవంతమైన ఎర్ర, ఒండ్రు మట్టినేలలు మల్బరీ సాగుకు శ్రేష్టమైనవి. భూసార పరీక్షలు చేయించి, తదనుగుణంగా నేలను సవరించి మల్బరీతోటలను సాగు చేయాలి.

నేల రకాన్ని మరియు నీటి లభ్యతలకు అనుగుణంగా మేలైన మల్బరీ వంగడాలను ఎంపిక చేసుకోవాలి.

మల్బరీసాగుకు పుల్లలు (కటింగ్స్‌) నాటడంకన్నా నర్సరీ ద్వారా పెంచిన నారు మొక్కలను (శాప్లింగ్స్‌) నాటడం లాభదాయకం. మల్బరీ పుల్లలను 6-8నెలల వయస్సు గల మల్బరీ కొమ్మల నుండి మాత్రమే ఎన్నుకోవాలి.

జనవరి/ఫిబ్రవరి నెలల్లో పెంచిన నారుమొక్కలు డిసెంబర్‌ తర్వాత నాటుటకు అనువుగా ఉంటాయి.

మల్బరీఆకు దిగుబడి ముఖ్యంగా క్రొత్త వంగడాలతో పాటుగా మొక్కకు మొక్కకు మధ్యగల స్థలావకాశముపై ఆధారపడి ఉంటుంది. ఎంత స్థలావకాశం ఉంటే అంత బాగా గాలి వెలుతురు సోకి ఏపుగా, బలంగా, ఆరోగ్యంగా పెరిగి ఎక్కువ కొమ్మలతో మందంగా ఉన్న వెడల్పాటి నాణ్యమైన ఆకు దిగుబడి పొందవచ్చు.

పట్టు పురుగుల పెంపకం :

వాణిజ్య పంటల ద్వారా అధిక దిగుబడిని సాధించడంలో నాణ్యమైన విత్తనాల ప్రాధాన్యత అందరికీ తెలిసినదే. అదే విధంగా పట్టుపరిశ్రమలో కూడా నాణ్యతతో కూడిన అధిక దిగుబడిని సాధించేందుకు మేలైన పట్టుపురుగు గుడ్ల రకాలను ఎంపిక చేసుకోవాలి. మేలైన పట్టుపురుగు గుడ్లను ఎన్నుకొన్న తరువాత వీటిని జాగ్రత్తగా రవాణా చేయాలి.

పట్టుగుడ్ల రవాణా మరియు పొదిగింపు :

పట్టు గుడ్లను విక్రయ కేంద్రాల నుండి చల్లని వేళల్లో మాత్రమే ప్రత్యేకించి ఉదయం లేక సాయంత్రపు వేళల్లో గుడ్ల రవాణాకు రూపొందించబడిన పెట్టెల్లో ఉంచి రవాణా చేయాలి.

పట్టుగుడ్ల రవాణా కాలంలో వాటికి చల్లని వాతావరణం అంటే 250 సెం.ఉష్ణోగ్రత మరియు 80-90 శాతం గాలిలో తేమ ఉండేలా చూసుకోవాలి.

పట్టు గుడ్లను విక్రయ కేంద్రాల నుండి తెచ్చిన తరువాత 2 శాతం ఫార్మలిన్‌ ద్రావణంలో 10 నిమిషాలు ముంచి శుభ్రం చేయడం ద్వారా గుడ్లపై ఉన్న రోగ క్రిములను నాశనం చేయవచ్చు. ఇందుకు గాను సెరిప్లస్‌ ద్రావణాన్ని కూడా ఉపయోగించవచ్చు.

గుడ్లను రోగ నిరోధకం చేసిన తట్టల్లో పలుచగా పరచి గుడ్ల పొదిగింపుకు ఉంచాలి.

గుడ్లను పొదిగించుటకు ఆ గదిలో 250 సెం.ఉష్ణోగ్రత మరియు 75-80 శాతం గాలిలో తేమ ఉండేలా చూసుకోవాలి.

గుడ్లు నీలి రంగులోకి మారేంత వరకు ఆ గదిలో రోజుకు 16 గంటల వెలుతురు ఉండేటట్లు చూసుకోవాలి.

గుడ్లు నీలి రంగులోకి మారిన వెంటనే వ్యాధి రోగనిరోధం చేసిన నల్లని గుడ్డలో వెలుతురు సోకకుండా పూర్తిగా చుట్ట చుట్టాలి. ఈ విధంగా చేయడాన్ని బ్లాక్‌ బాక్సింగ్‌ అంటారు. ఇలా చేయడం వల్ల చాకీ కట్టేరోజున గుడ్ల నుండి పురుగులు ఒకేసారి వెలువడతాయి.

నిర్ణీత సమయంలో ఆరోగ్యవంతమైన పట్టుపురుగులు గుడ్ల నుండి ఎక్కువగా పగలడానికి గుడ్లను అనువైన వాతావరణ పరిస్థితుల్లో పొదిగించాలి.

చాకీ కట్టే రోజున ఉదయాన్నే నల్లని బట్టను తీసివేసి వెలుతురులో ఉంచడం వల్ల అన్ని పురుగులు గుడ్ల నుండి ఒకేసారి బయటికి వస్తాయి. వాటిని ఉదయం 10 గంటలకు కత్తిరించిన లేత ఆకులతో చాకీ కట్టాలి.

చాకీ పట్టుపురుగులు పెంపకం :

పట్టు పురుగుల జీవిత చక్రంలో గల లార్వా దశ మొత్తాన్ని 5 దశలుగా విభజించవచ్చు. మొదటి రెండు దశల పురుగుల పెంపకాన్ని చాకీ పురుగుల పెంపకమని చివర అంటే 4, 5 దశల పురుగుల పెంపకాన్ని పెద్ద పట్టుపురుగుల పెంపకం అని మూడవ దశ పురుగులను మధ్యంతర దశ అని పిలవవచ్చు.

పట్టు పురుగుల పెంపకంలో చాకీ పురుగుల పెంపకం చాలా కీలకమైనది. అంటే పట్టు పంటలు సఫలం కావడం మరియు పట్టుగూళ్ళ అధికోత్పత్తి సాధించడం చాలా వరకు చాకీ పురుగుల పెంపకం మీద ఆధారపడి ఉంటుంది.

సాధారణంగా ఒకటవ, రెండవ మరియు మూడవ దశ పురుగులు చాలా సున్నితంగా ఉండి చాలా సులభంగా రోగాల బారిన పడడం వల్ల వీటి పెంపకానికి ప్రత్యేక శ్రద్ధ, యాజమాన్యత మరియు శాస్త్రీయ పెంపక విధానాలను తప్పనిసరిగా పాటించడం వల్ల మంచి నాణ్యత గల పట్టుగూళ్ళను పొందవచ్చు.

తెలంగాణ 'బైవోల్టు' పట్టుకు జాతీయ అవార్డు :

తెలంగాణ రాష్ట్రంలో పట్టుకు ప్రాధాన్యత పెరుగుతుంది. గడచిన కాలంలో కంటే నేడు సాగు విస్తీర్ణం గనణీయంగా పెరుగుతూ వచ్చింది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 3,176 ఎకరాలు ఉన్న మల్బరీ సాగు రాష్ట్రం ఏర్పడ్డాక 10,645 ఎకరాలకు విస్తరించింది. ప్రభుత్వం పట్టు మల్బరీలపై దృష్టి సారించి విరివిగా రైతులకు సబ్సిడీ అందిస్తూ మల్బరీ తోటల పెంపకంలో రైతులకు అవగాహన కల్పిస్తూ రావడం వల్ల నేడు దేశంలోనే బైవోల్టు పట్టును తెలంగాణ రాష్ట్రంలో 5,874 మె.టన్నులు ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇటీవల కాలంలో ఢిల్లీలో జరిగిన ''సర్జింగ్‌ స్కిల్‌'' సదస్సులో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మాస్వరాజ్‌, జౌళి శాఖా మంత్రి స్మృతి ఇరానీ చేతులమీదుగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ముఖ్యకార్యదర్శి పార్థసారధి ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ సంచాలకులు ఎల్‌. వెంకట్రామారెడ్డిలు అవార్డును అందుకున్నారు.

పట్టు ప్రస్థానం :

సహజ అడవుల్లో పట్టు తానంతట తానుగా పురుగుల ద్వారా ఉత్పత్తి చేసుకునేది. నాలుగు దశల్లో తన జీవన సరళిని 30 రోజుల్లో పూర్తి చేసుకొని కోశస్థదశల్లో ఉన్నప్పుడు పట్టుపురుగు తన రక్షణ కొరకు ఏర్పాటు చేసుకున్న గూడు నేడు మానవ పనుగడకు ఉపయోగపడే పట్టుదారంగా ఉపయోగపడుతుంది. పట్టుదారంతో వివిధ రకాల వస్త్రాల తయారీకి ఉపయోగించడం జరుగుతుంది. దీనిలో నాణ్యతా సరళి పెంచేందుకు పట్టు పురుగుల పెంపకాన్ని వ్యాపార సరళిలో పెంపకం మొదలు పెట్టారు పట్టు పురుగుల పెంపకం మొట్ట మొదటి సారి చైనా దేశంలో ఈ పెంపకాన్ని ప్రారంభించారు. అక్కడి నుండి ప్రారంభమైన పెంపకం చిన్న చిన్నగా వివిధ దేశాలకు విస్తరించింది. భారతదేశంలో మొట్టమొదటి సారిగా ఉత్తర ప్రాంతాలైన కాశ్మీర్‌, హిమాచల్‌, తూర్పు ప్రాంతాలైన, బెంగాల్‌, అస్సాం వంటి రాష్ట్రాల్లో పట్టు సాగు విస్తరించింది. అటు నుండి దక్షిణ రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, తెలంగాణ వంటి ప్రాంతాల్లో విస్తారంగా పట్టుసాగు వ్యాపించడం జరిగింది.

దేశంలోని 29 రాష్ట్రాల్లో 2,23,926 హెక్టార్ల విస్తీర్ణంలో మల్బరీ తోటలు సాగు చేస్తూ పట్టు పురుగుల పెంపకం జరుగుతుంది. ఈ మల్బరీ ఆకులను పట్టు పురుగుల పెంపకం కొరకు ఆహారంగా ఉపయోగించి రెండు రకాల పట్టు గూళ్ళను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. 1 మల్టీ వోల్టెన్‌ క్రాస్‌ బ్రీడ్‌ 2 బైవోల్టు అని పిలుస్తారు.

2017-18 సంవత్సరంలో దేశం మొత్తంలో కలిపి 22,066 మె. టన్నులు ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దీనిలో 5874 మె.ట. బైవోల్టు పట్టును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. బైవోల్టు పట్టు గూళ్ళలో దారం పొడవుగా ఉంటుంది. సహజంగా మెరుపుతో కూడి, నాణ్యత కలిగి ఉంటుంది

అనంత కరువుకు ప్రత్యామ్నాయం... పట్టు సాగు :

తీవ్రమైన వర్షాభావం, ఎడారిని తలపించే పంట పొలాలకు నిరంతరం క్షామంతో క్షోభించే అనంతపురం జిల్లాలో పట్టుసాగు రైతులకు మంచి ఊరటనిస్తున్నది. ఎకరాకు 60 నుండి లక్ష రూపాయల వరకు ఆదాయాన్నిచ్చే పట్టుసాగు రైతులకు ఆలంబనగా నిలుస్తున్నది. బెంగుళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కేంద్ర సిల్కుబోర్డు, ధర్మవరంలోని పట్టు మార్కెట్‌తో అనుసంధానమైన హిందూపూర్‌, పెనుగొండ, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎక్కువ గ్రామాల ప్రజలు పట్టుసాగుతోనే తమ జీవితాలను పెనవేసుకున్నారు. మామూలుగా పుచ్చ, టమాట ఇతర పండ్లు, కూరగాయలు సాగు చేసి జీవనాన్ని గడిపే రైతన్నలు అనేక ఆటుపోట్లకు గురై, వర్షాభావానికి బలై, పట్టుసాగునే ఆశ్రయించి ఉపాదిపొందుతున్నారు. దేశంలోనే పేరెన్నికగన్న ధర్మవరం పట్టు మార్కెట్‌ వీరి ఆశలకు ఊపిరిపోస్తుంది. ఇటీవల సిల్కు దారాలు తీసే నిపుణులైన కార్మికుల కొరతతో కొంత గిట్టుబాటు తగ్గినా రైతులకు నిఖర ఆదాయం లభించడంతో అందరూ పట్టుసాగు వైపే మొగ్గుతున్నారు. అగ్రిక్లినిక్‌ ప్రతినిధి ఇటీవల ఆయా నియోజకవర్గాల్లోని పలు గ్రామాలను సందర్శించినప్పుడు రైతుల అనుభవాలను సేకరించి ఇతర రైతులకు తోడ్పడే విధంగా వాటిని ఈ మాసపత్రికలో నిక్షిప్తం చేయడం జరిగింది.

తక్కువ నీరు, తక్కువ ఖర్చు, తక్కువ కూలీల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టు సాగు ప్రాముఖ్యాన్ని గుర్తించి సాగులోకి దిగుతున్నారు. ఊళ్ళకు ఊళ్ళే పొలాలన్నీ మల్బరీ సాగుతో పచ్చదనాన్ని పొంది రైతులకు సిరులు కురిపిస్తున్న నేపద్యంలో కారుచీకటిలో కాంతిరేఖలా కరువుసీమపై పట్టు సాగుపై రైతుల పట్టు పెరిగింది.

అనంతపురం జిల్లా, రాప్తాడు నియోజకవర్గం, తిమ్మంపేటలో మొత్తం గ్రామంలోని రైతులంతా ప్రస్తుతం పట్టుసాగే వృత్తిగా పట్టుదలతో ముందుకు వెళుతున్నారు. ఈ గ్రామంలో విద్యావంతులైన రైతు కుటుంబానికి చెందిన మంజునాధ రెడ్డి గత అనేక సంవత్సరాలుగా పట్టుసాగుతోనే తన జీవిత గమనాన్ని కొనసాగిస్తున్నారు. గత ఐదేళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు రాకపోయినప్పటికీ, పట్టుగూళ్ళ పెంపకాన్ని ఆయన మానుకోలేదు. ఎంతో తేమ శాతం కావలసిన మల్బరీ సాగుకు బిందుసేద్య పద్ధతిలో సాగుచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ధర్మవరం పట్టు మార్కెట్‌లో ఉత్పత్తి కొనుగోలుకు అవకాశాలు మెండుగా ఉండడంతో, ఈ బహువార్షిక మొక్కలు నాటిన సంవత్సరం, షెడ్లు నిర్మించుకున్న తొలిదశలో తప్ప సాగుకు పెద్దగా ఖర్చులేని సందర్భంలో మంచి పురుగులను తెచ్చి ఉత్పత్తిని పెంచుకొని వ్యవసాయంపై విశ్వాసంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు.

మల్బరీ మొక్కల పెంపకం ప్రారంభించి, బహువార్షికాలు ఫలసాయం తీసుకుంటూ అప్పుడప్పుడూ సస్యరక్షణ మందులు, పట్టుపురుగుల కొనుగోలు ఖర్చులు కలుపుకొని ఎకరాకు 10-15 వేలు పంటకు ఖర్చు కాగా నికరంగా 300 కిలోల పట్టుగూళ్ళను అమ్ముకొని ఖర్చులు పోను కనీసం రూ. 60-70 వేల ఆదాయాన్ని పొందుతున్నట్లు మంజునాథ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ సహకారం ముందులాగా లభిస్తే పురుగులు, వాటి పోషకానికి, రోగ నివారణకు సంబంధించిన మందులపై సబ్సిడీ ఇస్తే మరింత ఆదాయాన్ని పొందవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఈ ప్రోత్సాహకాలు భారీ ఎత్తున లభిస్తున్నట్లు మంజునాధరెడ్డి తెలిపారు.

అదే గ్రామానికి చెందిన రైతు విశ్వనాధ రెడ్డి మాట్లాడుతూ నాలుగు నెలల క్రితం వరకు తాను పుచ్చ, టమాట పంటలను సాగు చేసేవాడినని, తీవ్రమైన నీటి ఎద్దడి, గిట్టుబాటు ధరలు లభించకపోవడం, ఖర్చులు అధికమైపోవడంతో తాను మల్బారు పెంపకం చేపట్టానని, తక్కువ ఖర్చు, తక్కువ నీటి అవసరాలు, సిల్కుబోర్డు, ధర్మవరం పట్టు మార్కెట్ల నుండి పట్టుగూళ్ళ కొనుగోలుకు అవకాశం ఉండడంతో ప్రస్తుతం పట్టు ఉత్పత్తి లాభసాటిగా ఉందని, నాలుగు ఎకరాల పొలంలో పట్టు సాగు చేస్తూ ప్రతి ఎకరన్నరకు రూ. లక్ష ఆదాయాన్ని పొందుతున్నానని సంతృప్తి వ్యక్తం చేశారు. మరే పంటలోనూ లేనంత సునాయాసంగా సాగును నిర్వహిస్తూ, ఆదాయాన్ని పొందడం ఆనందంగా ఉందని తెలిపారు.

కొండాపురంపై కొండంత 'పటు'్ట :

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం, కొండాపురం రైతులకు పట్టు సాగు కొండంత ఆనందాన్నిస్తుంది. గ్రామంలోనే 150 మంది రైతులు గత కొన్నేళ్ళుగా పట్టుసాగు చేసి గణనీయమైన ఆదాయాన్ని పొందుతూ వస్తున్నారు. వారిలో ముఖ్యమైన రైతు శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం మార్కెట్‌ పరిస్థితి అంత బాగాలేనప్పటికీ మంచి ఆదాయాన్నే పొందుతున్నట్లు తెలిపారు. పట్టు పురుగులను సాకేందుకు 150 మందిలో 40 మందికి తప్ప అందరికీ షెడ్లు ఉన్నట్టు తెలిపారు.

నీటి సరఫరా బాగా ఉండి, భూగర్భ జలాల మట్టం పెరిగితే ఇంకా గణనీయమైన ఫలితాలను సాధించవచ్చునని వివరించారు. తనకు ఊహ తెలిసిప్పటి నుండి తమ కుటుంబానికి పట్టు సాగే ప్రధాన ఆదాయ వనరుగా ఉందని తెలిపారు. ప్రభుత్వ సబ్సిడీలు గత అనేక నెలలుగా పెండింగ్‌లోనే ఉండడం విచారకరమన్నారు. శ్రీనివాసరెడ్డితో పాటు మరో విద్యావంతుడైన నిరుద్యోగి వంశీ కూడా పట్టు రైతుగా తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు.

- వై.వి నరసింహారావు, అసోసియేట్‌ ఎడిటర్‌.

పి. మౌనిక, ఎజిబిఎస్‌సి