కంది మన రాష్ట్రంలో దాదాపు 12 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, 2 లక్షల టన్నుల ఉత్పత్తినిస్తుంది. ఎకరాకు 168కిలోల సరాసరి దిగుబడినిస్తుంది. పత్తి, మిరప పొగాకులకు ప్రత్యామ్నాయంగా అలాగే పెసర, మినుము, సోయాచిక్కుడు, వేరుశనగ లాంటి పైర్లతో మిశ్రమ పంటగా కందిని ఖరీఫ్‌ లో పండించవచ్చు. కందిని సాధారణంగా తొలకరి పంటగా అనేక ఇతర పంటలతో కలిపి మిశ్రమ పైరుగా సాగుచేస్తుంటారు. కందిని రబీలో కూడా పండించవచ్చు. నీరు త్వరగా ఇంకిపోయే గరప, ఎర్ర రేగడి, చల్కా నేలల్లో మరియు మురుగు నీరు పోయే వసతి గల నల్ల రేగడి నేలల్లో సాగు చేసుకోవచ్చు. చౌడు నేలలు, నీటి ముంపుకు గురయ్యే నేలలు పనికి రావు.

డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ బయో టెక్నాలజి (డి.బి.టి)- బయోటెక్‌ కిసాన్‌ హబ్‌ :

నూనె గింజలు, అపరాలలో ఉత్పాదకతను పెంచడానికి డి.బి.టి వారు బయోటెక్‌ కిసాన్‌ హబ్‌ అనే పథకాన్ని రూపొందించడం జరిగింది. పైలెట్‌ పథకంలో భాగంగా భారతదేశంలో 4 విశ్వవిద్యాలయాలకు మాత్రమే ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. డి.బి.టి బయోటెక్‌ కిసాన్‌ హబ్‌ అనే పథకాన్ని డి.బి.టి వారి ఆర్ధిక సౌజన్యంతో ఏరువాక కేంద్రం బనవాసి వారు అమలుపరుస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఏరువాక కేంద్రం వారు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, లామ్‌, గుంటూరు వారు రూపొందించిన ఎల్‌.ఆర్‌.జి -52 అనే బ్రీడరు కంది రకాన్ని కర్నూలు జిల్లాలో 20 మంది రైతులు ఒక్కో ఎకరా చొప్పున ప్రయోగాత్మకంగా సాగుచేయించడం జరిగింది.

శ్రీరాములు అనే రైతు పొలంలో ఉత్తమ ఫలితాలు :

ఎమ్మిగనూరు మండలంలోని కలుగొట్ల గ్రామంలో రైతు శ్రీరాములు తన ఎకరం పొలంలో ఎల్‌.ఆర్‌.జి-52 అనే కంది రకాన్ని సాగుచేశారు. సాధారణంగా ఈ రకం ఎండు తెగులును సమర్థవంతంగా తట్టుకొని, 160-170 రోజుల్లో కోతకు వచ్చి ఎకరాకు 9-10 క్వి. దిగుబడినిస్తుంది.రైతు శ్రీరాములు 2018 ఆగష్టు 8వ తేదీన విత్తనం వేయడం జరిగింది. ఎకరాకు 4 కిలోల విత్తనం వేయడం జరిగింది. విత్తేముందు దుక్కిలో 2 టన్నుల పశువుల ఎరువు, 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి, 10 కిలోల వేపచెక్క పొలంలో చల్లి కలియదున్నారు. విత్తిన 20 రోజుల తరువాత గుంటకతో అంతరకషి చేశారు. విత్తిన 30 రోజుల తరువాత 1 లీటరు వేపనూనె 500 మి.లీ. క్లోరిపైరిఫాస్‌ కలిపి పిచికారి చేశారు.

సస్యరక్షణలో భాగంగా లింగాకర్షణ బుట్టలు, పసుపు మరియు నీలం రంగు జిగురు అట్టలను పొలంలో ఉంచి పురుగు ఉధతిని గమనించడం జరిగింది. విత్తిన 45 రోజులప్పుడు నీటితడి పెట్టడం జరిగింది. విత్తిన 85-90 రోజుల తరువాత కాయ, ఈగ నివారణకు ప్రొఫెనోఫాస్‌ 400 మి.లీ. ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేశారు. విత్తనం విత్తడం దగ్గర నుంచి కోత వరకు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు పంటను పర్యవేక్షిస్తూ తగిన సూచనలు అందించారు. ఈ పంటను జనవరి 9న నూర్చడం జరిగింది ఎకరాకు 9.8 క్వి (14 బస్తాలు ఒక్కో బస్తా 70 కిలోలు దిగుబడి వచ్చింది. గింజ నాణ్యత అధికంగా ఉండటం వల్ల రైతుకు ఒక్కో క్వి రూ.5,000 చొప్పున అమ్మగా రూ.49,000 ఆదాయం వచ్చింది. పంటసాగుకు ఎకరాకు రూ. 18,840 ఖర్చయింది. సాగు ఖర్చులు పోనూ రైతుకు రూ. 30,160 నికరాదాయం లభించింది.

ఆదే విధంగా ఈ రైతు మరో ఎకరంలో ఎల్‌.ఆర్‌.జి-41 రకాన్ని కూడా సాగుచేశాడు. పైన పేర్కొన్న విధంగానే సాగు, యాజమాన్య పద్ధతులు పాటించాడు. ఇందులో ఒక ఎకరానికి 7.2 క్వి (10.3 బస్తాలు ఒక్కో బస్తా 70 కిలోలు) దిగుబడి వచ్చింది. సాగు ఖర్చు రూ. 19,840 అయింది. ఒక్కో క్వి రూ. 5,000 అమ్మగా, రూ. 36,000 ఆదాయం వచ్చింది. సాగు ఖర్చులు పోనూ రైతుకు రూ. 16,160 నికరాదాయం లభించింది.

కంది రకాల సాగు ఖర్చు వివరాలు (ఎకరాకు)

అంశం ఎల్‌.ఆర్‌.జి -52 ఎల్‌.ఆర్‌.జి -41
దుక్కి దున్నడానికి 2,000/- 2,000/-
సేంద్రీయ ఎరువులు 4,000/- 4,000/-
విత్తనం 6,00/- 6,00/-
విత్తనం వేయడానికి 2,000/- 2,000/-
కలుపు మరియు అంతరకృషి 3,000/- 3,000/-
పురుగు మందులు (2సార్లు) 3,500/- 4,500/-
ఎరువులు 1,420/- 1,420/-
కట్టెపీకడానికి & నూర్పిడి 2,320/- 2,320/-
మొత్తం ఖర్చు 18,840/- 19,840/-
దిగుబడి ఎకరాకు (బస్తా ఒక్కోటి 70 కి.) 9.8/- 7.2/-
క్వి (ధర) 5,000/- 5,000/-
వచ్చిన ఆదాయం 49,000/- 36,000/-
నికరాదాయం 30,160/- 16,160/-

యస్‌. నజ్మ, రీసర్చ్‌ అసోసియేట్‌, (సస్య ఉత్పత్తి), బి. షైని ప్రియాంక, రీసర్చ్‌ అసోసియేట్‌ (సస్య రక్షణ), డా. జి. ప్రసాద్‌ బాబు, కో-ఆర్డినేటర్‌,

కె. రాఘవేంద్ర చౌదరి, విస్తరణ శాస్త్రవేత్త, ఏరువాక కేంద్రం, బనవాసి, ఫోన్‌ : 9989623810