తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవనశాఖ కృషి అద్భుతంగా ఉందని ఇక్కడి రైతులకు నూతన సాంకేతిక సాగు విధానం అందించడంలో ముందుందని కూరగాయల సాగులో వీరు చేపట్టే విధానం రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ఉద్యాన సంచాలకులు ఆర్‌.సి. శ్రీవాత్సవ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యానవన శాఖ చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అధ్యయనం చేసేందుకు ఉత్తరాఖండ్‌ ఉద్యానవన శాఖ బృందం రాష్ట్రంలో పర్యటించింది. ఈ సందర్భంగా వారు సందర్శించి పరిశీలించిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ జీడిమెట్ల, ములుగు ప్రాంతాల్లో అధునాతన శాస్త్ర, సాంకేతిక పద్ధతుల్లో చేపట్టిన విధానం పండ్లతోటల ప్రదర్శన క్షేత్రాలు, నాణ్యమైన కూరగాయల నారు తయారు విధానం ఎంతో అద్భుతంగా ఉందని తద్వారా ఈ రాష్ట్ర రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. నాణ్యమైన వంగడాలను గుర్తించి రైతులకు అందించడంలో ఇక్కడి ఉద్యానవనశాఖ చేపట్టిన ప్రక్రియ దేశానికే ఆదర్శమని అన్నారు.

వాతావరణానికి తగిన విధంగా పంటలను ఎంచుకోవడంలో రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించేందుకు సిబ్బంది తగు ఏర్పాట్లను చేసుకోవడం రైతులకు పంటలపై అవగాహన కల్పించేందుకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఎంతో దోహదపగుతుందని ఇక్కడ రైతులు పండించిన పంటలతో పాటు, పూలను సైతం ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో ఇక్కడి పూలకు మంచి రేటును కల్పించడంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రైతులను అబ్బునపరుస్తున్నాయని తెలిపారు.

సంక్షేమ పథకాలను వెల్లడించిన కమీషనర్‌ వెంకట్రామి రెడ్డి :

ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వాటి పనివిధానాలను ఉత్తరాఖండ్‌ బృందానికి వివరించారు. కోట్లాది రూపాయలతో రైతులకు ఉపయోగపడే సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లను నిర్మించడం ద్వారా రైతులు ఉత్సాహంతో పంటలు పండిస్తున్నారని ఈ విధానం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని ప్రయోగాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ప్రతి రైతు ఉత్సాహంగా నూతన సాంకేతిక సాగు విధానాన్ని కొనసాగిస్తున్నారని తక్కువ ఖర్చుతో, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఫల సాయాన్ని పొందుతున్నారని ఒక రైతు కుటుంబం ఏడాది పొడవునా ఒక ఎకరంలో పనిచేసి ఆర్థికంగా అభివృద్ధి చేందేందుకు ఎంతో దోహదపడిందని తెలిపారు. రైతులకు డ్రిప్‌ ఇరిగేషన్‌, పాలిహౌస్‌ నిర్మాణాలకు ప్రభుత్వం 100 శాతం సబ్సిడీ సన్న, చిన్నకారు రైతులకు అందిస్తూ పాలిహౌస్‌ రైతులను ప్రోత్సహించడంతో తెలంగాణ రాష్ట్రంలో 1200 పైగా పాలిహౌస్‌ రైతులు సాంకేతిక పద్ధతిలో సాగు చేస్తున్నారని వివరించారు.

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో 600 పైగా పాలిహౌస్‌లు నిర్మించామని ఇక్కడి రైతులు పండించే జెర్బెర, కార్నేషన్‌ వంటి విదేశీ అలంకరణ పుష్పాలను విరివిగా ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారని వివరించారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ద్వారా రైతు పంట కాలనీలు ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు అవసరమయ్యే పండ్లు, కూరగాయలను పండించడం జరుగుతుందని ఉద్యాన పంటల రైతులను ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో 'రైతు బంధు' పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తుందని ఎకరానికి రూ. 4 వేలు చొప్పున ఖరీఫ్‌కి, రబీకి కలిపి రూ. 8 వేలు రైతుకు పెట్టుబడి సాయాన్ని బ్యాంకుల ద్వారా అందిస్తుందని వివరించారు. తద్వారా రైతాంగాన్ని అప్పుల ఊబి నుండి మళ్ళించేందుకు ఈ పథకం ఉపయోగకరంగా ఉంది. 'రైతు బీమా' పథకం ద్వారా రైతు మరణిస్తే ఆ కుంటబానికి రూ.5 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు పంటలను అమ్ముకునేందుకు ప్రత్యేక మార్కెట్లను రైతుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.

తమ రాష్ట్రానికి రావాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యానశాఖ సంచాలకులను ఆహ్వానించిన ఉత్తరాఖండ్‌ ఉద్యానశాఖ కమీష్‌నర్‌ శ్రీవాత్సవ. ఉత్తరాఖండ్‌లో ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన పాలిహౌస్‌లో పుట్టగొడుగుల పెంపకం, తేనెటీగల పెంపకం తేనె ఉత్పత్తి మొదలైన వాటికి ప్రాముఖ్యత ఇచ్చామని వీటిని పరిశీలించేందుకు రావలసిందిగా కోరారు.

- ఎలిమిశెట్టి రాంబాబు, అగ్రిక్లినిక్‌ ప్రతినిధి, ఫోన్‌ : 9949285691