సూనా ముఖి అనేది ఒక ఔషద మొక్క. దీని శాస్త్రీయ నామం కేసియా అంగుస్టిఫోలియా, దీని ఆకులు మరియు కాయలు విలువైన ఔషద గుణాలు కలిగి ఉంటాయి. ఆసియా దేశాల్లో ఔషద మొక్కలకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ మొక్క ముఖ్యంగా భారత దేశం, ఆఫ్రికా, సొమాలియా, సుడాన్‌, దక్షిణ అరేబియా మరియు యెమెన్‌ దేశాల్లో వ్యాపించి ఉంది. మన దేశంలో ముఖ్యంగా దక్షిణ భారత దేశ రాష్ట్రమైన తమిళనాడులో ఎక్కువగా సాగు చేస్తారు. ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర, రాజస్థాన్‌ మరియు గుజరాత్‌ రాష్ట్రాల్లో కూడా సాగు చేయటం ప్రారంభించారు.

ఈ మొక్కలు దీర్ఘకాలికాలు. సుమారు 3-6 అడుగుల ఎత్తు పెరుగుతాయి. మొక్క నిటారుగా ఉండి కాండం నునుపుగా మరియు పాలిన ఆకుపచ్చ నుండి లేత గోధుమ రంగులో ఉంటుంది. చిన్న చిన్న ఆకులను కలిగి ఉంటుంది. పసుపు పచ్చ రంగు పూలు కలిగి ఉంటుంది. కాయలు 6-80 సెంటీమీటర్ల పొడవు మరియు 2-3 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఆకుపచ్చ లేదా గోధుమ రంగుల్లో ఉంటాయి.

సూనాముఖి మొక్క మరియు పూలు - ఉపయోగాలు :

ఈ మొక్కల నుండి తయారు చేసిన ఔషదాలు చర్మవ్యాధుల నివారణకు, జుట్టు పెరుగుదలకు, జీర్ణకొశ వ్యాధుల నివరణకు, నులి పురుగుల నివారణకు, ఊబకాయ నివారణకు, యాంటీ బ్యాక్టీరియాగానూ ఉపయోగపడతాయి.

రకాలు :

ఎ ఎల్‌ ఎఫ్‌ టి-2, సోనా, కె కె ఎం(సె)1, తిన్నెవెల్లి సెన్నా ముఖ్యమైన రకాలు. కె కె ఎం(సె)1 రకం వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాలకు బాగా అనువైనది.

వాతావరణం :

వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేసుకోవచ్చు. దీని పెరుగుదలకు మంచి సూర్యరశ్మి ఉండి అప్పుడప్పుడు చిరు జల్లులు పడే వాతావరణం బాగా అనుకూలం. సుమారు 300-400 మి.మీ. వర్షపాతం కలిగిన ప్రాంతాలు చాలా అనువైనవి.

నేలలు :

ఇది సుమారుగా అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది కానీ అస్సలు నీరు నిల్వ ఉండరాదు. ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు, కంకర నేలలు బాగా అనుకూలం. నల్లరేగడి నేలలు లవణ శాతం ఎక్కువగా ఉన్న నేలల్లో కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు.

భూ యాజమాన్యం :

ఈ పంట సాగు చేయటానికి బాగా కలియ దున్నిన నేల అవసరం లేదు. కానీ, కలుపు మొక్కలు లేకుండా దున్నుకోవాలి. సాధారణంగా ఒక దుక్కి దున్ని రెండుసార్లు గొర్రు తోలుకోవాలి. ఈ పంట సాగుకు అస్సలు నీరు నిల్వ ఉండకూడదు. మొత్తం పొలాన్ని చిన్న చిన్న మడులుగా విభజించుకొని తగినంత వాలు వుండేట్టు చూసుకోవాలి. తద్వారా, నీరు నిల్వ ఉండదు.

చివరి దుక్కిలో హెక్టారుకు 10-15 టన్నుల పెంటమన్ను లేదా పసువుల పేడను వేసుకోవాలి. విత్తనాలు బాగా గట్టిగా ఉంటాయి కాబట్టి నాటడానికి 12 గంటల పాటు నీటిలో నానబెట్టుకోవటం వల్ల బాగా మొలకెత్తుతాయి. కిలో విత్తనానికి 3 గ్రా. థైరాంను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.

విత్తన పరిమాణం :

నీటి ఎద్దడి గల ప్రాంతాల్లో హెక్టారుకు సుమారు 25 కిలోలు మరియు నీటి పారుదల గల ప్రాంతాల్లో సుమారు 15 కిలోల విత్తనం అవసరం. వరుసల్లో నాటుకున్నట్లయితే, నీటి వసతి గల ప్రాంతాల్లో హెక్టారుకు 6-7 కిలోల విత్తనం సరిపోతుంది.

విత్తుకొనే కాలం :

సాధరణంగా మొదటి పంటను ఫిబ్రవరి-మార్చి లో మరియు రెండవ పంటను సెప్టెంబర్‌-అక్టోబర్‌ నెలల్లో నాటుకోవాలి.

విత్తుకునే విధానం :

సాధారణంగా విత్తనాలను వెదజల్లుతారు. కానీ, వరుసల్లో నాటుకోవాలంటే వరుసల మధ్య 45 సెం.మీ. మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉంచుకుంటే మంచి దిగుబడులు వస్తాయి మరియు అంతర కషి సులభమౌతుంది. విత్తనాలను సుమారు 1-2 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి.

నీటి యాజమాన్యం :

విత్తనాలను విత్తుకున్న వెంటనే నీటిని అందించాలి. తరువాత ప్రత్యేకంగా నీటిని అందించాల్సిన అవసరం లేదు. అవసరాన్ని బట్టి 3-4 సార్లు నీటిని అందిస్తే చాలు. వర్షపాతం మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఇది అనువైనది కాదు. పొలంలో అన్నిచోట్ల నీరు సమానంగా అందేటట్లు చూసుకోవాలి.

ఎరువుల యాజమాన్యం :

చివరి దుక్కిలో 10-15 టన్నుల పెంటమన్ను వేసుకోవాలి. నత్రజని, భాస్వరం మరియు పొటాష్‌ ఎరువులను హెక్టారుకు 80-40-20 కిలోలు అవసరం. వీటిలో, సగం నత్రజని, మొత్తం భాస్వరం, పొటాష్‌ ఎరువులను ఒకేసారి వేసుకోవాలి. మిగిలిన సగం నత్రజని ఎరువును రెండు దఫాలుగా విభజించి, మొదటిది నాటిన 1-3 నెలలకు అంటే మొదటిసారి ఆకులను కత్తిరించిన తరువాత, రెండవది 4 నెలల తరువాత అంటే రెండవసారి ఆకులు కత్తిరించిన తరువాత వేసుకోవాలి.

అంతర కషి :

నాటిన 3-4 వారాలకు మొదటిసారి కలుపు తీయాలి. ఇదే సమయంలో ఒకే చోట ఎక్కువ మొక్కలు ఉన్నట్లయితే వాటిని పీకివేయాలి.

సస్యరక్షణ :

ఆకుమచ్చ మరియు ఎర్రకుళ్ళు తెగులు నివారణకు 0.02 శాతం డైథేన్‌ జడ్‌-78 మందును పిచికారీ చేయాలి. ఆకు తినే పురుగుల నివారణకు కార్భరిల్‌ 2.5 గ్రా. మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

పంట కోతదశ :

సాధారణంగా నాటిన రెండు నెలలకు పూత మొదలవుతుంది. వాటిని తుంచి వేయటం వల్ల మొక్క ఏపుగా పెరగటం జరుగుతుంది. నాటిన మూడు నెలల తరువాత మొదటసారి ఆకులను కత్తిరించాలి. రెండవ మరియు మూడవ కత్తిరింపులను 6వ మరియు 7వ నెలల తరువాత చేసుకోవాలి. బాగా పెరిగిన, మందమైన మరియు నీలి రంగు ఆకులను కత్తిరించుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాల్లో నాటిన 120-150 రోజులకు మొత్తం మొక్కలను పీకివేయటం జరుగుతుంది. కాయలు ఆకుపచ్చ రంగులో ఉన్న సమయంలోనే కోసుకోవాలి. పంటను విత్తనోత్పత్తి కోసం వేసుకున్నట్లయితే కాయలు ముదురు గోధుమ రంగులోకి మారిన తరువాత కోసుకోవాలి.

కోత అనంతర యాజమాన్యం :

కోసిన తరువాత ఆకులను 7-10 రోజులపాటు నీడలో ఆరనివ్వాలి. మార్కెట్‌కు తీసుకెళ్ళే ముందుగానే ఆకులు మరియు కాయల నాణ్యత, రంగు మరియు పరిమాణాన్ని బట్టి విభజించుకోవాలి. ఎండిన ఆకులను బేల్స్‌లో ప్యాక్‌ చేసుకొని నిల్వ ఉంచుకోవాలి.

సూనా ముఖి ఆకులు మరియు కాయలు దిగుబడి :

మెట్ట ప్రాంతాల్లో సుమారుగా 700 కిలోల ఆకులు మరియు 100 కిలోల గింజల దిగుబడి వస్తుంది. అదే నీటి లభ్యత గల ప్రాంతాల్లో 1,500-2,000 కిలోల ఆకులు మరియు 175-200 కిలోల గింజల దిగుబడిని పొందవచ్చు.

మార్కెటింగ్‌ :

సగటున ఒక కిలో ఆకుల ధర సుమారు రూ. 70-80, కాయల ధర కిలో సుమారు రూ. 80-90 ఉంటుంది. ఈ పంట ఉత్పత్తులకు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలలో మంచి గిరాకీ ఉన్నది. జర్మనీ, హంగేరీ, జపాన్‌, నెదర్లాండ్స్‌, మరియు అమెరికా దేశాల్లో చాలా గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా ఔషదాల తయారు చేసే పరిశోధనల్లో ఉపయోగిస్తారు.

ఖర్చు మరియు రాబడి :

తమిళనాడు రైతుల అనుభవం ప్రకారం, ఒక హెక్టారు సాగుకు సుమారు 27,000 ఖర్చవుతుంది. అన్ని ఖర్చులు పోనూ సుమారుగా రూ. 30,000 మిగులుతుంది. అంతగా సారంలేని, తక్కువ నీటి వసతి గల నేలల్లో దీన్ని సాగు చేసుకొని అధిక లాభాలను సంపాదించవచ్చు.

పంగ రవి యుగంధర్‌, వ్యవసాయ పరిశోధక విద్యార్ధి, వ్యవసాయ కళాశాల, బాపట్ల

బి. ఉషా కిరణ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త, భారతీయ నూనె గింజల పరిశోధనా కేంద్రం, హైదరాబాద్‌, ఫోన్‌ : 9502471491