కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేయుటకు అనువైనది కోకో. దీని శాస్త్రీయంగా ధియోబ్రోమా కోకో. భారతదేశంలో సుమారు 40వేల హెక్టార్లలో కోకో సాగు చేయబడుతుంది. మన రాష్ట్రంలో సుమారు 24,156 హెక్టార్లలో సాగు చేయబడుతున్నప్పటికీ పశ్చిమ గోదావరి (18385 హె.) మరియు తూర్పుగోదావరి జిల్లాల్లోనే దాదాపు (2,570) హెక్టార్లలో సాగు చేయబడుచున్నది. ధియోబ్రొమిన్‌ అనే ఆల్కలాయిడ్‌ తయారీలో వినియోగించబడే కోకో ఉత్పత్తులు ఎగుమతికి అనువైనవి.

వాతావరణం - నేలలు :

తేమ ఎక్కువగా ఉన్న ఉష్ణ మండల ప్రదేశాలు కోకో సాగుకు మిక్కిలి అనుకూలం. ఏడాదికి 1250 మి.మీ.ల పైబడిన వర్షపాతం, 15-390 సెం. వరకు ఉష్ణోగ్రత, 80-100 శాతం తేమ ఉన్న ప్రదేశాలు కోకో సాగుకు అనుకూలం. మురుగునీరు పోయే సదుపాయం కలిగి ఏమాత్రం నిల్వ ఉండని నేలలు కోకో సాగుకు అనుకూలం. బంకమన్ను గల నేలల్లోనూ, గరప నేలల్లో కూడా ఈ పంటను సాగుచేయవచ్చు.

రకాలు:

ప్రపంచంలో ముఖ్యంగా రెండు రకాలు సాగులో ఉన్నాయి. ఇవి క్రయల్లో మరియు ఫారెస్టిరో రకాలు.

క్రయల్లో :

క్రయల్లో గింజలు కోసిన వెంటనే తెల్లగా ఉండి పులిసిన తరువాత గోధుమ రంగులోకి మారతాయి. ముదురు ఎరుపు రంగులో ఉండే క్రయల్లో కాయలు గరుగ్గా ఉంటాయి. క్రయల్లో రకం చేదు రుచి కలిగి ఉండి తక్కువ దిగుబడినిస్తుంది మరియు తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తాయి. మూడు రోజులలో పులవడం పూర్తవుతుంది. ఒక్కొక్క కాయలో 20 - 30 విత్తనాలు ఉంటాయి.

ఫారెస్టిరో :

ఫారెస్టిరో రకం గింజలు చప్పగా ఊదా రంగులో ఉండి పులిసిన తరువాత గోధుమ రంగులోకి మారతాయి. ఫారెస్టిరో కాయలు మాత్రం కోసిన వెంటనే పచ్చ రంగులో ఉండి పక్వానికి వచ్చిన తరువాత పనుపు రంగులోకి మారి దళసరి తొక్కను కలిగి ఉంటాయి. కాయల చివర్లు నున్నగా ఉండి కనీకనిపించకుండా కొండల వరస కలిగి ఉంటాయి. అదే ఫారెస్టిరో రకానికైతే పూర్తిగా పులవడానికి ఆరు రోజులు పడుతుంది. ఒక్కొక్క కాయలో సుమారుగా 30 కంటే ఎక్కువ విత్తనాలు ఉంటాయి.

ట్రినిటారియో :

ఈ వర్గంలోని రకాలు పై రెండు వర్గాల రకాలను సంకరణ పరచడం ద్వారా ఏర్పడినవి. ఇవి పై రెండు రకాల లక్షణాలను కలిగి ఉంటాయి.

కేంద్రీయ వన్యతోట పంటల పరిశోధనా సంస్థ, ప్రాంతీయ కేంద్రం, విట్టల్‌లో జరిగిన పరిశోధనల్లో I-14, I-56, III-105, చీజ 42/94 మరియు చీజ 45/53 మంచి రకం క్లోన్స్‌గా గుర్తించడం జరిగింది. చీూ 33 ఞ Iజూ 89, I-14 ఞ చీజ 42/94, I-14 ఞ II-67, I-56 ఞ III-105, ూఎవశ్రీ ఞ చీa-33, II-67 ఞ చీజ 42/94, II-67 ఞ చీజ 29/66 మరియు Iజూ6 ఞ ూషa6 మంచి హైబ్రీడ్స్‌గా గుర్తించబడినవి.

నాటుట :

కొబ్బరి తోటలో దీన్ని ఒక వరుస పద్ధ్దతి లేదా రెండు వరుసల పద్ధతిలో రెండు సాళ్ళ మధ్య నాటుకోవచ్చు. ఒక వరుస పద్ధతిలో కోకోను 2.7 మీ. దూరంలో మరియు రెండు వరుసల పద్ధతిలో 2.5 మీ. దూరంలో రెండు వరుసలు ఉండేలా నాటుకోవాలి.

ఎరువుల యాజమాన్యం :

నిర్దేశించిన ఎరువుల మెతాదు మొక్క దశ మీద, నీడ మీద, భూమి మీద ఆదారపడి ఉంటుంది. సాధారణంగా నాటిన 3 సంవత్సరాల నుంచి ప్రతి చెట్టుకు 125 గ్రా. నత్రజని (250 గ్రా. యూరియా), 40 గ్రా. భాస్వరం (250 గ్రా. సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌), 140 గ్రాములు పొటాషియం (250 గ్రా. మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌) సిఫారసు చేయబడినది. నాటిన మొదటి సంవత్సరమైతే పైన వివరించిన మెతాదులో 33 శాతం మాత్రమే వేయాలి. రెండో ఏడాది 66 శాతం వేయాలి. ఈ ఎరువులను రెండు మెతాదుల్లో వేయాల్సి ఉంటుంది. వర్షాకాలం ప్రారంభం ముందు అంటే ఎప్రిల్‌-మే నెలల్లో ఒకసారి మరియు సెప్టెంబరు - అక్టోబరు నెలల్లో రెండవ సారి వేయాలి. ఈ రసాయనిక ఎరువులను కలిపి చెట్టు మొదలు నుంచి 75 సెం.మీ. దూరం వరకు చుట్టూ చల్లి మట్టితో కలియబెట్టాలి. చెట్టు చుట్టూ బోదెలను తీయడం చాలా అవసరం. దాని వల్ల గాలి ఆడి వేర్లు పెరుగుదల బావుంటుంది. దీనివల్ల చిన్నవేర్లు పుట్టుకొచ్చి చెట్టు ఎక్కువగా నీరు మరియు ఆహార పదార్థాలను గ్రహించడానికి అవకాశం ఉంటుంది.

జింకు లోపాన్ని నివారించడానికి జింకు సల్ఫేటు (0.3 శాతం) + సున్నం (0.15 శాతం) మిశ్రమం ఆకుల మీద పిచికారి చేయాలి. ఆకుల మీద అన్నభేది (1శాతం)ని పిచికారి చేయడం వల్ల ఈ ధాతు లోపంను నివారించవచ్చు.

నీటి యాజమాన్యం :

నేల స్వభావాన్ని బట్టి 7-10 రోజుల వ్యవధిలో నీటి తడులివ్వాలి. డ్రిప్‌ పద్ధ్దతి - 20 - 30 లీ./ రోజుకు / చెట్టుకు. మన రాష్ట్రంలో ముఖ్యంగా ఏప్రిల్‌ నుండి జూన్‌ నెలల మధ్య వేసవి తాపాన్ని తట్టుకొని, మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగి అధిక దిగుబడి నివ్వాలంటే సరైన సాగు నీటి యాజమాన్యం ఎంతో అవసరం. కాల్వల ద్వారా నీరు పారించే విధానంలో వారానికి ఒక తడి తప్పకుండా ఇవ్వాలి. లేక డ్రిప్పు/ మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా అయితే శాస్త్రీయ బద్ధంగా మీ పరిస్ధతులను బట్టి ఒక్కో మొక్కకు రోజుకు ఎంత నీరు అవసరమో అంత అందించేటట్లు చూడవలెను. మొక్కలు ఎప్పుడు కూడ నీటి ఎద్దడి వల్ల ఆకులు వాడినట్లు కనబడకూడదు.

కత్తిరింపులు :

కోకోను ముఖ్యంగా వక్క మరియు కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేయడం వల్ల, కొమ్మల వ్యాప్తిని నియంత్రించటము మరియు నిర్థిష్ట ఆకారాన్ని కలుగజేయడం చాలా అవసరం. దీనికి కొమ్మల కత్తిరింపులు ఎప్పటికప్పుడు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న మొక్కల్లో నాటిన వెంటనే నిర్దిష్ట ఆకృతిని మరియు మొదటి జార్కెట్‌ ఎత్తును నిర్దేశించడానికి కత్తిరింపు చేయాలి. ప్రధాన కాండం మీద 1.5 - 2.0 మీ. (5-6 అడుగులు) ఎత్తులో జార్కెట్‌ ఏర్పడేలా చేయడం వల్ల యాజమాన్య పద్ధతులు సులభంగా పాటించవచ్చు. ఒక్కొక్క మొక్కపై 3-5 గొడుగు కొమ్మలు ఉండేలా చూసుకోవాలి. కొమ్మలు గొడుగు ఆకారంలో 10 - 12 అడుగుల మేరకు వ్యాపించి 8 - 9 అడుగుల ఎత్తు వరకు ఉండడం ఉత్తమం.

కాయకోత :

కోకోలో నాటిన రెండవ సంవత్సరము నుంచి పూత రావడం మొదలవుతుంది. కాయలు 140-160 రోజుల్లో పక్వానికి వస్తాయి. ప్రతికాయలో 25-45 గింజలు తెల్లని గుజ్జులో పొందుపరచి ఉంటాయి. కోకోలో ముఖ్యంగా ప్రతి సంవత్సరం రెండు కాపులు అంటే సెప్టెంబర్‌-జనవరి మరియు ఏప్రిల్‌-జూన్‌లో లభిస్తాయి. నీటి సదుపాయం ఉన్న చోట సంవత్సరం అంతా కాయలు లభిస్తాయి.

పక్వానికి వచ్చిన కాయలను, అంటే పసుపు పచ్చ రంగులో ఉన్న కాయలను, పూలగుత్తులు దెబ్బ తినకుండా తొడిమలను చెట్టుకే వదిలేసి కత్తితో కోయాలి. ఈ విధంగా ప్రతి 10-15 రోజులకొకసారి కోయాల్సిన అవసరముంటుంది. గింజల నాణ్యత కొరకు చీడపీడలు ఆశించిన మరియు దెబ్బతిన్న కాయలను కోసిన వెంటనే వేరుచేయాలి. ఇలా కోసిన కాయలను 2 రోజుల వరకు అలాగే ఉంచాలి, కాని 4 రోజులకు మించి ఉండరాదు. కాయలను కర్రముక్కతో మధ్యభాగంలో బద్దలు కొట్టి, గింజలను గుజ్జుతో సహా వేరుచేయాలి. కాయ మధ్య భాగంలో ఉన్న కాడను, తొక్కను పులవబెట్టడానికి ముందు తొలగించాలి.

గింజల చుట్టూ ఉన్న గుజ్జును తొలగించడానికి, మంచి సువాసనను రుచిని కలిగించడానికి, గింజలలో ఆమ్లతను 5.5 తీసుకురావడానికి, వగరును చేదును తగ్గించడానికి, గింజలో మొలకను చంపడానికి మరియు చుట్టూ ఉన్న పల్చని తొక్కని తొలగించడానికి పులవబెట్టుట చాలా అవసరం. పులవబెట్టడానికి చాలా పద్ధతులు వినియోగించవచ్చు. అవి ఏమిటంటే పెట్టె పద్ధతి గుంపు పద్దతి, ట్రే పద్దతి మరియు బుట్ట పద్దతి. ఫారెస్టిరో రకం కాయల గింజలు ఆరు రోజులు పులిసిన తర్వాత ఏడవరోజు బయటకు తీసి ఆరనివ్వాలి. ఆరిన తరువాత కోకో గింజల నుండి చాక్లెట్లు మరియు కన్‌ఫెక్షనరీ ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు.

డా|| ఇ.పద్మ, సైంటిస్ట్‌ (హార్టి), శ్రీమతి ఎమ్‌. ప్రియాంక, రీసెర్చ్‌ అసోసియేట్‌ (హార్టి), డా|| జి.రామానందం, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ (హార్టి) & హెడ్‌,

డా|| వై.యస్‌.ఆర్‌.ఉద్యాన విశ్వవిద్యాలయము, ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట