మన రాష్ట్రంలో పండించే నూనె గింజల పంటల్లో వేరుశనగ ప్రధానమైన పంట. ఇది ప్రపంచ నూనె గింజల పంటల్లో ఆరవ ముఖ్యమైన పంట. దీనిలో నూనె శాతం 48-50 వరకు, ప్రొటీన్‌లు 26-28 శాతం వరకు, అధిక శాతం పీచు, ఖనిజ లవణాలు మరియు విటమిన్‌లు కలిగి ఉంది. వేరు శనగలో సరాసరి దిగుబడులు చూసినట్లయితే 4 క్వింటాలు మాత్రమే, ఇంత తక్కువ దిగుబడులు సాధించుటకు ప్రధానమైన కారణం. నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే విత్తనాలు వాడక పోవటం.

వ్యవసాయంలో ఏ పంటలోనైనా అధిక దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తనమే మూల కారణం. అందుకే ''సుభీజే సుక్షేత్రం'' అన్నారు పెద్దలు. రైతులు వాడే విత్తనాన్ని బట్టి ఆ ప్రాంత లేదా ఆ రాష్ట్ర వ్యవసాయ ఉన్నతిని అంచనా వేయవచ్చు. వేరుశనగ సాగు చేసే రైతులు తమ వద్దనున్న పాత విత్తనాన్ని / రకాన్ని (లోకల్‌ వైరైటీస్‌) ప్రతి సంవత్సరం ఉపయోగించడం వల్ల మరియు అధిక దిగుబడినిచ్చే కొత్తగా రూపొందించబడిన విత్తనం అందుబాటులో ఉన్నపటకీ అధిక ధర ఉండడం, వేరుశనగలో విత్తనం నుండి విత్తనం ఉత్పత్తి రేటు తక్కువగా ఉండటం, విత్తనాలు మొలకెత్తే శక్తి త్వరగా పోవటం, ఒక ఎకరానికి ఎక్కువ విత్తనాలు అవసరం కావడం వంటి కారణాల వల్ల రైతులు తాము అనుకున్న స్థాయిలో దిగుబడులు సాధించలేకపోతున్నారు. అధిక దిగుబడినిచ్చే రకాల నాణ్యమైన విత్తనాన్ని రైతులు తమకు తాము ఉత్పత్తి చేసుకొనేందుకు వీలుగా వేరుశనగ విత్తనోత్పత్తి పరిజ్ఞానాన్ని ఈ పుస్తకం ద్వారా రైతులకు అందుబాటులోకి తీసుకురావటం కొరకు ఈ చిన్న ప్రయత్నం జరిగింది.

నాణ్యమైన విత్తనం అంటే సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి ఉంది. వేరుశనగలో అధిక దిగుబడులు సాధించుటకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఉత్పత్తి చేసిన దృవీకరించబడిన నాణ్యత కలిగిన మంచి విత్తనాన్ని వాడాలి. మంచి విత్తనం అనగానే శుభ్రత నాణ్యతతో పాటు బాగా మొలకెత్తే స్వభావం (70 శాతం తగ్గకుండా) కలిగి ఆరోగ్యవంతంగా పెరిగి మంచి దిగుబడినివ్వాలి. మంచి నాణ్యమైన విత్తనాన్ని రైతులు తమ పొలాల్లో తమకు తామే తయారు చేసుకున్నట్లైతే తక్కువ ఖర్చుతో వేరుశనగలో అధిక లాభాలు పొందవచ్చు.

నాణ్యమైన విత్తనానికి ఉండవలసిన లక్షణాలు :

జన్యు శుద్దత :

ఒక్కొక్క రకం విత్తనానికి, ఆ విత్తనాల నుంచి పుట్టిన మొక్కలకు ప్రత్యేకమైన స్వరూపాత్మక లక్షణాలు, స్వాభావిక లక్షణాలు ఉంటాయి. ఒక రకం విత్తనంనాటి, ఆ పంట కోసినప్పుడు అదే రకం విత్తనాలు రావాలి. ఒక స్వచ్ఛమైన రకం నుండి 100 శాతం అదే రకం విత్తనాన్ని పొందటమే స్వచ్ఛతను నిర్దారిస్తుంది. దీన్ని జన్యుశుద్ధత లేక జన్యు స్వచ్ఛత అంటారు.

భౌతిక శుద్దత:

విత్తనాల్లో చెత్త, సట్టలు మరియు సగం నిండిన విత్తనాలు ఉండకూడదు. విత్తనాల్లో మట్టి గడ్డలు, ఇసుక, దుమ్ము మొదలైన వ్యర్థ పదార్థాలు, కలుపు విత్తనాలు, వేరే పంట విత్తనాలు ఉండకూడదు.

తేమ శాతం :

విత్తనము తేమ శాతం 9 కంటే ఎక్కువగా ఉంటే నిల్వ చేయటానికి పనికిరాదు.

మొలక శాతం :

విత్తనం కనీసం 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ మొలక శాతం కలగి ఉండాలి. మొలక శాతం పరిక్షించినప్పుడు 70 శాతం ఉండవచ్చు, కాని 6 నెలల తరువాత నుంచి మొలక శాతం తగ్గుతూ ఉంటుంది. అందుచేత మొలక శాతం పరీక్షించిన తేది లేదా నెల విత్తన సంచి మీద రాసి ఉన్నట్లయితే దాన్ని చూసి విత్తనం కొనాలి.

విత్తన తరగతులు :

రైతులు ఆదరణ పొందిన వేరుశనగ రకాల విత్తనాలను వివిధ పరిశోధనా స్థానాలు ఉత్తమ ప్రమాణాలతో ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేయుచున్నారు. విత్తనోత్పత్తిలో విత్తనాలను ప్రధానంగా మూడు తరగతులుగా విభజించారు.

1. బ్రీడర్‌ విత్తనం

2. ఫౌండేషన్‌ విత్తనం

3. ధృవీకరించబడిన విత్తనం

1. బ్రీడర్‌ విత్తనం :

ఈ విత్తనాలను ఆయా రకాలను రూపొందించిన వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఉత్పత్తి చేస్తారు కనుక ఇవి అత్యుత్తమ ప్రమాణాలను కలిగి ఉంటాయి. ఈ విత్తనాన్ని కేంద్రక (న్యూక్లియస్‌) విత్తనం నుండి ఉత్పత్తి చేస్తారు.

2) ఫౌండేషన్‌ విత్తనం :

బ్రీడర్‌ విత్తనాన్ని ఉపయోగించి వ్యవసాయ పరిశోధన స్థానాలు, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థలు ఫౌండేషన్‌ విత్తనం ఉత్పత్తి చేస్తారు. ఈ విత్తనాలు కూడా ఉత్తమ ప్రమాణాలను కలిగి ఉంటాయి.

3) ధృవీకరించిన విత్తనం (సర్టిఫైడ్‌ విత్తనం) :

ఫౌండేషన్‌ విత్తనాన్ని ఉపయోగించి రైతుల పొలాల్లో ధృవీకరించిన విత్తనం ఉత్పత్తి చేస్తారు. విత్తన ధృవీకరణ సంస్థ వారు ఆ పొలాలను కనీసం రెండు సార్లు తనిఖీ చేస్తారు. కేళీలు లేదా బెరకులు తీసివేసే ఏర్పాటు చేస్తారు.

విత్తన నాణ్యత లోపిస్తే విత్తనాలు మార్చాలి :

ఒక సారి మంచి విత్తనం (బ్రీడర్‌ విత్తనం) వేసి, అదే పంట నుంచి రెండు నుండి మూడు తరాల వరకు విత్తనాన్ని సేకరించి ఉపయోగించవచ్చును. తరువాత అదే విత్తనాన్ని ఉపయోగిస్తే జన్యు స్వచ్చత, భౌతిక శుద్దత లోపించవచ్చును. కాబట్టి మరల స్వచ్చమైన విత్తనాన్ని పరిశోధనా స్థానాల నుండి తెచ్చుకోవాలి.

విత్తన నిర్ధాణ ప్రమాణాలు :

విత్తన నిర్ధారణ అనేది ఒక్కొక్క పంటకు వేరువేరు ప్రమాణాలు ఉంటాయి. న్యూక్లియస్‌ విత్తనం అనేది 100 శాతం జన్యు స్వచ్ఛతతో ఉండి మొదట విడుదల చేసిన రకం లక్షణాలు అన్ని అదే విధంగా కలిగి ఉండాలి. బ్రీడర్‌ విత్తనాన్ని న్యూక్లియస్‌ విత్తనం నుండి తయారు చేస్తారు. ఇది కూడా 100 శాతం జన్యు స్వచ్చత కలిగి ఉండి తరువాత తరాలు విత్తనం (ఫౌండేషన్‌ ధృవీకరించబడిన) స్వచ్ఛంగా ఉత్పత్తి చేయటానికి ఉపయోగపడుతుంది. విత్తనోత్పత్తి చేసే పొలం, మిగతా పొలాల కంటే చాలా జాగ్రత్తలు తీసుకొని చేయాలి. విత్తనోత్పత్తి చేసే పొలం సూచించిన విత్తన ప్రమాణాలు కలిగి ఉన్నట్లయితే నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేయవచ్చు.

విత్తనోత్పత్తి చేసే కాలం :

వేరుశనగను ముఖ్యంగా ఖరీఫ్‌ మరియు రబీ సీజనులో సాగు చేస్తారు. విత్తనోత్పత్తి చేయుటకు రబీ సీజన్‌ చాలా అనుకూలమైనది (సెప్టెంబర్‌ 15 - అక్టోబరు 15) రబీలో సాగుచేసే వేరుశనగ పంటకు చీడ పీడలు ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది మరియు నాణ్యమైన విత్తనాన్ని అధిక మోతాదులో ఉత్పత్తి చేయవచ్చు.

మూల విత్తనం :

మనం ఉపయోగించే విత్తన తరగతిపై మనం ఉత్పత్తి చేసే విత్తనం తరగతి ఆధారపడి ఉంటుంది. మూల విత్తనాన్ని నమ్మకమైన సంస్థల నుండి విత్తన ప్రమాణాలు మరియు ధృవీకరణ పత్రం కలిగి ఉన్న విత్తనాలను మాత్రమే సేకరించి వినియోగించాలి. విత్తన సంచులను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. విత్తనం పాడైనట్లైతే విత్తన మొలక శాతం కోల్పోయే ప్రమాదం కలదు. విత్తన శుద్ది తప్పని సరిగా చేయాలి. దాని వల్ల మంచి మొలక శాతం వచ్చి అధిక మొక్కలు ఉండడం వల్ల ఎక్కువ దిగుబడులు సాధించే అవకాశమున్నది. ఒక హెక్టారుకు కావలసిన విత్తనం అనేది దాని యొక్క 100 గింజల బరువుపై ఆధారపడి ఉంటుంది. ఎకరానికి 60-80 కిలోల విత్తనాలు అవసరమవుతాయి.

విత్తనోత్పత్తి క్షేత్ర ఎంపిక :

వేరుశనగ విత్తనోత్పత్తికి ఇసుక నేలుల / ఎర్ర గరప నేలలు అనుకూలం. వేరుశనగ వేసే పొలంలో శిలీంద్రాలు లేదా పురుగుల అవశేషాలు లేకుండా చూసుకోవాలి. వేరుశనగ విత్తనోత్పత్తి చేసే పొలంలో అంతకు ముందు పంటగా వేరుశనగ వేయనిది ఎంచుకోవాలి. కొన్ని మొక్కలు వాటంతట అవే రావటం వల్ల కల్తీలు జరిగే అవకాశం ఉంటుంది. వేరుశనగ విత్తనోత్పత్తికి వర్షాధారంగా కాకుండా నీటి వసతి ఉన్న పంట పొలాలను ఎంచుకోవాలి. వేరుశనగ తరువాత వేరుశనగ వేయటం వల్ల శిలీంద్రాలు లేదా పురుగుల ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి పంట మార్పిడి చేయటం మంచిది. వేరుశనగ విత్తనోత్పత్తి క్షేత్రం విత్తన నిర్ధారణ చేసే అధికారులు సందర్శించేందుకు వీలుగా ఉండే విధంగా ఎంచుకోవాలి.

మధ్యంతర దూరం :

వేరుశనగ స్వపరాగ సంపర్కం జరుపుకునే మొక్క ఇందులో పరాపరాగ సంపర్కం జరిగే అవకాశం దాదాపు లేదు. ఎక్కడైతే తేనెటీగల ఉధృతి ఎక్కువగా ఉంటుందో అక్కడ కొంత వరకు పరపరాగ సంపర్కం జరిగే అవకాశం కలదు. అందువల్ల వేరుశనగ పంటలో ఒక రకానికి మరొక రకానికి మధ్యంతర దూరం అవసరం. మన దేశంలో అన్ని తరగతుల వేరుశనగ విత్తనోత్పత్తి క్షేత్రానికి మరియు వేరొక రకానికి కనీసం 3 మీ. ఉండే విధంగా చూసుకోవాలి. రకాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి, విత్తనోత్పత్తి చేసే కాలాన్ని బట్టి వేరుశనగలో పరపరాగ సంపర్కాన్ని అంచనా వేసి మధ్యంతర దూరాన్ని నిర్ధారించాలి.

నేల తయారీ- విత్తటం :

నేలలు మరియు నేల తయారీ :

ఇసుకతో కూడిన గరప నేలలు లేదా నీరు త్వరగా ఇంకే ఎర్ర చల్కానేలలు చాలా అనుకూలమైనవి. విత్తే ముందు నేలను మెత్తగా దుక్కిచేసి చదును చేసుకోవాలి.

విత్తుదూరం : ఖరీఫ్‌లో 30I10 సెం.మీ.

రబీ/వేసవిలో 22.5 I 10 సెం.మీ.

ఖరీఫ్‌లో ఒక చదరపు మీటరుకు 33 మొక్కలు యాసంగిలో ఒక చదరపు మీటరుకు 44 మొక్కలు ఉండేలా మొక్కల సాంద్రత పాటించాలి.

విత్తే పద్ధతి :

విత్తనాన్ని గొర్రుతో గాని లేక నాగటి చాళ్ళలో గాని లేక ట్రాక్టరుతో నడిచే విత్తే యంత్రంతో గాని విత్తుకోవాలి. ట్రాక్టరు ద్వారా నడిచే సీడ్‌డ్రిల్‌ను వాడినట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవడమేకాక ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. ఒక ఎకరానికి 2.5-3 గం|| సమయం సరిపోతుంది.

విత్తన శుద్ది:

వరి మాగాణుల్లో లేక కొత్తగా వేరుశనగ సాగుచేసేటప్పుడు ఎకరాకు సరిపడే విత్తనానికి 200 గ్రా. రైబోజియం కల్చరుని పట్టించాలి. వేరు కుళ్ళు మొదలు కుళ్ళు మరియు కాండం కుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా ఆశించే పరిస్థితుల్లో కిలో విత్తనానికి 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడిని పట్టించి విత్తుకోవాలి.

ఎరువుల యాజమాన్యం :

ఆఖరు దుక్కిలో ఎకరాకు 3-4 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి మొత్తం భాస్వరం, పొటాష్‌ ఎరువులను విత్తే సమయంలోనే వేసుకోవాలి ఎకరానికి 100 కిలోల సూపర్‌ ఫాస్పేట్‌, 33 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ మరియు 18 కిలోలు యారియాను విత్త సమయంలోనే వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తర్వాత తొలిపూత దశలో మరో 10-15 కిలోల యూరియాను పై పాటుగా వేసుకోవాలి. ఎకరానికి 200 కిలోల జిప్సమ్‌ను పూత మరియు ఊడలు దిగే సమయంలో 40-45 రోజుల వయసులో మొదళ్ళ దగ్గర వేసి మట్టిని ఎగదోయాలి.

నీటి యాజమాన్యం :

పంట కాలంలో 8-9 నీటి తడులను వాతావరణ పరిస్థితులను బట్టి 7-12 రోజుల వ్యవదితో నీరు ఇవ్వాలి. ఊడ దిగే దశ నుండి కాయ గట్టి పడే వరకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.

కలుపు నివారణ :

లుపు మొలకెత్తక ముందే నశింపజేయగల కలుపు నాశిని అయిన పెండిమిధాలిన్‌ 30 ఇ.సి. ని ఎకరాకు 1.3 - 1.6 లీటర్ల చొప్పున 2 లేదా 3 రోజులలోపు తడి నేలపై పిచికారి చేసుకోవాలి.

పంట విత్తిన 20 రోజుల వరకు కలుపు తీయడానికి వీలుకాని పరిస్థితుల్లో పైరులో మొలచిన కలుపును (వెడల్పాకు మరియు గడ్డిజాతి) 2-3 ఆకుల దశలో ఉన్నప్పుడు ఇమాజితోపైర్‌ 10 శాతం ఎకరాకు 300 మి.లీ. లేదా ఎకరాకు ఇమాజామాక్స్‌ 35 శాతం + ఇమాజితాపైర్‌ 35 శాతం డబ్యుజి కలుపు మందును 40 గ్రా. చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి అన్ని కలుపు మొక్కలను నివారించవచ్చును.

కల్తీలు ఏరివేయుట (రోగింగ్‌) :

1) శాఖీయ దశలో :

వేరుశనగ విత్తనోత్పత్తి క్షేత్రంలో కనీసం రెండు నుండి మూడు సార్లు వేరుశనగ పంట తీయటానికి ముందు కల్తీలను ఏరివేయాలి. చిరు మొక్కదశలో ఆకు ఆకారంలో గాని, పరిమాణంలో గాని వేరే విధంగా ఉన్న మొక్కలను ఏరివేయాలి. బలహీనంగా ఉన్న మొక్కలను, తెగుళ్ళు, పురుగుల బారిన పడి బలహీనపడ్డ మొక్కలను కూడా తీసివేయాలి.

2) పూత దశలో :

ఈ దశలో వేరుశనగలో శాఖలు వచ్చే విధానం, పూత వచ్చే సమయం, పూత వచ్చే స్థలం, మొక్కల యొక్క ఎత్తు, ఆకు ఆకారం, ఆకు పరిమాణం, ఆకు యొక్క రంగుని బట్టి కల్తీ మొక్కలను గుర్తించి తొలగించాలి.

3) పీకటానికి ముందు:

వేరుశనగ కాయ సైజు, కాయ పొడవు, గింజల రంగు, మొక్క యొక్క ఎత్తు, పంట కాలం మరియు విత్తనోత్పత్తి చేసే రకంతో మొక్క లక్షణాలు కాకుండా వేరే ఇతర లక్షణాలు ఉన్న మొక్కలను తొలగించాలి.

పంట కోత :

వేరుశనగలో మొక్కల్లోని 75 శాతం కాయలు పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడే పంట కోత చేపట్టాలి. కాయలోపలి భాగం ముదురు గోధుమ వర్ణంలోకి మారినప్పుడు కోతకు వచ్చిందని గుర్తించాలి.

ఎండ బెట్టుట :

వేరుశనగ పంటను కోసినప్పుడు కాయల్లో 35-60 శాతం వరకు తేమ శాతం కలిగి ఉంటాయి. కాయలో తేమ శాతం తగ్గించుటకు చెట్లను గూడులాగా చేసి ఆరబెట్టాలి. కాయలను యంత్రాల ద్వారా తెంపుటకు కనీసం 18-20 శాతం వరకు తేమను తగ్గించాలి. అదే మనుషుల ద్వారా కాయలు తెంపుటకు కనీసం 15 శాతం వరకు తేమను తగ్గించాలి. వేరుశనగ కాయల్లో తేమ 8 శాతం వచ్చే వరకు ఆరబెట్టాలి. విత్తనం కోసం ఉపయోగించే కాయలను ఎక్కువ ఎండలో (45 శాతం) ఆరబెట్టకూడదు. దీనివల్ల మొలక శాతం తగ్గే అవకాశం కలదు. దుమ్ము, ధూళి లేకుండా శుభ్రపరచిన, బాగా నిండిన కాయలను మాత్రమే విత్తనం కొరకు వాడాలి.

నిలువ చేయుట :

వేరుశనగను గింజల రూపంలో కంటే కాయల రూపంలో నిల్వచేయుట మంచిది. విత్తనాన్ని తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసినట్లైతే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. వేరుశనగ కాయలను 130 సెల్సియస్‌ మరియు 65-70 శాతం వరకు తేమ శాతం కలిగి ఉన్న గదుల్లో నిల్వ చేయాలి. వేరుశనగలో మొలక శాతం ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉండదు. మళ్ళీ దాన్ని విత్తనం కొరకు ఉపయోగించినప్పుడు కాయలను యంత్రాల ద్వారా కంటే మనుషులతో ఒలుచుట ద్వారా విత్తనాలు ఎక్కువగా వచ్చే అవకాశం కలదు.

పైన చెప్పిన విషయాలన్ని పాటించి విత్తనోత్పత్తి చేసినట్లయితే నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసుకోవచ్చు.

పి. మధుకర్‌ రావు, శాస్త్రవేత్త (ఆగ్రానమి), పి. గోన్యా నాయక్‌, శాస్త్రవేత్త (ప్లాంట్‌ బ్రీడింగ్‌), యస్‌. ఓంప్రకాశ్‌, శాస్త్రవేత్త (కీటక శాస్త్రవిభాగం),

యన్‌. నవత, శాస్త్రవేత్త (ఆగ్రానమి), బి.మాధవి, శాస్త్రవేత్త (ఆగ్రానమి), డా|| ఆర్‌. ఉమా రెడ్డి, సహపరిశోధన సంచాలకులు,

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పొలాస, జగిత్యాల, ఫోన్‌ : 9505507995