నిమ్మతోటలు తొందరగా క్షీణించేందుకు గల కారణాలలో నులిపురుగులు కూడా ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. నిమ్మలో ముఖ్యంగా రెండు రకాల నులిపురుగులు ఆశిస్తున్నట్లు గమనించడమైంది. ప్రస్తుత కాలంలో సేంద్రియ ఎరువుల వాడకం తగ్గడం, పంట మార్పిడి పాటించకపోవడం, సరైన యాజమాన్య పద్ధతులను అవలంభించకపోవడం వల్ల నులిపురుగుల తీవ్రత అధికమై రైతులకు తీవ్రనష్టాన్ని కలుగచేస్తున్నాయి.

ఈ నులి పురుగులు వేర్లలోకి ప్రవేశించి వేర్లలోనే నివాసముంటూ మొక్క భాగాల నుండి ఆహారాన్ని పీల్చడం వల్ల వేరులోని కణజాలంలో మార్పులు జరిగి కణుపులు లేదా బుడిపెలు ఏర్పడతాయి. వేర్లు నీటిని, పోషక పదార్ధాలను గ్రహించలేవు. గ్రహించిన కొద్దిపాటి నీరు, పోషక పదార్థాలు సైతం మొక్కలోని ఇతర భాగాలకు సరఫరా కాకుండా అంతరాయం ఏర్పడుతుంది. మొక్కల పెరుగుదల తగ్గి గిడసబారిపోతాయి. నులిపురుగులు ఏర్పరచిన రంధ్రాల ద్వారా ఫ్యూజేరియం, పిడియం, రైజోక్టోసియా, ఫైటోఫ్తోరా లాంటి శిలీంధ్రాలు వేర్లకు చేరి మొక్కలు మరింత త్వరగా ఎండిపోతాయి.

నేలలో తేమ ఎక్కువగా ఉంటే నులి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. వేరుకుళ్ళు సోకిన నీటి ఎద్దడికి గురైన చెట్లకు నులి పురుగుల వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో నులి పురుగులు ఆశించిన చెట్లు నిదానంగా చనిపోతాయి. దీనినే సోడిక్లైన్‌ అంటారు.

నివారణ :

1. నులిపురుగులు ఆశించని మొలకలను. అంట్లను ఎన్నుకొని నాటుకోవాలి.

2. నులి పురుగులకు లోనయ్యే వంగ, టమాట, పొగాకు, మిరప, బెండ లాంటి పంటలను నిమ్మలో అంతర పంటలుగా సాగుచేయకూడదు.

3. అంతర పంటగా బంతి సాగుచేయడం వల్ల బంతి వేర్ల నుండి కొన్ని రకాలైన ఆల్కలాయిడ్స్‌ విడుదల అవ్వడం వల్ల నులి పురుగులు వ్యాప్తి చెందకుండా ఉంటాయి.

4. నారుమడులను పాలిథీన్‌ షీటుతో మల్చింగ్‌ చేయడం వల్ల నారుమడి ఉష్ణోగ్రత పెరిగి నులిపురుగులు చనిపోతాయి.

5. చెట్ల పాదుల్లో 130-160 గ్రా. కార్బోఫ్యూరాన్‌ లేదా 40-60 గ్రా. థిమెట్‌ గుళికలను వేయాలి.

6. మూడు నెలల తరువాత చెట్ల వయసును బట్టి ఒక్కొక్క చెట్టుకు 8-10 కిలోల వేప లేదా ఆముదం లేదా కానుగపిండిని పాదులలో వేయాలి. ప్రతి ఆరు నెలలకొకసారి ఇదే మోతాదులో వేప లేదా ఆముదం లేదా కానుగపిండిని వేయాలి.

డా|| యం. కవిత, శాస్త్రవేత్త, డా|| బి. గోవింద రాజులు, ప్రధాన శాస్త్రవేత్త, డా|| బి. ప్రతాప్‌, శాస్త్రవేత్త,

నిమ్మ పరిశోధనా స్థానం, పెట్లూరు, వెంకటగిరి, ఫోన్‌ : 9440478393