సమగ్ర సస్యరక్షణ అనేది కీటకాల ద్వారా పంటకు కలుగుతున్న ఆర్థిక నష్టాన్ని నియంత్రించే ఒక బృహత్తర చర్య పంటలపై పెరుగుతున్న పురుగుల శాతాన్ని తగ్గించి ఆర్థికంగా నష్టాన్ని కలిగించే స్థాయి నుండి విముక్తి చేసేందుకు ఉద్దేశించినది. సమగ్ర సస్యరక్షణ నిశితంగా పరిశీలిస్తే పురుగుల శాతాన్ని తగ్గించడానికి అనుసరిస్తున్న పద్ధతులు మానవ ఆరోగ్యానికి చూపిస్తున్న ప్రభావం పర్యావరణంపై పడుతున్న ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రసాయనాలు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించుకోవలసిన అవసరం ఏర్పడింది. పురుగుల శాతాన్ని తగ్గించడాన్ని, మందుల పిచికారికి అయ్యే ఖర్చు తగ్గించుకోవడానికి సమగ్ర సస్యరక్షణలో ఈ లింగాకర్షక బుట్టల పాత్ర ఏమిటో తెలుసుకుందాం..

10-15 సంవత్సరాల ముందు పత్తిలో ఈ లింగాకర్షక బుట్టలను అమర్చుకునేవాళ్ళు ఆ తరువాత బి.టి పత్తి వచ్చిన తరువాత వాటి అవసరమే లేకుండా పోయింది. ప్రస్తుతం 2-3 సంవత్సరాల నుండి పత్తిలో గులాబి రంగు పురుగు రైతులను కలవరపెడుతుంది. అందుకే మళ్ళీ రైతాంగం లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి మొగ్గు చూపుతుందన్నారు. అసలు లింగాకర్షక బుట్టలు మరియు లింగాకర్షక రసాయనాలు అంటే ఏమిటో తెలుసుకుందాం...

లింగాకర్షక బుట్టలు :

కీటకాల ఆకర్షణకు తయారు చేయబడినవే లింగాకర్షక బుట్టలు. ఇవి పురుగులను ఆకర్షించి బంధిస్తాయి. ఈ లింగాకర్షక బుట్టల్లో లింగాకర్షక ఎర (రసాయనాల)ని అమరుస్తారు. వీటినే ఫిరమేన్లు అంటారు. తరచుగా ఇతర ప్రాంతాల పంటల నుండి వచ్చే కీటకాల గమనాన్ని గుర్తిస్తాయి. లింగాకర్షక బుట్టల ద్వారా తక్కువ ఖర్చుతో సులభంగా ప్రత్యేక కీటక జాతుల నిర్థిష్ట నిర్మూలనకు అవకాశముంది.

కీటకాల రకాలను బట్టి లింగాకర్షక బుట్టలను గుర్తించి తగు విధంగా వాటిని డిజైన్‌ చేయడం జరుగుతుంది. పురుగుల నిర్మూలనకు, ఖచ్చితమైన యాజమాన్య నిర్వాహణ లక్ష్యంగా ఈ లింగాకర్షక బుట్టలు పనిచేస్తాయి. ప్రస్తుతం ప్రత్తిలో గులాబి రంగు పురుగు నివారణకు తయారు చేయబడిన లింగాకర్షక బుట్టలు పాలిధీన్‌ షీట్‌తో తయారుచేయబడినది.

లింగాకర్షక ఎర :

ఈ రసాయనం ఆడ / మగ రెక్కల పురుగు వదిలే రసాయనం (కెవాల్‌ ఫార్ములాను) ఆధారంగా చేసుకొని కొన్ని కంపెనీ వాళ్ళు దీన్ని కృత్రిమంగా తయారు చేశారు. ఈ రసాయనానికి మగ రెక్కల పురుగు ఏవైతే పొలంలో తిరుగుతూ ఉంటాయో అవి లింగాకర్షక బుట్టల్లోకి ఆకర్షింపబడి బంధింపబడతాయి. సరిగా ఈ లింగాకర్షక రసాయనాలను ప్రత్యేక జాతుల కొరకు తయారు చేసి హానికర కీటకాలను ఆకర్షింపబడతాయి. పత్తిలో గులాబి రంగు పురుగు నివారణ కొరకు పెక్టినోల్యూర్‌ అని మనకు పెస్టిసైడ్‌ షాపుల్లో దొరుకుతుంది. దీని ధర : 1 ల్యూర్‌ రూ. 16/-

వ్యవసాయంలో లింగాకర్షక బుట్టల ప్రాధాన్యత :

పర్యావరణంలో పెనుమార్పులు సంభవించడం ఉధృతమవుతున్న పురుగుల నుండి పంటను కాపాడేందుకు విపరీతమైన రసాయనాల వాడకం జరుగుతున్న నేపధ్యంలో మానవ శరీరానికి, ప్రకృతికి ఆహార పదార్థాల భద్రతకు ప్రమాదం ఏర్పడుతున్న నేపధ్యంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు, పంటల భద్రత చేకూర్చే లింగాకర్షక బుట్టల ప్రాధాన్యత రోజు రోజుకూ పెరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న సస్యరక్షణ యాజమాన్యానికి ప్రత్యామ్నాయంగా తయారు చేయబడుతున్న లింగాకర్షక బుట్టల అవసరాన్ని రైతులు కూడా గుర్తిస్తున్నారు.

ఉధృతమవుతున్న కీటకాల దాడుల నుండి పంటలను రక్షించుకునేందుకు సామూహిక వాటిని పట్టి బందించేందుకు, ఆర్ధిక నష్టస్థాయి పరిమితి తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి.

ప్రత్తిలో లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగాలు :

1. గులాబి రంగు పురుగు ఉనికిని తెలుసుకోవచ్చు.

2. మాస్‌ ట్రాపింగ్‌ (గుంపులు గుంపులుగా పడిన రెక్కల పురుగులను బంధించవచ్చు.

3. ఈ బుట్టల్లో మగరెక్కల పురుగులు బంధించబడతాయి. కాబట్టి ఆడ రెక్కల పురుగులకు సరిపడా మగ పురుగులు లేక సంయోగానికి అంతరాయం కలుగుతుంది.

4. విచ్చల విడిగా మందులను పిచికారి చేయకుండా అవసరాన్ని బట్టి పిచికారి చేసుకోవచ్చు. దీని ద్వారా ఖర్చు తగ్గుతుంది.

5. బుట్టల్లో పురుగులు పడిన దాన్ని బట్టి అంటే ఆర్థిక నష్ట పరిమితి దాటినప్పుడు సిఫారసు చేసిన మందులను పిచికారి చేసుకోవచ్చు.

6. పురుగు నిరోధక శక్తిని పెంచుకోలేదు.

ఎలా అమర్చుకోవాలి :

పురుగు యొక్క ఉనికిని తెలుసుకోవడానికి పంట విత్తిన 40-45 రోజుల తరువాత వీటిని ఎకరానికి 4 చొప్పున అమర్చుకోవాలి. పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి / నియంత్రించుకోవడానికి ఎకరానికి 8 కూడా అమర్చుకోవచ్చు. 4 / 8 లింగాకర్షక బుట్టలను పొలంలో అక్కడక్కడా అమర్చుకున్నట్లయితే గులాబిరంగు పురుగు ఉధృతిని తగ్గించవచ్చు.

అమర్చిన బుట్టల్లో వరుసగా మూడు రోజులు తల్లిరెక్కల పురుగులు గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

కె. నాగజ్యోతి, శాస్త్రవేత్త, ఏరువాక కేంద్రం, ఖమ్మం, ఫోన్‌ : 9989623813