పక్షులు ప్రకృతి ప్రసాందించిన వరప్రసాదం. పక్షులతో వ్యవసాయంలో ఎన్నో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. రామచిలుకలు, ఊర పిచ్చుకలు, బంగారు పిచ్చుకలు, కాకులు, పావురాలు, గువ్వలు, గోరింకలు, నెమళ్ళు గింజల దశలో పంటలపై మూకుమ్మడిగా దాడిచేస్తూ నాశనం చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతుంటాయి. అదే స్థాయిలో తెల్ల కొంగలు, పాల పిట్టలు, మంగలి పిట్టలు, గుడ్ల గూబలు, గద్ధలు, వడ్రంగి పిట్టలు వంటి పక్షులకు పంటలకు రక్షణగా మారి, రైతులకు సంతోషాన్నిస్తున్నాయి. ఈ నేపధ్యంలో పక్షులను కాపాడుతూనే పంటలను రక్షించుకునే పద్ధతులు ఉన్నాయని పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం డైరెక్టర్‌ డాక్టర్‌ ఉమారెడ్డి తెలిపారు.

పక్షులతో ఇబ్బందులు :

వరి పంటల్లో నారుపోసే దశలో బంగారు పిచ్చుకలు, ఊర పిచ్చుకలు, గోరింకలు 5 శాతం వరకు నష్టం కలిగిస్తాయి. గింజ పాలు పోసుకునే దశలో ఈ నష్టం సుమారు 30 శాతం ఉంటుంది. ఈ దశలో పక్షుల నివారణ కోసం స్కేర్‌ క్రోస్‌, రిబ్బన్‌ పద్ధతులను ఉపయోగించవచ్చు.

అలాగే సజ్జ పంటలో గింజ పాలు పోసుకునే దశలో 26 శాతం వరకు రామచిలుకలు, ఊర పిచ్చుకలు, బంగారు పిచ్చుకలు, కాకుల ద్వారా పంట నష్టం జరుగుతుంది. శబ్ద ప్రయోగ పద్ధతులతో పంటను రక్షించుకోవచ్చు.

మినుములు, పెసర, కంది పంటల్లో ఎక్కువగా గింజ మొలకెత్తే సమయాన కాయ దశలో పావురాల, గువ్వలు, కాకులు, రామచిలుకలు అధికంగా నష్టం చేస్తాయి. రిబ్బన్‌, శబ్ధ ప్రయోగ పద్ధతుల ద్వారా పక్షుల బారి నుండి పంటను కాపాడుకోవచ్చు.

పొద్దుతిరుగుడు పంటలో విత్తనాలు వేసే దశలో కాకుల ద్వారా గింజ పాలు పోసుకునే దశలో రామచిలుకల ద్వారా 40 శాతం వరకు నష్టం జరుగుతుంది. రిబ్బన్‌, ఆర్తనాద శబ్దప్రయోగ పద్ధతులతో నష్టాన్ని నివారించవచ్చు.

వేరుశనగలో విత్తనాలు వేసే దశలో కాకులు, పావురాల బెడద ఎక్కువగా ఉంటుంది. కాయదశలో కాకులు, రామచిలుకల ద్వారా నష్టం జరుగుతుంది. రిబ్బన్‌, ఆర్తనాద పద్ధతులతో నష్టాన్ని నివారించవచ్చు.

పంట నష్ట నివారణ పద్ధతులు :

రిబ్బన్‌ పద్ధతి :

పంట ఎత్తుకంటే ఒక అడుగు ఎత్తుగల రెండు కొయ్యలను ఉత్తర, దక్షిణ దిశల్లో పెట్టాలి. వాటికి ఒక పక్క ఎరుపు రంగు, మరో పక్క తెలుపు రంగు ఉన్న అర అంగుళం వెడల్పు 30 అడుగుల పొడవైన రిబ్బన్‌ 3 లేదా 4 మెలికలను తిప్పి కట్టాలి. పక్షుల ఉధృతి ఎక్కువగా ఉన్న ఎడల కర్రల మధ్య దూరం 5 మీ. తగ్గించి కట్టాలి. సూర్యరశ్మి రిబ్బన్‌పై పడి ధగధగ మెరుస్తూ గాలి వీచినప్పుడు ఒక రకమైన శబ్ధం చేస్తూ పంట దశ పక్షుల కంటపడకుండా చేస్తుంది.

శబ్ద ప్రయోగ పద్ధతి :

ఈ యంత్రం కాల్షియం కార్భైడ్‌ అనే పదార్థం ద్వారా పనిచేయును. 3-4 ఎకరాల విస్తీర్ణం కలిగిన పంటలపై దీన్ని అమర్చి పక్షుల బారి నుండి కాపాడవచ్చు. ఖర్చు అతి స్వల్పంగా ఉంటుంది. లేదంటే పంట పొలాల్లో కంచెలు వేసుకొని, దానిపై ఎక్కి ఇనుప డబ్బాలను కొడుతూ శబ్దం చేస్తుంటారు.

ఆర్తనాద పద్ధతి :

పంటకు నష్టం కలిగించే పక్షుల ఆర్తనాదాన్ని ముందుగా రికార్డు చేసి క్యాసెట్‌ ద్వారా పంట ప్రాంతంలో ప్రయోగించాలి. ఈ పద్ధతిని విత్తనోత్పత్తి కేంద్రాల్లో తక్కువ విస్తీర్ణం కలిగిన పండ్ల తోటలకు ఇది ఉపయోగకరం.

ఆకుచుట్టు పద్ధతి :

మొక్కజొన్న ఆకులను, గింజ పాలుపోసుకునే దశలో కంకి చుట్టూ, ఆకుల చుట్టూ పక్షుల దృష్టిని మరల్చవచ్చు. గట్ల నుండి 3 లేదా 4 వరుసల వరకు ఆకులను చుట్టి పక్షుల దృష్టిని మరల్చి పంటలను రక్షించవచ్చు. తక్కువ విస్తీర్ణం ఉన్న పంటలకు అనువైన పద్ధతి.

వేప విత్తన ద్రావణ పిచికారీ పద్ధతి :

వేప విత్తన ద్రావణ మిశ్రమాన్ని గింజపాలు పోసుకునే దశలో పిచికారి చేయాలి. పక్షులు దాని రుచిని జీర్ణించుకోలేక పంట వైపు రాకుండా వెళ్ళిపోతాయి. బయోబర్డ్‌ రిపరెంట్‌ అనే వేప ద్రావణంతో తయారుచేయబడిన మిశ్రమాన్ని లీటరు నీటికి 5-10 మి.లీ. చొప్పున కలిపి పిచికారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గూళ్ళ నిర్మూలన పద్ధతి :

పొలం గట్లపై ఉన్న పొదల్లో ఉన్న పక్షుల గూళ్ళను నిర్మూలించడం, చెట్ల తొర్రలను మూయడం ద్వారా పక్షుల నివాస స్థలాలను మార్చవచ్చు.