భారత దేశంలో పండించే ఆహార ధాన్యపు పంటల్లో జొన్న నాలుగవ స్థానంలో ఉంది. ఒకప్పుడు విస్తారంగా పండించే జొన్న పంటను ఇటీవల కాలంలో ఆధునిక ఆహారపు అలవాట్ల వల్ల రైతులు తక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లోని రైతులు మాఘీ జొన్నను సాగుచేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తేలికపాటి నల్లరేగడి నేలలు నాణ్యత ఎక్కువగా ఉండడం వల్ల మార్కెట్‌లో అధిక ధర పలుకుతుంది. మాఘీ జొన్న సాగు చేయడంలో సరైన యాజమాన్య పద్ధతులను పాటించడం మేలైన రకాలు, సంకర రకాలపైన అవగాహన ఎంతో అవసరం.

మాఘీ జొన్న పంటను సెప్టెంబరు మొదటివారంలో విత్తుకోవాలి. లేని పక్షంలో మొవ్వు చంపే ఈగ ఉధృతి అధికంగా ఉండి మొక్కల సాంద్రత పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ మాఘీ జొన్నకు అనువైన రకాలు, సంకర రకాలు అనేకం మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి.

నంద్యాల తెల్ల జొన్న-1 :

ఈ రకం మాఘీ రబీ పంటలకు అనువైనవి. ఈ రకం 105-110 రోజుల్లో కోతకు వస్తుంది. ఇది బెట్టను తట్టుకొని ఎకరాకు 10-12 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది. మరియు గింజ కూడా రాలదు.

నంద్యాల తెల్ల జొన్న-2 :

పంట త్వరగా కోతకు వస్తుంది (95-100). దీని గింజలు తెల్లగా ఉండి గింజలు సులువుగా కంకి నుండి రాలుతాయి. ఈ రకం సుమారు 12-14 క్వింటాళ్ళ దిగుబడిని ఒక ఎకరానికి ఇస్తుంది.

ఎన్‌-13 :

బెట్ట సమస్య ఉన్న ప్రాంతాలకు అనువైన రకం. తక్కువ కాల పరిమితి 95-100 రోజుల్లో కాపుకు వచ్చి ఒక ఎకరాకు 7-8 క్వింటాళ్ళ దిగుబడి ఇస్తుంది. ఈ రకంలో చొప్ప దిగుబడి కూడా అధికంగా ఉంటుంది.

నంద్యాల తెల్ల జొన్న-3 :

ఇది బెట్టను తట్టుకొని, చొప్ప కూడా ఎక్కువగా వచ్చే మాఘీకి, రబీకి అనువైన రకం. ఇది 100-105 రోజుల్లో ఒక ఎకరాకు 12-14 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. ఆకుపచ్చ తెగులును కూడా తట్టుకుంటుంది.

నంద్యాల తెల్ల జొన్న-4 :

ఈ రకం మొవ్వ చంపు ఈగ, శనగపచ్చ పురుగు ఉధృతిని కొంత మేర తట్టుకుంటుంది. తక్కువ కాలంలో అంటే 90-98 రోజుల్లో పంట కోతకు వస్తుంది. దీని గింజ దిగుబడి 13-15 క్వింటాళ్ళు / ఎకరా ఉండి నల్ల కాండం కుళ్ళు తెగులును తట్టుకుంటుంది.

కిన్నెర (యమ్‌.జె-278) :

ఈ రకం తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు అనువైనది. ఇది బెట్టకు తట్టుకొని 12-16 క్వి / ఎకరాకు గింజ దిగుబడినిస్తుంది. దీని కాలపరిమితి 115-120 రోజులు.

ఎం 35-1 :

గింజలు చొప్ప నాణ్యత కలిగిన రకం. ఈ రకం 115-120 రోజులు కలిగి 10-12 క్వి / ఎకరాకు దిగుబడినిస్తుంది.

ఇవే కాకుండా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌, హైదరాబాద్‌వారిచే విడుదల చేయబడిన సంకర రకాలు సి.ఎస్‌.హెచ్‌-13 ఆర్‌, సి.ఎస్‌.హెచ్‌ -15 ఆర్‌ కూడా మాఘీ, రబీకి అనువైనవి.

మాఘీ జొన్న పంటకు ఒక ఎకరాకు 3-4 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ విత్తనాలను వరుసకు, వరుసకు మధ్య 45 సెం.మీ. దూరంలో మొక్కకు మొక్కకు మధ్య దూరం 12-15 సెం.మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి. ఈ విత్తనాలను 3-5 సెం.మీ. లోతులో బోదెలకు మధ్య భాగంలో విత్తుకోవాలి. ఇలా విత్తుకున్నట్లయితే మనకు ఒక ఎకరాకు సుమారుగా 68 వేల నుండి 72 వేల మొక్కలు ఉంటాయి. ఒక కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిథాక్సాం లేదా థైరాం లేదా కాప్టాన్‌ లేదా 2 గ్రా. కార్బండిజమ్‌ అనే ఏదో ఒక మందుతో విత్తన శుద్ధి చేసుకొని, విత్తనం ద్వారా వ్యాపించే బంక కారు తెగులును సమర్థవంతంగా నివారించుకోవాలి.

బాగా దున్నిన దుక్కిలో 4 టన్నుల పశువుల ఎరువును ఒక ఎకరానికి ఆఖరి దుక్కిలో వేసుకొని కలియదున్నాలి. ఈ మాఘీ జొన్న పంటకు విత్తే సమయంలో 16 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులు వేసుకోవాలి. అలాగే విత్తిన 30 రోజుల తరువాత 16 కిలోల నత్రజనిని పైపాటుగా వేసుకోవాలి.

కలుపు మొక్కలను అంతరకృషి ద్వారా తొలగించడమే ఉత్తమమైన మార్గం. ఒక వేళ కలుపు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే అట్రజిన్‌ 50 శాతం మందును ఎకరాకు 800 గ్రా. చొప్పున 200-250 లీటర్ల నీటిలో కలిపి జొన్న విత్తిన తరువాత లేదా రెండవ రోజు భూమి తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి.

మామూలుగా అయితే జొన్నకు నీరు కట్టాల్సిన అవసరం లేదు. అయితే వర్షాభావ పరిస్థితుల్లో నీటి వసతి ఉన్న వారు 30-35 రోజులు ఉన్నప్పుడు ఒకసారి నాటిన 60-65 రోజుల తరువాత, 70-75 రోజులు, 90-95 రోజుల్లో తడులు ఇచ్చినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చు.

మొవ్వు చంపే ఈగ ఉధృతి పంట నాటిన మొదటి నెల వరకు ఉంటుంది. ఈ మొవ్వు చంపే ఈగ ఆశించిన మొవ్వ మొదటిగా వాడిపోయి తరువాత చనిపోయి చివరిగా కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన మొవ్వులాగినప్పుడు సులువుగా వస్తుంది. దీని నివారణకు గాను 1.5 గ్రా. థయోడికార్బ్‌ లేదా 2 మి.లీ. స్నైపర్‌మెత్రిన్‌ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

కాండం తొలిచే పురగు ఉధృతి పంట విత్తిన 30 రోజుల తరువాత అధికంగా ఉంటుంది. ఈ పురుగు ఆకులపై గుండ్రని రంధ్రాలు ఏర్పరచుతుంది. తరువాత మొవ్వును చంపి తెల్ల కంకులను ఏర్పడేలా చేస్తుంది. దీని నివారణకు గాను కార్బోఫ్యూరాన్‌ 3 శాతం గుళికలు లేదా పొడి మందును వీలును బట్టి వాడుకోవాలి. ఈ గుళికలను మొక్కసుడుల్లో 4 కిలోలు / ఎకరానికి వేయాలి.

ఎన్‌. నవత, సేద్య విజ్ఞాన విభాగ శాస్త్రవేత్త, బి. మాధవి, సేద్య విజ్ఞాన విభాగ శాస్త్రవేత్త, పి. మధుకర్‌ రావు, సేద్య విజ్ఞాన విభాగ శాస్త్రవేత్త,

బి. రాజు, మృత్తిక శాస్త్రవేత్త, ఆర్‌. ఉమారెడ్డి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పొలాస, జగిత్యాల