ఆంధ్ర ప్రదేశ్‌లో ఉద్యాన పంటలను దాదాపుగా పదిహేను లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఉద్యాన పంటలను పిండి నల్లి ఆశించి నష్టపరుస్తుంది. పిండి నల్లి ఆశించే పంటలు, పిండి నల్లి పంటలను నష్టపరిచే విధానం, పిండి నల్లి నివారణ పద్ధతుల గురించి వివరించడం జరిగింది.

పిండి నల్లి ఆశించే పంటలు :

పిండి నల్లి ఉద్యాన పంటలు అయినటువంటి బొప్పాయి, దానిమ్మ, మామిడి, జామ, సపోటా, టమాట, వంగ, గులాబీ, బంతి, చామంతి వంటి పంటలతో పాటు కలుపు మొక్కలు అయిన వయ్యారిభామ, జిల్లేడు మొక్కలను కూడా ఆశిస్తుంది.

పిండి నల్లి జీవిత చక్రం :

తల్లి మరియు పిల్ల పురుగులు మొక్కల ఆకుల అడుగు భాగాన ఈనెల వెంబడి ఉండి తరువాత కాయల పైభాగాన చేరి రసాన్ని పిల్చుతాయి. ఆడ తల్లి పురుగులు రెక్కలు లేకుండా పసుపు రంగులో ఉండి శరీరమంతా తెల్లని మైనంతో కప్పబడి ఉంటాయి. తల్లి పురుగు యొక్క గుడ్ల సముదాయం 150-160 గుడ్లను కలిగిఉంటుంది. దీని నుండి 10 రోజుల్లో గుడ్లు పొడగబడి, పిల్ల పురుగులు బయటకి వస్తాయి. పిల్ల పురుగులు ఆకులపైన, కాయపైన తిరుగుతూ రసాన్ని పిల్చుతాయి. ఈ పిల్ల పురుగు క్రమేపీ పెరిగి 25-30 రోజుల్లో తమ జీవితకాలాన్ని పూర్తి చేసుకుంటాయి. మగ పురుగులు రెక్కలు కలిగి ఉంటాయి.

పిండి నల్లి నష్టపరిచే విధానం :

పిండి నల్లి ఆశించే భాగాలన్నీ తెల్లని దూదితో కప్పబడినట్లు ఉంటాయి. తల్లి మరియు పిల్ల పురుగులు లేత ఆకులు, కాండం మరియు కాయలపై ఆశించి రసాన్ని పీల్చడం వల్ల ఆయా భాగాలు ఎదుగుదల లేకపోవడం, ఆకులు ముడుచుకొని కుచించుకుపోయి గిడసబారడం జరుగుతుంది. పురుగు ఉధతి పెరిగినప్పుడు తేనె వంటి జిగురు పదార్ధాన్ని విసర్జించడం వల్ల మసి తెగులు వ్యాప్తి చెంది కిరణజన్య సంయోగ క్రియకు అంతరాయం ఏర్పడుతుంది. అంతే కాకుండా రసం పీల్చేటప్పుడు ఈ పురుగులు నుండి కొన్ని రకాల విష పదార్ధాలు మొక్కలోకి వెళ్ళడం ద్వారా చిన్న మొక్కలు ఎండిపోయి చనిపోవడం జరుగు తుంది.

పురుగు వద్ధి - వ్యాప్తికి అనుకూల పరిస్థితులు :

పిండి నల్లి పురుగులు మరియు వాటి గుడ్ల సముదాయం తెల్లని మైనంతో కప్పివేయబడి ఉండడం వల్ల ప్రతికూల వాతావరణ పరిస్థితులను మరియు పిచికారి చేసిన మందుల నుండి కూడా తట్టుకోగలిగిన శక్తిని కలిగి ఉంటుంది. పిల్ల పురుగులు గాలి, సాగు నీరు, చీమలు మరియు వాడే పరికరాల ద్వారా ఆశించిన పొలం నుండి వేరే పొలంకు వ్యాపిస్తాయి. ఈ పిండి నల్లి స్రవించే తేనె లాంటి జిగురుకు చీమలు ఆకర్షించబడి అవి కూడా ఈ పిండినల్లిని వేరే ప్రాంతాలకు చేరవేయడం మరియు ఇతర పురుగుల నుండి రక్షణ కల్పించడం జరుగుతుంది.

యాజమాన్యం :

చీమలు పిండి నల్లిని ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వ్యాపింప చేయడానికి చీమలు ముఖ్యపాత్ర పోషిస్తాయి కాబట్టి చీమలను అరికట్టాలి. ముందు జాగ్రత్త చర్యగా క్లోరోపైరిఫాస్‌ 20 ఇ. సి 2.0 మి.లీ లను లీటరు నీటికి కలిపి పొలంలో ఉన్న చీమల పుట్టలో పోసి నాశనం చేయాలి. పిండి నల్లి ఉనికిని ముందుగానే గుర్తించ గలిగితే తేలికగా ఈ పురుగు వ్యాప్తిని అరికట్ట వచ్చును. ఈ పురుగు ఆశించిన మొక్కలను లేదా ఇతర మొక్కలను పొలంలో లేకుండా చూడాలి. మొక్కల కాండంపై సిఫార్సు చేసిన పురుగు మందు పూసి దీని యొక్క పిల్ల పురుగును ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వ్యాప్తి చెందకుండా చూడవచ్చు.

జీవ నియంత్రణ పద్దతులు :

అక్షింతల పురుగులు, అల్లిక రెక్కల పురుగులు, క్రిప్టోలిమాస్‌ మంట్రుజరీ అను బదనికలను పిండి నల్లీని తిని జీవిస్తాయి. ఎస్పాల్జిమస్‌ ఏపియస్‌ అనే సీతాకొక చిలుకలు కూడా ఈ పురుగు గ్రుడ్లను లార్వాలను మరియు తల్లి పురుగును తిని జీవిస్తాయి. మెక్సికోకు చెందిన అనగైరాస్‌ లీకి, ఏసీరోఫాగస్‌ పపాయే మరియు సూడో లిప్టోమస్టిక్స్‌ మెక్సికనా అను బదనికలను మన దేశంలోకి నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ అగ్రికల్చరల్లీ ఇంపార్టంట్‌ ఇన్సెక్ట్స్‌, బెంగళూరు వారు దిగుమతి చేసుకొని, అభివద్ధి పరచి రైతులకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ బదనికలను ఒక ఎకరం బొప్పాయి తోటలో 2000 చొప్పున విడుదల చేయాలి. ఈ బదనికలు తోటలో విడుదల చేసిన తరువాత ఎటువంటి పురుగు మందును పిచికారి చేయరాదు.

రసాయనిక మందులు :

వేపనూనె (2%) లేదా వేప గింజల కషాయం (5%) పిచికారి చేసుకోవాలి. ప్రోఫినోఫాస్‌ లేదా క్లోరోపైరిఫాస్‌ లేదా బుఫఫెజిన్‌ 2 మి.లీ లేదా థయోమిధాక్సాం 0.6 గ్రా లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 0.6 మిలీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఒకే రకమైన మందును పదేపదే పిచికారి చేయరాదు. క్లోరోపైరిఫాస్‌ మందు ద్రావణంతో చెట్టు మొదలు తడపడం ద్వారా పిండి నల్ల్లి యొక్క మొదటి దశ పురుగులు వేరే మొక్కకు వ్యాపించకుండా నివారించవచ్చు.

డా. పి. నాగిరెడ్డి, ఉద్యాన శాస్త్రవేత్త, ఎస్‌. రాజశేఖర్‌ నాయుడు, సమన్వయ కర్త, కషీ విజ్ఞాన కేంద్ర, కలికిరి, చిత్తూరు జిల్లా