మన రాష్ట్రంలో పండిస్తున్న ప్రధాన ఆహార పంట వరి. వరి నారుపోసుకునేందుకు మే-జూన్‌ అనుకూలంగా ఉంటుంది. ఆగష్టు 20 వరకు వరి నార్లు పెరిగిన వాటిని నాట్లు వేసుకుంటే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. రైతులు తొలకరిలో సహజంగా సకాలంలో నార్లు పోసి నాట్లకు సిద్ధమవుతారు. ఇది అనాదిగా ఆచరిస్తున్న పద్ధతి. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఏడాది నీటి కొరత తీవ్రంగా ఉంది. దీని వల్ల నాట్లు సకాలంలో పడక, నారు ముదిరిపోయే అవకాశం ఉంది. ఫలితంగా 45-50 రోజుల పైబడి నారు నాటాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముదురు నారు నాటిన ఈ క్రింది సూచనలు పాటించినట్లయితే సాధారణ దిగుబడులు వస్తాయి.

నాట్లు వేయడానికి 15 రోజుల ముందే పొలాన్ని దమ్ము చేయడం ప్రారంభించి 2-3 దఫాలుగా మురగ దమ్ము చేయాలి. పొలమంతా సమానంగా దమ్ము చెక్కతోగాని, జంబుతో గాని చదును చేయాలి. రేగడి భూముల్లో నాట్లు వేయడానికి 2 రోజుల ముందుగానే దమ్ము పూర్తి చేసి ఆ తరువాత నాట్లు వేస్తే మంచిది.

నారు తీసేటప్పుడు మొక్కలు లేతాకుపచ్చగా ఉంటేనే మూన త్వరగా తిరుగుతుంది. నాటడానికి 4-6 ఆకులున్న నారును ఉపయోగించాలి. ముదురు నారు నాటితే దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి నాటు పైపైన నాటితే పిలకలు ఎక్కువ తొడిగే అవకాశం ఉంటుంది.

నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీఫ్‌లో చ.మీటరుకు 33 మూసలు, రబీలో 44 మూసలు ఉండేలా చూడాలి.

నాట్లు వేసేటప్పుడు ముందుగానే పొలంలో గట్లు వెడల్పుగా లేకుండా సరిచేయాలి. గట్లు వెడల్పుగా ఉంటే కలుపుతోపాటు ఎలుకల బెడద ఎక్కువవుతుంది.

వరి నారు నాటిన తరువాత ప్రతి 2 మీటర్లకి 20 సెం.మీ. వెడల్పున కాలి బాటలు తీయాలి. దీనివల్ల పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతిని కొంత వరకు అదుపు చేయవచ్చు. ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులను వేయడానికి ఇంకా పైరు స్థితిగతులను గమనించడానికి ఈ కాలిబాటలు బాగా ఉపయోగపడతాయి. ఈ కాలి బాటలను నాటే సమయంలోను లేదా నాటిన 5 రోజులలోపు తీసుకోవాలి.

వరి రకాల కాలపరిమితిని బట్టి కుదుళ్ళ సంఖ్యను నిర్థారించాలి. భూసారం ఎక్కువగా ఉన్న పొలాల్లో తక్కువ కుదుళ్ళు, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్ళు ఉండేలా నాటుకోవాలి.

నారు నాటే సమయంలో పొలంలో నీరు పలుచగా ఉండే విధంగా చూసుకోవాలి.

ముదురు నారు నాటేటప్పుడు నిర్ణీత విస్తీర్ణంలో కుదుళ్ళ సంఖ్యను పెంచి దగ్గర, దగ్గర కుదురుకు 4-5 మొక్కల వంతున నాటువేయాలి.

ఇలా ముదురు నారు నాటినప్పుడు నత్రజని ఎరువును సిఫారసు చేసిన మోతాదు కంటే 25 శాతం పెంచి 3 దఫాలుగా కాకుండా, 2 దఫాలుగా అంటే 70 శాతం ఆఖరి దమ్ములోనూ, మిగతా 30 శాతం అంకురం దశలోనూ వాడాలి. నత్రజని ఎరువులను బురదపదునులో మాత్రమే సమానంగా వెదజల్లి 36-48 గంటల తరువాత పలుచగా నీరు పెట్టాలి.

50 కిలోల యూరియాకి 10 కిలోల వేపపిండి లేక 250 కిలోల తేమ కలిగిన మట్టిని కలిపి, 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది.

మొత్తం భాస్వరం ఎరువులను దమ్ములోనే వేయాలి.

పొటాష్‌ ఎరువులను రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి. తేలిక భూముల్లో (చల్కా) ఆఖరి దమ్ములో సగం, అంకురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వేయాలి.

కాంప్లెక్సు ఎరువులను పైపాటుగా దుబ్బు చేసే సమయంలోగాని, అంకురం ఏర్పడే దశలో గాని వేయకూడదు. దమ్ములోనే వేయడం మంచిది.

ఎండలు ఎక్కువగా ఉంటే వరినాట్లు పూర్తయిన తరువాత 5-7 సెం.మీ. వరకు పొలంలో నీరుని నిలకట్టాలి.

వరి మొక్క మొన తిరిగిన రోజు నుండి పైరు దుబ్బు చేయడం వరకు పొలంలో పారే నీరు పలుచగా 2-5 సెం.మీ. లోతు మాత్రమే ఉండాలి. నీరు ఎక్కువగా మడిలో ఉంటే పైరు బాగా దుబ్బు చేయదని రైతు సోదరులు గమనించాలి.

నారుమడిలో కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే బ్యుటాక్లోర్‌ 50 మి.లీ. లేదా ప్రెటిలాక్లోర్‌ + సేఫనర్‌ 25 మి.లీ. ఏదైనా ఒక దానిని ఎకరాకు సరిపడా నారుమడికి 5 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 8-10 రోజులకు పిచికారి చేయాలి.

బిస్‌పైరిబాక్‌ సోడియం అనే కలుపు మందును 0.5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి విత్తిన 8-10 రోజులకు పిచికారి చేసుకోవాలి.

నారుమడిలో ఊద, ఒడిపిలి వంటి గడ్డిజాతి కలుపు ఉన్నట్లయితే విత్తిన 15-20 రోజులకు సైహలోఫాస్‌ బ్యుటేల్‌ అనే కలుపు మందును 1.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

వరి నారును వేరు చేసి నాటుటకు సిద్ధం చేసినప్పుడు వరి నారు కట్టల చివర్లను తుంచి వేయాలి. ఇలా చేయడం వల్ల వరి నారులో ఉండే కీటకాలను నియంత్రించవచ్చు. ముఖ్యంగా కాండం తొలుచు పురుగు ఆకు కొసలపై పెట్టిన గుడ్లు నాశనమవుతాయి.

అవసరాన్ని బట్టి నారుమడిలో సస్యరక్షణ చేయాలి. విత్తిన 10 రోజులకు కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలు సెంటు నారుమడికి 160 గ్రా. చొప్పున వేసుకోవాలి. లేదా క్లోరిపైరిఫాస్‌ 2.0 మి.లీ. లీటరు నీటిలో కలిపి విత్తిన 10 రోజులకు మరియు 17 రోజులకు పిచికారి చేయాలి. నారు తీయడానికి 7 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రా. కార్బోఫ్యూరాన్‌ గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీరుపెట్టి వేయాలి.

జె. విజయ్‌, సేద్య విభాగ శాస్త్రవేత్త, డా|| ఎన్‌. వెంకటేశ్వరరావు, సీనియర్‌ శాస్త్రవేత్త, హెడ్‌, డి. శ్రీనివాస రెడ్డి, సస్యరక్షణ శాస్త్రవేత్త,

కృషీ విజ్ఞాన కేంద్రం, జమ్మికుంట, ఫోన్‌ : 8500119198