సంవత్సరంలో అన్నికాలాల్లో పండించదగిన పంట టమాట. మంచి లాభదాయక కూరగాయల్లో టమాట ఒకటి. టమాట సాగులో వివిధ రకాల పురుగులు, తెగుళ్ళు పంటను ఆశించడం సాధారణం. కానీ గత మూడు సంవత్సరాలుగా పిన్‌వార్మ్‌ పురుగు (సూది పురుగు) సమస్య ఎక్కువవ్వడం గమనించడం జరిగింది. దీనిపై రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల సమర్థవంతంగా నివారించలేక దిగుబడి తగ్గుతుంది.

ఈ పురుగును మొదటిగా అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతంలో గుర్తించారు. అందుకు సౌత్‌ అమెరికన్‌ వారు పిన్‌వార్మ్‌ (సూదిపురుగు) అంటారు. ఎందుకంటే కాయపైన సూదితో గుచ్చినట్లు రంధ్రాలు చేస్తుంది.

2014లో మహారాష్ట్రలోని పూనా ప్రాంతంలో పాలిహౌస్‌లో సాగుచేస్తున్న టమాటాలో దీన్ని గుర్తించారు. సుమారుగా 50 శాతం పైగా ఆ ప్రాంతంలో నష్టం జరుగుతుంది. తరువాత దీన్ని కర్ణాటకలోని బెంగుళూరు, గుజరాత్‌లోని జునాగాడ్‌, తమిళనాడులోని క్రిష్ణగిరి, ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ రాష్ట్రంలో గుర్తించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో కూడా ఈ పురుగు ఉధృతి తక్కువ కాలంలోనే ఎక్కువైంది. ఇది టమాటాతో పాటు వంగ, ఆలుగడ్డ పంటను కూడా ఆశిస్తుంది.

నారు నాటినప్పటి నుండి కాయ కోత వరకు పంట అన్ని దశల్లోనూ పురుగు ఆశిస్తుంది. పిల్ల పురుగులు ఆకులపై పదార్థాన్ని గోకి తినేసి, పై భాగాన్ని పొరలా చేసుకొని లోపల ఉండి తినడం వల్ల ఈ పురుగును మొదటిదశలో గుర్తించడం కష్టం. ఆకులపైన ఆశించడమే కాకుండా కాయలపై సూదితో గుచ్చినట్లు చిన్న రంధ్రాలు చేసి విపరీతమైన నష్టాన్ని కలుగచేస్తాయి. ఈ రంధ్రాల ద్వారా ఇతర శిలీంధ్రాలు, బ్యాక్టీరియా లోపలికి పోయి కాయను కుళ్ళింపచేస్తాయి. ఇలాంటి కాయలకు ధర పలకదు. మరియు మార్కెటింగ్‌కి పనికిరావు. ఇది ఆకులను, కాండాన్ని, మొగ్గలను, కాయలను మరియు పండిన పండ్ల మీద ఆశిస్తుంది.

పురుగు యొక్క వివిధ దశలు :

గుడ్లు 0.35 మి.మీ. పొడవుగా, పసుపు లేక మీగడ తెలుపు రంగులో ఉంటాయి. తల్లి పురుగు ఆకుల అడుగు భాగంలో లేదా కాండం మీద 1-3 గుడ్లను పెడుతుంది. పిల్ల పురుగులు 4-6 రోజుల్లో బయటకు వస్తాయి.

లార్వా :

గొంగళి పురుగు 4 దశలు కలిగి ఉంటుంది. మొదటి దశ పురుగులు తెలుపు రంగులో ఉంటాయి. తరువాత రెండవ దశ నుండి 4వ దశ వరకు అవి తినే ఆహారాన్ని బట్టి (ఆకులను లేదా పండిన పండ్లు) ఆకుపచ్చ లేదా తేలికపాటి గులాబి రంగులోకి మారుతుంది. లార్వా దశ 10-15 రోజుల వరకు ఉంటుంది.

కోశస్థ దశ :

ఈ దశలో 10-12 రోజుల వరకు ఉంటుంది. ఆకు ముడతలో లేక మట్టిలో గాని కోశస్థ దశ వృద్ధి చెందుతుంది.

రెక్కల పురుగు :

అడల్డ్‌ మాత్స్‌ 5-7 మి.మీ పొడవు మరియు 8-10 మి.మీ. వెడల్పు రెక్కలు ఉంటాయి. రెక్కల మీద తేలిక రంగు మరియు ముదురు రంగు చారలతో గుర్తించవచ్చు. రాత్రి వేళల్లో ఈ పురుగులు బయటకు వస్తాయి. మరియు సూర్యరశ్మి ఉన్నంత వరకు ఆకుల మధ్య లేదా పొదల్లో దాక్కుంటాయి. తల్లి రెక్కల పురుగు సుమారుగా 250 గుడ్లను దాని జీవితకాలంలో పెడుతుంది.

గుడ్డు, లార్వా, ప్యూపా మరియు రెక్కల పురుగు దశ 30-40 రోజుల్లో పూర్తవుతుంది. అంటే సుమారుగా ఒక సంవత్సరంలో 10-12 తరాలు కలిగి ఉంటుంది. ఈ పురుగు ఆకుల లోపలి భాగంలో, పండ్లలో మరియ కోశస్థదశ భూమిలో ఉంటుంది కనుక సమగ్ర యాజమాన్య పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి.

ముఖ్యంగా ఆరోగ్యవంతమైన నారును ఎంపిక చేసుకోవాలి. నారు దశ నుండే పురుగును గమనిస్తూ ఉండాలి.

పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నాన్‌సొలనేసియన్‌ పంటల్లో పంట మార్పిడి చేయాలి.

సంవత్సరమంతా టమాటా సాగు చేసే రైతులు పంట తీసేసిన తరువాత లోతు దుక్కులు చేయాలి. పాలిథీన్‌ షీట్స్‌తో సూర్యరశ్మీకరణ చేసి నారును పెంచుకోవాలి.

పురుగు సోకిన ఆకులను, కాయలను ఎప్పటికప్పుడు తీసి నాశనం చేయాలి. లేదా ఒక గొయ్యి తవ్వి దాంట్లో పడేసి మట్టితో కప్పివేయాలి.

వేపనూనె 1500 పిపియమ్‌ 5 మి.లీ. + 1 గ్రా. సర్ఫ్‌పొడి లీటరు నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో పిచికారి చేస్తే పురుగులు పంటపై గుడ్లు పెట్టవు. ఒక వేళ గుడ్లు పెట్టిన గానీ అవి లార్వాగా మారవు మరియు పొదిగిన లార్వాలు ఆకులనుతినడానికి ఇష్టపడక తిండి లేక చనిపోతాయి.

మగ రెక్కల పురుగులను ఆకర్షించే లింగాకర్షక బుట్టలు మరియు ఎర (ట్యూట ల్యూర్‌) మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవి పొలంలో ఎకరాకు 10 చొప్పున ఏర్పాటు చేయడం ద్వారా పురుగు ఉధృతి గమనించుకొని పిచికారి చేసుకోవచ్చు మరియు పురుగుల సంఖ్య కూడా తగ్గుతుంది. వీటిని పంట నాటిన 20-25 రోజుల్లో అమర్చుకోవాలి.

ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే స్పైనోశాడ్‌ 0.25 మి.లీ. లేదా క్లరాట్రనిలిప్రోల్‌ 0.3 మి.లీ. లేదా పూబెండమైడ్‌ 20 శాతం డబ్ల్యుజి 0.3 మి.లీ. లీటరు నీటిలో కలిపి 10 రోజులకొకసారి 2-3 సార్లు అవసరాన్ని బట్టి పిచికారి చేయాలి.

డా|| ఎ. రమాదేవి, డా|| వై. ప్రవీణ్‌ కుమార్‌, డా|| ఏ. పోశాద్రి, డా|| జి. శివచరణ్‌, డా|| యం. రఘవీర్‌, శాస్త్రవేత్తలు,

కృషీ విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్‌, ఫోన్‌ : 9989623829