ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుతం సాగవుతున్న 42 లక్షల ఎకరాల్లోని ఉద్యానసాగును కోటి ఎకరాలకు విస్తరింప చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆగష్టు 23వ తేదీన విజయవాడలోని వీఆర్‌ సిద్థార్ధ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉద్యాన్‌- 2018 ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం రైతులతో జరిగిన ముఖాముఖి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సమృద్ధి దిశగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో విశేషమైన ప్రగతిని సాధించడానికి, రైతుకు గిట్టుబాటు ధర కల్పన ద్వారా లాభసాటి వృత్తిగా సేద్య రథాన్ని శరవేగంతో ముందుకు నడిపించడానికి కృషి ప్రారంభమైందని తెలిపారు.

గతంలోలాగా కాకుండా పరిశోధనా శాల నుండి పొలం గట్ల మీదకే కాకుండా మార్కెట్ల వరకు విస్తరణ కార్యక్రమాలను ప్రభావితం చేస్తూ, విధాన పరమైన కార్యాచరణను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. నేడు ప్రపంచ మార్కెట్‌కు ధీటుగా మన వ్యవసాయ ఉత్పత్తులు పోటీ పడే విధంగా ఉండాలని సూచించారు. ప్రపంచస్థాయి, ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు ఉండే విధంగా సేద్యం చేపట్టాలని సూచించారు. తాము ఉత్పత్తి చేసిన వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులకు రేటును తామే నిర్ణయించే అధికారం రైతుకే ఉంటుందని తెలిపారు. సాగు విస్తరించిన కొద్దీ మార్కెట్‌ అందుబాటులోకి వస్తుందని అన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ తిరుగులేని శక్తిగా ఎదగాలంటే ఉద్యాన పంటలే కీలకమని గుర్తుచేశారు. వ్యవసాయంతో పాటు రైతులు ఎక్కువగా అనుబంధ రంగాలైన ఉద్యానవన, మత్స్య, పాడిపరిశ్రమ రంగాలకు విస్తరించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని తెలిపారు. రాయలసీమ ప్రాంతాల్లో ఇప్పటికే ఉద్యాన పంటలు విరివిగా సాగవుతున్నాయని అక్కడి వాతావరణంతో పాటు గాలి కూడా స్వచ్ఛందంగా ఉంటుందని ఉద్యాన పంటలే ఇందుకు కారణమని గుర్తుచేశారు.

ఇప్పటికే ఎక్కువ మంది రైతుల్లో ఉద్యాన పంటల వల్ల లాభం వస్తుందనే నమ్మకం ఏర్పడిందని చంద్రబాబు అన్నారు. రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే పంటలపై దృష్టి సారించాలని ప్రకృతి సేద్య విధానాలను రైతులంతా అందిపుచ్చుకోవాలని సూచించారు. ఇష్టానుసారం రసాయన మందులు వాడితే ఎక్కువ నష్టపోతాం. దీని వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. మానవాళి మనుగడ పూర్తిగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉందన్నారు. ప్రామాణికమైన వ్యవసాయ ఉత్పత్తులపైనే జీవన విధానం ఆధారపడి ఉంది. ఈ సందర్భంలో బాధ్యతాయుతంగా సాగు చేయాల్సిన అవసరం రైతాంగంపై ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రానున్న రోజుల్లో ఏ పంట ఏ రైతు పండించాడో, ఎలాంటి రసాయనాలు ఉన్నాయో అన్ని వివరాలతో వినియోగదారులకు తెలిసే విధంగా జవాబు దారీతనం రానుందని అన్నారు. వినియోగదారులు పంట ఉత్పత్తులను పూర్తి స్థాయిలో తెలుసుకునే అవకాశం రాబోతుందని ఇప్పటికే షాపుల్లో అలా గుర్తించే విధానం వచ్చిందని సూచించారు. రైతులు చైతన్యవంతంగా సాగు చేసినప్పుడే మంచి ఫలితాలు రాబట్టగలుగుతారని అన్నారు. ఇప్పుడు సాగు చేస్తున్న భూభాగం రెండింతలు పెంచుకోవలసిన అవసరం ఉందని ప్రజలకు అవసరమయ్యే ఉ్పత్తులను అందించే దశలో మన రాష్ట్ర రైతాంగం కృషి చేయాలని ఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని కొత్తపుంతలు తొక్కే విధంగా అన్ని ఏర్పాట్లను వ్యవసాయ శాఖ తీసుకువచ్చామని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న యంత్ర సామగ్రిని రైతుముంగిట ఉంచగలిగామని తక్కువ శ్రమతో ఎక్కువ సాగు చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత మన రాష్ట్రానికే ఉందని అన్నారు. ఇప్పటికే రైతులకు వ్యవసాయ ఉద్యానవనంపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ స్థాయి విలువ కలిగిన ప్రదర్శనలను మన రాష్ట్రంలోనే ఏర్పాటు చేశామని ఇటువంటి ప్రదర్శనల ద్వారా రైతులకు పలు రకాల సాగు విధానాలపై అవగాహన కలిగి వ్యవసాయ ఉత్పత్తులను అధికంగా సాధించేందుకు దోహదపడుతుందని అన్నారు.

దేశంలోనే మొదటి స్థానంలో ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని నిలిపిన ఘనత కమీషనర్‌ చిరంజీవి చౌదరిదేనని ఇంతటి స్థానాన్ని నిలిపినందుకు కమీష్‌నర్‌ను అభినందించారు. అనంతరం ఆదర్శరైతులను సన్మానించి వారికి ప్రోత్సాహక బహుమతులను అందచేశారు.

బిందు, తుంపరల సేద్యంలో దేశంలో మొదటిస్థానం :

-సోమిరెడ్డి

దేశంలోనే నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బిందు సేద్యంలో మొట్టమొదటి స్థానం కలిగి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉద్యాన పంటలను ప్రోత్సహించాలనే తలంపుతోనే ప్రభుత్వం రైతులకు విరివిగా సబ్సిడీలతో పాటు రుణాలను అందిస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రూ. 1380 కోట్లతో బిందు సేద్యానికి ప్రభుత్వం విరివిగా ఖర్చు చేసిందని ప్రతి రైతుకూ బిందు సేద్యాన్ని అందించే దిశగా పనిచేస్తున్నామని అన్నారు. నేడు దేశంలో ఉద్యాన సాగులో గుజరాత్‌ రాష్ట్రం మూడవ స్థానంలో ఉందని, మన రాష్ట్రం మొదటి స్థానంలో ముందున్నామని గుర్తుచేశారు. వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు వెనకడుగు వేయకుండా విరివిగా నిధులను కేటాయించదని రానున్న రోజుల్లో వ్యవసాయ ముఖచిత్రం గణనీయంగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతాంగానికి మేలు చేయాలనే సంకల్పంతో దూరదృష్టితో సాంకేతిక విధానాన్ని అమలు చేసేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు.

ఈ ప్రదర్శనలో వివిధ కంపెనీలతో పాటు నోవా అగ్రిటెక్‌, నోవా అగ్రిసైన్సు ఉత్పాదకాలు సైతం రైతులను ఆకర్షించాయి. రైతులకు తెగుళ్ళ, పురుగుల సమగ్ర సస్యరక్షణకు వాడాల్సిన ఉత్పత్తులపై నోవా అగ్రిటెక్‌ సిబ్బంది అవగాహన కల్పించారు. అగ్రిక్లినిక్‌ సమగ్ర వ్యవసాయ మాసపత్రిక సైతం ఈ ప్రదర్శనలో పాలు పంచుకుంది. ఈ పుస్తక ప్రదర్శనను రైతులు ఆసక్తిగా పరిశీలించారు. పంటలపై సమగ్ర సమాచారం ఉండడంతో రైతులు చందాదారులుగా చేరారు. ప్రదర్శనలో అగ్రిక్లినిక్‌ పుస్తక స్టాళ్ళను వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి సందర్శించారు. సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ తదితరులు సందర్శించారు.

సుస్థిర సేంద్రియ సేద్యమే శరణ్యం :

-ఉద్యాన శాఖ కమీషనర్‌ చిరంజీవి చౌదరి

రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేసి ఉత్పత్తులపై దృష్టి సారిస్తే అధిక లాభాలు సాధించవచ్చునని ఆంధ్రప్రదేశ్‌ ఉద్యాన శాఖ కమీషనర్‌ చిరంజీవి చౌదరి తెలిపారు. ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ రైతులు తమకున్న వ్యవసాయ క్షేత్రంలో 50 శాతం వరకు సేంద్రియ ఉత్పత్తులను పండించడం వల్ల ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం తరుణంలో ఒకే పంటను పండించడం కంటే 25 నుండి 30 రకాల పంటలను పండించడానికి రైతులు ముందుకు వస్తున్నారన్నారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, సీఐఐ అగ్రిప్యానల్‌ చైర్మన్‌ ఎం. లక్ష్మీ ప్రసాద్‌, ఐటీసీ లిమిటెడ్‌ అధికారి పి. వెంకటరామిరెడ్డి, వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ విశ్వ విద్యాలయం రీసెర్చి డైరెక్టర్‌ దిలీప్‌బాబు, జయదీప్‌రాయ్‌, ఇతర అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

ఖండాంతరాలకు తెలుగు పసుపు :

మన వద్ద నాణ్యమైన పసుపు ఉత్పత్తులు ఉన్నాయని, వీటికి విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉందని ఐఐఎస్‌ఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నిర్మలబాబు అన్నారు. కానూరు వి.ఆర్‌. సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన 'ఉద్యాన 2018' ప్రదర్శనలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన సదస్సులో నిర్మలబాబు మాట్లాడుతూ సంప్రదాయ పద్ధతులతో ఉత్పత్తి చేస్తే పసుపు పంట సిరులు కురిపిస్తుందన్నారు. ఎగుమతి, మార్కెటింగ్‌ చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందన్నారు. అంతర పంటగా మొక్కజొన్న వేయడం వల్ల వచ్చే తెగుళ్ళను ఎలా నివారించాలో ఆయన వివరించారు.

అవార్డుల అందజేత :

ఉత్తమ స్టాల్స్‌ కింద చిత్తూరు జిల్లాకు చెందిన మైక్రోఇరిగేషన్‌ సంస్థ రావెంట్స్‌ భార్గవ, ప్రొడ్యూసర్స్‌ రైతు ఉత్పత్తిదారుల సంఘం నర్సరీ విభాగంలో విజయవాడకు చెందిన స్టాండర్డు ప్లాంట్‌ షాపీ, ఆర్గానిక్‌ ఫుడ్‌ విభాగంలో భారతీయం, సహజ, భూమి ఆర్గానిక్స్‌, ఆర్గానిక్స్‌ ఫుడ్‌ స్టాళ్ళకు ఉత్తమ అవార్డులు లభించాయి. ఉత్తమ అధికారులుగా ఉద్యాన శాఖ ఉప సంచాలకులు పావులూరి హనుమంత రావు, అశోక్‌కుమార్‌, పద్మావతి, సుబ్బారాయుడు, ప్రాజెక్టు డైరెక్టర్ల విభాగంలో ఎం. వెంకటేశ్వర్లు, మధుసూధన్‌ రెడ్డి, రవి, రాజశేఖర్‌, నవీన్‌, మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు అధికారి సూర్యప్రకాష్‌లతో పాటు మొత్తం 37 మందికి కమీషనర్‌ చిరంజీవి చౌదరి చేతులు మీదుగా అవార్డులు అందచేశారు.

ఆకట్టుకున్న ఉద్యాన ప్రదర్శన :

సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన యంత్రాల వినియోగం, ఎరువుల వాడకం ఉత్పత్తి పెరుగుదల ఇలా వ్యవసాయ ఉద్యాన పంటలను పండించే రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఉద్యాన శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఉద్యాన 2018 వీఆర్‌ సిద్ధార్థ కళాశాల మైదానంలో నాలుగు రోజుల పాటు ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కంపెనీలు, రైతు సంఘాలు, ఫెర్టిలైజర్స్‌ 140 స్టాళ్ళ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో వివిధ సాంకేతిక పరిజ్ఞానంతో యంత్రాల పని విధానం రైతులను ఎంతగానో ఆకర్షించింది. వివిధ పంటలకు నీటి వాడక విధానాన్ని రైతులు ఆసక్తిగా తిలకించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే విధానం రైతులను అబ్బురపరచింది. 4 రోజుల పాటు 13 జిల్లాల నుండి రైతులతో పాటు వివిధ కళాశాలల విద్యార్ధులు, తదితరులు ఈ ప్రదర్శనను తిలకించారు. సహజ సిద్ధంగా లభించే ఉత్పత్తులను ఇష్టంగా ఆరగించారు. వివిధ స్టాళ్ళలో ఏర్పాటు చేసిన తినుబండారాల సైతం ఆకర్షణగా నిలిచాయి.

భూమితో పనిలేని సాగు :

థాయ్‌లాండ్‌కు చెందిన పూల మొక్క వెల రూ. 600/- ఖరీదులోనే కాదు. అత్యంత ఆకర్షణీయంగా ఉన్న ఈ పూలు సందర్శకులను కనులవిందు చేసింది. ఈ మొక్కకు మట్టి అవసరం లేదు. కొబ్బరి పీచు, బొగ్గు, ఇటుకపొడుల్లో సాగు చేయాలి. దీని జీవిత కాలం 10 ఏళ్ళు. సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా పూలు పూస్తాయి. ఈ మొక్కలను తణుకులోని ఓ నర్సరీ వారు ప్రదర్శనలో ఉంచారు. అలంకరణకు వినియోగించే ఈ పువ్వు ఖరీదు రూ. 15-20 వరకు ఉంటుంది.

ప్రదర్శన చివరి రోజు (నాలుగవ రోజు) :

నాలుగు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఇక్కడికి తీసుకువచ్చి అవగాహన సదస్సులు నిర్వహించారు. 1800 మంది రైతులకు అవగాహన కల్పించారు. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు, సేంద్రియ ఎరువుల వాడకం, సాంకేతిక సాగు పద్ధతులపై వినియోగంపై అవగాహనతో పాటు వివిధ ఉత్పత్తులపై రైతులకు వివరించారు. అధిక రాబడి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి కంపెనీల అనుమతులు పొందడంలో పాటించాల్సిన నిబంధనలపై నిపుణులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో తమ ఉత్పత్తుల ద్వారా ప్రతిభ కనబరచిన ఉద్యానశాఖ అధికారులకు ప్రోత్సాహకర బహుమతులను అందచేశారు.

ఆకర్షణీయంగా ఉద్యాన విభాగం :

ప్రదర్శనలో పండ్లు, కూరగాయలతో తయారుచేసిన బొమ్మలు, విగ్రహాలు సందర్శకులను విశేషంగా ఆకర్షించింది. ఉద్యానశాఖ సిబ్బంది గౌతమ బుద్ధుడు, శ్రీవెంకటేశ్వర స్వామి, ఇతర దేవతల ఆకృతులతో సుందరంగా తయారుచేసి ఉంచిన విగ్రహాలు వారి ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ, ఉద్యాన శాఖలు, సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్ళను లెక్కకు మించి నెలకొల్పాయి. జీవామృతం, ఘనజీవామృతం, సహజ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం ఇంకా అనేక ఇతర ప్రదర్శనా శాలలు విజ్ఞాన ప్రతీకలుగా నిలిచాయి.

లెక్కకు మించిన ఎఫ్‌పిఓలు :

దేశ వ్యాప్తంగా రైతు సాధికారతకు ముఖ్యంగా వ్యవసాయాన్ని పండుగగా నిర్వహించేందుకు ఉద్దేశించిన రైతు ఉత్పత్తి దారుల సంఘాల ప్రదర్శనాశాలలు విశేషంగా సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఉద్యాన ఉత్పత్తులైన కోకోవా, కొబ్బరి, కూరగాయలతో పాటు గిరిజన సహకార సంఘాలు ఇతర ఉత్పత్తిదారుల కంపెనీలు తమ ప్రదర్శనా శాలలను ఆకర్షణీయంగా అలంకరించి ప్రదర్శనకు వన్నెతెచ్చాయి. వీటితోపాటు గుంటూరు కేంద్రంగా కార్యాకలాపాలు నిర్వహిస్తున్న సుగంధ ద్రవ్యాల బోర్డు, కేంద్ర కొబ్బరి బోర్డు, వివిధ పరిశోధనా సంస్థలు, వైయస్‌ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయం స్టాల్సు రైతులకు విజ్ఞానాన్ని పంచే కృషిలో సఫలీకృతమైనాయి. రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న క్యాడ్బరీస్‌ కంపెనీ కోకోవా పంట సాగుపై ఆకర్షణీయమైన ప్రదర్శనా శాలను నిర్వహించింది. రైతులు, శాస్త్రజ్ఞులు, వ్యాపారులు ఒకే వేదికపై నిలిచిన ఈ నాలుగు రోజుల ప్రదర్శన మొత్తానికి విజయవంతంగా ముగిసింది.

- వై.వి. నరసింహారావు, అసోసియేట్‌ ఎడిటర్‌

ఎలిమిశెట్టి రాంబాబు, అగ్రిక్లినిక్‌ ప్రతినిధి, ఫోన్‌ : 9949285691