మన రాష్ట్రంలో పండిస్తున్న వాణిజ్య పంటల్లో పత్తి పంట ముఖ్యమైనది. పత్తి పంటను నల్ల నేలల్లో వర్షాధారంగానూ, తేలిక నేలల్లో నీటి వసతితో పండించడం జరుగుతుంది. మన రాష్ట్రంలో 2016-17 సం||లో పత్తిని దాదాపు లక్షల హెక్టార్లలో సాగుచేసాం. పత్తి సాగులో దాదాపు 98 శాతం బిటి పత్తినే సాగుచేయడం జరుగుతుంది. సాధారణ పత్తికి, బిటి పత్తికి ఉన్న తేడా బిటి పత్తిలో బాసిల్లస్‌ తురంజెన్సిస్‌ నుండి వెలికి తీసిన కాయతొలుచు పురుగులను తట్టుకునే బిటి జన్యువును కలిగి ఉండడమే. మిగతా విషయాల్లో బిటి పత్తి, సాధారణ పత్తి విషయంలో తీసుకునే జాగత్త్రల విషయంలో పెద్ద విబేధాలు ఉండవు. పత్తి పైరు ముఖ్యంగా వర్షాధారంగా పండించబడడం, వాతావరణంలో ఒడిదుడుకులు ఉండడం, పైరు మొదటిదశలో పెరుగుదల చాలా నెమ్మదిగా ఉండడం, సాళ్ళ మధ్య దూరం ఎక్కువగా ఉండడం మరియు ఎరువులు అధికంగా వాడడం వల్ల కలుపు ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది.

ఈ కలుపు మొక్కలు నీరు, పోషకాలు, వెలుతురు మొదలైన వాటి కొరకు పత్తి మొక్కలతో పోటీపడి, పత్తి మొక్కల పెరుగుదలను తగ్గించి తద్వారా దిగుబడులు తగ్గిస్తాయి. పరిశోధనల వల్ల తేలింది ఏమిటంటే ఈ కలుపు మొక్కలు పత్తి మొక్క కంటే 5-6 రెట్లు ఎక్కువ నత్రజని, 5-12 రెట్లు ఎక్కువ భాస్వరం, 2-5 రెట్లు ఎక్కువ పొటాషియం పోషకాలను గ్రహిస్తాయి. ఇంతేకాకుండా చీడపీడలకు ఆవాసాలుగా ఉంటాయి. దీనివల్ల దాదాపు 50-80 శాతం వరకు పత్తి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. కలుపు మొక్కల కారణంగా, పోషకాలు సరిగా అందకపోవడంతో పత్తి నాణ్యత కూడా తగ్గుతుంది. పత్తి రైతుకు సాగు ఖర్చు పెరిగి నికరాదాయం తగ్గుతుంది.

పత్తిలో సాధారణంగా పెరిగే కలుపు మొక్కలు :

గరిక, తుంగ, దర్భగడ్డి, నేల ఉసిరి, ఉత్తరేణి, పాయలాకు, తుత్తురు బెండ, వయ్యారి భామ, లింగ మిరియాలు, గురివి, ఆమడకాయ, పిచ్చి తోటకూర, చెంచలి, గల్జేరు కాడ, పారాశి కంప, పాలకాడ మొదలగునవి. పత్తి విత్తిన మొదటి 60 రోజుల కలుపుకు చాలా కీలకం. ఈ దశలో కలుపు నివారించుకోలేకపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. సాధారణంగా తొలిదశలో కలుపు నివారణ జరిగినట్లయితే ఆ తరువాత పత్తి మొక్కలో ఎదుగుదల ఉంటుంది. కాబట్టి చాలా వరకు నష్టం అరికట్టబడుతుంది.

పత్తి విత్తిన మొదటి దశలో గట్ల మీద పెరిగే కలుపు మొక్కలైనటువంటి వయ్యారిభామ మరియు పిచ్చి బెండలు, పత్తిలో అధిక నష్టం కలిగించే రసంపీల్చు పురుగు పిండినల్లికి ప్రత్యామ్నాయ ఆవాసాలుగా ఉండి, ఆ తరువాత పత్తిని ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.

పత్తిలో కలుపు నివారణ పద్ధతులు :

1. కలుపు రాకుండా జాగ్రత్త పడడం :

వేసవిలో లోతు దుక్కులు దున్నడం ద్వారా మరియు స్టేలోసీడ్‌ బెడ్‌ టెక్నిక్‌ను అనుసరించడం ద్వారా మనం పొలంలో కలుపు రాకుండా నివారించవచ్చు. స్టేలోసీడ్‌ బెడ్‌ టెక్నిక్‌ అంటే పంట వేయడానికి ముందు నేలపై తేలికగా నీరు పారించినట్లయితే లేదా తొలకరి వర్షాలకు లుపు విత్తనాలు మొలుస్తాయి. ఈ మొలిచిన లుపు పొలాన్ని బాగా కలియదున్నడం ద్వారా గానీ కలుపు మందు ద్వారా గానీ నివారించుకొని తదుపరి పత్తి విత్తుకున్నట్లయితే కలుపు ఉధృతి తక్కువగా ఉంటుంది.

2. కలుపు వచ్చిన తరువాత నిర్మూలించడం :

యాంత్రిక పద్ధతులు (ఫిజికల్‌ / మెకానికల్‌)

అంతర కృషి (కల్చరల్‌)

జీవ నియంత్రణ (బయాలాజికల్‌)

రసాయన (కెమికల్‌)

పత్తిలో కలుపు రాకుండా ఉండడానికి విత్తే ముందు ప్లుక్లోరాలిన్‌ 45 శాతం ఎకరాకు లీటరు చొప్పున పిచికారి చేసి భూమిలో కలియదున్నాలి. ఇలా వీలుకానప్పుడు విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పెండిమిధాలిన్‌ 30 శాతం ఎకరాకు 1.3-1.6 లీటర్లు, 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. విత్తిన 15-20 రోజులకు మరియు 45-50 రోజులకు అరకలను ఉపయోగించి అంతరకృషి చేయడం ద్వారా కలుపు నివారించుకోవాలి.

సాధారణంగా పత్తిలో అంతరకృషి చేసి, మనుషుల చేత కలుపుతీయించడం వల్ల కలుపు నిర్మూలించడమే కాకుండా, నేల గుల్ల బారుతుంది. తద్వారా మొక్క పెరుగుదల కూడా బాగుంటుంది. కానీ ఎడతెరపి లేని వర్షాలు పడి, అంతరకృషి గాని, కలుపు తీతకు గానీ అవకాశాలు లేనప్పుడు కలుపు మందులను వినియోగించి కలుపు నివారణ చేసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో వ్యవసాయ కూలీల కొరత ఏర్పడడం కూలీల వేతనాలు పెరిగిన దృష్ట్యా కలుపు మందుల వాడకం పెరిగింది. అయితే ఏ కలుపు మందులు ఎప్పుడు వాడాలి? ఏయే మోతాదులో వాడాలి? అన్నది కలుపు నివారణలో చాలా ముఖ్యం.

పత్తిలో విత్తిన 25-30 రోజులకు అంతరకృషి మరియు కలుపు తీతకు వీలుకానప్పుడు వెడల్పాటి మరియు గడ్డిజాతి కలుపు నివారణకు పైరిథయోబ్యాక్‌ సోడియం 250 గ్రా. + క్విజలోఫాప్‌ ఇథైల్‌ 400 గ్రా., 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ కలుపు మందులు పత్తి పైరు మీద పడినా ఏ హాని జరుగదు. ఇలా వీలుకానప్పుడు పారాక్వాట్‌ 24 శాతం 5 మి.లీ. లీటరు నీటకి కలిపి పత్తి పైరుపై పడకుండా వరుసల మధ్య కలుపు మీద మాత్రమే పడేటట్లు పిచికారి చేయాలి.

పత్తిలో కలుపు నివారణలో జీవనియంత్రణ విధానలను గురించి విశ్లేషించినట్లయితే ప్రస్తుతం మనదేశంలో ప్రాచుర్యంలో లేవు కాని, అమెరికా లాంటి దేశాల్లో ఆల్టర్నేరియా కాసియే అనే శిలీంధ్రం నుండి వెలికి తీసిన ''కాస్ట్‌'' అనే కలుపు మందును పత్తి, సోయాచిక్కుడు మరియు వేరుశనగలో కలుపు నివారణకు ఉపయోగించి సమర్థవంతంగా కలుపు నివారించుకోవడం జరుగుతుంది.

పత్తి సాగు ఖర్చులను విశ్లేషించినప్పుడు దాదాపు ఎకరానికి రూ. 3వేల నుండి రూ. 4 వేల వరకు కలుపుతీత ఖర్చు అవుతుంది. సకాలంలో కనుక కలుపు నివారించుకోలేకపోతే దిగుబడులు గణనీయంగా తగ్గడమేకాకుండా పత్తి నాణ్యత కూడా తగ్గినట్లుగా పరిశోధనా ఫలితాలు తెలియచేస్తున్నాయి. ఈ నేపధ్యంలో రైతులు పత్తిలో కలుపుతీత ఆవశ్యకతను గుర్తించి మనుషుల చేత కలుపు తీయించుకోవడం, అంతరకృషితో పాటుగా అవసరానికి తగినట్గుగా రసాయనిక మందులను కూడా వినియోగించుకోవడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకొని నాణ్యమైన పత్తిని, అధిక దిగుబడులను సాధించి అధిక నికరాదాయాన్ని పొందవచ్చు.

బి. మాధవి, సేద్య విజ్ఞాన విభాగ శాస్త్రవేత్త, ఎన్‌. నవత, సేద్య విజ్ఞాన విభాగ శాస్త్రవేత్త, బి. రాజు, మృత్తిక విభాగ శాస్త్రవేత్త,

పి. మధుకర్‌ రావు, సేద్య విజ్ఞాన విభాగ శాస్త్రవేత్త, ఆర్‌. ఉమారెడ్డి, సహ పరిశోధన సంచాలకులు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పొలాస, జగిత్యాల