సమస్త మానవాళికి నీరు జీవనాధారం. నీరు లేనిదే మనుషుల మనుగడ అసాధ్యం రానున్నకాలంలో ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయానికి అవసరమయ్యే సాగునీరు క్రమంగా తగ్గుతూ ఉంది. 2025 సం|| నాటికి నీటిపారుదల కింద సాగయ్యే దాదాపు 20 మి. హెక్టార్ల వరి సాగుకు తీవ్రమైన సాగునీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితులున్నాయి. 

భారతదేశంలోని జనాభాలో 100 మిలియన్‌ల కంటే ఎక్కువ ప్రజలు నీటి నాణ్యత తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దేశంలో దాదాపు 54% భౌగోళిక ప్రాంతం తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది మరియు భూగర్భజలాలు అడుగింటిపోతున్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా మానవ సంబంధిత హరిత గృహవాయువుల ఉద్ఘారాల్లో దాదాపు 15% వ్యవసాయ రంగం నుండే వెలువడుతున్నాయి. వీటిలో 46% నైట్రస్‌ఆక్సైడ్‌, 45% మిథేన్‌, 9% కార్భన్‌డైఆక్సైడ్‌ రూపాల్లో వెలువడుతున్నాయి. సాంప్రదాయ వరిసాగు పద్ధతిలో నీరు ఎక్కువగా నిల్వ ఉంచడం వల్ల ఎక్కువ మోతాదులో మిథేన్‌ వాయువు వెలువడి వాతావరణ సమతుల్యత దెబ్బతిని గ్లోబల్‌ వార్మింగ్‌కు కారణమవుతుంది. అందువల్ల వాతావరణ సమతుల్యత మరియు నీటి పొదుపు దృష్టిలో ఉంచుకొని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సాగు నీటి రక్షణ సాంకేతిక పద్ధతులను అభివృద్ధి చేశారు. అందులో ప్రధానమైనది ఏకాంతరంగా నీరుపెడుతూ ఆరబెట్టే ఆరుతడి నీటిపారుదల పద్ధతి. (ఆల్టర్నేట్‌ వెట్టింగ్‌ మరియు డ్రైయింగ్‌ పద్ధతి)

ఈ విధానంలో 30 సెం.మీ. పొడవు, 15 సెం.మీ వెడల్పు  ఉన్న పి.వి.సి పైపును ఎంచుకోవాలి. దీనికి 20 సెం.మీ. పొడవు వరకు 2 సెం.మీ దూరంలో 5 మి.మీ. వ్యాసం కలిగిన రంధ్రాలను ఏర్పాటు చేయాలి. సమాంతరంగా చదును చేసి నాట్లువేసిన పొలంలో 2 వారాల తరువాత గమనించడానికి సులువుగా ఉన్న ఒడ్డు / గట్టు పక్కన ఈ పివిసి పైపును రంద్రాలున్నంత భాగం వరకు పొలంలోని నేలలో పాతాలి. పాతిన పివిసి పైపులో రంద్రాలున్న 20 సెం.మీ. నుండి క్రమంగా పైపు అడుగు భాగం వరకు పైపులోని మట్టిని తీసివేయాలి. నేల ఉపరితలం నుండి 5 సెం.మీ. వరకు పొలంలో నీరు పెట్టాలి. అప్పుడు పివిసి పైపు మరియు నేల ఉపరితలంపై 5 సెం.మీ. ఎత్తు వరకు నీరుంటుంది. 

ఈ విధంగా ఏకాంతరంగా పొలంలో నీరు పెడుతూ, ఆరపెడుతూ ఉండడం వల్ల సాగు నీరు ఆదా అవ్వడమే కాకుండా మిథేన్‌ వాయువు ఉద్ఘారాలుకూడా తగ్గి వాతావరణ సమతుల్యత కాపాడబడుతుంది. పెట్టిన నీరు క్రమంగా తగ్గుతూ పివిసి పైపులో నేల ఉపరితలం నుండి 10 సెం.మీ. లోతు వరకు పడిపోయే సమయం 1-7 రోజుల వరకు ఉంటుంది. ఈ సమయం నేల యొక్క స్వభావం, వాతావరణ పరిస్థితులు మరియు పంట యొక్క దశలపై ఆధారపడి ఉంటుంది. 

ఈ పద్ధతి వల్ల కలిగే లాభాలు : 

  • ఈ పద్ధతిలో దాదాపు 35 శాతం వరకు నీటి ఆదా అవుతుంది. 
  • సాంప్రదాయ వరిసాగు కంటే కూడా దిగుబడులు అధికంగా ఉంటాయి. 
  • నీటి పారుదల ఖర్చులు తగ్గుతాయి. 
  • పంట మొక్కలు పడిపోకుండా కాండం ధృఢంగా ఉంటుంది.
  • హరితగృహవాయు ఉద్ఘారాలు కూడా తగ్గుముఖం పడతాయి. 

ఈ నీటిపారుదల పద్ధతిని అధిక వర్షాలు కురిసే ప్రాంతాల్లో వర్షాధారిత ప్రాంతాల్లో మరియు చివరి ఆయకట్టు ప్రాంతాల్లో చేపట్టలేము... 


 

రచయిత సమాచారం

డా|| యం. నాగభూషణం, సి.హెచ్‌ పల్లవి, డా|| పి. జగన్మోహన రావు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, వరంగల్‌, ఫోన్‌ : 9010104998