ఆంధ్రప్రదేశ్‌లో వర్షాధారంగా సాగు చేస్తున్న వాణిజ్య పంటల్లో ప్రత్తి ప్రధానమైనది. దాదాపు 6 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పైరు రాష్ట్రంలో 50-75 రోజుల దశలో ఉంది. ప్రత్తి సాగు చేసే రైతాంగం ఎక్కువగా తమ కమతాల్లో కలుపు లేకుండా జాగ్రత్త పడుతున్నప్పటికి గట్ల మీద, వారి పొలం చుట్టూ ఉన్న ప్రదేశాల్లో పొలానికి దగ్గరగా ఉన్న రోడ్ల దగ్గర ప్రమాదకరమైన తుత్తురబెండ, వయ్యారిభామ కలుపు ప్రత్తి దిగుబడుల మీద మరియు నాణ్యత పైన గణనీయమైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఈ కలుపు మొక్కలు చాలా మొండి జాతివి అంతే కాకుండా కాలంతో నిమిత్తం లేకుండా మొలిచి పూతకు వస్తాయి. తుత్తుర బెండ మరియు వయ్యారిభామ కలుపు మొక్కలు నూగు కలిగి వుంటాయి. ఇవి ప్రత్తి పైరులో పని చేసే వారికి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు కలిగిస్తాయి. ఈ మొక్కల్లోని పుప్పొడి అలాగే విషపూరిత రసాయనాలు నీటి ద్వారా, గాలి ద్వారా నేలలోకి చేరి ఇతర పంట మొక్కలను పెరగనివ్వవు. అలాగే నేలలోని సూక్ష్మజీవుల మీద కూడా ప్రభావం చూపిస్తాయి.

ప్రత్తి పంటలో ఇటీవల కాలంలో సమస్యాత్మకంగా వున్న రసం పీల్చు పురుగులైన తామర పురుగులు, తెల్లదోమ, పిండినల్లి, పేనుబంకకు ఈ మొక్కల ప్రత్యామ్నాయ ఆవాసాలు. ప్రత్తి పంట లేనప్పుడు ఈ రసం పీల్చుపురుగులన్నీ కూడ గట్లు మీద ఉన్న తుత్తుర బెండ, వయ్యారిభామల మొక్కల మీద ఆవాసాలు ఏర్పరుచుకుని వృద్ధి చెందుతాయి. తామర పురుగులు, తెల్లదోమ పలు వైరస్‌ తెగుళ్ళకు వాహకాలుగా వున్నాయి. ప్రత్తిలో టుబాకో స్ట్రీక్‌ వైరస్‌ తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ప్రత్తి పైరులో మొక్కల తొలి దశలో కలుపు నివారణ చాలా ముఖ్యం. రైతాంగం అంతర కృషి ద్వారా వాటిని నివారిస్తున్నారు. కానీ గట్ల మీద ఉన్న కలుపు, పంట కాలం మొత్తం పెరుగుతూనే వుంటాయి. ముఖ్యంగా ఈ కలుపు మొక్కలు అధిక విత్తనోత్పత్తి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏపుగా పెరిగే సామర్ధ్యం ఉండటం వల్ల లక్షల్లో విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ విత్తనాలు గాలి, నీరు ద్వారా సుదూరాల వరకు వ్యాప్తి చెందగలవు. వీటికి నిద్రావస్థ కూడా దాదాపు 2-3 సంవత్సరాల వరకు ఉంటుంది. 

ప్రత్తి పంట విత్తిన తరువాత దాదాపు 150 రోజుల వరకు పొలంలో ఉంటుంది. ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేస్తున్నప్పుడు పలు వాతావరణ ఒడిదుడుకులకు లోనవుతుంది. బెట్ట పరిస్థితుల్లో తామర పురుగులు మరియు పిండినల్లి ఎక్కువగా ఆశిస్తాయి. ఇవి ఎక్కువగా గట్లమీద ఉన్న తుత్తురబెండ మరియు వయ్యారి భామ మీద నుండి పంట మీదకు వస్తాయి. కావున ఈ కలుపు మొక్కలను నివారించడం ద్వారా, చాలా వరకు తామరపురుగులు మరియు పిండినల్లి వ్యాప్తిని అరికట్టవచ్చు. ఆ తరువాత కూడ ఈ పురుగుల నివారణకు రైతాంగం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పొలంలో జిగురు అట్టలను ఏర్పరచుకోవాలి. పంట తొలిదశలో వేప సంభందిత మందులను పిచికారీ చేయాలి. అలాగే విత్తిన 30, 45, 60 రోజులకు కాండానికి మందుపూత పద్ధతిని పాటించాలి. రసం పీల్చే పురుగుల ఉనికి మరియు ఉధృతిని అనుసరించి విత్తిన 60 రోజుల తరువాత సిఫారసు చేసిన రసాయనాలను పిచికారీ చేయాలి. 

ఈ మొండి జాతి కలుపు మొక్కలైన వయ్యారిభామ మరియు తుత్తురబెండ నివారణకు రైతులు ఆచరించవలసిన విషయమేమిటంటే గట్ల మీద ఉన్న ఈ కలుపును పూతకు రాక ముందే పీకి నాశనం చేయాలి. పూతకు వచ్చిన తరువాత వీటిని పీకినట్లయితే వీటి గింజలు నేలపైకి రాలి వృద్ధి చెంది సమస్యాత్మకంగా మారతాయి. రసాయనాల ద్వారా గట్ల మీద ఈ కలుపును నివారించటానికి లీటరు నీటికి 2 గ్రా. 2,4-డి సోడియం సాల్ట్‌ లేదా 80 శాతం పొడిమందును లేదా లీటరు నీటికి 5 గ్రా. అట్రాజిన్‌ 50 శాతం పొడి మందులతో ఏదో ఒకదాన్ని నీటిలో కలిపి పూతకు రాకముందే పిచికారీ చేయాలి. ఈ కలుపు మందులు పిచికారి చేసేటప్పుడు ప్రత్తి మొక్కల మీద పడకుండా జాగ్రత్తపడాలి. గట్లమీద తొలకరి వర్షాలు పడినవెంటనే కలుపు మొలవకుండానే లేదా అప్పుడే మొలిచిన కలుపును ప్రాధమిక దశలోనే నిర్మూలించడం చాలా అవసరం. ప్రత్తి పంటవేసిన పొలంలోనే కాకుండా చుట్టూ వున్న ప్రదేశాల్లో కూడా ఈ కలుపు మొక్కలను నివారించడం వల్ల నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చును. 

రచయిత సమాచారం

డా|| ఎస్‌. భారతి, డా||ఎస్‌.రత్న కుమారి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, లాం, గుంటూరు